[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[ఓ రోజు అన్ని పేపర్లలోను, టీవీలోనూ, అన్ని చోట్లా తనకీ సారికకీ పెళ్ళి నిశ్చయమైనట్టు వచ్చిన వార్తలూ, వాటి తాలూకూ ఫోటోలు సమీర్ని ఇబ్బంది పెడతాయి. చాలా ఫొటోలను సారిక అతనికి పంపిస్తుంది. వాటిని మొబైల్ లోంచి డిలీట్ చేస్తూంటాడు. ఇంతలో సారిక ఫోన్ చేస్తుంది. ఫోన్ తీస్తాడు కానీ, హలో అనడు. అటు నుంచి సారిక కూడా ఏమీ మాట్లాడదు. కొన్ని క్షణాల తరువాత, ఇద్దరం ప్రెస్ ముందుకు వెళ్ళి ఈ వార్త తప్పు అని చెబుదామా అని అడుగుతాడు సమీర్. అది అవసరమా అని అడుగుతుంది సారిక. తమ మధ్యలో అలాంటి నిర్ణయం లేనప్పుడు ఆ పని చెయ్యటం అవసరమే అంటాడు సమీర్. ఫోన్ పెట్టేస్తుంది సారిక. మర్నాడు ఓ సినిమా షూటింగ్లో పాల్గొంటాడు సమీర్. ఓ కళాకారుడు బార్లో కూర్చుని తాగుతూ వెయిట్రెస్‌తో మాట్లాడే సీన్ అది. కొంతసేపయ్యాకా, రజనీశ్ కట్ చెప్తాడు. షాట్ గ్యాప్‌లో రజనీశ్ వచ్చి, సారికను చేసుకుంటున్నావా అని సమీర్ని అడుగుతాడు. మత్తేదో దిగిపోయినట్లనిపిస్తుంది సమీర్కి. – ఇక చదవండి.]
‘కానరాని కోయిల’ అనే సినిమా ఆ మధ్య ఒక ప్రభంజనం సృష్టించింది. ఎన్నో అవార్డులు గెలుచుకుంది. మా సినిమా యూనిట్ యావత్తూ గోవాకి బయలుదేరింది. అక్కడ విచ్చలవిడిగా సభలు, సంబరాలు చేస్కోవాలని రజనీశ్ ఆలోచన. నేను కారులో ఒంటరిగా వస్తానని చెప్పాను. ఎవ్వరు ఒప్పుకోలేదు. అందరం ఆనందంగా ప్రత్యేకమైన వోల్వో బస్సులోనే వెళ్లాలన్నారు. తప్పేది లేక స్టూడియో వరకు కారులో వెళ్లాను. ఇంకా చాలా మంది రావాలన్నారు. చేసేది లేక రజనీశ్ రూమ్ లోకి వెళ్లాను. పూల పూల షర్ట్ వేశాడు రజనీశ్.
“ఎలా ఉంది?”, అన్నాడు.
“గోవాకి కరెక్ట్”, అన్నాను.
“కూర్చో”, అంటూ ఏవేవో సద్దుకున్నాడు.
సోఫాలో కూలబడ్డాను. రజనీశ్కి ఓ అలవాటుంది. ఏ పనీ క్రమంగా చెయ్యడు. ఎదురుగా ఉన్న టీపాయ్ లాక్కుని దాని మీద కూర్చున్నాడు.
“ఇంతకీ ఎప్పుడు?”, అన్నాడు.
“ఏంటి?”
“కలలకీ, వాస్తవానికీ పెళ్లి”
“అర్థం కాలేదు”
“సినిమాలన్నీ కలలే, పారిపాతం పూలు – స్వర్గం లోనివి. అలా తెంపుకుని నిజజీవితపు తోటలో పెట్టి, పెరిగిందకుని లోపలికి తీసుకెళ్లటం.”
“నిజజీవితమూ కృత్రిమమైనదే”
“కాదు సమీర్. చక్కని గూళ్ళు, పచ్చికలు, సెలయేర్లు, ఇవి నిజం. చిత్తశుద్ధి, చక్కని మనసు గల ఒక మానవతా మూర్తితో అనుబంధం పెంచుకుని చూడు, ఒక జీవిత కాలంలో పది జన్మలు గడపవచ్చు.”
“సారిక మీ దృష్టిలో ఎటువంటి అమ్మాయి?”
“నిన్ను కోరుకుందా? నువ్వు కావాలనుకున్నావా?”
“ఆమె చాలా కాలంగా అర్థం కాని స్పీడులో వెళ్ళిపోతోంది”
“ఓకే. ఏమైనా ఇబ్బందా? నాకు చెప్పు..”
ఆలోచించాను. రజనీశ్‌ను నమ్మవచ్చా? నిజానిజాలు తెలుసుకోవాలన్నా కొన్ని మాట్లాడటం తప్పదు. ఆ మాటకొస్తే మా జీవితాలలో ఏదీ దాచుకున్నది లేదని అర్థమైపోయింది.
