[ప్రభుత్వ హోమియో మెడికల్ ఆఫీసర్ డా. కె. ఉమాదేవి గారు అందిస్తున్న ఫీచర్ – ‘ప్రకృతి వనరులతో హోమియో వైద్యం’.]
హోమియో మందులు-9: ఎగ్నస్ కేస్టస్ (Agnus Castus)
పావన వృక్షం లేదా చేస్టీ ట్రీ అనే వృక్ష జాతికి చెందిన పండ్ల నుండి ఈ మందును తయారు చేస్తారు. డా॥ హానిమన్ మధ్యధరా సముద్ర తీరంలోను, గ్రీకు దేశంలో పెరిగే ఈ చెట్ల పండ్ల నుండి ఔషధ గుణాల్ని రాబట్టారు.
స్ధానాలు:
మనస్సు, నరాలు, కండ్లు, జననేంద్రియాలు.
వ్యాధులు:
నపుంసకత్వం, జననేంద్రియ వ్యాధులు, మానసిక వ్యాధులు.
పోలికలు:
సెలీనియం, యాసిడ్‌ఫాస్, లైకోపోడియం.
విరుగుళ్ళు:
కాంఫర్, నేట్రంమూర్, ఉప్పు నీళ్ళు.
సహచరులు:
కాలేడియం, సెలీనియం.
కారణాలు:
పొగాకు వాడడం వల్ల, జననేంద్రియ దుర్భలత, గనేరియా అణగారినా, హస్త ప్రయోగం, అధిక సంభోగం ఉన్న పురుషులు.
తత్త్వం:
చిన్న వయస్సులో సంభోగ శక్తిని దుర్వినియోగం చేయుట వల్ల వారి తత్త్వములు చెడిపోయి వయోవృద్ధులు వలె ఉండడం. లింఫాటిక్ తత్త్వం గల వారికి ఇది మంచి మందు.
పర్సనాలిటీ:
రోగపూరితులై విచారంతో వున్న వ్యక్తులు, నాడీ మండల నిస్త్రాణచే బాధపడుతున్న అవివాహితుల శోషరస గ్రంథులు, నాళాలు వ్యాధిగ్రస్త మగుతత్త్వం కలవారికిది ఉపయోగపడుతుంది.
మోతాదు:
3 – 200 పొటెన్సీ 3x 6x.
కాల పరిమితి:
8 – 14 రోజులు.
ఉద్రేకం:
నడవడం, కదిలినా, చల్లగాలిలో తిరిగినా, రాత్రిళ్ళు, అలసట వల్ల బెణుకులు, సంభోగం వల్ల ఎక్కువవుతుంది.
ఉపశమనం:
గోకడం, అదమడం, విశ్రాంతి వల్ల ఉపశమనం ఉంటుంది.
మానసిక లక్షణాలు:
విచారంగా ఉండి త్వరలో తాను చనిపోవుదునని ఇంతలో తాను ఏమియు చేయగలిగినది లేదనుకొనుట. జ్ఞాపకశక్తి తగ్గడం, మనస్సు పరధ్యానంగా ఉండడం. యవ్వనంలో శుక్ర స్ఖలనం వల్ల జననేంద్రియ దుర్భలత వల్ల జీవశక్తి కృంగి నీరసంగా ఉంటారు. ఒక లైన్ జ్ఞాపక ముంచుకోవాలన్న రెండుసార్లు చదవాల్సి రావడం, మనోనిశ్చలత లేకపోవడం, దూరం ఆలోచనలు చేయలేకపోవడం. వాసన (సువాసన, దుర్వాసనగాని) వేయుచున్నట్లు తలవడం, మాసికోద్వేగంతో తమను తామే దూషించుకోవడం, చావు భయం, కోపం, అకాల వార్ధక్యం, విచారం, నిర్లక్ష్యత ఆత్మనిగ్రహం లేకపోవటం వుంటుంది. వ్యాధుల వల్ల తలనొప్పులు, చర్మం మీద చీమలు ప్రాకినట్లుంది. అధైర్యం, నరాల నిస్త్రాణ ఉంటుంది.
