Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘ప్రజ్ఞ’ కు బహువచనం ‘భానుమతి’

[బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీమతి పి. భానుమతి శతజయంతి 2025 సందర్భంగా గోనుగుంట మురళీకృష్ణ గారు అందిస్తున్న ప్రత్యేక రచన.]

భానుమతి గురించి పరిచయం చేయటం అంటే ముంజేతి కంకణానికి అద్దం చూపించినట్లే! ఆమె నటి, గాయని, రచయిత్రి, సంగీత దర్శకురాలు, సినిమా దర్శకురాలు, చిత్రకారిణి, స్టూడియో అధినేత్రి ఇంకా ఎన్నో.. “ఈ ప్రక్రియలన్నిటి లోకి మీకు ఇష్టమైనది ఏది?” అని అడిగితే “రచన” అని చెప్పేవారు.

యువ పత్రిక దీపావళి ప్రత్యేక సంచికలో భానుమతి రచించిన కథ తప్పనిసరిగా ఉండేది. ఒకసారి ఆ పత్రిక సంపాదకుడు ఆమె రచించిన కథకు ఇరవై రూపాయలు పారితోషికం పంపించమని చెప్పారట. ఉప సంపాదకుడు గా పనిచేస్తున్న ముళ్ళపూడి వెంకటరమణ “ఆవిడ సినిమాల్లో లక్షలు సంపాదించుకుంటున్నది. మనం ఇరవై రూపాయలు ఇస్తే విసిరి ముఖాన కొడుతుందేమో!” అన్నారు. “తీసుకున్నా, తీసుకోకపోయినా ఆ కథకు మనం ఇచ్చేది అంతే! పంపండి” అన్నారు సంపాదకుడు.

కొన్నాళ్ళు ఆగిన తర్వాత ముళ్ళపూడి వారు భానుమతికి ఫోన్ చేసి పారితోషికం గురించి ప్రస్తావించి “ఆ ఇరవై రూపాయలు ఏం చేశారు?” అని అడిగితే, “పదిరూపాయలు పెట్టి నేను నేతచీర కొనుక్కున్నాను. మరో పదిరూపాయలతో మా అత్తగారికి పంచెల చాపూ కొనిపెట్టాను” అన్నారు. ముళ్ళపూడి వారు ఆశ్చర్యపోయి, ఆనాడు తాము అనుకున్న మాట చెప్పారు. భానుమతి నవ్వి “ఆ లక్షలు నేను నటిగా సంపాదించినవి. ఈ ఇరవై రూపాయలు నేను రచయిత్రిగా సంపాదించినవి. నాకు ఇష్టమైన ప్రక్రియ రచన కాబట్టి, ఇరవై రూపాయలే నాకు విలువైనవి” అని చెప్పారు.

 “నేను విశ్వనాథ సత్యనారాయణ గారి శిష్యురాలిని. పద్యం రాయటం ఆయన దగ్గరే నేర్చుకున్నాను. ఆయన నా చేత మొట్టమొదటగా రాయించిన కథ ‘మరచెంబు’. అప్పుడు నాకు పద్నాలుగవ ఏడు నడుస్తున్నది” అని చెప్పేవారు భానుమతి. ఆ తర్వాత ఎన్నో కథలు రచించారు. “ఎన్నో పుస్తకాలు, ప్రాచీన సాహిత్యం, వేదాలు, ఉపనిషత్తులు చదివినా నాకు హాస్యమంటేనే ఇష్టం. మునిమాణిక్యం నరసింహారావు, ధనికొండ వారి రచనలు ఇష్టం” అని అన్నారు. భానుమతి రచించిన ‘అత్తగారి కథలు’ కు రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డ్ వచ్చింది. ఈ కథలు అన్నీ హాస్య ప్రధానమైనవే!

‘అత్తగారు – అంతరాత్మ’ కథలో మనవడు యం.బి.బి.యస్. చదువుతూ ఉంటాడు. ఓరోజు ఒక స్కెలిటన్ పట్టుకొచ్చి ఆశ్చర్యంతో చూస్తున్న పనివాళ్ళకు అందులో ఎముకల పేర్లన్నీ ఇంగ్లిష్ లో ఏమిటేమిటో చెబుతూ ఉంటాడు. అప్పుడే మడికట్టుకుని పూజ గదిలోకి వెళ్ళబోతున్న అత్తగారు అవి చూసి అదిరిపడి, “ఈ ఎముకలేమిట్రా పీడా! అవెందుకు తెచ్చావ్? ముందవి బయట పారేయించి, వెళ్లి స్నానం చేసిరా!” అంటుంది. “బయట పడేస్తే ఎలా నానమ్మా! యాభై రూపాయలు పెట్టి కొనుక్కొచ్చాను” అంటాడు.

