[ప్రభుత్వ హోమియో మెడికల్ ఆఫీసర్ డా. కె. ఉమాదేవి గారు అందిస్తున్న ఫీచర్ – ‘ప్రకృతి వనరులతో హోమియో వైద్యం’.]
హోమియో మందులు-14: ఎపోసైనం (Apocynum Cannabinum)
ఇండియన్ హెంప్‌గా పిలవబడే చెట్టు ఆకులు, పొడి చేసిన వేరు నుండి హెల్ ఔషధగుణాల్ని రాబట్టడమైనది. ఇండియన్ జనుముగా పిలవబడే దీనిపై ఇంగ్లాండ్ వైద్యుడైన డా॥ బ్లాక్ కూడా హోమియో ఔషధ గుణాల్ని నిరూపించడమైనది.
స్థానాలు:
ఈ మందు మూత్రావయవాలు, గుండె, జీర్ణకోశం, గర్భాశయం, మెదడు, కాళ్ళూ చేతులు, స్త్రీ జననేంద్రియం, శ్వాసావయవాలపై ఎక్కువ ప్రభావం చూపుతుందని చెప్పాలి.
పోలికలు:
దీనిని ఎపిస్, ఆర్సెనికం ఆల్బం, స్ట్రాఫంతస్, డిజిటాలిస్, చైనా, కోల్చికంతో పోల్చవచ్చు. ఎపిస్, ఎపొసైనం, డిజిటాలిస్ పని చేయునప్పుడు శరీరం వాపులకు బ్లాటా బాగా పనిచేస్తుంది. (డా॥ హేన్స్)
కారణాలు:
ఉబ్బులు, కాలేయ దోషాలు, చెమటలు, అణగారిన, ఎక్కువయినా, ఎక్కువగా ఉపయోగించిన వచ్చే కారణాల వచ్చే వ్యాధులకి ఇది మంచి మందు.
వ్యాధులు:
గుండె జబ్బులు, అజీర్ణ రోగాలు, డయాబెటిస్, వాపులు, జలోదరం, శరీరం నీరు పట్టడం వంటి వ్యాధులకిది మేలైన మందు.
ఉద్రేకం:
చల్లదనం, చల్లని పానీయాలు, కదలిక, ఉదయం లేచిన తర్వాత, తిన్న తర్వాత, సాయంత్రం, మెలకువ చెందటం వల్ల వ్యాధి లక్షణాలు ఉద్రేకిస్తాయి.
ఉపశమనం:
బాగా నిద్రపోయినపుడు రిలీఫ్ ఉంటుంది.
స్వభావం:
నర్వస్ పిల్లలకు, స్త్రీలు, యుక్త వయస్కులకు, ముట్లాగి పోయేటప్పుడు వచ్చే కుడివైపు సమస్యలకు పనిచేయు మందు.
మోతాదు:
200 పొటెన్సీలో త్రాగడం వల్ల కల్గే దుర్గుణాల్ని మాన్పుటకు దీనిని మోతాదుకి 10 డ్రాప్సు ని 4 ఔన్సుల నీళ్ళలో కలిపి వాడాలి.
కాల పరిమితి:
7-15 రోజులు ఉంటుంది.
మానసిక లక్షణాలు:
మెదడు వ్యాధుల వల్ల కల్గే మగతకి, కంటిచూపు తగ్గడానికిది మంచి మందు. ఒక కాలు చేయి నిత్యం కదల్చడం వుంటుంది. మూత్రం, చెమటలు పట్టకపోగా దాహంగా ఉంటుంది. రోగి చలనం లేక వుండి మూత్రం అప్రయత్నంగా పోవడం వుంటుంది. ఆందోళనకు తోడు అస్థిమితత్వం ఉంటుంది.
శారీరక లక్షణాలు:
తల:
తలకు నీరు పట్టడం వల్ల తల భారంగా ఉంటుంది. తలలో కుడివైపు కణతల్లో అదిమినట్లుండే నొప్పితో తల త్రిప్పడం ఉంటుంది. పిల్లల్లో మెదడు వ్యాధుల వల్ల వచ్చే హైడ్రోసెఫలస్‌కిది మంచి మందు. వీరిలో నుదురు ముందుకు తోసుకొని ఉంటుంది.
కండ్లు:
ఒక కన్నుకు దృష్టిలోపం ఉంటుంది. కళ్ళవాపు ఉదయం, సాయంత్రం ఎక్కువ కావడం, కళ్ళలో ఇసుక పడినట్లుంటుంది. కన్నులు వేడిగా ఉండి మండుతుంటాయి. వీరు కన్నులు మూసుకొని పడుకోవడం వల్ల, తెరచియున్న ఏమీ కన్పించదు.
