[ప్రభుత్వ హోమియో మెడికల్ ఆఫీసర్ డా. కె. ఉమాదేవి గారు అందిస్తున్న ఫీచర్ – ‘ప్రకృతి వనరులతో హోమియో వైద్యం’.]
హోమియో మందులు-18: ఎసారం యురోపియం (Asarum Europaeum)
యురోపియన్ స్నేక్ రూట్‌గా పిలవబడే ఈ చెట్టు యూరోప్ అడవులందు పెరుగుతుంది. దీని గుణాలు మనకు మొదటగా హానిమన్ ద్వారానే తెలిసాయి.
స్థానాలు:
ఈ మందు నాడీ మండలంపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది.
వ్యాధులు:
ఇది జీర్ణకోశ వ్యాధులు, నరాల వ్యాధులకు చక్కని మందు.
పర్సనాలిటీ:
వీరు నాడీమండలోద్రేకత కల్గి ఆందోళనతో, మానసికోద్రేకతతో నిత్యం విచారంగా ఉండే సున్నితత్త్వం కలవారు.
కారణాలు:
ఆల్కహాల్, చల్లని పొడిగాలికి వ్యాధులు ఎక్కువగా వస్తాయి.
విరుగుళ్ళు:
కేంఫర్ వినిగార్.
మోతాదు:
3-30 పొటెన్సీలో వాడవచ్చు.
కాలపరిమితి:
1-5 రోజులు ఉంటుంది.
సహచరులు:
బిస్మత్, కాష్టికం, పల్సటిల్లా, సల్ఫ్యూరిక్ ఆసిడ్ దీనికి సహచరులు.
పోలికలు:
కాష్టికం, ఏలోస్, అర్జెంటమ్ నైట్రికమ్, పోడోఫైలం, సల్ఫర్ మందులు పోల్చదగ్గవి.
ఉద్రేకం:
వీరికి చల్లని పొడిగాలి, మేఘం లేనట్టి చక్కని వాతావరణం నందు, ధ్వనులకి ఎక్కువ అవుతుంది.
ఉపశమనం:
వీరికి ముఖం లేదా వ్యాధిగ్రస్తమగు భాగాల్ని చన్నీటితో కడుగుట వల్ల, తేమతో కూడిన తడి వాతావరణమందు, నీళ్ళు పోసుకొనుట వల్ల ఉపశమనం ఉంటుంది.
మానసిక లక్షణాలు:
నాడీ మండలంకు ఏ మాత్రం సహనశక్తి ఉండక బట్టమీద గాని (పట్టు, నార) గోరు, మేకుతో గీయుట కాని, కాగితం నలిగిన చప్పుడును సహించలేరు. రోగి ఎదుట పలక పుల్లను (బలపం) అరగదీసిన పొర్లు వస్తుంది. మనస్సు ఏమాత్రం ఉద్రేకంగా ఉన్నను రోగి చలితో వణుకుచున్నట్లుండడం, రోగి శక్తి విహీనుడై యుంటాడు. నాడీ తంతువుల నిస్త్రాణచే చెవులు వినపడవు. దృష్టి ఆనదు. స్త్రీలలో అవయవాలన్నియు తేలికగా ఉంటాయి. తాను ఒక దయ్యంవలె గాలిలో అల్లాడుచున్నట్లు ఊహించుకోవడం ఉంటుంది, కానీ ఆమె భయస్తురాలు.
శారీరక లక్షణాలు:
తల:
వ్రాయడం, కుట్టడం, కంటికి శ్రమ కలిగించే పనుల వల్ల వచ్చే తలనొప్పి. కూర్చున్నచోట నుండి లేచిన ఎడల తల తిరుగుట, తల బిగపట్టినట్టు ఉండుట చేత వెంట్రుకల్లో బాధగా ఉంటుంది. దీని వల్ల తల దువ్వుకొనుట కష్టంగా ఉంటుంది. తుమ్ములు, రొంప వల్ల తలనొప్పి ఉంటుంది.
కండ్లు:
చదివేటప్పుడు కన్నులు అనేక ముక్కలగునట్లు, నొక్కివేయుచున్నట్లు కాని, వెలుపలికి తోసివేయుచున్నట్లు గాని ఉండడం, చల్లగాలి గాని, చన్నీళ్ళు తగిలిన కన్నులకు హాయిగా ఉంటుంది. వీరు ఎండ, చల్లటి గాలులను సహించలేరు.
ముక్కు:
వీరు ఎప్పుడూ చలితోగాని, జలుబుతోగాని బాధపడుతుంటారు.