“శ్రీరామచంద్రా! ఏం ప్రారబ్దం రా ఇదీ! ఈ పీడా కొనుక్కురావటం ఏమిట్రా! అసలు వీటిని ఎందుకు తెచ్చావు?” అని అడుగుతుంది.

“మరి డాక్టర్ కావాలంటే మాటలు అనుకున్నావా? రేపొద్దున వీటిని డిసెక్షన్ చేయాలి. నీలాగా మడి కట్టుకుని కూర్చుంటే నా చదువెట్లా సాగుతుందనుకున్నావు?”

“ఎట్లాగేమిట్రా వెర్రి నాగన్నా! చక్కగా పుస్తకాలు చదివి డాక్టర్ కావాలి. ఏ మందు ఎప్పుడు ఇవ్వాలో, ఎట్లా ఇవ్వాలో పెద్ద డాక్టర్ల నడిగి తెలుసుకోవాలి” అని హితోపదేశం చేస్తుంది.

‘అత్తగారు – లంకెబిందెలు’ కథలో అత్తగారికి వృద్ధాప్యంలో లంకెబిందెలు దొరుకుతాయని జ్యోతిష్కులు చెప్పారట. అయితే ఆ వృద్ధాప్యం అనేది ఏ వయసు నుండీ వస్తుందో చెప్పలేదు. “నాకు ఒక మేనత్త ఉండేది. తన నగలన్నీ తన అభిమాన పాత్రురాలైన మా పెద్ద అక్కకు, మరికొన్ని రెండో అక్కకు ఇచ్చేసి, నాకు ఏమీ లేకుండా చేసేది.. పైగా ‘నీకేమమ్మా! లంకెబిందెలు వస్తాయి బోలెడు నగలతోనూ, డబ్బుతోనూ. పాపం వాళ్ళకేముంది? ఉన్నవి వేసుకోవాల్సిందేగా!’ అనేది. ఆ ముసలి పీనుగు అట్లా ఏడిపించేదే! పోతే పోన్లే! నా నిక్షేపం నాకు దొరికితే చాలు అనుకుని ఊరుకునేదాన్ని” అని చెబుతుంది అత్తగారు కోడలితో.

ఇలా ఈ కథాసంపుటి లో ఏ కథ చదువుతున్నా మనకు తెలియకుండానే మనసులోనే నవ్వుకుంటాం. అత్తగారి కథలు రెండు భాగాలు. భానుమతి కథానికలు పేరుతో ఇంకో రెండు భాగాల పుస్తకాలు ఉన్నాయి. ఇవి కాక ‘నాలో నేను’ ఆత్మకథకు జాతీయ బహుమతి వచ్చింది. అందులో తన బాల్యం, వివాహం, సినీనటిగా ప్రస్థానం, అందుకున్న అవార్డులు మొదలైనవి అన్నీ చెప్పారు.

ఇక నటన విషయానికి వస్తే ఆమె నటించిన చిత్రాలు ఎన్నో విజయం సాధించాయి. కానీ తనకు నటన ఇష్టం లేదనీ, పాటలు పాడటమే ఇష్టం అనీ చాలాసార్లు చెప్పారు. నాట్యం అసలు రాదు. “నాకు డాన్స్ అంటే ఇష్టముండేది కాదు, బిడియపడేదాన్ని. భక్తిమాల అనే చిత్రంలో నాది నాట్య ప్రధానమైన పాత్ర. వార్తాపత్రికలో నేను నాట్యం చేస్తున్న భంగిమ ఫోటో వేసి ‘కీళ్ళ నొప్పుల భానుమతి’ అని రాశారు” అని చెప్పి నవ్వేశారు.

సినిమాల్లో హాస్యం అంటేనే ఆమెకు ఇష్టం. ఏడుపులు అంటే చిరాకు. విజయ పిక్చర్స్ మీద ‘సత్యహరిశ్చంద్ర’  సినిమా ప్లాన్ చేస్తూ చంద్రమతి పాత్రకు భానుమతిని తీసుకుందామని అనుకున్నారు నిర్మాత చక్రపాణి. “చంద్రమతి విషాద భరితమైన పాత్ర. భానుమతి ఏడిస్తే ఎవరు చూస్తారు? భానుమతి ఎవరినన్నా ఏడిపిస్తే చూస్తారు గానీ!” అన్నారు చక్రపాణి మిత్రులు. నిజమేననిపించి తర్వాత ఆ పాత్రకు యస్.వరలక్ష్మిని తీసుకున్నారు.

