Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పూచే పూల లోన-85

[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[రజనీశ్ దర్శకత్వంలో సమీర్, సారిక నటించిన ‘కానరాని కోయిల’ అనే సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఎన్నో అవార్డులు గెల్చుకుంటుంది. ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు యూనిట్ సభ్యులందరూ బస్‍లో గోవా బయల్దేరుతారు. సమీర్ కారులో స్టూడియోకి వెళ్ళేసరికి, ఇంకా కొందరు రావల్సి ఉంటుంది. అందుకని రజనీశ్ గదిలోకి వెళ్తాడు. సమీర్‍ని కూర్చోమని చెప్పి, ఏవేవే సర్చుకుంటూంటాడు రజనీశ్. ఇంతకీ సారికతో పెళ్ళెప్పుడు అని అడుగుతాడు. పెళ్ళి ప్రస్తావన చేయవలసిన పద్ధతిలో ఎవరూ చేయలేదంటాడు సమీర్. అమ్మాయి నచ్చలేదా అని రజనీశ్ అడిగితే, ఆలోచించే సమయం లేదంటాడు సమీర్. ఇలాంటి విషయాలలో స్పష్టత అవసరమనీ, సారికని లోపలికి పిలిపించి మాట్లాడమంటాడు. కాసేపు పచార్లు చేసి, గోవా వెళ్ళాకా, ఏకాంతంలో నీ నిర్ణయం చెప్పు అని సమీర్‍తో అంటాడు. ప్రస్తుతానికి టూర్‍ని ఎంజాయ్ చెయ్యమంటాడు. కొద్ది సేపటికి సారిక కూడా అక్కడికి వస్తుంది. ఓ కుర్రాడు వచ్చి అంతా సిద్ధమని చెప్తాడు. సారిక, సమీర్ బస్ ఎక్కి కూర్చుంటారు. సమీర్, రైటర్ పక్కన కూర్చుంటే, ఎవరో అతడిని లేపి, ఆ సీట్‍లో సారికని కూర్చోమంటారు. రైటర్, అతని అసిస్టెంట్ వెనకాల సీట్‍లో మాట్లాడుకుంటూంటారు. బస్ బయల్దేరుతుంది. – ఇక చదవండి.]

ప్రయాణంలో ఏ గంట లోనో నిద్ర పట్టేసింది. ఎక్కడో, ఆ లోయల్లో ఏదో కుదుపుకి మెలకువ వచ్చింది. నా మీద వాలి నిదురిస్తున్న సారిక కూడా లేచింది. సర్దుకుని చుట్టూతా చూసింది. నన్ను మటుకు పరీక్షగా చూసింది. ఒక్కసారి కళ్లు మూసుకుంది. చేతులు కట్టుకుని తనలో తాను ఏదో చర్చించుకుంటున్నట్లు తల ఆడిస్తోంది. వెనుక రైటరు మళ్లీ మొదలుపెట్టాడు. ఆయన అసిస్టెంట్ కూడా అలాగే తల ఆన్చి పడుకున్నట్లున్నాడు.

“ఒరేయ్..”

“సార్.”

“ప్రక్కనున్న వాడి మీద వాలిపోవటం మన జాతీయ సమస్య.”

“కరెక్ట్ సార్.”

“బుద్ధి లేదురా నీకు?”

“అన్యాయం సారూ.”

“ఏం పనయ్యా అది? ప్రయాణం అంతా నిన్ను సద్దుకోవటం సరిపోయింది.”

“నేను నిద్రలోకి జారిపోయాను సార్. నన్ను అన్ని మాటలు అనటం సరైన పని కాదు.”

“నిద్రలోకి అందరు జారుతారు”

“ఇది నిజం.”

“ఇలా దిగజారిపోరు.”

“ఇది అన్యాయం.”

“నీది పెద్ద తలకాయ.”

“ఛా.”

“మొయ్యలేక నాకు ఈ భాగం యవత్తు మూస్కుంది.”

“ఇక పని చేయలేదంటారు.”

“ససేమిరా.”

“మీరు కొన్ని విషయాలు మరిచిపోతున్నారు.”

“కొన్ని అనకు. ఒక్కటి మటుకు చెప్పేసెయ్”

“ఒక నిండు సభలో నన్ను మీరు మీ కుడిభుజంగా పేర్కొన్నారు.”

“అయితే?”

