[ప్రభుత్వ హోమియో మెడికల్ ఆఫీసర్ డా. కె. ఉమాదేవి గారు అందిస్తున్న ఫీచర్ – ‘ప్రకృతి వనరులతో హోమియో వైద్యం’.]
హోమియో మందులు-15: ఆర్టిమీషియా వల్గారిస్ (Artemisia Vulgaris)
దీన్ని మాచిపత్రి నుండి తయారు చేసినవారు డా॥ హానిమన్.
స్థానాలు:
ఈ మందుకి తల, కళ్ళు, ముఖం, పళ్ళు, నోరు, గొంతు, అన్నకోశం, పొత్తికడుపు, మలాశయం, మూత్రావయవాలు, నరాలు, రక్తం పై ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
వ్యాధులు:
ఇది మానసిక వ్యాధులు, మూత్రావయవాలు, జ్వరాలు, పక్షవాతంకు ఉపయోగపడుతుంది.
సహచరులు:
స్ట్రమోనియం, పల్సటిల్లా, ఆరంమెట్ మందులు దీని సహచరులు
అనుచరులు:
కాష్టికం. దీని తరువాత వాడినచో, ఇది పనిచేస్తుంది. ఎకోనైట్, బెల్లడోనా, సినా, బ్రయోనియా, హెల్లిబోరస్, అయోడియం మందులు వాడిన తర్వాత బాగా పనిచేస్తుంది. ఇది కుడివైపు పనిచేయు మందు.
మోతాదు:
3-200 పొటెన్సీలో, మదర్ టింక్చర్ రూపంలో వాడవచ్చు.
కాలపరిమితి:
7-14 రోజులు ఉంటుంది.
కారణాలు:
నరాల నిస్త్రాణత, భయం, శరీర శ్రమ వలన కలిగే వ్యాధి లక్షణాలకు ఇది మంచి మందు.
మానసిక లక్షణాలు:
వీరిలో విచారం, భయం, తలకు దెబ్బ తగలడం వల్ల వచ్చే ఫిట్స్ ఉంటడం, నిద్రలో నడవడం, శరీర శ్రమ వల్ల కండరాలు కొయ్య బారటంతో వచ్చే నరాల దోషాలుంటాయి.
శారీరక లక్షణాలు:
తల:
మెదడు భాగాలలో రక్తమెక్కువుగా చేరడం. తలలో తీవ్రమైన బాధ, కండరాలు ముడుచుకొని పోవడం వల్ల తల వెనుకకు లాగినట్లుంటుంది. తలను ప్రక్కవైపులకి లేదా వెనక్కి వంచినట్లుంటుంది.
కళ్ళు:
రంగు రంగుల వెలుతురుని చూసిన తలదిమ్ము వస్తుంది. తెల్లని కాంతిని చూచునపుడు మాత్రం మామూలుగా ఉండడం కనుగ్రుడ్లు పైకి పోవడం ఉంటుంది. కళ్ళను నులుపుకొన్న పిదప కొంతసేపటికి కంటి బాధ తగ్గి దృష్టి బాగా కనిపిస్తుంది. ఎక్కువసేపు దేన్ని చూసినా, చదివినా కళ్ళనొప్పులు ఎక్కువ అవుతాయి.
ముఖం:
పక్షవాతంలో వలె ముఖం నందలి కండరాలు ఎడమవైపు ముడుచుకొని పోవడం వల్ల మూతి వంకర పోవడం, ముసలి రూపు రావడం జరుగుతుంది. పంటి కుదుళ్ళ కదలిక కల్గడం వల్ల, అడుగు దౌడ ఎముక ముందు వైపుకు త్రోయబడుతుంది.
నోరు:
నోటి వద్ద నురగలు వచ్చి పండ్లు పట పట కొరకడం, మాట స్పష్టంగా పలక లేకపోవడం, శ్రమతో పట్టి పట్టి ఒక్కొక్క మాట అనగల్గడం జరుగుతుంది. ఫిట్స్‌తో ఉన్నప్పుడు నాలుక కొరుక్కోవడం వుంటుంది.
జీర్ణకోశ లక్షణాలు:
తినుచున్నప్పుడు గొంతులో ఆహారం ప్రక్కవైపుల నుండి బైటికి పడిపోవడం, గుటక వేయడం కష్టంగా ఉండడం, ఆకలి వున్నా ఆహారం తీసుకొన లేకపోవడం, వికారం, వాంతులు, కడుపులో నొక్కుచున్నట్లు బాధగా ఉంటుంది.
