[షేక్ కాశింబి గారు రచించిన ‘ప్రభూ!’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
రాళ్ళ గుట్టలో.. మొసళ్ళో.. అన్నట్లు రక్తపు మడుగులో
తేలియాడుతున్నాయి.. ఖండిత అవయవాలు!
నిశ్శబ్బ నిశీధిలో కీచురాళ్ళ రొదలా.. భయం గొలుపుతున్నాయి విలవిల్లాడుతున్న క్షతగాత్రుల పెడబొబ్బలు!
మృత్యువు ప్రచండ భానునిలా.. నలుదిక్కులా తానై సంచరిస్తూ
జలదరించే మేనుని భీతితో గడ్డ కట్టిస్తున్నది!
కొట్టేసిన చెట్టు కొమ్మల్లా.. చుట్టూ పడున్నారు
ఆత్మీయ బంధువులు.. విగత జీవులై!
ఎంత గుచ్చి గుచ్చి చూసినా.. ఆ కలవర పెట్టే దృశ్యాలు
ఆత్మని తాకి.. ఆర్ద్రపరచడం లేదు!
ఏ ఆత్మ బంధమూ.. బాధించి
కళ్ళని దుఃఖపు సెలయేళ్ళతో తడపడం లేదు!
కరుడు గట్టిన స్వార్థ కాంక్ష
అర క్షణమైనా నరమేధాన్ని ఆపడం లేదు!
నిప్పులు కురిసే నిరసనతో కర్కశమైన గుండెలు
హింసాద్వేషాలనే.. చప్పుడుగా మార్చుకున్నాయి!
జీవన సంగ్రామాన.. నిర్మోహపు యంత్రాలుగా మారిన
నేటి ఆధునిక యువకుల చేత
అస్త్ర సన్యాసం చేయించడానికి.. వాళ్ళ
మనసు పొరల్ని తవ్వి, దయని పాదుకొలుపుతావో..
ప్రేమామృత బిందువుల్ని చిలకరించి
శాంతి మంత్రంతో మమతల ప్రతిమలుగా మారుస్తావో..
మేలి ఉవాచల కూర్పుతో.. వారిలోని
మలిగిన మానవతా దీపాలని వెలిగిస్తావో..
ప్రభూ! భారం నీదే!