[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[సుందర్ హైదరాబాద్ చేరుకుంటాడు. రజనీశ్ కూడా హైదరాబాద్‍కి షిఫ్ట్ అయినట్టు తెలుస్తుందతనికి. రజనీశ్ తనని కలవమని చాలా సార్లు కిరణ్ ద్వారా కబురు చేస్తాడు సుందర్‍కి. గోవాలోని సంఘటలని, ఆ వ్యవహారాలని అక్కడే వదిలేయాలని నిర్ణయించుకోవడంతో రజనీశ్‌ని కలవడానికి ఆసక్తి చూపించడు సుందర్. గతంలో జరిగిన కథ ముగిసి, సుందర్ వర్తమానంలోకి వస్తాడు. ప్రస్తుతం గోవాలో సమీర్ ఇంటికి వెళ్ళే దారిలో ఉన్నాడు. సమీర్ ఇంటి ముందంతా చాలా హాడావిడిగా ఉంటుంది. తనని రానిస్తాదో లేదో అనుకుంటాడు. ఫోన్ నంబర్ అదే ఉంచాడో లేక మార్చేసాడో అనుకుంటాడు. అయినా ప్రయత్నిద్దామని ఆ నెంబర్‍కి ఫోన్ చేస్తాడు. ఎంగేజ్డ్ మెసేజ్ వస్తుంది. అక్కడున్న ఇద్దరు కుర్రాళ్ళ మాటల్లో తన ప్రస్తావన వచ్చేసరికి జాగ్రత్తగా వింటాడు. ఇంతలో సమీర్ ఫోన్ చేస్తాడు. ఎక్కడున్నారంటే, మీ ఇంటి ముందే ఉన్నానని చెప్తాడు సుందర్. ఓ మనిషిని పంపించి, లోపలికి పిలిపిస్తాడు సమీర్. అక్కడున్న అందర్నీ పంపించేసి, సుందర్‍ని తన ప్రైవేట్ రూమ్‍కి తీసుకువెళ్తాడు. ‘ఆ రోజు స్వయంగా పోలీసులకి లొంగిపోయారు. నన్ను అరెస్ట్ చేయబోతున్నారని తెలిసా? లేక మరో కారణం ఏదైనా ఉన్నదా?’ అని సుందర్ అడిగితే, అప్పుడు జరిగిదాన్ని, తాము జ్యోతిని ఎలా ఉపయోగించుకున్నదీ చెప్తాడు సమీర్. వివరంగా చెప్పమంటే, చెప్తాడు సమీర్. సారికని హత్య చేసింది స్టెల్లా అని చెప్తాడు. అదేంటి, సారిక రూమ్ లోకి ఎవరూ రాలేదని నిర్ధారించారు కదా అని సుందర్ అడిగితే, అవును స్టెల్లా కూడా రాలేదని చెప్తాడు సమీర్. ‘మరి?’ అని సుందర్ అడిగితే, ‘అందుకే ఈ థీమ్ తో రజనీశ్ సినిమా తీయాలనుకుంటున్నాడు’ అని చెప్తాడు సమీర్.. – ఇక చదవండి.]
“స్టెల్లా హోటల్‌కి వెళ్లలేదు అంటూనే ఆమె హంతకురాలని ఎలా అన్నారు?” సమీర్‌ని సూటిగా అడిగాను.
“జరిగింది చెబుతాను..” అంటూ లోపలికెళ్లి కొన్ని కాగితాలు నా ముందు పెట్టాడు. పేపర్లు జాగ్రత్తగా చదివాను. అవి పోస్ట్ మార్టమ్ రిపోర్ట్‌వి.
“మొత్తం అక్కరలేదు..!” సమీర్ చెప్పాడు.. “చివర ఒక పారా ఉంటుంది. ప్రధాన కారణం, చూడండి.”
‘ఎస్ఫిక్సియా – మెడని ఎవరో గట్టిగా నొక్కి పట్టుకున్నట్లు స్పష్టంగా తెలుస్తున్నది. అక్కడక్కడ గోళ్లతో గాట్లున్నాయి. గోళ్లు అర అంగుళం పొడవు – అంటే సామాన్యంగా స్త్రీల వేళ్లకుండే గోళ్లు అని అనుమానం వ్యక్తపరచటమైనది. బాధితురాలు అటు ఇటుగా దాదాపు పదిహేను నిముషాలు యాతన పడ్డట్లు నిర్ధారించటమైనది. ప్రాణవాయువు స్తంభింపపడటం వలన అపస్మారక స్థితికి వెళ్లి ఆ తరువాత మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయినట్లు పరీక్షలో తేలిన వివరం..’ – రిపోర్ట్ చివర ఒక రిమార్క్ కనిపిస్తోంది. గొంతు నొక్కి పట్టుకున్న వాళ్లు కొద్ది సేపటికి వదిలి పెట్టి అంతలోనే మరి ఎటువంటి అవకాశం ఉండకుండా తిరిగి ఆ స్థితిలోనే మరి కాస్త గట్టిగా నొక్కి పట్టినట్లు పరీక్షలో తేలింది.
