[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[రాత్రి బాగా పొద్దుపోయాకా సమీర్ ఉంటున్న హోటల్ గదికి వస్తాడు జో. ఇద్దరు ఒకరినొకరు హత్తుకుంటారు. గతంలో ఓ రోజు తినడానికి ఒక చిన్న బన్ను ముక్క తప్ప ఏమీ లేని రోజును గుర్తుచేసుకుంటాడు సమీర్. ఆ రోజు ఉన్న ఆ చిన్న బ్రెడ్ ముక్కని తాను తినకుండా, జో కోసం ఉంచేయడం, జో తినకుండా గిటార్ వాయించుకుంటూ కూచోడం, చివరికి ఆ ముక్కను కుక్కకి వేస్తే, అది కూడా తినకుండా ఉండడం అన్నీ గుర్తొస్తాయి సమీర్‍కి. ఇంతలో ఓ యువకుడు పంక్చర్ అయిన బైక్‍ని తోసుకుంటూ వచ్చి, ట్యూబ్ మార్పించుకుని, ఓ పెద్ద నోట్ ఇచ్చి వెళ్ళిపోతాడు. అప్పుడు జో తినడానికి ఏమైనా తెద్దామని బయల్దేరుతాడు. ఆ కుక్క అప్పుడా బ్రెడ్ ముక్కని తింటుంది. ఆ రోజుని జో కి గుర్తు చేస్తాడు సమీర్. మర్నాడు రాత్రి తమ షెడ్ వద్ద మిత్రులతో డిన్నర్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాననీ, సమీర్ తప్పకుండా రావాలని చెప్తాడు జో. – ఇక చదవండి.]
మా పాత కారు షెడ్‍ని జో అలానే ఉంచాడు. కానీ దాని చుట్టూతా ఓ అందమైన పూలతోట పెంచాడు. షెడ్ వెనకాల ఒక డొంక రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు మీద టెంపరరీగా ఒక స్టేజ్ కట్టించాడు.
కారు జో నడుపుతున్నాడు. అక్కడ ఆపి, ఆ ప్రాంతాన్ని చూపించాడు.
“ప్రస్తుతం ఇక్కడ కారు ఆపను”, అన్నాడు.
“దేనికి?”
“జనం మూగుతున్నారు. కార్యక్రమం మొదలయ్యే వేళకి వద్దాం”, అంటూ ముందుకి పోనిచ్చాడు.
“మరి ఎక్కడ ఆగుదాం?”
“చెబుతాను.”
అలా చాలా దూరం వెళ్ళిపోయాడు. చివరిగా, ఒక ఇంటి ముందు ఆపాడు. ఇద్దరం దిగి లోపలికి నడిచాం. ఇంట్లో ఎవరూ లేరు. జో తాళం తెరచి లోపలికి ఆహ్వానించాడు. లోపలికి వెళ్ళి విస్తుపోయాను. గోవా సామ్రాజ్యమంతా అక్కడే ఉన్నదనిపించింది.
చరిత్రలోని నిజానిజాలు, ఘటనలు, సంఘటనలూ అన్నీ ఒకే చోట పొందుపరిచి ఉంచారు ఎవరో.
“ఇది నేను నీ కోసం కొన్నాను”, అన్నాడు.
“ఏది? ఈ పెయింటింగా?”
నవ్వాడు.
“కాదు, ఈ ఇల్లంతా నీదే.”
“ఎవరివీ ఈ పెయింటింగులు?”
“చెబుతాను, సిగ్గుపడకు.”
“నాకు సిగ్గా? ఎందుకు?”
“అవును. ఒక్క మాట చెప్పు. నువ్వు సారికను పెళ్ళి చేసుకోవటం లేదని నాకు తెలుసు.”
అక్కడ మ్యూజియమ్‍లో ఉండే కుర్చీ లాంటిది ఉంది. అందులోకి కూలబడ్డాను.
“నాకొకటి అర్థం కాదు..”, అన్నాను. “..నా వివాహం జాతీయ సమస్య ఎందుకైపోయింది?”
జో నా భుజం తట్టాడు.
