Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పూర్ణాహుతి

[శ్రీమతి కె. వి. రాజలక్ష్మి గారి ‘పూర్ణాహుతి’ అనే కన్నడ కథని అనువదించి అందిస్తున్నారు చందకచర్ల రమేశ బాబు.]

పార్కులోకి అడుగు పెడుతూనే, గేటు పక్కనే ఉన్న కార్మికుల క్వార్టర్స్ వైపు దృష్టి సారించాను. మొదటి రెండు ఇళ్ళకు తాళం కనిపించింది. “ఊళ్ళో లేరు”- అక్కడే బట్టలుతుకుతున్న ఆడమనిషి నా వైపు చూసి చెప్పింది. ఆమె పక్కనున్న ఒక మూడు నాలుగేళ్ళ కుర్రాడు నా వైపే ఆశతో చూస్తుంటే, “రా” అన్నట్టు చెయ్యూపాను. వెంటనే వాళ్ళమ్మ వైపు చూసి, కళ్ళలోనే అనుమతి దొరకగానే పరిగెట్టుకుని వచ్చాడు. జేబులోంచి చాకో-బిస్కట్ పొట్లం ఇచ్చి “ఏంట్రా నీ పేరు” అంటూ చెంపలు నిమిరాను. “శివరాజ్” అంటూ ఒకటే పరుగుతో వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళాడు.

ఇంట్లోని పళ్ళు, కూరగాయలు, మిఠాయిలు- ఇలా ఏది నాకు మిగిలింది అనిపిస్తే ఈ పార్కులోని వాళ్ళకు ఇచ్చేవాణ్ణి. అక్కడ ఉన్న నాలుగిళ్ళ వాళ్ళూ రోజు కూలివాళ్ళే. ఒక్కోసారి ఆరేసి నెలలకు వేరేవాళ్ళు రావడం కద్దు. ఇంటికి ఇద్దరు పిల్లలు అన్నట్టు రెండిళ్ళలో నలుగురు, ఇంకో ఇంట్లోని మహిళ గర్భిణి, చివరి ఈ ఇంట్లో వీడు శివరాజ్. ఆ పిల్లల్లో పెద్ద పాప, దాని తమ్ముడు స్కూలుకు వెళ్ళడం లేదు అని తెలిసి కారణం అడిగాను. “ఇక్కడ చేర్చుకోవడానికి టిసి కావాలన్నారు సార్. మళ్ళీ ఊరెళ్ళి తేవాలి” అన్నాడు వాళ్ళ నాన్న. “అదేం కష్టం కాదే! ఇక్కడ స్కూల్లో అర్జీ ఇస్తే మీ పని అవుతుంది కదా? దానికోసం పిల్లలను ఎందుకు ఇంట్లో కూర్చోబెడతారు?” అన్నాను. “అలా కాదు సార్. ఈ రోజు ఇక్కడ, రేపు ఎక్కడో? కాంట్రాక్టర్ ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి మేము. ఇక్కడ చేర్పించి, మళ్ళీ కొన్ని నెలలకు ఇంకో చోటికి వెళ్ళి చేర్చడం కష్టం సార్.” అన్నప్పుడు అతడి అమాయకత్వం, బెదురు చూసి అయ్యో అనిపించింది. “అయినా పిల్లలు ఊరికే ఇంట్లో కూర్చోవడం లేదు సార్. ట్యూషన్‌కు వెళ్తారు” అన్నాడు. పిల్లలు ఏ తరగతుల్లో చదువుతున్నారు అని తెలుసుకున్నాను. పార్కుకు మరో వైపున్న కార్పొరేషన్ పాఠశాలలో నా మిత్రుడి అక్క పనిచేస్తోంది. తాత్కాలికంగా ఏదైనా చేద్దామని ఆమెను అడిగాను.

“టిసి వచ్చేదాకా ఆ క్లాసుల్లో కూర్చోనీండి. మేమే టిసి తెప్పించవచ్చా అని కనుక్కుంటాను. చదివే పిల్లలకు ఇలాంటి కారణాలవలన చదువు ఆగకూడదు. రేపు వచ్చెయ్యమనండి” అనే భరోసా స్కూలువాళ్ళ నుండి దొరికింది. నా పని పొద్దున పదకొండునుండి రాత్రి ఎనిమిది దాకా. ఒక రోజు మట్టుకు ఇంటినుండి లాగిన్ అవుతాను అని టిఎల్‌కు చెప్పితే సరిపోతుంది అనుకుని “మొదటి రోజు పిల్లలతో నేనే వస్తాను” అని చెప్పి ధన్యవాదాలు తెలిపాను.