ముక్కు:
ముక్కు లోపలి జిగురు పొరలు పొడారినట్లుండి పసుపుపచ్చని చిక్కని స్రావంతో నిండి పొక్కులు కట్టడం. ముక్కు పట్టేసినట్లుండడం, ఒక్కోసారి పల్చని ఒరుపు కల్గించే స్రావం కారుతుంది. ఉదయాన లేవగానే ముక్కు రంధ్రాలు, గొంతు పూడుకుపోతుంటాయి.
ముఖం:
ముఖం పాలిపోయి, పొడారిన పెదవులతో, చల్లని చెమటలతో ఉంటుంది. ముఖం ఉబ్బు – పడుకున్నప్పుడు అధికంగా ఉండి లేచికూర్చున్న తగ్గుతుంది. వీరి ముఖం నీలి వర్ణంగా ఉంటుంది.
నోరు:
నోరు పొడిగా ఉండి దాహమెక్కువుగా ఉండడం వల్ల రోగి తరుచు నోటిని తడుపుకుంటారు. కఫం, ఎంగిలి ఉమ్మివేయడంతో నోటి నుండి లాలాజల మధికంగా ఊరుతుంది.
జీర్ణకోశ సమస్యలు:
ఉదయం నిద్ర లేవగానే దప్పిక ఉండడం, నీళ్ళు త్రాగినా యిమడక వాంతి కావడం ఉంటుంది. ఏమాత్రం అన్నం తినగానే కడుపులో బాధ, పొట్ట ఉబ్బరించడం, అధిక ఆకలి, అజీర్ణం, పుల్లని త్రేన్పులు, దాహం ఎక్కువగా ఉండి, జీర్ణకోశంలో నిస్త్రాణంగా ఉంటుంది.
జీర్ణకోశంలో, పొట్టలో, ఛాతీలో నొక్కుచున్నట్లు బాధతో ఊపిరాడక పోవడం ఉండి, జలోదరంతో విరేచనాలుంటాయి, మలం పల్చగా ఉన్నా మలబద్దకము, అజీర్ణ సంబంధమైన నీళ్ళ విరేచనాలుంటాయి. విరేచనానంతరం బాగా నీరసంగా ఉండడం వల్ల మొలల వల్ల ఆసనంలో కొయ్య కొట్టినంత బాధగా ఉంటుంది. మలబద్దకంగా ఉన్నప్పుడు ఉబ్బులధికంగా ఉండి విరేచనాలు ఎక్కువగా అయినప్పుడు వాపులు తగ్గడం విశేషం. ఆసన కండరాలకు తగిన బలంలేక పోవుటచే విరేచనం అప్రయత్నంగా, తెలియకయేగాని, అపానవాయువు వెడలునపుడు సీసాలో నుండి నీళ్ళను వంచునపుడు కల్గు బుడ బుడ ధ్వనితో చీముతో కలిసి అవుతుంది. విరేచనానంతరం కడుపులో ఖాళీగా ఉండి ఉన్నట్లుండి రోగి పాలిపోయి చల్లని చెమటలు పడతాయి.
నిద్ర:
నిద్ర నుండి లేచినపుడు ముక్కు, గొంతు పచ్చని చిక్కని కఫంతో నిండి వుండడం, రొంపతో పసిపిల్లల్లో ముక్కు నుండి ఎడతెగని స్రావం కారడం, ఒక చేయి, ఒక కాలు ఎక్కువగా కదల్చడం, అస్థిమితంగా ఉండి నిద్ర సరిగా పట్టక పోవడం వుంటుంది.
జననేంద్రియ లక్షణాలు:
గర్భవతుల్లో వచ్చే పొడి దగ్గు. అండాశయ కంతుల వల్ల కల్గే వాపులకిది మంచి మందు. బహిష్టు మధ్యలో కల్గే అధిక రక్తస్రావం పొర్లు పొర్లుగా వస్తుంది.
ముట్లాగి పోయేటప్పుడు గర్భాశయ రక్తస్రావాలుంటాయి. గుండె దడగా ఉండి వికారం, వాంతులు అవుతుంటాయి. నాడి వేడిగా, నీరసంగా ఉంటుంది. యువతుల్లో బహిష్టులు సక్రమంగా రాకపోవడం లేదా అణగారడం వల్ల శరీరం లేదా కాళ్ళు, చేతులు, పొట్ట భాగంలో వాపులుంటాయి. తల త్రిప్పుట, వమనానుమానం, గుండె దడ, నిస్త్రాణ ఉంటుంది.