పాత్రలో జీవించటమే నటనకు గీటురాయి. కానీ భానుమతి ఆ పాత్రను చంపి జీవిస్తారనేది విమర్శ. ఏ పాత్రలోనైనా నిర్మొహమాటంగా మాట్లాడటం, చురకత్తి లాంటి చూపు, కంఠంలో అధికారం, మాట విరుపున వెటకారం ఇవే కనిపిస్తాయి. ప్రేక్షకులు ఆవిడ పాత్రను చూడటానికి కాదు, ఆవిడను చూడటానికి వస్తారు.

ఆవిడా సొంతచిత్రం ‘అంతా మన మంచికే’ (1972) మూడు గంటల పాటు నవ్వులలో ముంచెత్తుతుంది. అందులో  పొగాకు వ్యాపారిగా నటించిన ధూళిపాళ, భార్యకు తెలియకుండా వేరే ఆడవాళ్ళతో చాటుమాటు వ్యవహారం నడుపుతూ ఉంటాడు. అది భానుమతి కంటబడుతుంది. తనని కలవటానికి ఆఫీస్ కి వచ్చిన అతనితో “అంతా బాగున్నారా పిల్లలు, భార్య‘లు’!” అని వెటకారంగా అడుగుతుంది ‘భార్యలు’ అనేచోట ‘లు’ వత్తి పలుకుతూ.

ఇంకో సీన్ లో ప్రొప్రైటర్ ని కలవటానికి క్యాబరే డ్యాన్సర్ వస్తుంది అర్ధ నగ్నమైన దుస్తులతో. భానుమతి చూసి “ఆగాగు.. ఏమిటి నీ అవతారం, నీ దేవతా వస్త్రాలు?” అని అడుగుతుంది. ఇంతలో గొంగళి పురుగు ఆ డ్యాన్సర్ కాలి మీదకు పాకుతుంది. ఉలిక్కిపడి కెవ్వుమని అరిచి, గోక్కుంటూ గంతులు వేస్తుంది. “నిన్ను చూస్తుంటే నాకూ అంత కంపరంగా ఉంది. డాన్సూ వద్దు, పాడూ వద్దు. ఇది కప్పుకుని ఇంటికి వెళ్ళు” అని శాలువా ఆమె చుట్టూ కప్పి, “ఈసారి డాన్స్ వేసేట్లయితే ఒంటి నిండా బట్టలు కట్టుకుని రా!” అని పంపేస్తుంది.

పత్రికలలో ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడు కూడా హాస్యస్పోరకమైన జవాబులు ఇచ్చేవారు భానుమతి. సాహితీరంగంలో విశ్వనాథ వారి లాగ సినీరంగంలో భానుమతికి చాలా గర్వం అని చెప్పుకునే వారు. ఆ విషయం రెండు మూడు సందర్భాల్లో అడిగారు విలేఖరులు. “అది గర్వం కాదు, ఆత్మ విశ్వాసం. అది కూడా నేను ప్రదర్శించేది కాదు, అంతా అమ్మవారి అనుగ్రహం” అని చెప్పారు. మరో సందర్భంలో “తెరమీద యస్.వి.రంగారావు గారుంటే పక్కనున్న్ ఆర్టిస్ట్ ని ఎవరూ చూడరు. భానుమతి ఉన్నా అంతే! అది వాళ్ళ ఇమేజ్. గర్వం అనుకుంటే వాళ్ళ ఖర్మ” అన్నారు. ఇంకో సందర్భంలో “అవునండీ! గర్వం నాకు కాక ఇంకెవరికి ఉంటుంది? కర్ణుడికి కవచ కుండలాలు లాగా గర్వం నాకు సహజాభరణం” అని చెప్పారు.