రెండు రోజులనుండి ఉదయం వాకింగ్ కని పార్కుకు రాలేదు. ఈ రోజు పిల్లలకు స్కూలు గురించి చెబుదాం అని వస్తే వీళ్ళు ఊళ్ళో లేరు. ఎప్పుడొస్తారో తెలియదు. సరే చూద్దాం అనుకుని పది నిమిషాలు వాక్ చేసి నేను మామూలుగా కూర్చునే బెంచీ పైన కూర్చున్నాను. సూర్యుడి కిరణాలు నేరుగా నా పైన పడుతున్నాయి. చెప్పులు వదిలేసి చేతులు, కాళ్ళు ఆడించాను. సూర్యుడినుండి కావలసినంత విటమిన్-డి దొరకడం ఎంత అదృష్టమో అనిపించింది. ఈ వైద్యుడు ఒక్క పైసా కూడా తీసుకోడు. జాతి మతాల తేడా లేకుండా ఉచితంగా పంచుతూ పోతాడు. మనం వాడుకోకపోతే విటమిన్-డి కొరత మనకు. దాన్ని పొందడానికి మందులు అంటూ ఖర్చు. నవ్వుకున్నాను. మనసులో ఆదిత్య హృదయం చదువుకుంటూ కళ్ళు మూసుకుని సూర్యుడివైపు చూశాను. నీరెండ ఆహ్లాదకరంగా అనిపించింది. చాలనిపించినప్పుడు మొహం కిందికి దించి నేలవైపు చూశాను. ఎవరో పారబోసిన చక్కెర కణాలను శ్రద్ధగా వరసగా చీమలు తీసుకుని పోవడాన్ని ఆశ్చర్యంతో చూశాను. నేను తెచ్చుకున్న రెండు బిస్కెట్లలో ఒకదాన్ని తీసి పొడిచేసి అక్కడక్కడ చల్లి ఇంకోదాన్ని తినసాగాను. కొత్త ఆహారాన్ని పసిగట్టిన చీమలు ఆ ముక్కల్ని తీసుకెళ్ళడం ప్రారంభించాయి. తమకంటే పెద్ద ముక్కలని మోసుకుని తాపత్రయ పడుతూ చలించనారంభించాయి. ఒకట్రెండు చీమల చలనవలనాలను విస్మయంతో గమనించసాగాను. వాటికి అడ్డంగా ఉన్న ఒక చిన్న రాతిని జరిపాను. అప్పుడు అవి సులభంగా వెళ్ళసాగాయి. పరోక్షంగా నాకు ధన్యవాదం చెప్పుండచ్చునేమో అనిపించి, వెంటనే నా ఆలోచనకు నాకే నవ్వొచ్చింది. ఆ చీమలకు కొన్ని రోజుల పాటి ఆహారాన్ని, అవి అడక్కపోయినా ఇచ్చానన్న తృప్తి ఆవరించింది నాలో!

అవును. నాకు కూడా అలాగే కదా జరిగింది! లేకపోతే ఎక్కడో పిజిలో ఉన్న నాకు ఇలా ఒక సహాయం అందడం అంటే! అదీ నేను అడక్కున్నా!!

నా అఫీసులో పనిచేస్తున్న సీనియర్ సందేశ్ మా ఊరివాడే అని తెలిసాక ఆ పని మీద శ్రద్ధ, విశ్వాసాలు పెరిగాయి. ఏదైనా తప్పు జరిగినా అతడు ఉన్నాడు అనే ధైర్యం! అతడికి విదేశాల్లోని ప్రాజెక్ట్ పని మీద వెళ్ళే అవకాశం వచ్చినప్పుడు, తన ఫ్లాట్లో నన్నుండమన్నాడు. “సంవత్సరం పడుతుందో, రెండు సంవత్సరాలో! అద్దెకివ్వడానికి మనసొప్పడం లేదు. నువ్వే ఉండు” అంటూ నా మీది నమ్మకంతో ఉదారతను చూపాడు. “అమ్మ ఎప్పుడైనా ఏ ఫంక్షన్ కైనా ఊరినుండి వచ్చినప్పుడు ఇక్కడే ఉంటుంది. ఆ టైమ్‌లో మాత్రం కొద్దిగా చూసుకో” అన్నాడు.

