Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పూచే పూల లోన-97

[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[ఆటో ఎక్కి చిత్ర, జ్యోతి ఉంటున్న ఇంటి దగ్గర దిగుతారు సుందర్, మాధవ్. సామాను జాగ్రత్తగా దింపుకుని లోపలికి వెళ్తారు. జ్యోతి ఈజీ చెయిర్‍లో పడుకుని ఉంటుంది. నుదుటి మీద ఏదో గుట్ట లాంటిది పెట్టుకుంది. సామాన్లను జాగ్రత్తగా టేబుల్ మీద పెట్టి, సోఫాలో కూర్చుంటారు. ఇంతలో చిత్ర లోపలికి వస్తుంది. వీళ్ళని చూసి, ఎప్పుడొచ్చారు అని అడుగుతుంది. ఇప్పుడే అంటాడు సుందర్. మీరు తప్పిపోయినట్లు కంప్లెయింట్ ఇచ్చాను తెలుసా అని అంటుంది చిత్ర. బదులుగా తొందరపడ్డావని అంటాడు సుందర్. ఈ విషయాలేవీ పోలీసులకి తెలియాల్సిన అవసరం లేదని అంటాడు. ఈ లోపు జ్యోతి లేచి, మాధవ్‌తో మాట్లాడుతుంది. సుందర్ జ్యోతిని కిచెన్ పక్కగా ఉన్న వసారాలోకి తీసుకువెళ్ళి, తమకు దొరికిన మందు గురించి చెప్పి, ఎలా వాడాలో తెలిపే కాగితాన్ని ఆమెకిస్తాడు. దాన్ని చదువుతుంది. మీరు ఇక్కడికి వస్తున్నట్టు గవడెగారికి తెలిసిందనీ, వస్తున్నట్టు ఫోన్ చేశాడని చెబుతుంది. ఆ మందులని దాచేయమంటాడు. వాటిని భద్రపరుస్తుంది చిత్ర. ఈలోపు జ్యోతి అక్కడికి వచ్చి, ఏంటవి అని అడిగితే, నీకు మందు అని చెప్తుంది చిత్ర. ఈలోపు గవడె వస్తాడు. ఆయన్న్ని చూసి మాధవ్ బయటకి వెళ్ళి నిల్చుంటాడు. సుందర్‍ని చూసి, వెల్కమ్ బ్యాక్ అని అంటాడు. సుందర్ జవాబిచ్చే లోపు అతని ఫోన్ మోగుతుంది. హైదరాబాద్ నుంచి కిరణ్ కాల్ చేస్తూంటాడు. ఫోనెత్తకుండా గవడె గారితో మాట్లాడుతాడు సుందర్. తనకివ్వాల్సినవి ఇచ్చేయమంటాడు గవడే. అలాంటివేవీ లేవని సుందర్ అంటే, మీరు సేకరించిన మూడు డ్రాయింగులు నాకివ్వాలని అంటాడు. కిరణ్ వరుసగా కాల్ చేస్తూనే ఉంటాడు. తన వద్ద ఏ డ్రాయింగ్స్ లేవని అంటాడు. అవి ఇవ్వకుండా గోవా వదిలి వెళ్ళలేరని అంటాడు గవడె. ఇంతలో ఓ పోలీస్ ఇన్‍స్పెక్టర్ వచ్చి, సమీర్ అనే నేరస్థుడికి సహకరిస్తూ ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నందుకు సుందర్‌ని అరెస్ట్ చేస్తున్నానంటాడు. – ఇక చదవండి.]

చిత్ర లోపల నుంచి వచ్చింది.

“మీరు ఎవర్ని అరెస్ట్ చెయ్యాలనుకుంటున్నారో తెలుసా?”

“నువ్వెవరు?” అదోలా అడిగాడు ఆ ఇన్‌స్పెక్టర్.

“నా పేరు చిత్ర.”

“ఏం చేస్తున్నావు? ఇక్కడెందుకున్నావు?”

“నేను ఒక పెద్ద సంస్థ తరఫున డాక్యుమెంటరీ తీస్తున్నాను. ఎన్నో నిజాలనూ, బూటకాలనూ, మరి కొన్ని మోసాలను కూడా వెలికి తీసి ప్రపంచానికి చూపించబోతున్నాను. ప్రజలు గ్రుడ్డివాళ్లు కారు.”