భానుమతికి కర్నాటక సంగీతం అంటే చాలా ఇష్టం. మొదట తన పాటను పదిమందికీ వినిపించాలనే మద్రాస్ వచ్చారు. అనుకోకుండా సినిమా అవకాశాలు వచ్చాయి. నటిగా కూడా నిలదొక్కుకున్నారు. తన సొంత బ్యానర్ మీద తీసిన చిత్రాల్లో హీరోయిన్ పాత్రను తన స్వభావానికి అనుగుణంగా రాసుకోవటమే కాక, త్యాగరాయ కీర్తనో, అన్నమయ్య కీర్తనో, జయదేవుని అష్టపదో ఏదో ఒకటి తప్పనిసరిగా ఉండేటట్లు చూసుకునే వారు. “త్యాగరాయ కీర్తనలు సినిమాల్లో పెడితే ఎవరు చూస్తారు? సిగిరెట్లకు బయటకు వెళతారు” అని విసుగుకునే వాడు భర్త రామకృష్ణ. అయినా వినిపించుకోలేదు భానుమతి.

తన పాత్రలు అన్నిటికీ తనే పాడుకునే వారు. అప్పటికి నేపథ్యగానం బాగా ప్రాచుర్యంలోకి వచ్చినా తన పాటలు వేరొక గాయని పాడటానికి ఒప్పుకునేవారు కాదు. ‘బొబ్బిలి యుద్ధం’ (1964) లో కథ ప్రారంభించగానే యస్.రాజేశ్వరరావు పాట ఉంటుంది. ఇది నాగయ్య మీద చిత్రీకరించారు. యస్.రాజేశ్వరరావు సంగీత దర్శకుడిగా ప్రతిభావంతుడే గానీ, ఆయన స్వరంలో శ్రావ్యత ఉండదు. ఈ పాట వింటుంటే ప్రేక్షకులకు చిరాకు కలుగుతుంది. వెనువెంటనే ‘శ్రీకర కరుణాల వాల వేణుగోపాలా..’ అంటూ భానుమతి పాట మొదలు అవుతుంది. చూస్తున్న వారి మనసు తేలికై హాయిగా వినువీధిలో విహరిస్తున్న అనుభూతి కలుగుతుంది. అదీ ఆమె గాన మాధుర్యం.

1982 లో అంతా చిన్నపిల్లలతో ‘భక్త ధ్రువ మార్కండేయ’  చిత్రం తీశారు. కథ తనే తయారు చేసి, దర్శకత్వం, సంగీత దర్శకత్వం పర్యవేక్షణ చేశారు. అందులో తనతో సన్నిహితంగా ఉండే రచయిత్రి శారదా అశోకవర్ధన్ కు ఒక పాట రాయటానికి అవకాశం ఇచ్చారు. ఒక జోలపాట రాశారు ఆమె. పిల్లలకు నటన నేర్పుతూ తనూ వాళ్ళతో కలిసిపోయి ఆనందిస్తూ నటింపజేశారు. జయాపజయాలతో సంబంధం లేకుండా చూస్తే ఆ సినిమా బాగానే ఉంటుంది.

భానుమతి ఆఖరుగా నటించిన చిత్రం ‘అసాధ్యురాలు’ (1993). ఆమె తెలుగులో నటించినవి మొత్తం 60 చిత్రాలు. అందులో సగం సొంత చిత్రాలు. ఇతర నిర్మాతలకు నటించినవి కేవలం 30 మాత్రమే! ఆమె పెట్టే కండిషన్స్ భరించలేక “భానుమతి తో మనం వేగలేం!” అని నిర్మాతలందరూ అనుకోవటమే కారణం.

“కవిత్వం, కథల తర్వాత నాకు చాలా ఇష్టమైనది పెయింటింగ్ వేయటం. ఎన్నో వేశాను. బాగున్నాయన్నారు అందరూ. తర్వాత జ్యోతిష్య శాస్త్రం మీద యాభై ఏళ్లుగా కృషి చేస్తున్నాను. నేను, నా నమ్మకాలు వమ్ము కాలేదు. హస్తసాముద్రికం కూడా కొంత పట్టుబడింది.. ఆడదాన్లో కొంత అజ్ఞానం, అమాయకత్వం ఉంటేనే మగవాడు భరించగలడు. ఇంటలెక్చువాలిటీ తో నిర్మొహమాటంగా సాగిపోయే స్త్రీని భరించలేడు. అందుకే ప్రపంచాన్నే శాసించిన నేను మా వారి వెనుకనే నడిచాను” అని చెప్పేవారు భానుమతి.

ఒక సూర్యుడు.. ఒక చంద్రుడు.. ఒక భానుమతి. భానుమతికి ప్రత్యామ్నాయం లేదు.

Exit mobile version