[శ్రీమతి వారణాసి నాగలక్ష్మి రచించిన ‘పోస్ట్‌మ్యాన్’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
పట్టు పీతాంబరాలు లేవు,
పసిడి హారాలూ లేవు
రత్నఖచితమైన మకుటం లేదు,
రవ్వల కంకణాల పేరైనా వినలేదు
ఖాకీ దుస్తుల్లో తలపై టోపీతో
వరాలిచ్చే మురారిలా వస్తాడతను!
ఎండనక వాననక
పురవీధుల్లో అతను సంచరిస్తుంటే
గణగణమోగే ఆ ఘంటానాదం
మురళీరవమై వినపడుతుంది
పరుగులతో గుమ్మాలు దాటొచ్చే జనసమూహం
ఆలమందలా కనిపిస్తుంది!
సైకిలే రథంగా, తన కాళ్లే అశ్వద్వయంగా
ఉత్తరాల సంచులతో ఆ రథసారథి
ఆగుతూ సాగుతుంటే ప్రతి పల్లే రేపల్లైపోతుంది!
పుట్టుకా చావూ పెళ్లీ పేరంటం..
కబురేదైనా కర్మయోగిలా
ఎవరి లేఖలను వారికందించే అతగాడు
ఆ కొద్ది క్షణాల్లోనూ ఎవరి కర్మఫలాలను
వారికందించే అంతర్యామిలా గోచరిస్తూ
అందరికీ బంధువనిపిస్తాడు!
వారణాసి నాగలక్ష్మి పేరుమోసిన కథారచయిత్రి, కవి, గేయ రచయిత్రి. చిత్రలేఖనంలోనూ విశేష నైపుణ్యం ఉంది. ఆలంబన, ఆసరా, వేకువపాట, శిశిర సుమాలు వీరి కథా సంపుటాలు. బోలతీ తస్వీర్ హిందీ అనువాద కథల సంపుటి. ‘కలవరాలూ కలరవాలూ’ కవితా సంపుటి.
వాన చినుకులు లలిత గీత మాలిక, ఊర్వశి నృత్య నాటిక వీరి ఇతర పుస్తకాలు. వీటిలో ‘వానచినుకులు’ పుస్తకానికి తెలుగు యూనివర్శిటీ సాహితీ పురస్కారం లభించింది.