[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[సుందర్‌ని అరెస్ట్ చేయబోతాడు ఇన్‍స్పెక్టర్. అంతలో చిత్ర లోపలి నుంచి వచ్చి, తాను ఒక పెద్ద సంస్థ తరఫున డాక్యుమెంటరీ తీస్తున్నాననీ, ఎన్నో నిజాలను, బూటకాలను, మరికొన్ని మోసాలను వెలికితీసి ప్రపంచానికి చూపించబోతున్నానని ఇన్‍స్పెక్టర్‌తో అంటుంది. బయటంతా గొడవ గొడవగా ఉంటుంది. ఇలాంటి మాటలకి తాను బెదిరిపోనని అంటాడు ఇన్‍స్పెక్టర్. తన మొబైల్‍లో ఉన్న ఒక రికార్డెడ్ మెసేజి వినిపిస్తుంది చిత్ర. దాంట్లో, ఇన్‍స్పెక్టర్, గవడె- సుందర్ అరెస్టు గురించి మాట్లాడుకున్న విషయం ఉంటుంది. సుందర్‍ని ఫ్రేమ్ చేసి, దెబ్బలు కొట్టయినా అతని దగ్గర ఉన్న మ్యాపులు సంపాదించమని గవడె ఇన్‍ప్సెక్టర్‌కి చెప్తున్నట్టు ఆ సందేశంలో ఉంటుంది. ఇవన్నీ కోర్టులో చెల్లవని అంటాడు ఇన్‍స్పెక్టర్. గవడె తల దించుకుంటాడు. ఇంతలో ఇన్‍స్పెక్టర్‌కి ఫోన్ వస్తుంది. బయటకు వెళ్ళి మాట్లాడి వస్తాడు. సమీర్ ఇప్పుడే పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడనీ, తనని వెనక్కి రమ్మని కబురొచ్చిందని చెప్పి వెళ్ళిపోతాడు ఇన్‍స్పెక్టర్. గవడె అక్కడ్నించి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళగానే, కార్వాలో వచ్చి ఎవరో పెద్ద మనిషి ఇచ్చాడని చెప్పి ఓ కాగితాన్ని సుందర్‌కి ఇస్తాడు. దాని మీద ఏవో డేట్స్ ఉంటాయి. ఆ ముందు తాలుకు ముంతలతో వచ్చిన కాగితాలు చూస్తాడు. ఆ వివరాలు, ఈ వివరాలు కలిపి చదివి రెండూ చిత్రకిచ్చేసి, ఆ ప్రకారం మందులు వేయమంటాడు. గోవా నుంచి హైదరాబాద్ బయల్దేరుతాడు సుందర్. చిత్ర కూడా ఎయిర్‍పోర్ట్ వరకూ వస్తానని కారెక్కుతుంది. దారిలో కిరణ్ ఫోన్ చేస్తాడు. బయల్దేరాననీ, సాయంత్రం ఆరు గంటలకల్లా హైదరాబాదులో ఉంటానని చెప్తాడు సుందర్. ఊర్లోకి రాగానే ఒక్కసారి రజనీశ్ గారు కలవమంటున్నారనీ, హైదరాబాద్ వచ్చాకా, తన ఫోన్ ఆన్సర్ చేయాలని చెప్తాడు కిరణ్. సరేనంటాడు సుందర్. జ్యోతితో తొందరగా పని ముగించుకుని హైదరాబాద్ వచ్చేయమని చిత్రకి చెప్తాడు. ఆ రికార్డింగ్‌కి థాంక్స్ చెప్తాడు. అది జో పంపాడని, రేపో మాపో అతనూ బెయిల్ మీద విడుదలవుతున్నాడనీ చెప్తుంది చిత్ర. ఎయిర్‌పోర్ట్‌లో దిగుతూ, త్వరలో హైదరాబాద్‍లో కలుద్దామని చెప్తాడు సుందర్. – ఇక చదవండి.]
రజనీశ్ హైదరాబాద్ షిఫ్ట్ అయినట్టు తెలుసుకున్నాను. కిరణ్ చాలాసార్లు రజనీశ్ కలవమన్నట్టు నాకు హైదరాబాదులో కబురు పంపాడు. ఈ వ్యవహారం యావత్తూ గోవాలోనే వదిలిపెట్టేయాలని నిశ్చయించుకున్నాను. సినీ ప్రపంచం, మీడియా, వాళ్ళ గొడవలు – అందులో హత్యల దాకా వెళ్ళిపోయిన వ్యవహారాలు.. ఇవన్నీ ఎందుకో ఒక విధంగా ఇబ్బందికరమైన వాతావరణాన్నే నాకు సృష్టించాయి. ఆ పాన్ డబ్బా దాటి బండి ఆపుకుని, అలా సమీర్ గురించి, గోవా లోని సంఘటలన గురించీ, దూదిపింజల్లా సాగిపోయిన చరిత్ర గురించీ ఆలోచిస్తూ కూర్చుండిపోయాను. మెల్లగా రివర్స్ పోనిచ్చి ఆ ఎడమ ప్రక్కనున్న రోడ్డు లోకి మళ్ళాను. నా ముందర చాలా కార్లున్నాయి. ఎలాగో అలాగ వాటన్నింటినీ దాటుకుని ఓ చెట్టు క్రింద ఆపి ఆలోచించాను. నన్ను రానిస్తాడా? ఏమని ఆలోచిస్తాడో? నంబర్ అదే ఉంచాడో లేక మార్చేసాడో? ఆ బంగళా దగ్గరకెళ్ళి నేను ఫలానా అని చెబితే లోపలికి వెళ్ళటం కుదురుతుందా?
