Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రకృతి వనరులతో హోమియో వైద్యం-7

[ప్రభుత్వ హోమియో మెడికల్ ఆఫీసర్ డా. కె. ఉమాదేవి గారు అందిస్తున్న ఫీచర్ – ‘ప్రకృతి వనరులతో హోమియో వైద్యం’.]

హోమియో మందులు-6: ఎస్కులస్‌ హిప్పోకాస్టనమ్‌ (Aesculus Hippocastanum)

ఇది హర్సు చెస్టుయేనట్‌ అనే వృక్షజాతికి చెందిన మొక్క. ఉత్తర అమెరికా, ఉత్తర హిందూస్తాన్‌లో పెరుగుతుంది. దీని పండ్ల నుండి ఔషధ గుణాల్ని రాబట్టిన వారు న్యూయార్క్‌కు చెందిన డా॥ కూలీ.

స్థానాలు:

చర్మం, గుండె, మెదడు, కటిభాగం, జీర్ణకోశం, ఊపిరితిత్తులు, నడుం, ఆసనం లోని సిరలపై ప్రభావం చూపుతుంది.

వ్యాధులు:

మొలలు, నడుంనొప్పి, జీర్ణకోశ వ్యాధులకు ఉపయోగపడుతుంది.

ఉద్రేకం:

ఉదయాన లేచినపుడు, విరేచనానంతరం, మూత్రం విడుచునపుడు, కదలిక, నడుచుట వల్ల, ముందుకు వంగడం, చల్లగాలి లోపలికి పీల్చడం. మధ్యాహ్నం, తిన్న తర్వాత, వర్షాకాలం, విరేచనం తర్వాత, నిద్ర, వెచ్చదనం వల్ల ఎక్కువవుతుంది.

ఉపశమనం:

వేసవిలో, చల్లగాలివల్ల, వేడినీటి స్నానం వల్ల, మొలల నుండి రక్తస్రావం తర్వాత, విడవకుండ వ్యాయామం చేయడం వల్ల రిలీఫ్ ఉంటుంది.

పోలికలు:

నక్స్‌, సల్ఫర్‌, ఎలోస్‌, ఇగ్నేషియా, మ్యూరియాటిక్‌ ఆసిడ్‌, నిగండియం, కాలిన్సోనియా.

మయాజమ్‌:

సూడోసోరా.

స్వభావం:

ముక్కోపంతో విచారంగా, మూలశంక స్వభావంతో వుండు వ్యక్తులు.

తత్త్వం:

సిరలందు రక్తాధిక్యత వల్ల కాలేయ సంబంధ, మూలశంఖ సిరలతో నడుం నొప్పితో బాధపడేవారు.

మోతాదు : 3-30 పొటెన్సీ, మదర్ టించర్ ఎక్స్‌టర్నల్‌గా సిరల వాపుకు వాడవచ్చు.

మానసిక లక్షణాలు:

మనసు నిలకడ ఉండక విచారంగా, కోపంగా, మందంగా ఉండడం, చిన్న పిల్లలు నిద్రలో ఉలిక్కిపడి కంగారుగా మెలకువ చెందడం, నిద్రయందు మేల్కొన్న వెంటనే రోగి లక్షణాలు అధికంగా ఉండి, తన చుట్టూ ఉన్న వారిని గుర్తుపట్టలేరు. తానెచ్చట వున్నది కొంతసేపటికి తెలియదు. నిద్రయందు పడుకున్నప్పుడు ఎక్కువై శరీర పరిశ్రమ వల్ల ఉపశమిస్తుంది.

శారీరక లక్షణాలు:

తల:

తల వెనుక భాగంలో బ్రద్దలగుచున్నట్లు నొప్పి, నుదుటి యందు, కుడి కంటి మీద, కుడి నుండి ఎడమవైపుకు పొడిచినట్లు వచ్చే మైగ్రేన్‌ తలనొప్పి, కూర్చొని లేచిన తర్వాత తలభారం ఎక్కువవడం, తలలో చీమలు ప్రాకుతున్నట్లు, గోకుతున్నట్లు, పొడుస్తున్నట్లుంటుంది.

కండ్లు:

కన్నులు ఎర్రబడి నీళ్లు కారడం, మంటలుగా ఉండడం, నొప్పి, బాధగా, పోటుగా ఉండడం. కండ్లరోగాలు మానిన పిమ్మట కండ్లకు రక్తనాళాల వాపు, కుడి కంటినందు కంటి చుట్టూ నొప్పిగా ఉంటుంది. కన్నులకు రక్త ప్రసరణాధిక్యత వల్ల కంటి గ్రుడ్డులో పొడుస్తున్నట్లు బాధగా ఉంటుంది.

ముక్కు:

ముక్కు ఆరిపోయినట్లుండడం, తుమ్ములు, జలుబు, ముక్కు నుండి నీళ్ళు కారడం, ముక్కు దిబ్బడ, పీల్చినపుడు గాలి చల్లగా ఉంటుంది.

నోరు:

నాలుకపై మంట కల్గించే పుండ్లు, పసుపు పచ్చని పూత, చిక్కని పసుపు పచ్చని తీగవంటి కఫం నోటి నుండి రావడం వల్ల కాండ్రించి ఉమ్మితే లాలాజలం  ఎక్కువగా ఊరడం వుంటుంది.

గొంతు:

గొంతులో మంట, వేడి, వాపు వల్ల గుటక వేసేటప్పుడు, గొంతులో తేమ లేనట్లు, సూదితో పొడుస్తున్నట్లు, మంటగా ఉండి కంఠం నొక్కివేసినట్లుండి తరచు గుటక వేయడం వుంటుంది. గొంతు పచ్చిగా ఉండి చల్లని గాలి పీల్చుట వల్ల అతి సున్నితంగా ఉంటారు.

