[ప్రభుత్వ హోమియో మెడికల్ ఆఫీసర్ డా. కె. ఉమాదేవి గారు అందిస్తున్న ఫీచర్ – ‘ప్రకృతి వనరులతో హోమియో వైద్యం’.]
హోమియోపతీ వైద్య విధానం ఎలా ఉంటుంది?
హోమియోపతి ఈనాడు క్రమంగా ఒక గుర్తింపును పొందుతోంది. కానీ చాలామందికి దీని పట్ల ఒక సమగ్రమైన అవగాహన లేదనే చెప్పవచ్చు.
అది చౌకయిన వైద్యం అనీ, ఈ మందులు వెంటనే గుణం చూపించవనీ, వ్యాధి ఎక్కువై తగ్గుతుందనీ, స్లో ప్రాసెస్ అనీ చాలామంది అపోహ పడుతుంటారు. పైగా కొందరిలో నాటు మందులనే భావన కూడా లేకపోలేదు.
అందుకే హోమియో వైద్యం అంటే ఏమిటి? అది ఎలా పని చేస్తుంది? ఈ వైద్య విధాన వైశిష్ట్యం ఎలాంటిదన్న విషయాల్ని ఇప్పుడు తెలుసుకుందాం.
హోమియోపతి అనే సమస్త పదం ‘హోమియోస్, పేథస్’ అనే రెండు గ్రీకు పదాల కలయికతో ఏర్పడింది. హోమియోస్ అంటే ‘సారూప్యత’, పేథస్ అంటే ‘బాధ’ అని అర్థం. కాబట్టి సారూప్యత గల వ్యాధుల్ని సారూప్యత గల మందుల వల్ల నయం చేసే వైద్య విధానమే హోమియోపతి వైద్యం. ముఖ్యంగా ఇది ప్రకృతి నియమం ‘సిమిలియా సిసిలిబస్ క్యూరాంటర్’ పైన ఆధారపడి ఉంటుండి
ఈ హోమయోపతి వైద్యవిధానం ఈనాటిది కాదు. 1790లో ‘శామ్యూల్ హానిమన్’ అనే జర్మన్ డాక్టర్ కృషి ఫలితంగా ఇది ఆవిర్భవించింది. దీన్ని ఒక నియమబద్ధమైన శాస్త్రీయ వైద్యంగాను, ‘మహత్తరమైన ఒక వైద్యకళ’ గాను డా॥ హానిమన్ తీర్చిదిద్దారు.
తరుణ వ్యాధులు మొదలుకొని అతి పెద్ద దీర్ఘ వ్యాధుల వరకు అన్ని రకాలైన వ్యాధుల్ని నయం చేసే వైద్యంగా ఇది నేడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుని పొందుతోంది.
ఇతర వైద్య విధానాల ద్వారా నయం కాని ఎన్నో వ్యాధుల్ని హోమియో వైద్యం ద్వారా సునాయసంగా తక్కువ కాలంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సంపూర్ణంగా నయం చేయవచ్చు.
ఈనాటి వైద్యవిధానం రోగాన్ని అణగదొక్కడానికి గానీ, రోగాన్ని విధ్వంసం చేయడానికి గానీ ఉపయోగిస్తుంది. అసలు రోగమే రాకుండా నిరోధించడానికి ప్రయత్నించదు. అయితే హోమియో విధానం రోగిలో వ్యాధి నిరోధక శక్తిని బలపరిచి సంపూర్ణ ఆరోగ్యాన్ని కల్గిస్తుంది. కాబట్టే ఇందులో డాక్టర్ రోగాన్ని కాక రోగిని దృష్టిలో పెట్టుకొని చికిత్స చేయడం జరుగుతుంది.
అందరికీ వచ్చే రోగాల పేర్లు ఒకటే అయినా, రోగుల స్వభావాలు వేరు వేరుగా ఉండవచ్చు. కాబట్టి ఆయా వ్యక్తులకు ఒకే మందు కాకుండా వారి వ్యక్తిగత లక్షణాల్ని బట్టి కూడా మందులు మారుతుంటాయి.
ఉదాహరణకు పది మంది టైఫాయిడ్ జ్వరంతో బాధ పడుతున్నప్పుడు అందరికీ ఒరే మందు ఇవ్వరు. వారి వారి వ్యక్తిగత విశిష్ట లక్షణాల్ని బట్టి వారికి వేరు వేరు మందు ఇవ్వాల్సి ఉంటుంది.