శారీరక లక్షణాలు:
కనుపాపలు పెద్దవగుట, కండ్లు దురదలు, కణతలు నుదురులో నొప్పి ఉండి తల భారంగా మొద్దుబారినట్లుంటుంది. చెవులు వినపడక పోవడం, చెవుల్లో హోరు.
చేప, కస్తూరి వాసన లేని, లేని వాసనలు ముక్కుకు తోస్తాయి. వేడైన ఆహార పానీయం వల్ల పండ్ల సలుపు ఉంటుంది.
రొమ్మెముక వద్ద గట్టిగా ఊపిరి పీల్చినపుడు నొప్పి ఉంటుంది. ఎంత తేలికైన ఆహారమైననూ జీర్ణం కాదు. జీర్ణ కోశం వాయుపూరితమై ఉంటుంది. పొత్తి కడుపులో నొప్పి, ప్లీహం వాపు, ఆసనంలో లోతైన పుండ్లు, ఆసన కండరాలకు బలం లేక మలం పల్చగా ఉన్నా మలబద్దకముంటుంది. నిద్రయందు కడుపులో గుడ గుడలాడడం, మల విసర్జన సమయమందు శ్వేత ధాతువు పోతుంది. తరచూ మూత్ర విసర్జన చేయడం. మూత్ర నాళం నుండి పచ్చని స్రావం రావడం ఉంటుంది.
జననేంద్రియ సమస్యలు:
పురుషులు:
సంభోగేచ్ఛ తక్కువ లేదా లేకపోవడం, అంగ దౌర్భల్యం, వృషణాలు చల్లగా గట్టిపడి వాచి బాధగా ఉంటుంది. ఎట్టి శృంగార సంబంధమైన తలంపుల వల్ల కూడా కామోద్రేకం కల్గకుండుట. జననేంద్రియం సన్నగిల్లి ముడుచుకొని పోవడం, దురదలు, నపుంసకత్వం, హస్త ప్రయోగం వల్ల కలిగే నిస్త్రాణ, మలవిసర్జన కాలంలో ప్రొస్టేట్ గ్రంథి స్రావం వెలువడుతుంది. తరచు గనేరియా వ్యాధితో బాధపడడం, పలుసార్లు గనేరియా (సెగ రోగం) అణిచి పెట్టడం వల్ల కలిగే దుర్గణాలు, పెళ్ళికాని వారిలో కల్గు నరాల నిస్త్రాణని, శుక్ల నష్టాన్ని నివారిస్తుంది. వృద్ధులు పడుచువారి వలె నటించు నపుంసకులకు చాలా ఉపయోగకరమైనది. జననేంద్రియాలకి బిగువుండక చల్లగా, మెత్తగా వ్రేలాడుతుంటాయి.
స్త్రీలు:
జననేంద్రియ పటుత్వం లేక తెలియకుండానే రంగు లేనట్టి తెల్లమైల అవుతూ తగిలిన చోట బట్ట పసుపు రంగుగా మారుతుంది. బాలింతల్లో పాలు తగ్గిపోవడం, పాలు లేకపోవడం, విచారంగా ఉన్నప్పుడు పాలు సరిగా ఉండకపోవడం, గర్భాశయం వెలుపలికి రావడం, మావి రాకపోయినపుడు వెలువరించడంలో ఉపయోగపడుతుంది. బహిష్టులాగిపోయి సంభోగేచ్ఛ లేనట్టి స్త్రీలలో కలిగే వంధ్యత్వం. కడుపునొప్పి వుంటుంది. కోడిగ్రుడ్డు లోని తెల్ల సొన వంటి తెల్లమైల వల్ల నడిచేటప్పుడు తొడలు వరిసిపోతాయి.
భర్తయందు, పిల్లలందు విచారంగా, సంభోగమందు విముఖతగా ఉండి ఆత్మహత్య చేసికొనవలెనని ఉంటుంది. ప్రసవానంతరం మతిభ్రమణం కల్గడం, హిస్టీరియాతో కూడిన గుండెదడ, ముక్కునుండి రక్తస్రావాల్ని అరికడుతుంది. హార్మోన్ల ఇంబాలెన్స్ వల్ల జననేంద్రియ పటుత్వం ఉండక రక్తస్రావాలవుతాయి. సెక్స్ పట్ల విముఖత, ఫ్రిజిడిటీతో విచారంగా ఉంటారు.
