[ప్రభుత్వ హోమియో మెడికల్ ఆఫీసర్ డా. కె. ఉమాదేవి గారు అందిస్తున్న ఫీచర్ – ‘ప్రకృతి వనరులతో హోమియో వైద్యం’.]
హోమియో మందులు-2: యాబ్సింతియం (Absinthium)
ఇది అమెరికా, యురోప్లో ‘వర్మ్‌వుడ్’ అని పిలవబడే వృక్షజాతికి చెందిన ఆకులు, పువ్వుల నుండి తీసిన రసంతో రూపొందించిన ఔషధం. డా. గాఛెల్ (Gutchell), హెల్బర్ట్ (Helbert) ఔషధ గుణాల్ని రాబట్టినారు.
స్థానాలు:
వెన్నెముక, మెదడు, నరాలు,
వ్యాధులు:
మూర్చలు, మెదడు, వెన్నెముక, నరాల వ్యాధులకి ఉపయోగపడుతుంది.
పోలికలు:
ఆర్టిమీసియా వల్గారిస్, సినా, సిక్యుటా, బైల్, స్ట్రమోనియం, ఆసిడ్ నైట్రికం, ఆసిడ్ హైడ్ర్ వంటి ఇతర మందులతో పోలిక కల్గి ఉంటుంది.
ఉద్రేకం:
చల్లగాలికి వ్యాధి లక్షణాలు ఎక్కువవుతాయి.
ఉపశమనం:
విశ్రాంతి తీసుకున్నచో రిలీఫ్ ఉంటుంది.
మానసిక లక్షణాలు:
వీరిలో మతిమరుపు, పిచ్చి, మగత, భ్రమలు, హిస్టరియా, జ్ఞపకశక్తి తగ్గడం, మెదడు, వెన్నెముక రక్తాధిక్యత వల్ల కలిగే నెర్వస్నెస్, మెంటల్ ఎగ్జైట్మెంట్ ఉండడం, నిద్రలో దయ్యాలు, భూతాలు కంటికి ఎదురుగా ఉన్నట్లుండడం వంటి చెడుకలలు రావడం వంటి మానసికక లక్షణాలుంటాయి.
శారీరక లక్షణాలు:
తల: పడుకొని కాని, కూర్చొని గాని లేచేటప్పుడు తల దిమ్ముగా ఉండి వెనుకకు పడిపోయినట్లుండడం, తల క్రిందికి వెనక్కి వాల్చి పడుకోవడం, ఉన్నట్టుండి తల దిమ్ము అధికంగా రావడం ఉంటుంది.
కండ్లకలక వల్ల కళ్ళు ఎరుపెక్కి నొప్పితో, దురదతో ఉండడం, కనురెప్పలు బరువెక్కి ఉంటాయి. చెవుల్లో చీము కారడం, గొంతులో మంట ఉండి గరుకుగా ఉంటుంది. ఆకలి ఉండదు. తిన్న తర్వాత బరువుగా ఉండి కడుపులో చల్లగా ఉంటుంది. తేన్పులు, వికారం, వాంతుల వల్ల కడుపులో ఇన్డైజెషన్గా ఉండి పిత్తాశయంలో అసౌకర్యంగా ఉంటుంది. లివర్, స్ప్లీన్ వాపు వల్ల గ్యాస్ ట్రబుల్‌తో పొట్ట ఉబ్బరించి, కడుపునొప్పి ఉంటుంది. లివర్ ప్రాబ్లమ్ వల్ల దగ్గు ఉంటుంది.
ఎప్పుడూ మూత్రానుమానం ఉండి మూత్రం నారింజపండు రంగులో ఉండి, మూత్రం వాసనతో, ఘాటుగా, దుర్వాసన ఉంటుంది.