అల్లోపతిలో డయాగ్నోసిస్ ప్రధానంగా చూస్తే, హోమియోపతిలో సింప్టమ్స్ (వ్యాధి లక్షణాల్ని) ప్రధానంగా చూస్తారు. కాబట్టి వ్యాధి నివారణకు పూనుకునే ముందు వైద్యుడు వ్యాధి స్వరూపాన్ని తెలుసుకోవల్సి ఉoటoది.
వ్యాధులు రావడానికి కారణం బాక్టీరియా, వైరస్, సూక్ష క్రిములు అనుకోవడాని కన్నా వ్యక్తిలో సహజ వ్యాధి నిరోధక శక్తి తగ్గి, ప్రాణశక్తి వాటికి లొంగిపోవటమే ముఖ్యకారణంగా భావించాలి. అందువల్ల శారీరకంగా, మానసికంగా కలిగే మార్పులు రోగలక్షణాలుగా బహిర్గతమై వ్యాధి స్వభావాన్ని సూచిస్తాయి. అట్లాగని ఒక లక్షణం ఒక వ్యాధికి మాత్రమే పరిమితమై ఉండదు.
ఉదాహరణకు దగ్గును తీసుకుంటే ఇది పొంగు వ్యాధిలోను ఎలర్జీ, ఇతర శ్వాసవ్యాధుల్లోనూ కన్పించవచ్చు.
హోమియో మందులు మానవుని ఆరోగ్యాన్ని మార్చగలిగిన మేరకు మాత్రమే రోగనివారణ శక్తి కల్గి ఉంటాయి. ఈ విషయాన్ని ప్రయోగపూర్వకంగా మొదట ఋజువు చేసినవారు హానిమన్. ఆరోగ్యవంతునిలో హోమియో మందు ఏయే మార్పుల్ని మానసిక, శారీరకస్థాయిలో పుట్టించగలదో అలాంటి లక్షణాలు ప్రదర్శించే వ్యాధిని పత్రమే అది నివారించగలదు. అంతేగాక ప్రాణశక్తిని సాధారణ స్థితికి పునరుద్ధరించడానికి హోమియోపతి మందులోని అంతర్గత చైతన్య చర్యను ఉపయోగించుకుంటుంది. కాబట్టి ఇతర, వైద్య విధానాలకు లేని ప్రత్యేకతను ఈ విధానం సంతరించుకుంది.
హోమియో మందుల్ని రోగ లక్షణాల మీదే కాకుండా రోగి లక్షణాల మీద కూడా ఆధారపడి ఎంపిక చేయాలి. రోగి లక్షణాలు రోగ నిర్ధారణకు మరియు మందుల ఎంపికకు ముఖ్యం. రోగి లక్షణాల్ని పోలి ఉన్న సారూప్యం గల మందుని ఎంపిక చేయాలి.
వ్యాధి ప్రాథమిక దశలో తన శరీరంలోని మార్పుల్ని రోగి చెప్పగలుగుతాడు. కాని అవి లేబరేటరీ పరీక్షకు అందవు. వ్యాధి ముదిరి శరీర అవయవాలలో మార్పులు వచ్చిన తర్వాత వాటిని రక్త, మల, మూత్ర పరీక్షలు, ఎక్స్‌రే , స్కానింగ్‌ల ద్వారా గుర్తించవచ్చు. ఈ పరీక్షల వల్ల వ్యాధి ఫలితాలు తెలుస్తాయి. పరీక్షలో ఏ లోపాలు కన్పించకపోతే ఏ జబ్బూ లేదని అల్లోపతి డాక్టర్లు చెపుతారు. రోగి లక్షణాలను పట్టించుకోరు. అలాగాక మొదటనే వ్యాధిని గుర్తించి, రోగం ముదరకుండా హోమియో మందుల ద్వారా తేలికగా నయం చేసుకోవచ్చు. హోమియో మందుల్ని సారూప్య సూత్రానుబద్దంగా స్వల్ప మోతాదులో వాడతారు. కాబట్టి వీటివల్ల ఇతర సైడ్ ఎఫెక్ట్స్, రియాక్షన్లు ఉండవు.
వ్యాధి నివారణలో స్వస్థత పై నుంచి క్రిందికి, లోపల నుండి వెలుపలికి, ప్రధాన అవయవాల నుండి ఆప్రధానమైన అవయవాలకు బాధ విముక్తి పొందుతూ వస్తుంది. అందువల్ల వెనుక వచ్చిన బాధలు ముందూ, ముందు వచ్చిన బాధలు చివర తగ్గుతూ వస్తాయి. అందువల్ల మొదట బాధ ఎక్కువై తగ్గుతుంది. కాబట్టి వ్యాధి నివారణకు కొంత టైమ్ పడుతుంది.