“మా అమ్మానాన్న రావచ్చా?” అని మొహమాట పడుతూ అడిగాను. “అది కూడా అడగాలా? నీ ఇల్లే అనుకుని చూసుకో చాలు. మేంటెనెన్స్ నెలకు మూడువేలు మాత్రం కట్టు. కరెంటు బిల్లు కట్టుకో” అని చెపుతూ ధైర్యం నింపాడు. నా టిఎల్ కొంచెం స్ట్రిక్టు. సందేశ్‌కు తెలిసిన వాణ్ణి అని తెలిసాక కొద్దిగా మెత్తబడ్డాడు. “నీకు సెలవులేమైనా ఇబ్బంది అనిపిస్తే నాకు చెప్పు. నేను చెప్తాను.” అని కూడా అన్నాడు. ఈ రకమైన చిన్న చిన్న రాజకీయాలు అన్ని చోట్లా ఉండేవే. అవకాశం వచ్చినప్పుడు వాడుకోవడమే. కానీ ఇతరులను ఇబ్బంది పెట్టరాదు అన్నది నా నియమం.

పిజిలో పన్నెండు వేలు కట్టేవాణ్ణి. సందేశ్ స్వయం పాకం చేసుకునేవాడు. ఆ పాత్రలన్నీ ఉన్నాయి. మనమే వండుకోవచ్చు. హోటల్ బిల్లు కూడా మిగులుతుంది. కనిపించని దేవుడికి దణ్ణం పెట్టుకుని పిజి ఖాళీ చేసి ఫ్లాట్లోకి వచ్చేశాను.

“రేపు ఉదయం టిఫిను, మధ్యాహ్నం హోమం, పూర్ణాహుతి తరువాత భోజనం ఉంటుంది. బిల్డింగ్ నివాసులందరూ పాల్గొని విజయవంతం చేయాలని మనవి” అంటూ వాట్సప్ గ్రూపులో ఒక మెసేజ్ పడింది. “మన కాంప్లెక్స్ వార్షికోత్సవం. ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నాం” అంటూ ఒక పదిహేను రోజుల క్రితం బిల్డింగ్ పదాధికారులు ఇంటిముందు నిల్చున్నప్పుడు ఐదు వందలు ఫోన్ పే పంపింది గుర్తొచ్చింది. ఒక రకంగా మంచిదే అయింది. ‘రాత్రి భోజనానికి ఏదో చేసుకోవచ్చు. పొద్దున వంట తప్పింది. అప్పటిదాకా తీరికే’ అనుకుంటూ ఇంటివైపు నడిచాను. గేటు వద్ద శివరాజ్ తల్లి కనిపించి “వాళ్ళకు ఫోన్ చేశానయ్యా. సోమవారం వస్తారు” అని చెప్పింది. అంటే బుధవారం ఆ పిల్లలను స్కూలుకు పిలుచుకు పోవచ్చు అనుకుని, శివరాజ్ కు టాటా చెప్పి గేటు దాటాను.

***

కాంప్లెక్స్ వెనుక భాగాన ఉన్న పార్టి హాల్లో అందరికీ భోజనం, టిఫిన్లు ఏర్పరచారు. నా ఎడమవైపుకు కూర్చున్న సుమారు డెబ్భై సంవత్సరాల వ్యక్తి “మీరు కొత్తా? ఇంతకు ముందెప్పుడూ చూడలేదు?” అనగా నేను నా పరిచయం చెప్పుకున్నాను. “నేను మురారి త్రివేదిని. ఇక్కడి ఫౌండర్ మెంబర్లలో ఒకడిని. క్రితం ఏడు నేనే అధ్యక్షుడిగా ఉన్నాను.” అని ఆయన పరిచయం చేసుకోగానే నాకు ఆశ్చర్యం, ఆనందం ఒక్కసారిగా కలిగాయి. త్రివేది అనగానే కేవలం హిందీ మాట్లాడే మనిషేమో అనుకున్న నా ఊహ నిజం కాలేదు. “మీలాంటి పెద్దవాళ్ళ అనుభవం, మార్గదర్శనం అవసరం సార్” అన్నాను. ఆయనకు సంతోషం కలిగినట్లు అనిపించింది. మొహం విప్పారింది. ఉప్మాతో పాటు రవకేసరి వడ్డించగానే “ఇదే వర్కవుట్ అయ్యేది మన బడ్జట్‌కి. అదీ గాక పూర్ణాహుతి ముగిసి, అన్న సంతర్పణ జరిగేదాకా ఆగాలి కదా? అందుకే నేనే సజెస్ట్ చేశా” అన్నారు. “అదీ కరెక్టే లెండి. ఈ దుబారా కాలంలో ఇలాంటివన్నీ ఆలోచించాల్సిందే” అన్నాను. “ఇంకో విషయం. ఇలా అంటున్నానని అనుకోకండి. వందో, రెండొందలో ఇచ్చి నలుగురైదుగురు ఒకే ఇంటినుండి వస్తారు. ఇచ్చేటప్పుడు కూడా చిన్న చెయ్యే. కానీ విందుకు మాత్రం అందరూ వస్తారు” అంటూ కన్నుకొట్టారు. నేను కూడా నవ్వాను.