“చూడు, నాకు పెళ్ళిళ్ళు, కుటుంబాలు, ఇలాంటి వాటి గురించి ఏ మాత్రం అవగాహన లేదు. కానీ ఒక్కోసారి ఆలోచిస్తూ ఉంటాను.”
“ఓ. నువ్వు కూడా పెళ్ళి గురించి ఆలోచిస్తున్నావా? గుడ్! అమ్మాయి ఎవరు?”
“నో! నా లాంటి వాడు పెళ్ళి చేసుకోకూడదు. నేను ఆలోచిస్తున్నది అది కాదు. ఒక ఇంటిలో ఒక జాతిరత్నం పుట్తింది అనుకో.. ఆ రత్నాన్ని అందరూ గర్వంగా, గౌరవంగ చూసుకుంటున్నారనుకో, దానిని ఎవరైనా ఎగరేసుకుని పోయినప్పుడు కలిగే బాధ చాలా చిత్రమైనది. మోసం, దగా, కుట్ర వంటివి ముందుకు వస్తాయి. నువ్వు కేవలం హీరోవి కావు. గోవా ప్రాంతానికి ఒక వెలుగు తెచ్చిన మహామనిషివి. నీ పేరు చెప్పుకుని బ్రతికేస్తున్నవారెందరో ఉన్నారు.”
“అయితే?”
“ఈ పెయింటింగ్స్‌ని జాగ్రత్తగా చూసావా?”
అప్పుడనిపించింది, ఇక్కడేదో తిరకాసుందని. మెల్లగా లేచాను.
ఎదురుగా ఉన్న పెయింటింగ్ వద్దకు వెళ్ళాను. ఒక పాత కోట. దాని అంచున సముద్రం. అందులోకి కూలిపోతున్న ఒక వంతెన. ఆ వంతెనను భుజాల మీద ఎత్తి పైకి లేపుతున్న ఓ వ్యక్తి. అతన్ని జాగ్రత్తగా చూసాను. ఎవరో కాదు, నా ముఖమే!
మరో పెయింటింగ్ వైపు తిరిగాను. ఇది ఆలోచింప జేసింది. ముగ్గురు అమ్మాయిలు జారిపోతున్న డ్రెస్సులతో ఇబ్బందిగా నిలబడి ఉన్నారు. వారికి అడ్డగా నేను రెండు చేతులూ జాపి ఎవరూ రావద్దన్నట్టు నిలుచునున్నాను.
మరో పెయింటింగ్‍లో ఒక పాత కట్టడం లోంచి పారాచూట్‌లో ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నాను.
“జో..”, మెల్లగా అన్నాను. “..ఒక సినిమా హీరో ఒక జాతిని ఉద్ధరించగలిగే దమ్మునవాడిలా ఎలా కనిపిస్తున్నాడు మీకు?”
“నిజం కాదా?”
తల అడ్డంగా ఊపాను.
“కాదా? కానీ అదే నిజం. ఉద్ధరించనక్కరలేదు. ఆ జాతి కోసం నిలబడితే చాలు. ఇక్కడ ప్రతిభ ఉంది, ఇక్కడివారు పనికిరాని వారు కాదు, వారికీ ఒక చరిత్ర ఉంది, అది ఇతరుల వలన ఛిన్నాభిన్నమైనప్పటికీ అదొక నిండు పున్నమిలా వెలుగుతూనే ఉంటుందని చెప్పేందుకు ఒక చేయూతగా ఉన్నా చాలు. అందరూ నీలో దానినే చూస్తున్నారు. నీర్కు వేరే దారి లేదు. నువ్వు హీరోవి, నాయకుడివి! ఒప్పుకుని తీరాలి.”
“ఓకే. అయితే? రాజకీయాలలోకి రావాలా? పోటీ చెయాలా?”
జో కొద్దిసేపు ఏమీ మాట్లాడలేదు.
“కాదు. ఏ ఆడదాని గౌరవం కోసం నువ్వు ఇల్లు వదిలివేసావో, వాళ్ళని వదులుకోవటం ఇక్కడ కొందరు సహించలేరు.”
నాలో ఏవో సుడులు తిరగటం ప్రారంభమయింది. ఏంటిది? నాకు తెలియకుండా ఇక్కడ ఏం జరుగుతోంది?
