మంచివాళ్ళు….. చెడ్డవాళ్లు .
అని…… ఎదుటివారిని
చూడగానే… ‘తెలిస్తే’
అసలు వివాదమే ఉండదు
వాళ్ళ ముఖం మీద
వీళ్లు మంచివాళ్లు…
వీళ్లు చెడ్డవాళ్ళు
అని వ్రాసి ఉండదు.
అలా వ్రాసి ఉంటే
సృష్టిలో సమస్యే ఉండదు
మరి ఎలా ??
మనం…మన మనసు పొరను
కుదిపి కదిపి ప్రశ్నిస్తే
‘అది’.. ఖచ్చితంగా చెప్తుంది .
చెప్పాలంటే.. మన మనసు
చాలా ఉత్తమమైనది
మహోన్నతమైనది కూడా!
కానీ కానీ … మనం
‘మనసే లేకుండా’
బ్రతికేస్తున్నాం.. .
అక్కడ వచ్చిందన్నమాట
అసలు చిక్కు!!
ఇది చాలా పెద్ద చిక్కు!!!
అందుకే
ఈ క్షణం నుండి అయినా
మన తప్పును తెలుసుకుందాం
మనసుతో బ్రతుకుదాం!
మనసుపెట్టి మాట్లాడదాం!!
మనసుపెట్టి ప్రతి పని చేద్దాం!
మనసు పెట్టి ప్రేమిద్దాం,
మనసు పెట్టి స్నేహం చేద్దాం!!!!
ఇక ఇప్పుడు….
ఓ పెద్ద తమాషా జరుగుతుంది!!
ఎదుటి వాళ్ళలో చెడ్డవాళ్ళు ఉన్నా
మన దగ్గరకు వచ్చేసరికి
‘మంచి వాళ్ళుగా’… వాళ్లంతట వాళ్లే మారిపోతారు.
మారకపోయినా మనకు
అలా కనబడతారు!!
ఇది మన మనసు చేసే
గారడీ అన్నమాట!!
ఇలా చేసి చూడండి
ప్రయత్నించండి
చేయగలరా ?
ప్రయత్నించండి… ప్రయత్నించండి …
మళ్లీ మళ్లీ ప్రయత్నించండి !
ప్రయత్నిస్తూనే జీవించండి !!
ఇక అప్పుడు మన జీవితం అంతా
పూల పరిమళాల బాట అవుతుంది!!

శ్రీ నల్లబాటి రాఘవేంద్రరావుకు రచయితగా 700 కథలు రాసిన సుదీర్ఘ కాల నాలుగు పుష్కరాల అనుభవం ఉంది. ఇందులో రమారమీ 130 కథలకు వివిధ బహుమతులు లభించాయి.
సుమారు 250 కవితలు రాశారు. 75 కవితలకు పలు సంస్థల వివిధ బహుమతులు లభించాయి.
ఇంకా 4 నవలలు, 8 టెలిఫిలిం లు ,15 రేడియో నాటికలు, 10 ప్రదర్శన నాటికలు, 200 షార్ట్ స్కిట్స్, 100 వరకు గేయాలు, 200 సూక్తులు.. వీరి కలం నుండి జాలువారాయి ఇంతవరకు.
20 చోట్ల సన్మానాలు రమారమీ 20 బిరుదులు పొందారు.
‘స్వర్ణ శిఖరాలు’ (బహుమతి కథల కథల సంపుటి), ‘బంగారు రహదారులు’ (బహుమతి కవితల కవిత్వ సంపుటి), ‘స్వర్ణయుగ సరదా కథలు’ (బహుమతి హాస్య కథలు సంపుటి) వెలువరించారు.