పొత్తికడుపు విపరీతమైన బాధగా ఉంటుంది. కడుపులో పురుగులుండడం వల్ల ఆకుపచ్చని నీళ్ళ విరేచనాలు అవుతాయి. మలమూత్రాల్ని ఆగి ఆగి విసర్జించడం జరుగుతుంది. మూత్రం పసుపు పచ్చగా, విస్తారంగా, చుక్కలు చుక్కలుగా చాలాకాలం పాటు పోతుంది.
జననేంద్రియ లక్షణాలు:
పురుషులలో:
సంభోగేచ్ఛ విపరీతంగా ఉండడం వల్ల రాత్రియందు స్ఖలనమవుతుంది.
స్త్రీలలో:
ఋతుస్రావం ఎక్కువగా ఉండడం వల్ల గర్భాశయం అప్పుడప్పుడు ముడుచుకొని పోవడం జరిగి, వెలుపలికి వస్తుంది. బహిష్టు లోపాల వల్ల ఋతుస్రావం తక్కువగా పోవడం వల్ల అపస్మార సంబంధమైన కంపాలుంటాయి. గర్భిణీ స్త్రీలలో గర్భాశయం ముడుచుకొని పోవుటచే అకాల ప్రసవ సూచనలు కన్పించడం, ప్రసవానంతర మైల అణిచి పెట్టబడడం జరుగుతుంది.
ఇతర లక్షణాలు:
జ్వరంలో ఒళ్ళంతా వెల్లుల్లిపాయ వాసన గల చెమట ఎక్కువగా పోవడం, ఫిట్స్ వచ్చినపుడు శ్వాస గురగురలాడడం, ఫిట్స్ తగ్గుటకు ముందు, తెలివి వచ్చుటకు ముందు ఎక్కువగా శ్వాస తీసుకుంటారు. ఇలాంటి వారికి ఇది సూచించదగ్గ మందు.
(మళ్ళీ కలుద్దాం)
వృత్తిరీత్యా ప్రభుత్వ హోమియో వైద్యురాలైన డా. కొప్పెర్ల ఉమాదేవి ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వీరు 22.6.1965 న కర్నూలులో జన్మించారు. ప్రాథమిక విద్య కర్నూలు లోను, హైస్కూలు విద్య – కదిరి, శ్రీకాళహస్తి లోనూ, ఇంటర్ డోన్ లోనూ, బి. హెచ్. ఎం. ఎస్ – కడప లోనూ పూర్తి చేశారు.
ప్రసిద్ధ కథ, నవల, నాటక రచయిత డా॥ వి.ఆర్. రాసానితో 5.11.1989 న వివాహం జరిగింది యశ్వంత్ కుమార్ (USA), కాంచన్ కృష్ణ పిల్లలు.
వీరివి కొన్ని కవితలు, కథలు, 1500 దాకా వైద్యపరమైన వ్యాసాలు పలు పత్రికల్లో ముద్రింపబడ్డాయి.
ఆంధ్రజ్యోతి ఆదివారంలో, 1998 జులై నుంచి నవంబర్ వరకు ‘స్త్రీ శరీర విజ్ఞానం’, వార్త దినపత్రికలో 1996 నుంచి నేటివరకు ప్రతి సోమవారం ‘హెల్త్ కాలమ్’, విశాలాంధ్ర – ఆదివారంలో 2017 నుంచి 2020 వరకు ‘ఆరోగ్యం’, 1993 నుంచి 1995 వరకు ప్రముఖ మాసపత్రికలో ‘హెల్త్ కాలమ్’ నిర్వహించారు.
1997-1998 మధ్య తిరుపతి రేడియో కేంద్రం నుంచి ‘యవ్వన సౌరభం’ శీర్షికతో ధారావాహిక ప్రసంగాలు చేశారు.
స్త్రీల వ్యాధులు – హోమియో వైద్యం (1996, 2000), స్త్రీ శరీర విజ్ఞానం (2000), హోమియో వైద్యం – సాధారణ వ్యాధులు (2003), హోమియో వైద్యం (2011), ఇన్ఫెక్షన్స్ (2016), పిల్లల పెంపకం (2017), కరోనా – నివారణ (2021) అనే పుస్తకాలు వెలువరించారు.