“జో..!”, గంభీరంగా అన్నాను. “..ఇక్కడ ఏమైనా ఉద్యమం ప్రారంభించావా?”
“లేదు. నా ప్రమేయం ఏదీ లేదు. ఇక్కడ పరిస్థితి ఇది. నీకు విషయం అర్థమవ్వాలంటే ఇలా రా..” అంటూ ఒక చీకటి గదిలోకి తీసుకుని వెళ్ళాడు.
లైట్లు వేసాడు. మామూలుగా సినిమాలు ఎక్కువగా చూసేవారు నా బొమ్మ గీయాలనుకున్నప్పుడు గీసే బొమ్మ అది.
ఒక వెస్ట్ కోట్‌లో మెడకి మఫ్లర్ చుట్టుకుని ఉన్నాను. చాలా అడ్వర్టైజ్‍మెంట్స్‌లో కూడా ఆ బొమ్మనే వాడారు. ఆరడుగుల పెయింటింగ్ అది.
“ఎలా ఉంది?”, అడిగాడు.
“ఎవరో చాలా గొప్ప కళాకారులు.”
“ఇటు తిరుగు” అన్నాడు.
ఆ పెయింటింగ్‍కి ఎదురుగా ఉన్న గోడ వైపు తిరిగాను. అక్కడ మరో కాన్వాస్ ఉంది. ఇప్పుడు ఈ లోకం లోకి వచ్చాను. చర్చ్‌లో మోకాళ్ళ మీద కూర్చుని రెండు చేతులూ ముడుచుకుని ప్రార్థన చేస్తున్నట్లుగా ఒక అమ్మాయి, అందాల రాశి కనిపిస్తోంది.. ఎవరో కాదు – స్టెల్లా!
“గుర్తుపట్టావా?”
“ఓ! అయితే గోవాకి ప్రతిరూపమైన అందాన్ని ఇలా పొందుపరచి, పట్టుకుని, గుర్తుపట్టావా? అని నన్ను అడుగుతున్నావా?”
అక్కడ కిటికీకి ఆనుకుని సిగరెట్ వెలిగించాడు జో.
“ఎవరో గొప్ప కళాకారులన్నావు కదూ? ఈ పెయింటింగ్స్ అన్నీ ఆమెవే!”
గోరు ముద్దలు చేసి నోటిలో పెట్టటం, ప్రేమకు ప్రతిరూపంగా చూసాను. బస్సు లోంచి విసిరేసిన బ్రెడ్ ముక్కలను ఆత్రంగా బిచ్చగత్తె పిల్లలు తింటుంటే, వాళ్ళు తింటున్నారన్న ఆనందంలో కూడా ఓ చిన్ని ముక్కలా మిగిలిప్తోతే? అన్నట్లు చూస్తున్న ఆమె కళ్ళు ఎలా ఉంటాయో ఊహించగలను. మనకు తెలియకుండానే మనలను లోలోన దైవంగా నిర్మించుకుని సర్వం సమర్పించి ఆరాధిస్తూ నా కంటిలోకి వెలుగు నిపు అని అదే ఆకలితో అలమటిస్తున్నట్లు ఆమె కళ్ళు బేలగా ఎదురుగా ఉన్న నా పెయింటింగ్ వైపు చూస్తున్నాయి.
నన్ను చిత్రీకరించి, ఆమెను కూడా ఒక పరిస్థితి లోకి ఊహించుకుని ఈ సన్నివేశాన్ని దర్శించండి అని చెప్పగల్గడం సామాన్యమైన ప్రతిభ కాదు!
పురుషుడని కలుపుకున్న గౌరవం ఇందుచేతనేనేమో స్త్రీకి దక్కదనిపిస్తుంది..
“ఏది బాగుంది?”, జో అడుగుతున్నాడు.
“ఇదంతా అద్భుతంగా ఉంది. ఇది కేవలం ఒక కళాకారుడిగా చెబుతున్నాను.”
“కలలు, కళాకారులు.. ఇవి నాకు ప్రస్తుతం ప్రధానం కాదు.”
“మరి?”
