Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పూచే పూల లోన-91

[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[సమీర్‍ని మరో ఇంటికి మారుస్తాడు జో. ఆ రాత్రి సమీర్‍కి ఎంతకీ నిద్రపట్టదు. మధ్యలో మెలకువ వచ్చి పై గదిలోంచి క్రింద హాలుకి వస్తాడు. అక్కడ జో టీవీలో ఏదో ప్రోగ్రామ్ చూస్తుంటాడు.  సమీర్ వెళ్ళి జో పక్కన కూర్చుంటాడు. మంచినీళ్ళు కావాలా అని జో సైగ చేస్తే వద్దంటాడు. సారికని ప్రేమించావా అని సమీర్‍ని అడుగుతాడు జో. నీ తర్వాత నాకు అంత దగ్గరైన మనిషి అని చెప్పి, ఆమెతో జాగ్రత్తగానే మసలుకున్నానని అంటాడు. సారిక తనని ప్రేమించానని చెప్పేందుకు రెండు సందర్భాలలో ప్రయత్నించిందని చెప్తాడు. ఈలోపు జో ఛానెల్ మార్చి, వాల్యూమ్ పెంచుతాడు. యాంకర్ సారిక మరణం గురించి చెబుతూ, తమ ప్రతినిధి సిద్ధు, రజనీశ్‍తో మాట్లాడుతున్న దృశ్యాన్ని లైవ్‍లో చూద్దామని అంటుంది. సిద్ధు సారిక మరణం ఇండస్ట్రీకి తీరని లోటంటారా అని అడిగితే, మనం ముందు మనుషుల్లా మాట్లాడుకుందామంటాడు రజనీశ్. వాళ్ళిద్దరి మధ్య సారిక తండ్రికీ రజనీశ్‌కీ ఉన్న స్నేహం, సారిక ఆస్తులు వంటి విషయాలు ప్రస్తావనకి వస్తాయి. ఆమె వివాహం ఒకసారి మీతో అనీ, మరోసారి సమీర్‍తో అని వార్తలు వచ్చాయి అని సిద్ధు అంటే, అవన్నీ వదంతులని అంటాడు. సారికకి మత్తుపదార్థాలు అలవాటున్నాయా అని అడిగితే, ఆమె వ్యక్తిగత వివరాలు తనకి తెలియవని చెప్పి వెళ్ళిపోతాడు రజనీశ్. యాంకర్ ఇంకా ఏదో చెప్తుంటే, టీవీ కట్టేస్తాడు జో. రజనీశ్ నిజం చెప్తున్నాడా అని జో సమీర్‍ని అడుగుతాడు. ఇలాంటి పని చేయాల్సిన అవసరం రజనీశ్‍కు లేదంటాడు సమీర్. అలా ఖచ్చితంగా చెప్పలేమని అంటాడు జో. సమీర్ ఆలోచనలో పడతాడు. – ఇక చదవండి.]

మర్నాడు ఉదయం కొద్దిగా త్వరగానే లేచి పంజిమ్ బయలుదేరాం. బాడీని హోటల్ లౌంజ్‌లో దర్శనార్థం ఉంచారని తెలిసింది.

జో కారును కొద్దిగా మెల్లగానే నడుపుతున్నాడు.

“నాకొకటి అర్ధం కాదు..”, అన్నాడు

“ఏంటి?”

“మీడియాలో నీతిగా బ్రతకటం కుదరదంటారు, నిజమా?”

“ఏ రంగం లోనూ కుదరటం లేదు.”

“నిజమే. కానీ రాజకీయంలో, వ్యాపారంలో, మీడియాలో బ్రతికుండాలంటేనే అన్నిటినీ మరిచిపోవాలి. అవునా కాదా? లేకపోతే లోపలికి రాకుడదు. మందు త్రాగే వాడే బార్ లోకి వెళ్లాలి.”

“కరెక్ట్. కెమెరా దూరని చోటు లేదు. అది నాకు వద్దు అని తిప్పికొట్టే మగాడు కనిపించటం లేదు.”