“బిల్డింగ్ కైనా డబ్బులెక్కడినుండి వస్తాయి చెప్పండి? రెండు జాతీయ పండుగలు, వినాయకుడి పండగకని మాత్రం అసోసియేషన్ డబ్బులు తీసి పెడతాం. మిగతావాటికి ఇలా ఫండ్ రైజింగ్ చేయాల్సిందే. వేరే దారే లేదు.” అంటూ కొనసాగించారు. నేను తలాడించాను. “మన ఏరియా నాయకులు కొద్దిగా సహాయం చేస్తారు. ఇక్కడి సమస్యలకు వాళ్ళనే ఆశ్రయించాలి కదా? అందుకే ఇలాంటి ఫంక్షన్లకు వాళ్ళను పిలుస్తాము. ఈ రోజు కూడా ఆయన వస్తారు.” అన్నప్పుడు నేను ఊ కొట్టాను. “ఇంకొంచెం వేసుకుంటారా? పిలవనా?” అన్నప్పుడు మాత్రం ’ అయ్యయ్యో వద్దు సార్! మళ్ళీ భోజనానికి ఆకలి ఉండాలిగా” అంటూ నీళ్ళు తాగి లేచాను.

***

పిల్లల ఆటలకని వదలిన జాగాలో శామియానా వేసి, ఒక వైపు ఇటుకల అరుగు తయారుచేసి ఇనుప హోమకుండం పెట్టారు. దాని వద్దనే పూజా సామాగ్రి, హోమం చేయించేవారు, మంత్రాలను చదివే పురోహితులు – ఇలా చుట్టూ రెండు మూడడుగుల జాగా వదిలారు. దగ్గరగా కూర్చుని చూడడానికి జమఖానాలు వేశారు. వాటి వెనుక కొన్ని కుర్చీలు. “రండి. ఇలా కూర్చుందాం.” అంటూ మొదటి వరస కుర్చీల వైపు ఆయన నడుస్తుంటే నేను వెంబడించాను. త్రివేదిగారు మళ్ళీ కాంప్లెక్స్ గురించి చెప్పసాగారు.

“ఇక్కడ ఉన్నవాళ్ళలో చాలా మట్టుకు అప్పర్ మిడల్ క్లాసువాళ్ళే. అరవై శాతం కంటే ఎక్కువ ఇళ్ళల్లో మొదట కొన్నవారే ఉన్నారు. కొన్ని ఇళ్ళు మాత్రం రెండు మూడు చేతులు దాటాయి. కొంతమంది ఇన్వెస్ట్‌మెంట్ కోసం కొన్నవారు కూడా ఉన్నారు. వాటిలో అద్దెకు ఉన్నవాళ్ళు నివసిస్తున్నారు. ఇక్కడ నివసించిన ఓనర్స్‌లో వేళ్ళల్లో లెక్కపెట్టేంత మంది మాత్రం వచ్చున్నారు.

మీకు తెలుసా! ఓనర్లలో కొందరు మాజీ సైనికులున్నారు. వారికి మేంటెనన్స్‌లో ఇరవై శాతం రిబేట్ ఇస్తాం. దీన్ని ప్రొపోస్ చేసింది నేనే.” అని ఛాతీ విరుచుకున్నారాయన. “మంచి నిర్ణయం సార్. ఇది మనవైపు నుండి వారికి ఇవ్వగలిగిన కొద్దిపాటి గౌరవం” అంటూ అనుమోదించాను. “ఇక్కడ రాజకీయాలు లేవని కాదు. తట్టుకోలేకపోతే నేను కూడా గోదాలోకి దిగడమే” అన్నారు. మెచ్చుకోలుగా ఆయన వైపు చూశాను. త్రివేదిగారు నాకు మరింత ఆప్తులయినట్టనిపించింది.