ఉదాహరణకు గజ్జి, తామర వంటి చర్మవ్యాధులకు అల్లోపతి మందులు వాడినప్పుడు అవి అణిచివేయడం వల్ల కొన్ని రోజులకి ఉబ్బసం వస్తుంది. హోమియో మందు వాడినప్పుడు ముందుగా ఉబ్బసం తగ్గి చర్మవ్యాధి బైట పడుతుంది. తర్వాత చర్మవ్యాధి కూడా తగ్గిపోతుంది. హోమియోలో స్పెషలైజేషన్ అంటూ ఉండదు. అల్లోపతిలో లాగ స్కిన్ స్పెషలిస్ట్, చిల్డ్రన్స్ స్పెషలిస్ట్ అంటూ ఉండరు, అన్ని రకాల కేసులు హోమియో వైద్యులు చూడడం జరుతుతుంది. పాజిటివ్ హోమియోపతిగా నేడు చలామణీ అవుతున్న వారు కూడా హోమియోపతి మందుల్ని సారూప్య సూత్రానుబద్దంగా ఇవ్వడం జరుగుతోండి. హోమియో వైద్య విధానం ద్వారా వంశ పారంపర్యంగా వచ్చే జబ్బుల్ని కూడా నయం చేయవచ్చు.
ఉదా: తల్లిదండ్రుల్లో క్షయవ్యాధి ఉన్న వారి పిల్లలకు మాటి మాటికి జలుబు చేయడం, ఒళ్ళు చేయకపోవడం లాంటివి వుంటే అలాంటి వారికి ‘ట్యూబర్‍క్యులినం’ ఎక్కువ డోస్‌లో ఇస్తే తప్ప వారి తత్వంలో మార్పురాదు.
అలాగే కొంతమంది చిన్నప్పటి నుంచి ఏదో ఒక రుగ్మతకు లోనవుతుంటారు. వీరి వంశంలో కేన్సర్ ఉన్నట్లయితే వీరికి ‘కార్సికోసిన్’ ఇవ్వవచ్చని డా. ప్యూబిస్టర్ అభిప్రాయం.
బాలామంది తమకు తలనొప్పి అనో, కడుపు నొప్పి అనో, ఆస్త్మా అనే మందులు అడుగుతుంటారు. కానీ వ్యాధి పేరును బట్టి హోమియో వైద్యంలో మందులు ఇవ్వరు. ఒకే వ్యాధికి అనేక మందులు, ఒకే మందు అనేక వ్యాధులకు అవసరమవుతుంటాయి. వ్యాధిని ఏ పేరుతో పిల్చినా రోగిలోని విశిష్ట లక్షణాల్ని బట్టే మందుల్ని వాడాల్సి ఉంటుంది.
మందులు దేనిని కల్పించగలవో, దానినే నయం చేయగలవన్న చికిత్సా పరమైన ప్రకృతి నియమాన్ని ఉపయోగించి, ఆ మందుల్ని వ్యాధి నివారకంగా ఉపయోగిస్తారు. ఉదా: బెల్లడోనాని మెదడువాపుకు, పెర్టూసిస్ కోరింతదగ్గుకు, క్యుప్రంమెట్ కలరా వ్యాధికి, పల్సటిల్లా మీజిల్స్‍కు ప్రివెంటివ్‌గా పనిచేస్తాయి.
ఈ వైద్య విధానంలో ఆపరేషన్ అవసరం లేకుండానే కొన్ని వ్యాధుల్ని నయం చేయవచ్చు.
ఉదా:- మొలలున్నవారు నక్స్‌వామికా, సల్ఫర్ మందులను ఒక దాని తర్వాత ఒకటి వాడితే ఆపరేషన్ అవసరముండదు ముఖ్యంగా బలహీనంగా ఉన్న పిల్లల్లో టాన్సిల్స్ వస్తుంటాయి. వారి వ్యక్తిత్వాన్ని బట్టి మందులు వాడితే నయమవుతుంది. అంతేకాని ఆపరేషన్ చేసినందువల్ల ఫలితం శూన్యం. వాటికి హోమియో వైద్యమే సంపూర్ణమైన ఆరోగ్యం కల్గిస్తుంది.
