Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రాకృతిక జీవన సుగంధం

[శ్రీ కోమాకుల సూరిబాబు రచించిన ‘ప్రాకృతిక జీవన సుగంధం’ అనే కవితని అందిస్తున్నాము.]

మానవ జీవిత రథచక్రాలు ప్రగతి పథంలో నడిచినపుడే
జీవన సౌభాగ్యానికి తెరలేస్తాయి..
పూల ఘుమఘుమలు ప్రకాశవంతమై..
సువాసనలు వెదజల్లు సమయాన..
జీవన సారం వెల్లివిరిసి ఆనందమయమవుతుంది..
పూల మొక్కల తళతళలు.. పువ్వుల సుగంధ వాసనలు..
చల్లగాలి తెమ్మెరలు.. ఆహ్లాదకరముగా ఆవిష్కరింపబడి..
అనుకోని అనుభూతికి లోనవుతాయి..
పక్షుల కిలకిలా రావములు..
తుమ్మెదల ఝుంకార నాదములు..
పిచ్చుకల సవ్వడి.. పావురాళ్ల కీచులు..
ప్రకృతిని పరవశింప చేసినపుడు..
పొందే ఆనంద మాయ భావనా తరంగాలు..
జీవన తరంగాలలో ఉప్పొందింప జేసి..
రసమయ కాంతులు విరబూసి..
రసాత్మక ప్రక్రియకు తెరలేపుచున్నపుడు..
ఆనంద బాష్పాలు తెరలు తెరలుగా కన్నులలో కురిపించినపుడు..
పొందే భావనా గీతికా సుగంధ పరిమళాలు
జీవన సౌందర్యానికి పట్టుకొమ్మలై..
మానవ జీవిత సుగంధాభివృద్ధికి ఆలంబనగా అమరుతాయి..

వినయ విధేయతలో పెరిగే పిల్లల..
ఆటపాటలు, అల్లరిపనులు, కుర్రచేష్టలు..
మానవ మనుగడలో భాగమై..
కుటుంబ బాధ్యతలు సక్రమ నిర్వహణలో..
నిర్వర్తించు సమయాన.. పొందే..
హృదయ స్పందన మధురాతి మధురమై
హృదయ కవాటాలు ప్రతిస్పందన చెంది..
భావి జీవిత సౌభాగ్యానికి సుగంధ పరిమళాలాలు వెదజల్లును..
ఆహార నియమాలకు ప్రాధాన్యమిస్తూ..
మద్యానికి బానిసలు కాకుండా..
కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలం గడుపుతూ..
ఆర్థిక అవసరాలు గమనిస్తూ..
ఆదాయ వ్యాయాల సమతూకం పాటిస్తూ..
నైపుణ్యాలు అలవరచుకుంటూ..
కొత్త ప్రాంత విశేషాలు గమనిస్తూ..
కొత్త కొత్త పరిచయాలు పెంపొందించుకుంటూ..
సమయం దొరికినపుడు పుస్తకాలతో కుస్తీ పడుతూ..
ఆత్మవిశ్వాసాన్ని బలపరచుకుంటూ..
జీవిత రథాన్ని నడిపితే..
జీవన సుగంధం పరిఢవిల్లుతుంది..

శ్రమైక జీవన సౌందర్యంలో ..
పొందే ఆనందమయ పరిమళాలు..
ఆసాంతం మన హృదయానికి అద్దం పట్టి..
అమృతమయమైన జీవన సౌభాగ్యానికి..
ఆలంబనగా నిలిచి జీవితాన్ని ఆహ్లాదపరుస్తాయి..
ఆకాశంలో మబ్బులు తెరలు తెరలుగా తరలుతుంటే,
మబ్బుల మాటున దినకరుడు దోబుచులాడుతుంటే..
ప్రాకృతిక పారవశ్యం పరిమళింప జేసి..
మదిని ఆహ్లాదింప జేయు తరుణాన..
పొందు ఆనంద కేళీ విలాస పర్వం..
జీవిత సౌభాగ్యానికి పట్టుకొమ్మ కాదా..
ప్రాతః కాల వేళ పలకరించు బాల భాస్కరుని..
ప్రభాత కిరణాలు తనువును తాకుతుంటే..
సుస్వర గీతాలు స్వర మాధురులై..
హృదయాన్ని పులకింప జేయు తరుణాన..
తన్మయత్వం తాండవించి మనసు నింపుతుంటే..
ఆ రసానుభూతి జీవన ప్రయాణాన్ని..
దిగ్విజయముగా సాగించమని ప్రోత్సహిస్తుంటే..
విజయానందపరుడువై నీ కర్తవ్యాన్ని
నిర్వహించడానికి ఉద్యుక్తుడవుతున్న వేళ..
నీలో ప్రసరించే ఆనందమయ కిరణాలు..
నీ జీవిత గమనానికి నాంది పలుకుతున్నపుడు..
జీవిత మాధుర్యం నీ లక్ష్యాన్ని ఛేదిస్తున్నపుడు..
జీవిత మధుర సుగంధం ప్రభంజనమై..
నీ భావి జీవితానికి ఆలంబనగా మారి..
అమృతమయ జీవితానికి దారి చూపించి..
జీవన సుగంధం నీ ఇంటిల్లిపాది ప్రసరింప జేసి..
ఆనందమయ జీవితం సాగించు కర్తవ్య నిర్వహణ..
నీకు వరమై నీ కుటుంబ సౌభాగ్యం పరిఢవిల్లుతుంది..
అనుటలో సందేహం లేదు.

Exit mobile version