“ఈ రిపోర్ట్ చూసే కదా, సారిక తండ్రి మిమ్మల్ని అనుమానిస్తున్నట్లు కాగితం వ్రాసిచ్చాడు?” అన్నాను.
“అవును.”
“అది తొందరపాటు కాదా?”
సమీర్ నవ్వాడు.
“అన్నీ తొందరపాట్లే సార్..” అన్నాడు.
“..ఆరు నూరు; నూరు ఆరు అయిపోయేటప్పుడు కాలమంతా సంచలనం కోసం తహతహలాడుతుంది. నేను కాకపోయినా నేను బయటకి వెళ్లి అక్కడి వారెవరితోనో చేయించినట్లు, లేదా ఆ అవకాశం ఉన్నట్లు పోలీసులు వారి విచారణలో పేర్కొనటం జరిగింది. దానికి తోడు నేను ఆ ప్రదేశానికి చేరబోతూ ఎందుకైనా మంచిదని దారి మళ్లించి మరో చోటకి వెళ్లిపోయాను.”
“ఊ.. స్టెల్లా సంగతి అర్థం కావటం లేదు. నేను గోవా నుండి వచ్చేసాక ఏమయింది?”
“జో విడదలయ్యాడు. నా కోసం చాలా ఇబ్బందులు పడ్డాడు. అనుమానితుల లిస్టులో ఒక్కొక్కరినీ తీసేస్తూ వచ్చాడు. ఏమనుకున్నాడో ఏమో ఒక రోజు కార్వాల్లోని, జ్యోతిని తీసుకుని స్టెల్లా ఇంటికి వెళ్లాడు.”
“ఓ.”
“సాయా స్థావరం వాళ్లిచ్చిన షెడ్యూల్ ప్రకారం ఆ పని చేసాడు. కానీ స్టెల్లా తన గదిలోంచి బయటకి రాలేదు. క్రింద హాల్లో ముగ్గురూ కూర్చున్నారు. ఒక పెద్దావిడ పైకి వెళ్లి స్టెల్లాకి చెప్పింది. రెయిలింగ్ మీది నుండి అడిగింది.. దేనికి కలవాలో చెప్పమంటోంది స్టెల్లా.”
“జ్యోతి అనే ఆర్టిస్ట్ పెయింటింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకోవాలనుకుంటోంది అని అన్నాడు జో.”
ఆవిడ లోపలికెళ్లి మరల రెయిలింగ్ వద్దకు వచ్చింది.
“ఈ రోజు కుదరదని చెప్పమంటోంది.”
“అయిదు నిముషాలు. అంతే.”
మరల లోపలికెళ్లి వచ్చింది. ఈ సారి చేతులు జోడించి నమస్కారం చేసింది.
“ఇది ఆమె రిప్లై.”
ముగ్గురూ చేసేది లేక బయటకి వచ్చారు. కారులో తిరిగి వస్తున్నప్పుడు ఒకటే వానగా ఉంది. దారిలో ఎక్కడో జ్యోతికి వరుసగా వాంతులైనాయి. దగ్గరలో జోకి తెలిసిన వారింటికి తీసుకెళ్లారు. ఆ రాత్రి అక్కడే ఉండిపోయారు. దాదాపు అర్ధరాత్రి తరువాత ఏదో అలికిడి వినిపించి కార్వాల్లో జ్యోతి పడుకున్న గదిలోకి తొంగి చూసాడు. బెడ్ మీద జ్యోతి లేదు. భయపడి జోని లేపాడు. ఇద్దరూ గది లోకి వెళ్లి లైటు వేసి ఆ గదికి గల బాల్కనీ డోర్ కదిపి చూసారు. అది తెరిచి ఉంది. మెల్లగా డోర్ ఇటు లాగారు.
అక్కడ ఆకాశంలో పున్నమి చంద్రుడు వెలిగిపోతున్నాడు. ఆ బాల్కనీలో ఒక స్టాండ్ మీద కాన్వాస్ ఉంది. బాల్కనీలో పడక కుర్చీలో జ్యోతి కూర్చుని ఆ కాన్వాస్‌ని చూస్తోంది.
