కొన్ని చెట్లపూలు గుంపులుగా పూస్తాయి
ఆ పుష్పాలు ఆకులతో చుట్టిన గుచ్ఛాలు
అందుకే వాటి ప్రేమ అంత వత్తైనదీ,చిక్కనిదీ
కొందరి అభిమానం గుత్తులగులాబీలే
ప్రియమిత్రుల అనురాగం చేమంతిచెండులే
ఆత్మీయుల తలపులు బంతిపూలవానే
కొందరి ఔన్నత్యం స్వచ్ఛమల్లెలమాలలే
వారి స్నేహపరిమళం జాజుల దండలే
కొందరి పలకరింపు పరిమళించే అత్తరే
గురువుల జవాబులు వాడిపోని మాలికలే
నేస్తాల ఉదయపూలు రోజంతా గుబాళింపే
వారు మన మదిలోని మధుర సుగంధాలే
పూలు ప్రేమకు ప్రతిరూపాలు
అభిమానానికి కొలమానాలు
గౌరవానికి చిరకాల చిహ్నాలు
ఆప్యాయతలకు మారురూపాలు
జీవితాలకి అచ్చమైన ప్రతీకలు
చురుకుముళ్ళ మనుషుల మధ్య
అరుదైన అపురూపాలీ పుష్పగుచ్ఛాలు
అవి బతుకును తేలిక చేసే సులువులు
మనసుల్ని దృఢం చేసే మృదుత్వాలు
అల్లూరి గౌరీలక్ష్మి కథా, నవలా రచయిత్రిగా చక్కని పేరు సంపాదించారు. ఈమె మంచి కవయిత్రి, ఫెయిర్ కాలమిస్ట్ కూడా. నాలుగు కథా సంపుటాలూ, 4 నవలలూ, 3 కవిత్వ సంకలనాలూ, ఒక కాలమ్స్ బుక్ వెలువరించారు.
APIIC Ltd. లో General Manager గా పనిచేసి పదవీ విరమణ పొందారు.