Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రకృతి వనరులతో హోమియో వైద్యం-17

[ప్రభుత్వ హోమియో మెడికల్ ఆఫీసర్ డా. కె. ఉమాదేవి గారు అందిస్తున్న ఫీచర్ – ‘ప్రకృతి వనరులతో హోమియో వైద్యం’.]

హోమియో మందులు-16: ఆర్నికా (Arnica)

కొండ ప్రాంతాల వాళ్ళు కాళ్ళ నొప్పులకు ఈ మందును ఎక్కువగా వాడడం వల్ల దీన్ని లియోపార్డుబేన్‌, ఫాల్‌ క్రాంట్‌ అని అంటారు. పూలు పూచే సమయంలో ఈ మొక్కలను గుజ్జుగా చేసి డా॥ హానిమన్‌ హోమియో మందుగా మలచడం అయింది. మొక్క ఆకుల్ని చుట్టలుగా చేసి కాల్చడం వల్ల దీన్ని మౌంటెన్‌ టుబాకో అని అంటారు.

స్థానాలు:

ఈ మందుకి నరాలు, బ్రెయిన్‌, రక్తం, రక్తనాళాలపై ఎక్కువ ప్రభావం కనిపిస్తుంది.

వ్యాధులు:

ఇది కండరాలు, నరాల వ్యాధులు, చర్మవ్యాధులకు ఉపయోగపడుతుంది.

కారణాలు:

వీరికి భయం, కోపం, అధిక సంభోగం, ప్రమాదవశాత్తు తగిలిన దెబ్బల వల్ల వ్యాధి లక్షణాలు కల్గుతాయి.

పర్సనాలిటీ:

వీరు రక్తపుష్టి కలిగిన నరాల నిస్త్రాణతో బాధపడుతుంటారు. నాడీ మండలోద్రేకత వల్ల చలాకీగా ఉండి ముఖం ముడుచుకొనిపోయి ఎర్రగా ఉంటుంది.

పోలికలు:

దీన్ని రూస్టాక్స్‌, ఎకోనైట్‌, బ్రయోనియా, ఇపెకాక్‌, విరేట్రం ఆల్బంతో పోల్చవచ్చు.

విరుగుళ్ళు:

ఇగ్నీషియా, ఆర్స్‌ ఆల్బ్‌, కాంఫర్‌, కాఫీ మందులు దీనికి విరుగుళ్ళుగా పనిచేస్తాయి. దీన్ని కుక్కలు, జంతువులు కరిచినపుడు వాడరాదు.

మోతాదు:

Q 6-1M. ఆర్నికా మదర్‌ టించర్‌ని పదిరెట్లు నీళ్ళలో లేదా గ్లిసరిన్‌తో కలిపి, దెబ్బలకి, చర్మవ్యాధులకి వాడవచ్చు. (చర్మం చితికిన, పుండైన, కోయబడిన వాడరాదు.) ఆర్నికా నూనెని తలకు వాడవచ్చు.

కాలపరిమితి:

గంటల్లో, రోజుల్లో ఉంటుంది.

ఉద్రేకం:

వీరికి విశ్రాంతి వల్ల, పడుకోవడం వల్ల, తాకుట వల్ల, తేమతో కూడిన చల్లదనం, కదలిక, ధ్వనులవల్ల, అదరుట, అధిక శ్రమ, నిద్రపోయిన తర్వాత లక్షణాలు ఉద్రేకిస్తాయి.

ఉపశమనం:

వీరికి బహిరంగమైన గాలిలో, చన్నీటి స్నానం వల్ల, నిబ్బరంగా కూర్చోవడం వల్ల, తల పల్లంగా పెట్టి పడుకోవడం వల్ల రిలీఫ్ ఉంటుంది.

మానసిక లక్షణాలు:

వీరు సెన్సిటివ్‌గా ఉండి నొప్పికి తట్టుకోలేక దొర్లుతుంటారు. విచారంతో నలుగురితో కలవడానికి ఇష్టముండదు. జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, తనలో తాను గొణుక్కోవడం, పరాకు మాటలు మాట్లాడటం, మగతగా ఉండి చనిపోవుదుననే భయంతో నిద్రలేవడం, సంధిలో ప్రక్క గుడ్డల్ని ప్రోగు చేయడం వుంటుంది.

