Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రకృతి కన్య

[శ్రీమతి ఏ. అన్నపూర్ణ రచించిన ‘ప్రకృతి కన్య’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

ముద్రం, చేపలు, పక్షులు, పువ్వులు
నదులు, జలపాతాలు పచ్చని ప్రకృతి,
మంచు దుప్పటి కప్పుకున్న కొండలు
అంటే ఇష్టం లేనివారు ఎవరు?

ఇష్టమైనదాన్ని సందర్శించే అవకాశం
కల్పించుకుంటాం కదూ!
అప్పుడు మనం పొందే అనుభూతికి
మాటలు వుండవు అవునా?

కళ్ళు కెమెరా ఐతే
హృదయం అనుభూతులను
దాచుకునే ఖజానా

సముద్రపు ఒడ్డున కూర్చుంటే
గలగలమంటూ సవ్వడితో
మనలను పలకరిస్తాయి కెరటాలు

ఇంటి బాల్కానీలో నిలబడితే
రివ్వుమని వచ్చి వాలుతాయి
పిడికిట్లో ఇమిడిపోయే పిచ్చుకలు

ఎక్కడైనా నీటిలో ఈదులాడే
రంగు రంగు చేపలను చూస్తే
మనలను కదలనీయవు

నదులలో నౌకా విహారాలు
ఆనందాల పరవళ్లు
గిలిగింతలు కలిగించే పరవశాలు

పచ్చని చెట్లతో
ఆహ్లాదం కలిగించే వనాలు
మదిని పులకింప చేసే మధురోహలు

వర్షం కురిపించిన
తుంటరి మేఘాలు
అదను చూసి దూసుకు వచ్చే
ఉదయకిరణాలు
పోటీ పడితే మంచు కరిగిన జలపాతం
మిడిసిపడుతూ ఎక్కడికో జారిపోతూ
దారులు వెతుకుతోంది

లోయలో మడుగులు కట్టి
సరిగంగ తానాలు చేయమని పిలుస్తుంది
గజ గజ వొణికించే చలిలో ఐనా
గడ్డకట్టిన కరిగిపోని సుందర దృశ్యాలు
చూసిన కొద్దీ చూడాలనిపించే
మంచుపూల వానలు
వయసుని మరపించిన కేరింతలు

ఓహ్ ఎంత అందమో ఆనందమో
చెప్పలేం మాటలతో
పంచుకునే తోడు వుండాలి అంతే

అదేమిటో మనమొస్తే చాలు
మరింత విరగబాటుతో
అందాలు ప్రదర్శిస్తుంది ప్రకృతి కన్య!

Exit mobile version