మూర్ఛలు వచ్చే ముందు వణకడం, గుండెదడ వణుకు ముఖం వ్యాపిస్తుంది. మూర్ఛకు సంబంధించిన పొర్లు ముఖం ప్రారంభమై శరీరానికి, కాళ్ళకి వ్యాపిస్తుంది. పొర్లు నందు నాలుక, పండ్లు కొరకడం, నాలుక వణకడం, నోటి నుండి మరగ వస్తుంది. ఆకస్మాత్తుగా దేహం మొద్దుబారినట్లుంటుంది. పరాకు మాటలు, పాదాలు చల్లగా ఉండడం, శరీరంలో కాళ్ళూ చేతుల్లో స్పర్శ కానీ లేకపోవడం ఉంటుంది. పొర్లు చాలా వరకు కేకలతో ఉండి కొన్ని గంటలకు – ఒక దాని తర్వాత మరొకసారి త్వరితంగా పొర్లు వస్తుంది. మూర్ఛానంతరం కొంత సేపటి వరకు జ్ఞాపకశక్తి ఉండదు. రోగికి మూర్ఛ వచ్చినట్లు తెలియదు.
పిల్లల్లో జీర్ణకోశ బాధలతో, పెద్దల్లో మూర్ఛలతో నరాల వ్యాధులతో సంబంధించిన పొర్లుకు ఈ మందు ఉపయోగపడుతుంది. ఒక్క రోజునే అనేకసార్లు కంపములు రావడం, సంధితో రోగి అస్థిమితంగా అటు ఇటు నడవడం, పిల్లలకి నిద్రపట్టకపోవడం ఉంటుంది.
టైఫాయిడ్ జ్వరంతో మెదడు అడుగు భాగం నందు రక్త ప్రసరణ అధికంగా ఉంటుంది.
స్త్రీల అండాశయాలందు, జననేంద్రియాలందు మెరుపు తీగవలె ఋతుశూల వుండి తదనంతరం శరీరమంతట వణుకు, ఈడ్పులు, మగతా కల్గుతుంది. బహిష్టులు అణగారి పోవడం వల్ల స్త్రీలు క్లోరోసిస్ తో బాధపడతారు. ఈ మందుని వాడిన బహిష్టులు తిరిగి వస్తాయి.
(మళ్ళీ కలుద్దాం)
వృత్తిరీత్యా ప్రభుత్వ హోమియో వైద్యురాలైన డా. కొప్పెర్ల ఉమాదేవి ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వీరు 22.6.1965 న కర్నూలులో జన్మించారు. ప్రాథమిక విద్య కర్నూలు లోను, హైస్కూలు విద్య – కదిరి, శ్రీకాళహస్తి లోనూ, ఇంటర్ డోన్ లోనూ, బి. హెచ్. ఎం. ఎస్ – కడప లోనూ పూర్తి చేశారు.
ప్రసిద్ధ కథ, నవల, నాటక రచయిత డా॥ వి.ఆర్. రాసానితో 5.11.1989 న వివాహం జరిగింది యశ్వంత్ కుమార్ (USA), కాంచన్ కృష్ణ పిల్లలు.
వీరివి కొన్ని కవితలు, కథలు, 1500 దాకా వైద్యపరమైన వ్యాసాలు పలు పత్రికల్లో ముద్రింపబడ్డాయి.
ఆంధ్రజ్యోతి ఆదివారంలో, 1998 జులై నుంచి నవంబర్ వరకు ‘స్త్రీ శరీర విజ్ఞానం’, వార్త దినపత్రికలో 1996 నుంచి నేటివరకు ప్రతి సోమవారం ‘హెల్త్ కాలమ్’, విశాలాంధ్ర – ఆదివారంలో 2017 నుంచి 2020 వరకు ‘ఆరోగ్యం’, 1993 నుంచి 1995 వరకు ప్రముఖ మాసపత్రికలో ‘హెల్త్ కాలమ్’ నిర్వహించారు.
1997-1998 మధ్య తిరుపతి రేడియో కేంద్రం నుంచి ‘యవ్వన సౌరభం’ శీర్షికతో ధారావాహిక ప్రసంగాలు చేశారు.
స్త్రీల వ్యాధులు – హోమియో వైద్యం (1996, 2000), స్త్రీ శరీర విజ్ఞానం (2000), హోమియో వైద్యం – సాధారణ వ్యాధులు (2003), హోమియో వైద్యం (2011), ఇన్ఫెక్షన్స్ (2016), పిల్లల పెంపకం (2017), కరోనా – నివారణ (2021) అనే పుస్తకాలు వెలువరించారు.