“మరి మీ కుడి భుజం మీద బలహీన క్షణంలోనైనా అలా అలవోకగా వాలిపోయి కొద్ది సేపు నిద్రామాతను సేవించుకోవటం అపరాధం ఎలా అవుతుంది సారూ?”

“రెండున్నాయి.”

“చెప్పాలి.”

సారిక నన్ను చూసి నవ్వుతోంది.

“మొదటిది.”

“యస్ సారూ.’

“కుడి భుజం కాన్సెప్ట్‌కు క్లారిటీ ఇచ్చేద్దాం.”

“ఇప్పుడే?”

“చూడు శిశువా! కుడి భుజం అంటే అన్ని విషయాలలో చక్కగా సహాయపడుతూ అండదండలుగా ఉన్నవాడు అని అర్థం.”

“టూకీగా సెలవిచ్చారు సారూ.”

“రెండవది.”

“చెప్పాలి.”

“సభలలో మాట్లాడేవి సభల కోసం మైకు కోసం. ఆ రోజు వద్దన్నా వాళ్లు నిన్ను స్టేజ్ మీదకి పిలిచారు.. సభ అయిపోయిన తరువాత ఎవరో మాట్లాడుకుంటుండగా నేను విన్నాను.”

“ఎవరి గురించి సార్?”

“ఇంకెవరు? నీ గురించే. పదివేలు కొట్టి స్టేజి మీదకి పిలిపించుకున్నావట. నిజమా?”

“అబద్ధాలలో ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్న అబద్ధం సారూ..”

“కావచ్చు. నిజం కాదు అనేందుకు ఆధారాలున్నాయా?

“గట్టిదే ఉంది.”

“వదులు.”

“ఇదేంటి? గట్టిది అంటే వదులుగా ఉంది అంటారేంటి?”

“తెలుగు భాషలో కొన్ని తెగుళ్లున్నాయి. ఆధారం గురించి చెప్పు.”

“పదివేలన్నారు.”

“అవును. ఎక్కువ కూడా కావచ్చని ఆ వింటున్నవాడు అభిప్రాయపడ్డాడు.”

“నా దగ్గర పదివేలు అలా పారెయ్యటానికే గనక ఉండి అంటే మీ చేతిలో పెట్టి నమస్కారం చేసుకుంటాను.”

“వినటానికి బాగుంది. కానీ అలా ఎందుకు చేస్తావు శిశువా?”

“మీ భుజాన్ని – కుడి భుజాన్ని వాడుకునేందుకు అడ్వాన్సుగా రెంట్ ఇచ్చేసే వాడిని.”

“వేనుడిని మథిస్తే ఏకంగా పృథు చక్రవర్తియే పుట్టుకొచ్చాడు.”

“శభాష్ సారూ.”

“నా భుజాన్ని మథిస్తే ఏవేవి వస్తాయో నువ్వు ఆలోచించలేదు.”

“మిమ్మల్ని బాధపెట్టే ఉద్దేశం నాకు లేదు. సృష్టి యావత్తులో అమాయకుడు, సత్యసంధుడు ఒక్కరే.”

“ఎవడు వాడు? బస్సులో ఇప్పుడున్నాడా?”

“ఉన్నాడు.”

“ఎక్కడ?”

“మీ ప్రక్కనే. నేనే..”

“ఎందుకో చెప్పు; అసలు నిజం తరువాత చెబుతాను.”

“నిద్రను న్యాయంగా ఆశ్రయించిన వాడు అమాయకుడు. ప్యార్ కియా నహీ జాతా.. హోజాతా హై.”

“ఓ.”

“నిద్ర పోవాలని ఎవరూ పోరు. నిద్ర వచ్చేస్తుంది.”

“ఒప్పుకుంటాను. ఈ నేరంలో నీకు పాత్ర లేదంటావు.”

సారిక నన్ను జాగ్రత్తగా చూసింది. ఆడవాళ్ళు ప్రశ్నలు వేస్తే ఏదో ఆలోచించి జాగ్రత్తగా సమాధానాలు చెప్పవచ్చు. ఈ విన్యాసాలు మొదలుపెడితే రెండు విశ్వవిద్యాలయాలలో ఒకేసారి గ్రాడ్యుయేషన్ చేస్తున్నట్లుంటుంది.

“నేనలా అనలేదు.”, అసిస్టెంట్ రైటరు వదలదలచుకోలేదు.

“ఎలా అన్నావు?”