శ్వాసకోశ లక్షణాలు:
పడక నుండి లేచేసరికి ముక్కు, గొంతు, పచ్చని చిక్కని కఫంతో నిండి ఉంటుంది. వీరిలో పిల్లికూతలు, గురక, దగ్గు చాలా అధికంగా ఉంటుంది. గుండె వ్యాధుల్లో రోగికి పడుకున్నప్పుడు ఊపిరాడక పోవుటచే రోగి లేచి కూర్చోవడం, గుండెకు నీరు పట్టినపుడు ఆయాసంచే మాట రాదు. మనస్సు చాలా ఆందోళనగా ఉంటుంది. ఏమాత్రం కదలినా గుండెదడ అధికమవుతుంది. పసిపిల్లల్లో ముక్కు నుండి ఎడతెగని స్రావం, రొంప ఉంటుంది.
శరీరంలో కాలేయం, మెదడు, గుండె, ఊపిరితిత్తుల వ్యాధుల వల్ల వచ్చే వాపులకు ఇది మంచి మందు. నీరు పట్టిన భాగాలు నొక్కిన ఎడల సొట్ట పడుతాయి. చర్మవ్యాధులు అణిగిపోవుటచేత, అధిక రక్తస్రావాల తర్వాత, మలేరియా, టైఫాయిడ్, సెప్టిక్ ఫీవర్స్ వంటి రక్త స్వభావాన్ని మార్చివేయు వ్యాధుల తర్వాత వచ్చే ఉబ్బులకిది మంచి మందు. కిడ్నీలు పనిచేయక పోవుటచే రోగి త్రాగిన నీరు అంతా జీర్ణకోశమందే ఉండి బాధగా ఉండి వాంతులవుతాయి. అధిక నిస్సత్తువచే శరీరమందలి మాంస కండరాలు వాచి పని చేయజాలవు. కీళ్ళు వాచి నీరు పడతాయి. పొగ చుట్టలు కాల్చడం వల్ల గుండె, కాలేయం పాడైన శరీరానికి నీరు పడుతుంది. దాహమెక్కువగా ఉండి నీరు ఎక్కువగా త్రాగుతుండడం విశేషం. ఇలాంటివారికిది సూచించదగ్గ మందు.
(మళ్ళీ కలుద్దాం)
వృత్తిరీత్యా ప్రభుత్వ హోమియో వైద్యురాలైన డా. కొప్పెర్ల ఉమాదేవి ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వీరు 22.6.1965 న కర్నూలులో జన్మించారు. ప్రాథమిక విద్య కర్నూలు లోను, హైస్కూలు విద్య – కదిరి, శ్రీకాళహస్తి లోనూ, ఇంటర్ డోన్ లోనూ, బి. హెచ్. ఎం. ఎస్ – కడప లోనూ పూర్తి చేశారు.
ప్రసిద్ధ కథ, నవల, నాటక రచయిత డా॥ వి.ఆర్. రాసానితో 5.11.1989 న వివాహం జరిగింది యశ్వంత్ కుమార్ (USA), కాంచన్ కృష్ణ పిల్లలు.
వీరివి కొన్ని కవితలు, కథలు, 1500 దాకా వైద్యపరమైన వ్యాసాలు పలు పత్రికల్లో ముద్రింపబడ్డాయి.
ఆంధ్రజ్యోతి ఆదివారంలో, 1998 జులై నుంచి నవంబర్ వరకు ‘స్త్రీ శరీర విజ్ఞానం’, వార్త దినపత్రికలో 1996 నుంచి నేటివరకు ప్రతి సోమవారం ‘హెల్త్ కాలమ్’, విశాలాంధ్ర – ఆదివారంలో 2017 నుంచి 2020 వరకు ‘ఆరోగ్యం’, 1993 నుంచి 1995 వరకు ప్రముఖ మాసపత్రికలో ‘హెల్త్ కాలమ్’ నిర్వహించారు.
1997-1998 మధ్య తిరుపతి రేడియో కేంద్రం నుంచి ‘యవ్వన సౌరభం’ శీర్షికతో ధారావాహిక ప్రసంగాలు చేశారు.
స్త్రీల వ్యాధులు – హోమియో వైద్యం (1996, 2000), స్త్రీ శరీర విజ్ఞానం (2000), హోమియో వైద్యం – సాధారణ వ్యాధులు (2003), హోమియో వైద్యం (2011), ఇన్ఫెక్షన్స్ (2016), పిల్లల పెంపకం (2017), కరోనా – నివారణ (2021) అనే పుస్తకాలు వెలువరించారు.