కారులో మొబైల్, స్టాండ్ లోంచి తాజా వార్తలు చూపిస్తోంది. ఎ.సి.పి మాట్లాడుతున్నాడు. అతని ముందర ఓ అమ్మాయి మైక్ పట్టుకునుంది.

“సారిక – ప్రముఖ సినీ నటి సారిక హాఠాత్తుగా హోటల్ రూమ్‌లో మరణించటం గోవా వాసులనే కాదు, యావత్ సినీ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఈ విషయంలో, ఇది సహజంగా జరిగిందా లేక ఏదైనా కుట్ర ఉన్నదా అనే అంశం మీద ఎ.సి.పి. సుకుమార్ గారితో మాట్లాడదాం. సార్, మీరేమంటారు? కేస్ బుక్ అయిందా లేక రిపోర్ట్ కోసం ఆగి తరువాత చెబుతారా?”

“పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ ఇంకా రాలేదు. అది వచ్చే వరకూ మేము ఏమీ చెప్పలేము.”

“హోటల్ స్టాఫ్‌ని విచారించినట్లు తెలుస్తోంది. వాళ్ళ ద్వారా ఏదైనా సమాచారం తెలిసిందని అనుకోవచ్చా?”

“వాళ్ళని మామూలుగా అడిగి తెలుసుకున్నాం. అంటే ఎవరు డ్యూటీలో ఉన్నారో, ఎవరు రూమ్ సర్వీస్ చేసారు, ఇలా. ఫోన్‍కి సంబంధించి కూడా వివరాలు తీసుకుంటున్నాం.”

“వాళ్ళ ద్వారా ఏదైనా విషయం బయటకి వచ్చిందనుకోవచ్చా?”

“ఏమీ లేదండీ. సామాన్యంగా పెద్ద పెద్ద హోటల్స్‌లో సెక్యూరిటీ ప్రొఫెషనల్ గానే ఉంటుంది.”

“సారిక బంధువులు, కావాలసిన వారు, ఎవరైనా ఇక్కడ ఉన్నారా?”

“హోటల్ నుండి కబురు వెళ్ళింది, రావచ్చు” అంటూనే అతను ఎక్కడికో జారుకున్నాడు.

“అదండీ సంగతి. ఇక్కడ పెద్ద ఎత్తున జనం పోగవుతున్నారు. ఇక్కడ మీరు చూస్తే దాదాపు ఇండస్ట్రీ లోని వారు చాలామంది ఇంకా ఒక్కొక్కరే వస్తూ కనిపిస్తున్నారు..”

జో మొబైల్ కట్టేసాడు.

“ఎందుకు ఆపేసావు? ‘కొద్దిసేపట్లో సమీర్ కూడా రావచ్చని అందరూ అనుకుంటున్నారు’ అని చెప్పేది కదా?”

“వాళ్ళకేమి? ఏమైనా చెబుతారు. ఏది రైట్, ఏది రాంగ్ అనే గొడవ కంటే చాలాసార్లు మనశ్శాంతి ముఖ్యం. అది ఉంటే తరువాతైనా ఏమైనా చెయ్యవచ్చు.”

“కరెక్ట్.”

“నా మొబైల్ మ్రోగింది. రజనీశ్ కాల్ చేస్తున్నాడు. ఫోన్ తీసాను.

“హలో.”

“ఎక్కడ?”

“ఆఁ, ఇంకో గంటలో ఉంటాను. దారిలో ఉన్నాను.”

“కొద్దిగా ఆలోచించు.”

“దేనికి?”

“పరిస్థితులు మారుతున్నాయి.”

“అంటే?”

“నేను హాస్పటల్ ఆవరణలో ఉన్నాను. ఇక్కడ చాలామంది పోలీసులున్నారు.”

“ఓకె.”

“కొద్దిసేపటి క్రితం సారిక తండ్రి వచ్చాడు. లోపల చాలా సేపు ఏవేవో చర్చించుకుంటున్నారు.”

“ఊ. రిపోర్ట్ వచ్చిందా?”

“ఇంకా రాలేదు. ఏదో తిరకాసుంది.”