శారీరక లక్షణాలు:

తల:

నరాల దోషం వల్ల పార్శ్వపు నొప్పి రావడం, తల ముడుచుకొని పోయినట్లుండడం, ఉదయాన నడుచుట వల్ల తలనొప్పి కనుబొమ్మల్లోకి కుట్టుచున్నట్లుండడం, దెబ్బలు తగలడం వల్ల నొక్కినట్లు వచ్చే తలనొప్పి, తలత్రిప్పుట వల్ల తల వెచ్చగా ఉండి శరీరమంతా చల్లగా ఉంటుంది.

కళ్ళు:

కండ్లనెక్కువగా ఉపయోగించడం వల్ల, దెబ్బలు తగలడం వల్ల చితక కొట్టినట్లు నొప్పి, వాపుతో ఎర్రగా ఉండడం, కళ్ళు లోతుకు పోవడం, రక్త స్రావాలుంటాయి.

చెవులు:

చెవుల  వెనుక  కుట్టుచున్నట్లు  పోటుగా, చితక  కొట్టినట్లు  నొప్పిగా  ఉండి చెవులు ఆర్చుకొని పోవడం, ధ్వనులు వినపడడం, కదులుచున్నప్పుడు సరిగా మాట వినకపోవడం వుంటుంది.

ముక్కు:

విపరీతమైన తుమ్ముల వల్ల ముక్కు వాచి నొప్పిగా ఉండడం. ముక్కు నుండి రక్తం కారడం ఉంటుంది.

ముఖం:

ముఖంలో ఒకవైపు దౌడ ఎర్రగా, మంటగా, ఉండి ముఖంపై చర్మం ముడుచుకొని  పోవడం.  క్రింది  పెదవి  జ్వరంతో  వణకడం, పెదవులు పగిలి ఉంటాయి. శస్త్ర చికిత్సానంతరం పంటినొప్పి, పండ్లను పీకించుకున్న తర్వాత కల్గు రక్తస్రావాలకు ఇది మంచి మందు.

జీర్ణకోశం:

నోరు ఆర్చుకొని పోయి దాహంతో, దుర్వాసనగా ఉంటుంది. దెబ్బలు తగలడం వల్ల అన్నకోశంలో నొప్పి, బాధగా ఉండి రక్తం వాంతులవుతాయి. భోజనం చేసినా, పానీయం త్రాగినా తిరిగి రక్తవాంతులవుతాయి. భోజనం చేసేటప్పుడు రాతితో నొక్కబడినట్లుండి, అన్నకోశం వెన్నెముక వైపుకు నొక్కి వేస్తున్నట్లుంటుంది. త్రేన్పులు చేదుగా క్రుళ్ళిన గుడ్ల వాసనతో ఉంటాయి.

అలవాట్లు:

వీరికి పుల్లని వస్తువులు, సారాయి, చల్లనీరు యిష్టం. మాంసం, పాలు, పొగాకు అయిష్టం. గ్యాస్‌ట్రబుల్‌ వల్ల పొట్ట ఉబ్బరంతో ప్రక్కటెముకల క్రింద కుట్టుచున్నట్లు నొప్పిగా ఉండి ఊపిరి పీల్చుట కష్టంగా ఉంటుంది.

రాత్రి నిద్రలో అప్రయత్నంగా పల్చగా, తెల్లగా, నురగతో, ఆమంతో కూడిన మల విసర్జన జరగడం. తరచు విరేచనాలవడం వల్ల, నీరసం వల్ల, ప్రతి విరేచనా నంతరం పడుకోవడం జరుగుతుంది.

ఇది మూత్రంలో రక్తం, ఇటుక పొడి వంటి పదార్థం పోవడం వల్ల, దెబ్బల వల్ల, మూత్ర పిండాల వాపు వల్ల జరుగుతుంది. ఎక్కువ పరిశ్రమ వల్ల మూత్రం ఆగిపోతుంది.

జననేంద్రియ లక్షణాలు:

అధిక సంభోగం వల్ల నపుంసకత్వం ఉంటుంది, దెబ్బ తగిలిన వృషణాలు వాచి వరిబీజం రావడం వుంటుంది.