“సారికని పెళ్ళి చేసుకుంటావా?”
“నిజం చెప్పాలా?”
“యస్.. ప్లీజ్!”
“పెళ్ళి విషయంలో ఏ నిర్ణయం ఇంకా తీసుకోలేదు.”
రెండు చేతులూ నడుము మీద పెట్టుకున్నాడు జో.
“కమాన్.. స్టేజ్ నీ కోసం ఎదురు చూస్తోంది.”
***
అది ‘సిల్వేనియా’ అనే ట్రూప్. నా సినిమా పాటలతో స్టేజ్ దద్దరిల్లి పోతోంది. రంగు కాగితాలు గాలిలో ఎగురుతున్నాయి. అందరి మధ్యలోంచి నన్ను స్టేజ్ మీదకు తీసుకువెళ్ళాడు జో..
కేరింతలు, పులకింతలు సామాన్యంగా లేవు. ఎవరు ఏమి మాట్లాడుతున్నారో తెలియటం లేదు. వాయిద్యాలన్నీ మెల్లగా ఆగిపోయాయి.
జో మైక్ తీసుకున్నాడు.
“ఫ్రెండ్స్, సమీర్ మన కోసం వచ్చాడు. మనలోని వెలుగు ముంబయిలో చూపించు, మనమెవరో చాటాడు. మనింటికి వచ్చాడు. ఇప్పుడు మనతో మాట్లాడుతాడు.”
అందరినీ నిశ్శబ్దంగా ఉండమని సైగ చేసాడు. మైక్ అందుకున్నాను.
“నేను నిలబడి ఉన్న చోటు నాకు తిండి పెట్టిన భూమి. ఇక్కడి నుండే నేనూ, జో కలిసి ఒక సామాన్యమైన నాటకం ఆడాము. అది అద్భుతంగా ఒకరి గుండె లోకి దూరింది. నేను తెర మీదకి మారిపోయాను. సుదూర తీరాలకు చేరిపోయాను. జీవితంలో ఎన్నో ఘర్షణలను ఎదుర్కున్నాను. మీ అందరి ఆదరణ, ప్రేమ వలన ఇలా నిలబడి, నిలదొక్కుకుని మీ ముందర ఉన్నాను..” ఇలా మాట్లాడుతుందఘా, ఆ జనంలో దూరంగా ఎక్కడో ఏదో అలజడి బయలుదేరింది. ఏదో చిన్న గోల, ఎవరో ఒకర్నొకరు ఏదో అనుకున్నారని నేననుకున్నాను..
కొందరు మెల్లగా బయటకి వెళ్ళిపోతున్నారు. ఒకరినొకరు మొబైళ్ళు చూపించుకుంటున్నారు. నన్ను వింతగా చూస్తున్నాను. నేను జో వైపుకు తిరిగాను. అతనికీ ఏమీ అర్థం కాలేదు. గబుక్కున క్రిందకి దిగాడు. నేను కుర్చీలో కూర్చుండిపోయాను. ఇంతలోనే జో మీదకి వచ్చి, నన్ను గబగబా కుర్చీలోంచి లేపి, దగ్గరలో ఉన్న ఓ గదిలోకి తీసుకెళ్ళి తలుపులు మూసేసాడు. చుట్టూతా గోలగోలగా ఉంది.
“నీ మొబైల్ ఏది?”, అన్నాడు
తడుముకుని తీసాను. అది ఏరోప్లేన్ మోడ్‍లో ఉంది.
“ఓ..” అన్నాడు.
“ఏమైంది?” అడిగాను.
జో చుట్టూతా చూసాడు.
“సమీర్.. ఎగ్జైట్ కాకు.”
“ఏమైంది?”
“సారికను..”
“సారిక.. ఏమైంది?”
“సారిక.. కాదు, సారిక.. చనిపోయింది.” చెప్పాడు జో.
(ఇంకా ఉంది)
వేదాంతం శ్రీపతిశర్మ కథా రచయిత. నవలా రచయిత. వ్యంగ్య హాస్య రచనలకు పెట్టింది పేరు. “ఆరోగ్య భాగ్యచక్రం” అనే పుస్తకాన్ని వెలువరించారు.