“పెయింటింగ్ ఎలా ఉంది?”
వీళ్లని అడిగింది. అందులో ఒక వైపు స్టెల్లా కూర్చునున్నట్లుంది. ఒక వైపు ఎవరో అమ్మాయి కొద్దిగా ముందుకు వంగి మాట్లాడుతున్నట్లుంది.
జ్యోతి నవ్వింది. వాళ్లకి అర్థం కాలేదు.
“విశ్వసుందరి నా కంట పడకపోయినంత మాత్రాన నాకు ఆమె తెలియదనుకున్నావా?” జ్యోతి అడిగింది.
వాళ్లేమీ మాట్లాడలేదు.
జో కొద్దిగా చొరవ తీసుకున్నాడు.
“ఈ పెయింటింగ్ వెయ్యాలని ఎందుకనిపించింది?” అడిగాడు. జ్యోతికి సామాన్యంగా ఉండే ఓర చూపుతో చాలా సేపు చూసింది.
“ఒక మంచి ట్యూన్ దొరికినప్పుడు వినిపించాలనిపించదా?”
“యస్.. తప్పకుండా. పెయింటింగ్ బాగుంది. ఇంతకీ వీళ్లెవరు?”
“స్టెల్లా కనిపిస్తోంది.”
“అవును.”
“అవతల ప్రక్క ఒక ఆంకర్.”
“ఓ. ఇదొక ఇంటర్వ్యూనా.”
“ఇప్పుడర్థమైందన్నమాట నా పెయింటింగ్. అంత నీచంగా ఉందా?”
“నో..” కార్వాల్లో అన్నాడు.. “ఆంకర్ అన్నది తెలియటానికి టైం పట్టింది.”
“పెయింటింగ్ పూర్తిగా చూడండి.” తిడుతున్నట్లు అంది.
జాగ్రత్తగా చూసారు. కుడివైపు మూల ఒక కెమోరా ఉంది.
జ్యోతి లేచి కాన్వాస్ దగ్గర కెళ్లి స్టెల్లా కేరికేచర్‌ని జాగ్రత్తగా చూసింది. వీళ్ల వైవు తిరిగింది.
“ఈమె ఎక్కువ మాట్లాడదు.”
“మరి మాట్లాడినట్లు చూపించావు?” జో అడిగాడు.
“పాపం. మాట్లాడాలి.. మాట్లాడకపోతే తప్పదని కాబోలు ఆ అమ్మాయితో మాట్లాడతుంది.”
జ్యోతి గట్టిగా ఆవులించి గదిలోకి వెళ్లింది.
“ఈనాటి గోవా ఆత్మగౌరవం అప్పుడైనా మాట్లాడకపోతే ఎలా?”
కార్వాల్లో వెనుక ఉన్నాడు.
“ఏం మాట్లాడింది?” అడిగాడు.
జ్యోతి కళ్లు మూసుకుని, రెండు సార్లు తూలి బెడ్ మీద పడిపోయింది. ఇద్దరూ ఆమెను జాగ్రత్తగా కదిపి చూసారు. కానీ లాభం లేదు. నిద్రలోకి జారిపోయింది.
లైట్లు తీసి ఇద్దరూ ఆ బెడ్ రూమ్ నుంచి బయటకు వస్తుండగా ఏదో ములుగులా వినిపించి ఆగారు.
జ్యోతి నిద్రలోనే మాట్లాడుతోంది..
“ఒక పెళ్లి ఆగిపోయి ఇంకో పెళ్లి సాగిపోతే ఏం కాదు..” ఇద్దరూ దగ్గరకెళ్లారు. తెలివి తెచ్చుకుని మొబైల్‌లో రికార్డు చేసారు.
“..ఒక పెళ్లి ఆగిపోయి ఇంకో పెళ్లి సాగిపోతే ఏం కాదు. అలా ఎన్నో జరిగిపోతాయి. ఎవరికెవరో ఎవరికీ తెలియదు! ఇక్కడి నీటిని ఇక్కడి వాళ్లే ఎందుకు తాగాలి? ఈ సముద్ర తీరానికి ఎందుకో వచ్చారు. స్పైసెస్ పండించారు. అందాలని పండించారు. పంచుకున్నారు. ఒక వ్యవస్థను ఏర్పరుచుకున్నారు.. వెళ్లిపోయారు..”
మరల ములుగుతూనే కొద్ది సేపు ఆగిపోయింది. వీళ్లిద్దరూ నేల మీద కూర్చున్నారు. నిజానికి వాళ్లకు కావలిసిందదే!