చూస్తుండగానే కుర్చీలు నిండిపోయాయి. హోమకుండం చుట్టూ సాంప్రదాయక దుస్తులు ధరించిన మగవారు, పట్టుచీరలతో ధగధగ మెరిసిపోతున్న ఆడవారు, అటూ ఇటూ తిరుగుతూ సందడి చేస్తున్న పిల్లలు.. పురోహితుడు చెప్తున్న మంత్రాలు సౌండ్ బాక్స్ ద్వారా షామియానా బయటికి వినిపించేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది. పండగ వాతావరణం నెలకొంది.

హోమకుండం అగ్ని పజ్వరిల్లసాగింది.

“మరి కొద్ది సేపట్లో పూర్ణాహుతి జరుగుతుంది. దయచేసి అందరూ సహకరించండి” అన్న అనౌన్స్‌మెంట్ వినిపించింది. ఎరుపు రంగు పట్టు వస్త్రం మూటను స్టీల్ హరివాణంలో పెట్టుకుని మధ్యవయస్కుడొకాయన సభికుల వైపు రాసాగాడు. భక్తాదులంతా నాణాలను అందులో వేసి కళ్ళకద్దుకోసాగారు. “చూడండి! నేను ఐదు రుపాయల నాలుగైదు నాణాలను తీసుకొచ్చాను. ఈ నాణాలను ఆ మూటలో ఉంచి హోమానికి అర్పిస్తారు. సాయంత్రానికి వేడి చల్లారాక, నల్లగా మారిన నాణాలను జాగ్రత్తగా తీసుకుని దాచుకుని ధన్యులవుతారు” అంటూ త్రివేదిగారు చెప్పగా, నేను కూడా రెండు ఐదు రుపాయల నాణాలను తీసి పెట్టుకుని, నా వైపు వచ్చినప్పుడు పూర్ణాహుతికని వేసి నమస్కరించుకున్నాను. తరువాతి పావుగంటలో పూర్ణాహుతి అయిపోయింది. “ఎందుకో ఈ రోజు మా అతిథి రాలేదు. పూర్ణాహుతి సమయంలో ఉండడం మ్యాటర్ ఆఫ్ ప్రెస్టీజ్” అంటూ త్రివేదిగారు గొణుక్కున్నారు. ఇదేం పట్టనట్టు అగ్ని ధగధగ మంటను లేపింది.

“నమస్తే జీ” అంటూ ఒక రమారమి యాభై ఏళ్ల ఆడ మనిషి, చిన్న కొప్పు, అందులో ముడుచుకున్న మల్లెపూలతో త్రివేదిగారి చూపును ఆకర్షించారు.

“అరె మిసెస్ అమలా! హౌ ఆర్యూ? ఎప్పుడొచ్చారు?”

“నిన్న రాత్రయింది. ఇక, ముందు నెలనుండి ఇక్కడే ఉంటాను. పూర్ణాహుతికి నా సమర్పణ ఇదిగోండి.”

బుట్టలో రవిక గుడ్డ, ఎండుకొబ్బరి మొదలైన సామాగ్రి నా కంట పడింది.

“..మళ్ళీ కలుద్దాం. నమస్తే” అంటూ ఆమె ఆడవారి గుంపువైపు వెళ్ళింది.

నాకేం అర్థం కాక, త్రివేదిగారివైపు ప్రశ్నార్థకంగా చూశాను.

“మిసెస్ అమల ఆమె! పది సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నారు. సరస్వతి బ్లాక్. ఐదవ అంతస్తు. నేనుంటోంది గోదావరి. చెప్పానుగా?”

“నేనూ అదే బ్లాకులోనే. ఆరవ ఫ్లోర్”

“ఐదారు నెలలైంది. ఈమె ఇంటాయన రాత్రి పడుకున్నాయన లేవలేదు. అన్యోన్య దాంపత్యం. ఒక్కడే కొడుకు. ముంబైలో ఉన్నాడు. ఇప్పుడు మనమడు ఎనిమిదో తరగతిలో ఇక్కడే చేరాడు. ఈమెకు కూడా తన దుఃఖాన్ని మరవడానికి ఒక అవకాశం. ఒక్క రోజు కూడా పువ్వులు లేకుండా కనబడేది కాదు. ఇప్పుడూ అదే కొనసాగిస్తోంది. మెచ్చుకోవాలి. కానీ కొందరికి నచ్చదు. కించపరిచేలా చూస్తారు. ఎప్పుడు మారతారో ఏమో! సరే. నీకు తరువాత పరిచయం చేయిస్తాను. మంచామె. టచ్‌లో ఉండు” అన్నప్పుడు ఆయన పైన గౌరవం రెట్టింపయ్యింది.