ఎముకలు గూళ్ళలో నుండి తప్పించుకుపోయేటి నొప్పి. జ్వరంతో నాడి సన్నగా, నిస్త్రాణగా ఉండడం, లోపల చలి, వణుకుగాను, పైకి శరీరం వెచ్చగా, ముఖం కంది వెచ్చగా ఉంటుంది. చేతులు చల్లగా ఉంటాయి. ఆరుబైట గాలిలో నడుస్తున్నప్పుడు చేతులకు చెమటలు పడతాయి.
ఇతర లక్షణాలు:
ఊపిరి తీసుకునేటప్పుడు ఛాతీ బరువుగా ఉండి నొప్పి ఉంటుంది. సాయంత్రం పూట పొడిదగ్గు ఉంటుంది. రాత్రిపూట చెమటలు పట్టడం, చల్లదనం సహించలేరు. కదలిక వల్ల, అలసట వల్ల బాధలెక్కువవుతాయి. కాళ్ళు, చేతులు బెణకడం, బరువులెత్తడం వల్ల కీళ్ళనొప్పులుంటాయి. కదలినప్పుడు కీళ్ళు పట్టు తప్పినట్లుంటాయి. చేతి వేళ్ళు కుడివైపు చేయి నొప్పిగా గుంజినట్లుండడం జరుగుతుంది. కుడి తుంటి బరువుగా ఉండి నొప్పి ఉంటుంది. ఎడమకాలి బొటన వేలిలో నొప్పి ఎక్కువగా ఉంటుంది. కాళ్ళు, చేతులు చల్లగా, నిస్త్రాణతతో ఉంటాయి. శరీరంపై క్రిములు (చీమలు) పాకుతున్నట్లు దురదలుండి గోకితే తగ్గి మళ్ళీ వస్తాయి. సాయంత్రం వేళల్లో దురదలు ఎక్కువగా ఉండేవారికిది మంచి మందు.
వృత్తిరీత్యా ప్రభుత్వ హోమియో వైద్యురాలైన డా. కొప్పెర్ల ఉమాదేవి ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వీరు 22.6.1965 న కర్నూలులో జన్మించారు. ప్రాథమిక విద్య కర్నూలు లోను, హైస్కూలు విద్య – కదిరి, శ్రీకాళహస్తి లోనూ, ఇంటర్ డోన్ లోనూ, బి. హెచ్. ఎం. ఎస్ – కడప లోనూ పూర్తి చేశారు.
ప్రసిద్ధ కథ, నవల, నాటక రచయిత డా॥ వి.ఆర్. రాసానితో 5.11.1989 న వివాహం జరిగింది యశ్వంత్ కుమార్ (USA), కాంచన్ కృష్ణ పిల్లలు.
వీరివి కొన్ని కవితలు, కథలు, 1500 దాకా వైద్యపరమైన వ్యాసాలు పలు పత్రికల్లో ముద్రింపబడ్డాయి.
ఆంధ్రజ్యోతి ఆదివారంలో, 1998 జులై నుంచి నవంబర్ వరకు ‘స్త్రీ శరీర విజ్ఞానం’, వార్త దినపత్రికలో 1996 నుంచి నేటివరకు ప్రతి సోమవారం ‘హెల్త్ కాలమ్’, విశాలాంధ్ర – ఆదివారంలో 2017 నుంచి 2020 వరకు ‘ఆరోగ్యం’, 1993 నుంచి 1995 వరకు ప్రముఖ మాసపత్రికలో ‘హెల్త్ కాలమ్’ నిర్వహించారు.
1997-1998 మధ్య తిరుపతి రేడియో కేంద్రం నుంచి ‘యవ్వన సౌరభం’ శీర్షికతో ధారావాహిక ప్రసంగాలు చేశారు.
స్త్రీల వ్యాధులు – హోమియో వైద్యం (1996, 2000), స్త్రీ శరీర విజ్ఞానం (2000), హోమియో వైద్యం – సాధారణ వ్యాధులు (2003), హోమియో వైద్యం (2011), ఇన్ఫెక్షన్స్ (2016), పిల్లల పెంపకం (2017), కరోనా – నివారణ (2021) అనే పుస్తకాలు వెలువరించారు.