“నన్ను, ఏంటి, ఎందుకు ఆలోచించుకోమన్నారు?”

“ఒక్క క్షణం ఉండు, మరల ఫోన్ చేస్తాను.”

జో ఎందుకో దగ్గాడు.

“ఏమంటాడు?”

“సారిక తండి హాస్పటల్‍కి వచ్చాడట. నన్ను ఎందుకో కొద్దిగా ఆలోచించమంటున్నాడు. ఏమి ఆలోచించాలో తెలియటం లేదు. ఏదో జరిగి మరల మాట్లాడతానన్నాడు.”

“ఏదో తిరకాసుంది. ఇంతకీ ఈయన ఆస్పత్రికి ఎందుకు వెళ్ళాడు?”

ఇదే జో తో వచ్చిన చిక్కు. ప్రతీసారీ మరోవైపు నుండి ఆలోచిస్తాడు. మరల రెట్టించాడు.

“చెప్పు, అందరూ హోటల్లో గుమిగూడితే ఈయన అక్కడికెందుకు? రిపోర్ట్ కోసమా? లేక ఆ రిపోర్ట్ తయారు చేయించటం కోసమా?”

ఆయన ఏమి ఆలోచించమన్నాడో తెలియదు కానీ ఇది ముందు ఆలోచించాలనిపించింది.

“ఆలోచించు..!”, అన్నాడు జో. “..పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ మీద ఈయనకెందుకు అంత ఆసక్తి?”

“ఏమో జో! కొందరు ప్రాక్టికల్‍గా ఉంటారు” అంటుండగానే మరల ఫోన్ మ్రోగింది.

“హలో.”

“హలో, ఎక్కడ?”

“దారిలో.”

“రిపోర్ట్ వచ్చేసింది. ఎవరికీ చెప్పటం లేదు. పోలీసులు వెళ్ళిపోతున్నారు. కొద్దిసేపటి తరువాత సారిక తండ్రి కారులో ఎవరో పెద్ద ఆఫీసరుతో కలిసి పోలీస్ స్టేషన్‍కి వెళ్ళిపోయాడు.”

“ఓకె. ఆయన దగ్గర నుండి స్టేట్‌మెంట్ రికార్డ్ చేసుకుంటారనుకుంటాను.”

“అంతే ఉంటుంది. నేను ఓ మనిషిని స్టేషన్‌కి పంపాను.”

“దేనికి?”

“చాలా అవసరం.”

“ఎలా?”

“చూడూ, ఆమె మన ట్రూప్‍లో ఇక్కడికి వచ్చింది. మనందరం టీమ్‍లో ఉన్నాం. మనకి ఎటువంటి సమస్యా రాకూడదు. అర్థమైందా?”

“ఇంతకీ నేను..”

“నాకు ఫోన్ వచ్చాక మరల నేను చేస్తాను. నేను హోటల్‍కి వెళుతున్నాను..”

పెట్టేసాడు.

జో వైపు తిరిగాను.

“రజనీశ్ పరిస్థితిని మానిటర్ చేస్తున్నాడు జో. ఈ గోలంతా.. అలా అనకూడదు, ఈ సంఘటన యావత్తూ మాకు సంబంధించింది కదా?”

“కరెక్ట్. అయినా ఆయనలో ఏదో విధమైన స్పీడు కనిపిస్తోంది.”

“మా టీమ్‌కి ఆయనే పెద్ద కదా? అది బాధ్యతతో కూడిన విషయం. అవునా కాదా?”

“నిజమే. పెద్దవాళ్ళకి రెండు బాధ్యతలు ఉంటాయి. ఇంట్లో వాళ్ళ పట్ల, అలాగే బయటవాళ్ళతో వ్యవహరిస్తున్నప్పుడు తిరిగి ఇంట్లో వాళ్ళతో ఎలా మసలుకోవాలని, తరువాత ఏవైనా అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు ఏం చెప్పాలని.. ఇలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.”