ఎందుకైనా మంచిదని ఫోన్ తీసి నంబరు నొక్కాను. ఇన్ని నెలలు ఈ నంబరు ఇంకా ఇందులో దాగి ఉండటమూ విశేషమే. ఈ నంబరుతో ఏ ఫోనూ పనిచేయటం లేదని సందేశం వస్తుందని అనుకున్నాను. కానీ నంబరు ఎంగేజ్ అయి ఉన్నదని మరాఠీలో వినిపించింది. ఫోన్ ప్రక్కన పెట్టాను. కారు లోంచి బయటకొచ్చి నిలుచున్నాను. చాలామంది రిపోర్టర్లు, మీడియా మనుషులు గుమిగూడిపోయి ఉన్నారు.
నాకు దగ్గరగా ఇద్దరు కుర్రాళ్ళు మాట్లాడుకుంటున్నారు.
“ఏముందిరా? డబ్బునోళ్ళు, ఎలాగో అలాగ బయటకొచ్చేస్తారు.”
“అవును. మనమంటే అన్నీ మరచిపోవాల్సిందే.”
“నేనొకటి విన్నాను.”
“ఏంటది?”
“రజనీశ్ ఉన్నాడు గదా, డైరక్టర్.”
“ఉన్నాడు.”
“అతనే ఇరికించి, అతనే బయటకి తెచ్చాడట.”
“ఎందుకు?”
“తిక్క! రజనీశ్ ఎంత తిక్కలోడో తెలుసు కదా?”
“అవును. ఆడుకుంటాడు అందరితో.”
“ఇప్పుడు ఈ జరిగిన కథ మీదనే ఓ సినిమా తీస్తాడట.”
“ఛా.”
“అవును మరి! ఇంకోటి విన్నావా?”
“ఏంటి?”
“గోవాలో ఉన్నన్నాళ్ళూ సుందరం అనే రచయిత ఉన్నాడు చూడు?”
“ఎవరు? నవలలు వ్రాస్తాడు? అతనా?”
“అవును.”
ఈ రోజులలో కూడా రచయితలను ఇలా గుర్తుపెట్టుకునే వాళ్ళున్నారా అనుకుని ఎందుకైనా మంచిదని కొద్దిగా దగ్గరగా వెళ్ళాను. వీళ్ళెవరో నన్ను గుర్తు పట్టరని అర్థమైంది.
“అతను సమీర్‌తో చాలా రోజులు గోవాలో ఉన్నాడట.”
“ఓ, అయితే?”
“అతని చేత స్క్రిప్ట్ వ్రాయిస్తున్నాడట.”
“ఎందుకని?”
“రియలిస్టిక్‌గా ఉండటం కోసం.”
“బాగుంది.”
“ఈ దర్శకులు చుట్టూతా ఉన్న ఈగలనీ, దోమలని కూడా వదలరు.”
“ఇంతకీ సారిక ఎట్లా చనిపోయిందిరా?”
“అదెవరికి కావాలి? కానీ కిరణన్నకి అంతా తెలుసు.”
జేబులో మొబైల్ మ్రోగింది. తీసి చూసాను. సమీర్. దూరంగా నడిచాను.
“హలో.”
“గొంతు విని చాలా రోజులైంది”, సమీర్ అన్నాడు.
“ఎలా ఉన్నారు?”
“వండర్‍ఫుల్.”
“కలవచ్చా?”
“అడగవచ్చా అలాగ?”
నవ్వాను.
“అడిగేసానుగా?’
“ఇక్కడ.. అడ్రస్సు..”
“మీ ఇంటి ముందరే ఉన్నాను.”
కొద్ది సేపు ఏ సౌండూ లేదు.
“హలో.”
“ఆఁ, ఆఁ, నేను ఊహించలేదు. రండి. ఎందుకు ఆలస్యం?”
“ఇంటి ముందు ఇంత మంది జనం.. ఈ గోల..”
“ఓ. నేను మనిషిని పంపుతాను.”
***
టిషర్ట్, తెల్లని పాంట్‌లో ఉన్నాడు. అందరినీ వెళ్ళిపొమ్మన్నాడు. అయినా కొందరు ఫోటోలు తీసేసారు. లోపలున్న ప్రైవేటు గదిలోకి తీసుకెళ్ళి తలుపు వేసేసాడు. అటువైపు ఓ బాల్కనీ ఉంది. అందులోకి వెళ్ళాం. ఒక టేబుల్ చుట్టూ నాలుగు కుర్చీలున్నాయి. ఎదురుబదురు కూర్చున్నాం.