బయట గొడవ గొడవ ఉంది.

అతను హేట్ తీసి అక్కడున్న సోఫా మీద కూర్చున్నాడు.

“మీడియా అంటే భయపడిపోయే ఈడియట్‌లా కనిపిస్తున్నానా?”

 చిత్ర తన మొబైల్ ఆన్ చేసింది. ఒక రికార్డింగ్ వినిపించింది.

“హలో..” అది గవడె గొంతులా ఉంది.

“సార్..!” ఇతని గొంతులా ఉంది.

“సమీర్‌ని పట్టుకునే దమ్ము మీకు లేదు.”

“దమ్ము మాట కాదు సార్..”

“అంటే? ”

“ఇక్కడ ఎవరికీ ఇష్టం లేదు.”

“పెద్దాయన సంగతేంటి?”

“వీరమణి వాటా దక్కే వరకూ వదలడు.”

“నాకు మనుషులతో పని లేదు. ఓ పని చెయ్యి.”

బయట నుంచి ఒకటే గోల – డవున్ డవున్ పోలీస్ ఫోర్స్..

“చెప్పండి సార్.”

“ఈ రైటర్ వెనుక ట్రాకింగ్ కొంత పని చేసింది కదా?”

“కొంత. అది దాటాక కో-ఆర్డినేట్స్ లేవు.”

“అతన్ని పట్టుకుని చితక్కొట్టెయ్. ఆ అడ్డా తాలుకు మాపింగ్ నాకు కావాలి.”

“అతన్ని కేవలం ఒక్క మాట మీద అరెస్ట్ చెయ్యగలను. దానికి పోలీస్ ఫోర్స్ కూడా నో అనదు.”

“ఫ్రేమ్ చెయ్యి.”

“నేరస్థుడితో సంబంధం ఉండి పోలీసుల నుండి తప్పించుకు తిరుగుతున్నందుకు గాను ఓ వ్యవహారం చెయ్యగలను.”

“అదే చెయ్యి. జోని కూడా అలాగే పట్టుకున్నావు కదా?”

“దానికే ఇంత గొడవ అవుతోంది బయట. గోవా తన అస్తిత్వాన్ని వెతుక్కుంటూ సమీర్‌ని, జో ని నాయకులుగా ఎంచుకున్నట్లుంది.”

“ఇతను బయట వాడు.”

“ఆలోచించి ప్రయత్నం చేస్తాను.”

చిత్ర ఆఫ్ చేసింది. వీళ్లిద్దరి సంవాదం ఆమె వద్దకు ఎలా వచ్చింది? అర్థం కాలేదు. సమీర్ ఉన్న అడ్డా కోసమా గవడె తపన? ఏముందో దాని క్రింద?

జ్యోతి లోపలి నుంచి వచ్చింది. తలకి గుడ్డ చుట్టుకునుంది. ఇన్‌స్పెక్టర్ లేచాడు.

“నో ప్రాబ్లమ్..” అన్నాడు. “ఇవన్నీ కోర్డులో చూపించుకోండి. నాకు ఇవన్నీ మామూలే. పదండి సార్..”

గవడె మటుకు నన్ను దింపుడు కళ్లతో చూస్తున్నాడు.

“మీకు సమీర్ కావాలా? గనులు కావాలా?” జ్యోతి అడిగింది.

“ఈమె ఎవరు?” అడిగాడు అతను.

“నీకనవసరం!”

“రెండునూ.”

గవడె మధ్యలోకి వచ్చాడు. ఇన్‌స్పెక్టర్ కి ఫోన్ వచ్చి లేచాడు. బయటకి వెళ్లాడు. మాధవ్ దారి లోంచి తప్పుకున్నాడు.

కొన్ని క్షణాలు నిశ్శబ్దంలో కలసిపోయాయి.

“సార్, పోనీ ఓ మాటలోకి వద్దాం” అన్నాడు.

ఇన్‌స్పెక్టర్ లోపలికి వచ్చాడు. గవడె వైపు తిరిగాడు.

“సార్, అయామ్ సారీ.”

“ఏమైంది?”

“సమీర్ ఇప్పుడే పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. నన్ను వెనక్కి రమ్మని ఆదేశాలు.”