“అది అసలు నేరమే కాదు అని నేను సృష్టం చేస్తున్నాను.”

కొద్దిసేపు నిశ్శబ్దం కమ్ముకుంది.

“అసలు నేరమంటే ఏమిటో ఓ సారి చెప్పేద్దాం.”

“సార్..”

“నీ సౌకర్యం నాకు అసౌకర్యంగా మారటం నేరం.”

“అలవోకగా జరిగితే?”

“అది బలహీనమైన వాదన.”

“ఎందుకలాగ?”

“నేను ఇప్పుడు చొక్కా విప్పుతాను.”

“వద్దు సార్. మీ బలం నాకు తెలుసు.”

“నో, బలప్రదర్శన కోసం కాదు.”

“ఎందుకు సార్ మరి?”

“కుడి భుజం మీద గాట్లు చూపిస్తాను. కోర్టు వారికి సాక్ష్యాలు అవే.”

“నిజమా?”

“అవును.”

“బాగా చిన్నప్పుడు దెబ్బలు పడ్డాయా సార్?”

“కాదు. నీ జుట్టుంది చూసావు?”

“అందరూ గిరిజాలంటారు సారూ.”

“ముమ్మటికీ కావు.”

“ఏల?”

“ముళ్ళపందికున్న వెంట్రుకలైనా షాంపూ వాడితే మృదువుగా మారగలవు. నీవి వెంట్రుకలు కావు. ముళ్ళు అని చెప్పాల్సి ఉంది.”

“అవి లీవ్స్ ఆఫ్ గ్రాస్ సార్.”

“ఎలాగ?”

“వాల్ట్ విట్‌మాన్ చెప్పినవి. స్థితప్రజ్ఞునిగా నిలబడ్డ ప్రతి వాడికీ అవి నిలబడి ఉంటాయి. వంగవు.”

“నాలాగా బొత్తిగా లేని వాడికి?”

“సమాజం నిర్ణయిస్తుంది.”

బస్సు అలా మలుపులు తిరుగుతోంది.

“ఈ దేశం చాలా గొప్పది..”, రచయిత వదలలేదు.

“ఎందుకంటారు?”

“తన సమస్య తనకి సరిగ్గా తెలియని ప్రతి వాడు స్థితప్రజ్ఞునిగా చెలామణి అయిపోతూ ఉంటాడు.”

ఓ చిన్న పల్లెటూరిలో రెండు బస్సులాగి ఉన్న చోట ఈ బస్సు కూడా ఆగింది.

టూర్ కండక్టర్ ముందరకి వచ్చాడు.

“మేడమ్..!”, సారికతో అన్నాడు, “..కొద్ది సేపు స్నాక్స్, టీ కోసం దిగుదాం. ఫ్రెష్ ఎయిర్ పీలుద్దాం.”

ఇద్దరం లేచాం. పెద్దగా జనం ఎవరూ అక్కడ లేరు.

మేము క్రిందకి దిగుతుంటేనే ఓ కుర్రాడు రెడీగా టీ కప్పులు ప్లేటు పెట్టుకొని మా వైపు వస్తూ కనిపించాడు. కొద్దిగా చలిగానే ఉంది.

అలా నాలుగడుగులు వేసాం. కాస్త హాయిగా అనిపించింది. రజనీశ్ క్రిందకి దిగినట్లు లేదు. మా దగ్గరకి ఎవరూ ఉరికి రాకూడదని కాబోలు ఇద్దరు కొద్దిగా దూరంగా నిలబడి కాపలా కాస్తున్నారు. బస్సు ముందర బానర్ కట్టి ఉంది.

‘కానరాని కోయిల’, అని వ్రాసి ఉంది. కోకిల బొమ్మ చాలా బాగా గీశారు ఎవరో.

జేబుల్లో చేతులు పెట్టుకుని అలా చుట్టుతా చూస్తున్నాను. ఎంతో ముద్దుగా ఉన్న రెండు కుక్క పిల్లలు ప్రక్కనున్న పచ్చిగడ్డిలో ఆడుకుంటున్నాయి.

“సమీర్..”, సారిక గొంతు వినిపించింది.

ఇటు తిరిగాను. నేను పలుకుతానో లేదో అన్నట్లు చూసి, ఎందుకో గుటకలు మ్రింగింది.

“యస్?”

కనురెప్పలు పైకి లేచాయి.

“ప్రేమ నేరమా?”

(ఇంకా ఉంది)

Exit mobile version