“ఎలా ఉన్నారు?”, అడిగాడు.
“ఎందుకో బాగానే ఉన్నాను.”
“అదేం మాట?”
“ఆ రోజు స్వయంగా పోలీసులకి లొంగిపోయారు. నన్ను అరెస్ట్ చేయబోతున్నారని తెలిసా? లేక మరో కారణం ఏదైనా ఉన్నదా?”
“మీకు మందులిచ్చేసాం కదా?”
“అవి జ్యోతి కోసం.”
విపరీతంగా నవ్వాడు.
“అని మీరనుకున్నారు.”
“మరి?”
“ఒకటి జ్యోతికి. నిజమే.”
“ఓ. మరి రెండవది?”
“అదీ జ్యోతికే. కానీ ఆమె చేత రహస్యం చెప్పించటానికి.”
నా వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి.
“కమాన్! ఆమె..”
సిగరెట్ తీసి ముట్టించాడు. చెయ్యి అడ్డం పెట్టాడు.
“చూడండీ.. జ్యోతి ఒక పాత, పాడుబడ్డ కోటని చూసి వందల సంవత్సరాల క్రితం అక్కడున్న కట్టడాన్ని అచ్చుగుద్దినట్టు స్కెచ్ వేయగల్గిందని మాకు తెలుసు. ఆమె లోని ఆ ప్రతిభని పూలతో రంగరించి మరోలా వాడుకున్నాం.”
“ఆశ్చర్యం.”
“మా దగ్గర ఒక అనుమానితుల లిస్ట్ ఉంది. అందులోంచి కొందరి దగ్గరకి జ్యోతిని తీసుకుని వెళ్ళే ఏర్పాటు ఆ మందు సేవించిన తర్వాత కార్వాల్లో చేత చేయించాం.”
మతిపోయింది.
“మరి ఈ వ్యవహారమంతా రికార్డ్ లోకి ఎలా వచ్చింది? మీరింతకీ బెయిల్ మీద విడుదలయ్యారా లేక కేసు పూర్తిగా కొట్టేసారా?”
“బెయిల్ మీదనే ఉన్నాను. కేసు వచ్చే నెలకి వాయిదా పడింది. మూడొంతులు కేసు కొట్టేయవచ్చు.”
సారికను ఎవరు చంపారు అని అడగాలని కూడా, ఎందుకో ఆగాను.
“రజనీశ్‌ని మరి జ్యోతి కలవలేదు కదా? ఆఁ.. నాకు తెలిసి..”
భయంకరంగా నవ్వాడు.
“సార్, రజనీశ్‌ని ఎందుకు కలవాలి?”
“లోకమంతా ఆయన పేరే చెప్పుకుంటోంది. ఇప్పుడు కూడా క్రింద..”
“నో. ఆయన సినిమా కోసం గేమ్ ఆడతాడు. గేమ్‍లో పాల్గొనడు. జీనియస్.”
“అర్థం కాలేదు.”
“కొందరు జీవితంలో నటిస్తారు. చిరాకు తెప్పిస్తారు. కొందరు నటనలో జీవిస్తారు. మెప్పిస్తారు. కొందరు జీవితంలో కనిపించే నాటకీయత శ్వాసగా పీల్చి అనుభవిస్తారు. వారి ప్రతిభతో ఇంకొకరికి అనుభూతిని అందిస్తారు. ఆ ప్రక్రియలో పిచ్చివాళ్ళల్లా కూడా కనిపిస్తారు.”
“నిజం జ్యోతి ద్వారా నిరూపణ అయినట్లు అర్థమవుతోంది.”
“కరెక్ట్.”
“నిజం నేను తెలుసుకోవచ్చా?”
బాల్కనీ రెయిలింగ్ మీద కాళ్ళు చాపాడు సమీర్.
“మంచివారే. అమృతం తీసుకెళ్ళి, పంచి పెట్టి, అది ఎవరు తాగారో తెలుసుకోవచ్చా అంటే?”
“అయ్యో, జ్యోతి కదా? మందు పుచ్చుకుంది?”
“తొందరపడకండి.”
“మరి?”
“సారికను హతమార్చింది స్టెల్లా.”
లేచి నిలబడ్డాను. సమీర్ శూన్యంలోకి చూస్తున్నాడు. పెదవులు కొరుక్కున్నాడు.
“అదేంటి సార్? ఆమె రూమ్ లోకి ఎవరూ రాలేదని నిర్ధారించారు కదా?”
“ఎవరూ రాలేదు.”
“మరి?”
“స్టెల్లా కూడా రాలేదు.”
“మరి?”
రెండు చేతులూ జేబుల్లో పెట్టుకుని, నన్ను వింతగా చూసాడు.
“అందుకే రజనీశ్ సినిమా తీయాలనుకున్నాడు”.
(ఇంకా ఉంది)
వేదాంతం శ్రీపతిశర్మ కథా రచయిత. నవలా రచయిత. వ్యంగ్య హాస్య రచనలకు పెట్టింది పేరు. “ఆరోగ్య భాగ్యచక్రం” అనే పుస్తకాన్ని వెలువరించారు.