చిన్న హడావిడి మా దృష్టిని ఆకర్షించింది. ప్రధాన ఆహ్వానితులు వచ్చారు. ఆయన త్రివేది వైపు చూడగానే, మేమిద్దరం హోమకుండం వైపు అడుగులు వేశాం.

“క్షమించండి. మా డ్రైవర్ పెదనాన్న అకస్మాత్తుగా కాలం చేశారు. ఆయనకొక అంతిమ నమస్కారం చేసి వచ్చేటప్పటికి ఆలస్యం అయింది” అంటూ మాకు మాత్రమే వినబడేట్టు గుసగుసగా చెప్పేసరికి ఆయన కమిట్మెంట్ నచ్చిందన్నట్టు చూశారు త్రివేది.

అంతలోనే కాంప్లెక్స్ అధ్యక్షుడు వచ్చాడు. “క్షమించండి. వంటవైపు వెళ్ళాను. మీరు రావడం చాలా సంతోషం.” అంటూ స్వాగతించాడు.

“నా చిరుకానుక” అంటూ ఆయన ఐదువందల చిన్న కట్ట అధ్యక్షుడి చేతిలో పెట్టి “పూర్ణాహుతి అయిపోయిందా? అందుకోసమే వచ్చాను.” అనేటప్పటికి ఎలా బదులివ్వాలో తెలియలేదు అధ్యక్షుడికి. అవుననాలో కాదనాలో తెలియని పరిస్థితి.

మా ఇబ్బందిని కనిపెట్టిన చిన్న పురోహితుడు “అమ్మా! మీ బుట్ట ఇలా తీసుకుని రండి.” అంటూ శ్రీమతి అమలగారిని పిలవగా, ఆమె వడివడిగా అటువైపు వెళ్ళింది. ఆమె వద్ద ఉన్న బుట్టలోని సామాగ్రిని మరో పళ్ళెంలో ఉంచి, దానికి పసుపు కుంకుమ దిద్ది “సార్! ఇటు రండి. దీన్ని తాకి నమస్కరించండి” అంటూ నాయకుడికి చెప్పాడు. ఆయన ఆలాగే చేశాడు. ఆయన వెనకాలే నేను, త్రివేది గారు, అమల గారు దాన్ని ముట్టుకుని, కళ్ళకద్దుకున్న తరువాత, ఒకట్రెండు మంత్రాలతో దాన్ని అగ్నికర్పించడం జరిగింది. దాని పైన నెయ్యి పొయ్యగానే మంట ధారాళంగా పైకెగసింది.

మేమంతా అగ్నికి మరోమారు ప్రదక్షిణం చేసి, నమస్కరించడం కూడా జరిగింది.

***

“ఆ పెద్ద పురోహితుడు నన్నెందుకో ఇగ్నోర్ చేశారు. మా ఆయన పోయనప్పటినుండి ఇలాగే ప్రవర్తిసున్నారు. ‘పూర్ణాహుతికి అప్పుడే అంతా తయారయిపోయిందండీ’ అంటూ నాది తీసుకోలేదు. అయినా భగవంతుడు దయామయుడు” అంటూ అమలగారు కళ్ళు ఒత్తుకున్నారు. “ఇగ్నోర్ సచ్ పీపల్, కీప్ మూవింగ్” అని త్రివేది ఆమెను ఓదార్చారు.

“బ్రహ్మమొకటే, పరబ్రహ్మమొకటే” అన్నమయ్య కీర్తనలోని “నిండార రాజు నిద్రించు నిద్రయు నొకటె, అంటనే బంటు నిద్ర అదియు నొకటే, మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమియొకటే, చండాలుడుండేటి సరి భూమియొకటే” పంక్తులు గుర్తుకొచ్చాయి. అన్ని పాపాలనూ భస్మం చేసే అగ్ని జ్వాలలు తీక్ష్ణమవసాగాయి.

కన్నడ మూలం: శ్రీమతి కె.వి.రాజలక్ష్మి

తెలుగు: చందకచర్ల రమేశబాబు

Exit mobile version