అతను గబగబా వెళ్లిపోయి జీపులో కూర్చున్నాడు. మాధవ్ వచ్చి నా ప్రక్కన నిలబడ్డాడు. చిత్ర గాలి పీల్చుకుంది. గవడె బాటిల్ లోంచి నీళ్లు త్రాగాడు.

“తొందరపడ్డారు గవడె గారూ..” అన్నాను.

“..మీరు ఇక్కడి నుండి వెళ్లిపోవడం ఉత్తమం.”

ఆలోచించాడు. బయట హడావుడి చూసాడు. తమాయించుకున్నాడు.

“మన మధ్య కూడా ఏదో అనుబందం ఉండాలి కదా?”

“ఉంటుంది.”

“నా వలన మీరందరూ ఏ ఉపయోగం పొందలేదా?”

“కమాన్ సార్, చాలా పొందాను. కృతజ్ఞతలు.”

నవ్వు తెచ్చి పెట్టుకున్నాడు. ఎందుకో మమ్మల్ని ‘టేక్ కేర్’ అంటూ వెళ్లిపోయాడు. ఆయన వెళ్లగానే కార్వాల్లో లోపలికి వచ్చాడు. తలుపులు వేసేసాడు.

“కూల్. అందరూ కూర్చోండి. పంజిమ్‌లో గొడవ గొడవగా ఉంది. ఈ కాగితం ఓ పెద్ద మనిషి నాకిచ్చాడు. మీరేదో ముందు తెచ్చారట కదా?”

ఆ కాగితం చదివాను. దాని మీద ఏవో డేట్స్ ఉన్నాయి.

ఆ ముందు తాలుకు ముంతలతో వచ్చిన కాగితాలు చూసాను.

ఆ వివరాలు, ఈ వివరాలు కలిపి చదివాను. రెండూ చిత్రకిచ్చేసాను.

“ఈ రెండిటి ప్రకారం నడుచుకోండి” అన్నాను.

***

కారు ఎయిర్‌పోర్ట్ వైపు వెళుతోంది. నా ప్రక్కన చిత్ర కూర్చుంది. అది జరిగిన వారంలో నేను హైదరాబాదు బయలు దేరాను. ఆ రోజు కిరణ్ చాలా సార్లు ఫోన్ చేసి వదిలేసాడు. నేను ఎన్ని సార్లు చేసినా ఎత్తలేదు. ఇప్పడెందుకు ఫోన్ చేసాడు.

 “..యస్?! ”

“సార్, ఎక్కడ?”

“ఎయిర్‌పోర్ట్‌కి వెళుతున్నాను. సాయంత్రం ఆరు గంటలకల్లా హైదరాబాదులో ఉంటాను.”

“ఆ రోజు మీ కోసం గోవా పోలీసులొస్తున్నారని చెప్పడానికి చేసాను.”

“నీకేలా తెలుసు?”

“ నేను క్షణక్షణం మానిటర్ చేస్తున్నాను.”

“ఇప్పుడు హైదరాబాదు పోలీసులు నన్ను రిసీవ్ చేసుకుంటారా?”

నవ్వాడు. “కాదు సార్.”

“మరి ఏంటి?”

“ఊర్లోకి రాగానే ఒక్కసారి రజనీశ్ గారు కలవమంటున్నారు. ”

“దేనికి? సినిమా కథ కావాలా?”

“కాదు సార్. ఆయనకి కొన్ని విషయాలు తెలియాలిట.”

“నాకు ఏ విషయాలు తెలియవు అని చెప్పు. ఉంటాను.”

“సార్.. ఒకే. హైదరాబాదు వచ్చాక నా ఫోన్ అన్సర్ చెయ్యాలి. సార్ ప్లీజ్!”

“అలాగే”

ఫోన్ కట్ చేసాను.

“చిత్ర..”

“చెప్పండి.”

“జ్యోతి వ్యవహారం తొందరలోనే ముగించుకుని హైదరాబాదు వచ్చెయ్, ఓకే.”

“అలాగే. రెండు రోజులలో మా ప్రొడ్యుసర్ వస్తున్నాడు.”

“ఓ”

“మడ్‌గాఁవ్‌లో షూట్.”

“ఓకె.”