స్త్రీలలో వేవిళ్ళు, గర్భస్రావాన్ని అరికడుతుంది. బహిష్టు-బహిష్టుకు మధ్య రక్తస్రావం కావడం, శరీరమంతట చితక కొట్టినట్లు నొప్పులు. గాయాల వల్ల స్తనాల వాపు, చన్మొనలు పుండై బాధగా ఉండడం, దెబ్బ తగులుట వల్ల గర్భాశయం వెలుపలికి రావడం. ప్రసవానంతరం జననేంద్రియాలలో నొప్పులుంటాయి, రక్తస్రావం వుంటుంది. వీరికి బాలింత జ్వరం వస్తుంది, ప్రసవానంతరం మూత్రం బంధింపబడడం లేక అప్రయత్నంగా పడిపోవడం వుంటుంది. రక్తస్రావం కాకుండా అరికట్టడమే కాకుండా గర్భాశయంలోని కండరాలు తిరిగి ముడుచుకొనునట్లు చేస్తుంది. వీరికి ప్రసవ నొప్పులున్నా కాన్పు కాదు. కటి భాగం పచ్చిగా ఉండడం వల్ల  నిటారుగా నడవలేక పోవడం వుంటుంది.

శ్వాసకోశ లక్షణాలు:

వీరికి ఉబ్బసం వల్ల అర్ధరాత్రి వరకు నిద్ర రాక అటు ఇటు తిరగడం, దెబ్బల వల్ల ముక్కు, నోటి నుండి రక్తస్రావాలు, ఛాతీలో ఎడమవైపు కొద్ది కొద్దిగా కుట్టినట్లుండి దగ్గు రావడం. కదలిన, ఏడ్చిన దగ్గు ఎక్కువవడం, దగ్గడం వల్ల కండ్లు ఎర్రబడడం, కోరింత దగ్గు ఉంటుంది. విపరీతంగా పరుగెత్తడం వల్ల రొమ్ము ఎముక అడుగున నొక్కినట్లుండి ఊపిరాడక,  గుండె దడగా ఉంటుంది.

రుమాటిజమ్‌:

వర్షాకాలంలో, అధిక పరిశ్రమ వల్ల కీళ్ళు, నడుం, కాళ్ళు, చేతుల్లో చితక కొట్టినట్లు నొప్పులుండి తిన్నగా నడవలేకపోవడం ఉంటుంది, ప్రతి వస్తువు గట్టిగా ఉన్నట్లుండి ఇతరులు తాకుటను, సమీపించినా భయంగా ఉంటుంది.

చర్మం:

పడక రాపిడి వల్ల ఏర్పడే పుండ్లు, సెగ్గడ్డలు, కముకు దెబ్బలు, రక్తం గూడు కట్టడం, దురద, మంటతో కూడిన చిన్న చిన్న మొటిమలు, కురుపులు, తరచుగా రావడం, రక్తస్రావాల వల్ల చర్మం నల్లగా, నీలిరంగుగా ఉండడం, ఎర్రని మచ్చలుంటాయి.

ప్రథమ చికిత్సలో, గాయాల మూలంగా, రక్తస్రావాన్ని అరికట్టడానికి, చీము పట్టకుండా, వాపు రాకుండా చేస్తుంది. తల, వెన్నెముకకు దెబ్బ తగిలిన వచ్చే తల త్రిప్పు వంటి బాధలకిది మంచి మందు. ఆపరేషన్‌కు ముందు ఒకరోజు అనంతరం, దీన్ని 4 రోజుల పాటు యిస్తే రక్తస్రావం, షాక్‌ తక్కువగా ఉంటుంది. బిగుతైన చెప్పులవల్ల చర్మం కమిలి బొబ్బలేర్పడి పగిలి పుండ్లు ఏర్పడతాయి. నిద్రలో జంతువులు, శవాలు వంటి భయంకరమైన కలలు రావడం వల్ల పెద్ద పెద్ద కేకలు వేయడం, మాట్లాడడం, అప్రయత్నంగా మలమూత్ర విసర్జన చేయడం ఉండి పగలు ఎక్కువ మగతగా ఉండి నిద్రరాక పోవడం, స్మృతి తప్పడం, పరాకుగా మాట్లాడడం వుంటుంది.

టైఫాయిడ్‌,  మలేరియా,  దెబ్బలు  తగలడం  వల్ల  వచ్చే  జ్వరాలతో  లోపల,  ఉదయాన చల్లగా ఉండి ఎముకల్లో లాగుచున్నట్లు నొప్పిగా ఉంటుంది.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version