హోమియో వైద్యంలో విటమిన్ లోపం, పోషకాహార లోపం వంటి వాటితో బాధపడేవారికి వారి శరీరతత్వాన్ని బట్టి అటువంటి వారికి కాల్కేరియా కార్ట్, నేట్రంమూర్ అయోడినం, సైలీషియా, లైకోపోడియం ఇవ్వాల్సి ఉంటుంది.
అలాగే సన్నగా ఉన్నవారు లావు అవడానికి, లావుగా ఉన్నవారు సన్నబడడానికి, సిగరెట్స్, త్రాగుడు అలవాట్లున్న వారికి అవి మాన్పించడానికి కూడా హోమియోలో మంచి మందులున్నాయి.
హోమియో మందులు తియ్యగా ఉంటాయి. వీటిని నోటిలో వేసుకొని చప్పరించాలి. పసిపిల్లలు మొదలు వృద్ధుల వరకు ఏ ఇబ్బంది లేకుండా సునాయసంగా వాడుకోవచ్చు.
దీర్ఘ వ్యాధులతో బాధపడేవారు అల్లోపతి, ఆయుర్వేదం మందులు వాడినాక, వ్యాధి ముదిరిన తర్వాతనే హోమియోపతికి వస్తారు. ఆ దీర్ఘవ్యాధులలో రోగ లక్షణాలు, రోగి లక్షణాలు కలిసిపోయి ఉంటాయి. వాటి మూల కారణాన్ని బట్టి, రోగి తత్వాన్ని బట్టి మందులు ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి కొంత జాప్యం జరుగుతుంది.
ఆందోళన, డిప్రెషన్, దిగులు, కోపం, మానియా వంటి అనేక మానసిక వ్యాధుల్ని రూపమాపడంలో హోమియో మందులు చక్కటి పాత్ర నిర్వహిస్తాయి.
ఇలా ప్రతి వ్యాధికి తనదైన విశిష్టమైన విధానంలో హోమియోపతి వైద్యం నివారణోపాయాల్ని నిర్దేశిస్తుంది. అందుకే ప్రపంచ వైద్యరంగంలోనే ఒక ప్రత్యేకతను కల్గి ఉన్న వైద్యవిధానం హోమియోపతి వైద్యవిధానం అనడంలో అతిశయోక్తి లేదు.
(మళ్ళీ కలుద్దాం)
వృత్తిరీత్యా ప్రభుత్వ హోమియో వైద్యురాలైన డా. కొప్పెర్ల ఉమాదేవి ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వీరు 22.6.1965 న కర్నూలులో జన్మించారు. ప్రాథమిక విద్య కర్నూలు లోను, హైస్కూలు విద్య – కదిరి, శ్రీకాళహస్తి లోనూ,
ఇంటర్ డోన్ లోనూ, బి. హెచ్. ఎం. ఎస్ – కడప లోనూ పూర్తి చేశారు.
ప్రసిద్ధ కథ, నవల, నాటక రచయిత డా॥ వి.ఆర్. రాసానితో 5.11.1989 న వివాహం జరిగింది యశ్వంత్ కుమార్ (USA), కాంచన్ కృష్ణ పిల్లలు.
వీరివి కొన్ని కవితలు, కథలు, 1500 దాకా వైద్యపరమైన వ్యాసాలు పలు పత్రికల్లో ముద్రింపబడ్డాయి.
ఆంధ్రజ్యోతి ఆదివారంలో, 1998 జులై నుంచి నవంబర్ వరకు ‘స్త్రీ శరీర విజ్ఞానం’, వార్త దినపత్రికలో 1996 నుంచి నేటివరకు ప్రతి సోమవారం ‘హెల్త్ కాలమ్’, విశాలాంధ్ర – ఆదివారంలో 2017 నుంచి 2020 వరకు ‘ఆరోగ్యం’, 1993 నుంచి 1995 వరకు ప్రముఖ మాసపత్రికలో ‘హెల్త్ కాలమ్’ నిర్వహించారు.
1997-1998 మధ్య తిరుపతి రేడియో కేంద్రం నుంచి ‘యవ్వన సౌరభం’ శీర్షికతో ధారావాహిక ప్రసంగాలు చేశారు.
స్త్రీల వ్యాధులు – హోమియో వైద్యం (1996, 2000), స్త్రీ శరీర విజ్ఞానం (2000), హోమియో వైద్యం – సాధారణ వ్యాధులు (2003), హోమియో వైద్యం (2011), ఇన్ఫెక్షన్స్ (2016), పిల్లల పెంపకం (2017), కరోనా – నివారణ (2021) అనే పుస్తకాలు వెలువరించారు.