ఆ ప్లాంటెషన్స్ దాటి కారు అలా వెళ్లిపోతుంటే ఎందుకో కొద్దిగా దిగులుగానే ఉంది.

“థాంక్యూ చిత్రా.”

“దేనికి?”

“ఆ రికార్డింగ్‌కి.”

“నాకు కాదు. జోకి చెప్పాలి. అతనే పంపించాడు. రేపో మాపో అతను బెయిల్ మీద విడుదలవుతున్నాడు.”

“ఓ. సమీర్ ఏంటి? ఇలా చేసాడు?”

“అర్థం కావటం లేదు. ఇంతకీ సారిక కేసు ఎప్పుడు తేలుతుందో?”

“తేలుతోందనే అనిపిస్తోంది. సినిమాలూ, రియల్ ఎస్టేట్, మైనింగు, రాజకీయాలు.. అన్నీ బ్లాక్ మనీతో సృష్టించుకున్న రంగాలు. కొందరు బుల్లీ అవుతారు, కొందరు బలి అవుతూ ఉంటారు.”

“జ్యోతి తో పాత స్నేహిమా? లేక ఇక్కడే పరిచయమా?”

“ఇక్కడే పరిచయం.”

“కానీ ఒక చెల్లిలిలా చూసుకున్నాను.”

“అవును. కేవలం ఆమెలోని ప్రపంచం కోసం కాదు. అలాంటి పరిస్థితిలోంచి కూడా మాములుగా ప్రవర్తించే ప్రయత్నం చేస్తోంది.”

“అది ఎంత మందికి సాధ్యం?”

“కరెక్ట్”

“సో.. గోవాకి బై చెబుతున్నారు.”

“ప్రస్తుతానికి.”

“పూల గురించి, పూలబాల గురించి, జరిగిన గోల గురించి, అర్థం కాని గంభీరమైన హేలల గురించి, చాలా చాలా చూసాను.”

“ఎక్కడా భయం వెయ్యలేదా?”

“ఎందుకో అలా అనిపించలేదు. జరిగిపోయాక అవునా అని అనుకున్నప్పుడు అమ్మో అనుకున్నాను.”

“ఓ.. అమ్మో అనుకున్నారా? నా లాంటి అమ్మాయిల గురించి ఏమనుకున్నారు?”

“వామ్మో” అనుకున్నాను.

నవ్వింది. “రచయితలంటే పెద్ద అభిప్రాయం నాకు ఉండేది కాదు.”

“ఇప్పుడు మారిందా?”

“అవును”

“ఎందుకు?”

కారు ఆగింది. లగేజ్ దింపుకున్నాం. ఎంట్రెన్స్ దాకా నాతో వచ్చింది.

“నిజం కోసం సృష్టి రహస్యాల కోసం, మానవత్వం కోసం ప్రాణాలను బార్డర్ల వరకూ తీసుకెళ్ల గలిగే ధైర్యం కూడా వాళ్లల్లో ఉంటుందనుకోలేదు.”

“ఏదో చిత్రా.. కొద్దిగా తపన.. దాంతో బ్రతికేస్తున్నాను.”

“తపస్సు ఒంటరిగానే కాదు, ఇంకొకరితో కలసి కూడా చేస్తుకోవచ్చు”

కళ్లు పెద్దవి చేసిన నవ్వాను. చేతులు కట్టుకుని చిరునవ్వు నవ్వుతూ క్రిందకి చూస్తోంది. ఇలాంటి అమ్మాయిలను ఈ లోకంలో కాదు, మరో లోకంలో, మరో ప్రపంచం కోసం ఇంకెక్కడో ఎవరికీ అందని చోట వివాహం చేసుకోవాలి!

హ్యాండ్ బాగ్ లోంచి కాడ్‌బరీ చాకొలెట్ తీసి ఇచ్చింది.

“మిస్ మీ..” చిన్నగా పాడింది.. “నేను అక్కడికి వచ్చినప్పుడు మరో మంచి ఆలోచనతో కలుసుకుందాం..”

“చిన్న కరెక్షన్..!” అన్నాను.

“..ఒక్క తీయని ఆలోచనలతో అన్నీ కలిపేద్దాం!”

తను కళ్లెగరేసింది.

(ఇంకా ఉంది)

Exit mobile version