చెవులు:
చెవులందు ఏదియో బిరడా పెట్టినట్లుండడం జరుగుతుంది.
జీర్ణకోశం:
నోటిలో చల్లని లాలాజలం ఊరడం, నాలుక శుభ్రంగా ఎల్లప్పుడూ ఉండడం వికారంగా ఉండడం, వాంతులు కావడం, తీగలాగా సాగే జిగురుతో ఉండే విరేచనాలు కావడం, కడుపులో శూల, భోజనానంతరం అధికమవడం ఉంటుంది. గర్భవతులందు వికారం, వేవిళ్ళు ఉండి ఉదయాన మేల్కొన్నప్పుడు జీర్ణకోశంలో నొక్కుచున్నట్లు, తవ్వుచున్నట్లు భయంకరమైన బాధగా ఉంటుంది.
మలంలో జిగురు ఎక్కువగా పోవడం వల్ల అజీర్ణం కలుగుతుంది, పల్చని విరేచనాలు అవుతాయి. మలాశయం వెలువపలకి రావడం జరుగుతుంది.
జననేంద్రియ లక్షణాలు:
నాడీ మండల నిస్త్రాణతో కూడిన ఋతుశూల ఉండి, నడుం నొప్పి వల్ల ఊపిరి కూడా పీల్చుకోలేరు.
బహిష్టులు త్వరగా రావడం, కొంతకాలం వరకూ నల్లని ఋత్రుస్రావం కావడం, తెల్ల మైల చిక్కగా, పసుపు పచ్చగా రావడం ఉంటుంది. చేతులు కాళ్ళు, ముఖం వెచ్చగా ఉంటాయి.
జ్వరం నందు చలిగా ఉండి, చెమటలు సులువుగా పోస్తుంటాయి. ఒక్కో అవయవం మంచువలె చల్లగా ఉంటుంది.
కండరాలయందు ఈడ్పులు, బాధలుండి, ముడుచుకొని పోవుచున్నట్లు, బిగిసికొని పోవుచున్నట్లుండడం, అధికంగా శోషిల్లడం, నిత్యం ఆవలించడం వుంటుంది.
(మళ్ళీ కలుద్దాం)
వృత్తిరీత్యా ప్రభుత్వ హోమియో వైద్యురాలైన డా. కొప్పెర్ల ఉమాదేవి ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వీరు 22.6.1965 న కర్నూలులో జన్మించారు. ప్రాథమిక విద్య కర్నూలు లోను, హైస్కూలు విద్య – కదిరి, శ్రీకాళహస్తి లోనూ, ఇంటర్ డోన్ లోనూ, బి. హెచ్. ఎం. ఎస్ – కడప లోనూ పూర్తి చేశారు.
ప్రసిద్ధ కథ, నవల, నాటక రచయిత డా॥ వి.ఆర్. రాసానితో 5.11.1989 న వివాహం జరిగింది యశ్వంత్ కుమార్ (USA), కాంచన్ కృష్ణ పిల్లలు.
వీరివి కొన్ని కవితలు, కథలు, 1500 దాకా వైద్యపరమైన వ్యాసాలు పలు పత్రికల్లో ముద్రింపబడ్డాయి.
ఆంధ్రజ్యోతి ఆదివారంలో, 1998 జులై నుంచి నవంబర్ వరకు ‘స్త్రీ శరీర విజ్ఞానం’, వార్త దినపత్రికలో 1996 నుంచి నేటివరకు ప్రతి సోమవారం ‘హెల్త్ కాలమ్’, విశాలాంధ్ర – ఆదివారంలో 2017 నుంచి 2020 వరకు ‘ఆరోగ్యం’, 1993 నుంచి 1995 వరకు ప్రముఖ మాసపత్రికలో ‘హెల్త్ కాలమ్’ నిర్వహించారు.
1997-1998 మధ్య తిరుపతి రేడియో కేంద్రం నుంచి ‘యవ్వన సౌరభం’ శీర్షికతో ధారావాహిక ప్రసంగాలు చేశారు.
స్త్రీల వ్యాధులు – హోమియో వైద్యం (1996, 2000), స్త్రీ శరీర విజ్ఞానం (2000), హోమియో వైద్యం – సాధారణ వ్యాధులు (2003), హోమియో వైద్యం (2011), ఇన్ఫెక్షన్స్ (2016), పిల్లల పెంపకం (2017), కరోనా – నివారణ (2021) అనే పుస్తకాలు వెలువరించారు.