“చాలా పెద్ద కుటుంబం.!” సన్నగా నసిగింది.. “చివరకు ఏం జరిగింది? ఎవరిక్కావాలి? అవసరానికో అమ్మాయి కావాలి. ఇది కాదని పారిపోయాడు ఆ రాజకుమారుడు. ఇదే నిజం, నేనే నిజమని ఉండిపోయాడు రాజగురు. ఆ సంతతికి మరో వర్గం మేము. మరో ఎస్టేట్ పెంచాడు రాజు ఆ ప్రక్రియలో. సమీర్ తండ్రి నాకు మేనమామ! ఆ గొప్ప హీరో నాకు బావ.. కజిన్. కానీ కలవడు.. ఇది కలవదు. ఆ సముద్రం చివర క్షితిజం అలా కనిపిస్తుంది. ఎందుకో ఊరిస్తూ మెరుస్తుంది కూడా.. కానీ అది నిజానికి లేనే లేదు. దాని దగ్గరకు వెడుతున్న కొద్దీ మరింత మాయమవుతుంది!”
జ్యోతి ఎందుకనో విదిలించుకుని లేచింది. ఇద్దరూ భయపడి లేచి నిలుచున్నారు. ఆమె నవ్వింది.
“మాయం కాకపోతే? యస్? చెప్పండి?” అంది.
ఇద్దరూ ఒకళ్ల మొహాలులొకళ్లు చూసుకన్నారు.
“నేను చెబుతాను..!” చెప్పింది జ్యోతి! “మాయం చేసేందుకు మరో అమాయకురాలొస్తుంది! ఇది పడవ ప్రయాణం సార్.”
జ్యోతి ఎటో చూస్తోంది.
“అలలు అలా వస్తాయి పోతాయి..!” నటించి మరీ చూపిస్తోంది జ్యోతి. “..పట్టుకుంటామా? వాటి మీదుగా దాటేస్తాం. అవునూ, ఒకటడుగుతాను చెప్పండి? అలలు బ్రతికుంటాయా? చెప్పండి? నో.. లేచి పడిపోతాయి.. అంటే! పోతాయి! పోవాలి కూడా.. అలాగే లేచి ఆగిపోతే? ప్రయాణం సాగదు.”
కొద్ది సేపు కళ్లు మూసుకుంది. కళ్లు మూసుకునే చెప్పింది, “..ఏమన్నారు? నేను సమీర్‌ని ప్రేమించాను అని అడిగారు కదూ? హ.. హ.. హ.. అయామ్ స్టెల్లా! సమీర్ లాంటి ఉన్నతమైన వ్యక్తిత్వం కోసం మనసు పడ్డ ఓ సన్నని పూలమాలను కాను!
మున్నీటిలో కలిసిపోతున్న భూమిని నిలువెత్తున నిలబడి క్రింద కాళ్లతోనూ, పైన చేతులతోనూ గట్టిగా పట్టుకుని నిలబడి అపుకున్న ఆనకట్టను – ఆశల పట్టును!
రా.. నీ కోసం నిలుపుకున్న ఈ చిరాస్తిని నీలో కలుపుకొమని, చిత్రమైన వెడ్డింగ్ కార్డును పిచ్చిగా అచ్చు చేసి మనసులోనే దాచుకుంటూ అంతరంగంలోనే అంతరించి పోతున్న అంత పెద్ద చరిత్రను నేను..
మీరూ ఆలోచించండి. ఒకరిది సినిమా, ఒకరిది చరిత్ర. ఒకటి మాయమవ్వాలి, ఒకటి మిగిలిపోవాలి.. అదే న్యాయం.”
చివరి వాక్యాన్ని అదే పనిగా అంటూ నిద్రలోకి జారిపోయింది జ్యోతి.
బాల్కనీ తలుపు తెరిచే ఉంది. చెట్ల మీది ఆకుల మీద వెన్నెల తన మెరుపును కొద్ది కొద్దిగా అద్దినట్లు, తన పద్ధతిలో పెయింట్ చేసినట్లు అర్థమవుతోంది! ఆ వెలుతురులో స్టెల్లా పెయింటింగ్ సజీవంగా కనిపించింది ఇద్దరికీ..
“జీసస్..!” మెల్లగా అన్నాడు జో, “..గాట్ ఇట్!”.
(ముగింపు వచ్చేవారం)
వేదాంతం శ్రీపతిశర్మ కథా రచయిత. నవలా రచయిత. వ్యంగ్య హాస్య రచనలకు పెట్టింది పేరు. “ఆరోగ్య భాగ్యచక్రం” అనే పుస్తకాన్ని వెలువరించారు.