“జో, నువ్వు చాలా విషయాలలో చాలా ఎదిగిపోయి ఉన్నావు. నేను కేవలం సినిమాలలో ఒకరు చెప్పేది చేస్తూ పోయాను.”

మరల ఫోన్ వచ్చింది.

“హలో”

“కొద్దిగా కారు ప్రక్కకి తీసుకుని నాకు ఫోన్ చెయ్యి” చెప్పి రజనీశ్ ఫోన్ పెట్టేసాడు.

“కారు ప్రక్కకి తీసుకో జో.”

కొంత దూరం వెళ్ళి ఏదో డొంక రోడ్డుకు వెళ్ళే చోట కారు ఆపాడు జో.

“జో..”

“యస్?”

“ఏదో తేడాగా ఉంది.”

“ఏమైంది?”

“బండి ప్రక్కకి తీసుకుని ఫోన్ చెయ్యమన్నాడు.”

“చెయ్యి.”

ఫోన్ చేసాను.

“హలో”, ఎత్తాడు రజనీశ్.

“సార్, కారు ఆపుకుని ఫోన్ చెయ్యమన్నారు?”

“ప్రక్కన ఎవరున్నారు?”

“జో కారు నడుపుతున్నాడు.”

“జో ఎవరు?”

“నా చిరకాల మిత్రుడు.”

“ఓకే. సారిక తండ్రి చాలాసేపు పోలీస్ స్టేషన్‌లో చర్చలు జరిపాడుట.”

“అయితే?”

“ఆ ఆఫీసర్ చెప్పాడో లేక తనే చేసాడో తెలియదు.”

“ఏం చేసాడు?”

“ఎవరి మీదనైనా మీకు అనుమానం ఉందా అని అడిగినప్పుడు నీ మీద అనుమానం ఉందని చెప్పాడుట.”

“నో..”

“అవును. మరి?”

“కంప్లయింట్ వ్రాసి ఇచ్చాడు. పోలీస్ ఎఫ్.ఐ.ఆర్. చేస్తున్నారు.”

“అనుమానం ఉంటే అరెస్ట్ చేస్తారా?”

“పోస్ట్ మార్టమ్ రిపోర్ట్‌లో ఏముందో వాళ్ళు చెప్పటం లేదు.”

“నేను హోటల్‌లో లేను కదా?”

“లేవు. నీ చెయ్యి పడకపోయినా, నీ చెయ్యి ఉండవచ్చని ఆయన చెబితే అది అక్కడ సీరియస్ గానే తీసుకుంటారు.”

“సార్, కాస్త వివరంగా చెప్పండి.”

“నాకూ అర్థం కావటం లేదు. సహజ మరణం కాదని తెలుస్తోంది. ఆత్మహత్య లేదా హత్య వైపు కథ కదులుతోంది.”

“నేను ఏం చేయాలి?”

“ఓ పని చెయ్యి. ప్రస్తుతం మరో ఏదైనా ప్రదేశానికి దారి మళ్ళించు. అది రైటో రాంగో నాకు ఇప్పుడు తెలియటం లేదు. కానీ కొంత టైమ్ దొరుకుతుంది. చెప్పాను. నీ ఇష్టం.”

ఫోన్ పెట్టేసాడు. స్పీకర్ ఫోన్‌లో అంతా విన్నాడు జో. సీటు వెనక్కి నెట్టి వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు.

“జో..”

“ఊఁ..”

“ఏమంటావు?”

“రెండు పాయింట్లు. నీ టీమ్‌లో అందరినీ వాళ్ళు ఏడిపించకుండా నీ మీద మొత్తం పెట్టేస్తే గాలి పీల్చుకోవచ్చు. రెండవది టీమ్ లీడర్ స్టేటస్‌లోనే ఉంటూ పెద్దమనిషిగా అటూ ఇటూ కూడా వ్యవహరించవచ్చు. తనని పెద్దగా ఎవరూ అనుమానించనక్కరలేదు కూడా. నాయకులు నడకలు మారుస్తూ మనకు తెలియనివి నడిపించగలరు. మాటకి చెబుతున్నాను.”

(ఇంకా ఉంది)

Exit mobile version