జీర్ణకోశం:

కడుపులో అల్సర్‌ వల్ల ఎప్పుడు వికారం, వాంతులు కావడం, ఆహారం తిన్న 3 గంటలకు కడుపులో రాయి పెట్టినట్లు బరువుగా ఉండడం, పుల్లగా, చేదుగా త్రేన్పులు రావడం, కడుపులో పొడుచుచున్నట్లు నొప్పి వుంటుంది. జీర్ణకోశం ఎప్పుడు మంటగా, బాధగా ఉంటుంది. ఆహారం నోటిలోకి రావడం వుంటుంది.

కామెర్ల  వల్ల   కాలేయం  వద్ద  బరువుగా  ఉండి,   చేతితో  అదిమినా  నొప్పిగా  ఉండడం, పొత్తి కడుపు, బొడ్డువద్ద నొప్పి కోయుచున్నట్లుంటుంది. కుడివైపు హెర్నియా వల్ల, మొలల వల్ల కలిగే నొప్పికి మంచి మందు.

మలాశయం బలహీనతవల్ల మలబద్ధకం, మలాశయం వెలుపలికి రావడం, మల విసర్జన తర్వాత దురద, కోయుచున్నట్లు బాధగా ఉండడం వల్ల నిలబడలేరు, పడుకోలేరు. వంగి లేచినపుడు బాధగా ఉంటుంది. మొలలున్న వారిలో కల్గు హృద్రోగాలు, గుండెదడ, మొలల బాధ శీతాకాలంలో ఎక్కువవుతుంది. ఇంటర్నల్‌ మరియు ఎక్స్‌టర్నల్‌ మొలల వల్ల ఆసనంలో మంట, బాధతో రక్తస్రావం, నక్స్‌, సల్ఫర్‌, కొలిన్‌స్సోనియాల్ని వాడిన ఫలితం లేనప్పుడు ఇది పనిచేస్తుంది. ఆసనం పొడారి, వేడిగా, నిండుగా ఉండి చిన్న పుల్లలతో గ్రుచ్చినట్లుండి విరేచనమైన కొన్ని గంటలకి బాధలు ప్రారంభ మవుతాయి.

యూరిన్‌:

మూత్రం వెచ్చగా, ఇటుక పొడిరంగులో రావడం, మూత్రావయవాల్లో మంట, ఎడమ మూత్రపిండంలో నొప్పి ఉంటుంది.

జననేంద్రియం:

పురుషుల్లో నిద్రలో వీర్యస్ఖలనాలు, మల విసర్జన చేసేటప్పుడు ప్రొస్టేట్‌ స్రావం పోవడం.

స్త్రీలలో నడుంనొప్పితో బహిష్టు అయిన తర్వాత చిక్కని పసుపు పచ్చని స్రావం కంటిన్యూగా కావడం, నడుం, చట్టనొప్పితో నల్లని తెల్లమైల కావడం, తెల్లమైల దీర్ఘకాలం కావడం, గర్భవతుల్లో గర్భకోశం నొప్పిగా ఉండి జననేంద్రియాలు నొప్పిగా ఉంటాయి.

శ్వాసావయవాలు:

కాలేయ దోషంతో దగ్గు రావడం, గుటక మింగేటప్పుడు గట్టిగా ఊపిరి పీల్చుతున్నప్పుడు దగ్గు ఎక్కువవడం, దగ్గువల్ల గొంతు బొంగురు పోవడం, ఊపిరాడక పోవడం, ఛాతీలో ముడుచుకొని పోయినట్లు నొప్పిగా ఉండడం ఉదయాన కఫం ఎక్కువుగా రావడం వుంటుంది. శ్వాసావయవాల్లో రక్తాధిక్యత వల్ల నిండుగా, వెచ్చగా ఉంటుంది.

రుమాటిజిమ్‌:

మెడ, నడుం, తుంటిలో నొప్పి, వెన్నెముకలో బలం తగ్గడం వల్ల నడిచిన, కూర్చున్న, ముందుకు వంగినా, నడుంనొప్పి ఎక్కువవడం, నడుచున్నపుడు నడుం నుండి తుంటిలోనికి నొప్పి వ్యాపిస్తుంది. నడుం నొప్పితో కదలలేరు. కాళ్ళు, చేతులు, కీళ్ళలో నొప్పులతో వంగకపోవడం, తొడల్లో నొప్పులు. కాళ్ళపై వెరికోజ్‌ వెయిన్‌ ఉబ్బి ఉండి బాధగా ఉంటాయి. ఒకచోట నుండి మరొక చోటికి మారుతాయి. వసంతకాలంలో టైమ్‌ ప్రకారం వచ్చే మలేరియా, ఎలర్జిక్‌ జ్వరాలకిది మంచి మందు.

జ్వరం:

సాయంత్రం 4 గంటలకు వీపులో చలితో రావడం. జ్వరం 7-12 గంటలకు  చర్మం  పొడిగా,  వేడిగా  ఉండి  చెమట  వెచ్చగా  ఎక్కువగా  రావడం  ఉంటుంది. జ్వరం వచ్చేముందు ఆవలింతలు, వొళ్ళు విరుపులు, తల బ్రద్దలు కొట్టుచున్నట్లుంటుంది. వేడి యందు కంఠంలో నిప్పులాగా వుండడం, నోటిలో మంట, లాలాజలం ఎక్కువగా ఊరడం వల్ల తరుచూ గుటకలేయడం, చెమట లెక్కువగా పట్టేవారికిది సరైన మందు.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version