“మేమిద్దరం ఒకరినొకరు ఇష్టపడటం లేదా పడకపోవటం అలా ఉంచండి. ఆ ప్రస్తావన చేయవలసిన పద్ధతిలో ఎవరూ చేయలేదు.”
“మరి?”
లోపలికెవరో వస్తుంటే అవతలకి వెళ్ళమని సైగ చేసాడు. తలుపు మూసుకుంది.
“ఎలాగో అలాగ పెళ్లి అయిపోవాలని అనుకున్నట్లు అర్థమయింది”
చాలా సేపు ఆలోచిస్తున్నట్లు కనిపించాడు రజనీశ్.
“అమ్మాయి నచ్చలేదా?”, సూటిగా అడిగాడు.
“ఆలోచించే సమయం ఏది?”
తొడల మీద గట్టిగా బాదుకుని గబుక్కున లేచాడు.
“సమీర్..”, గంభీరంగా చెప్పాడు, “..నువ్వు మామూలుగా ఇళ్లల్లో సంబంధాలు చూసే పద్ధతిలో మాట్లాడుతున్నావు. రేపో, మాపో పెళ్లి చేసుకోవా? ఇంటివాడివి కావా?”
నేనేమి మాట్లాడలేదు. మళ్ళీ అందుకున్నాడు.
“చూడు, మనం అనుకున్నట్లు అన్ని ఒక స్పీడు లోనే జరగవు.”
“ఒక వేళ సారిక నాకు ఇష్టం లేదు అని అంటే?”
సీరియస్‌గా చూసాడు.
“సమీర్, ఈ విషయాలు నాజూకుగా వుంటాయి. స్టేజ్ మీద జరిగే సంవాదాలు వినటానికి బాగుంటాయి. తెర మీద రంగులు చూడటానికి బావుంటాయి. నిజ జీవితంలోని నిజానిజాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. నీకు నిజంగా ఆమె ఇష్టం లేదని నువ్వు అనుకుంటే ఇప్పుడే, ఇక్కడే లోపలికి పిలిపించి ఆ మాట చెప్పు. పిలిపించనా? కొద్ది సేపు ఇబ్బంది పడతావు. తర్వాత సుఖపడతావు”
గదిలో అటూ ఇటూ తిరిగాడు రజనీశ్. తనలో తాను ఏదో చర్చించుకున్నట్లున్నాడు.
“ఆల్రైట్..”, అన్నాడు, “..నా సమక్షంలో చెబితే రకరకాల అపోహలొస్తాయి. గోవా వెళ్ళాక, ఏకాంతంలో మాటల్లో పెట్టి మెల్లగా సబ్జెక్ట్‌ని పోస్ట్‌పోన్ చేయించి నాలుగు నెలల తరువాత నీ నిర్ణయం చెప్పు. దీనిని మన మధ్యనే ఉంచు. ఇది తెలివిగల వాళ్లు చేసే పని. ఒకవేళ..”
“ఒక వేళ..?”
“ఈ నాలుగు నెలల్లో నీ నిర్ణయం ఏ కారణం చేతనైన మారినట్లయితే మరీ మంచిది. ఆ రోజు గ్లాసులు లేపుదాం, ప్రస్తుతానికి మన టూర్‌ని పూర్తి స్థాయిలో ఎంజాయ్ చెయ్యండి. కమాన్..” అంటూ తలుపు తెరుచుకుని బయటకు వెళ్లిపోయాడు.
ఇతను విలన్ ఎందుకవుతాడు? లేక ఏదైనా ప్లాన్‌లో ఇది ఒక సమర్థవంతమైన వ్యూహమా? సామాన్యంగా ఇలాంటి సమయాలలో ఒక పెద్దమనిషి ఎలాంటి సలహా ఇస్తాడో అదే ఇచ్చాడు. ఇతను ఒక గొప్ప చిత్ర దర్శకుడు. ఎందుకో ఇప్పుడు మటుకు నటిస్తున్నాడని అనుకోలేదు.
తలుపు తెరుచుకుంది. అక్కడ సారిక నిలుచున్నట్లు తెలుస్తోంది. కుర్రాడు లోపలికి వచ్చాడు.
“సార్”
“యస్?”
“అంతా రెడీ, బస్సులోకి అందరూ వచ్చేసారు. మీకు వేడినీళ్ల ఫ్లాస్క్ కుడా సిద్ధం చేసాను. రండి”
అతను ఆ మాట చెప్పి అలాగే నిలబడి ఉన్నాడు.
“సార్, రమ్మంటున్నారు.. మేడమ్ గారు కూడా వచ్చేసారు”
కొద్దిగా బరువుగానే అడుగులు వేసుకుంటూ బయటకు నడిచాను. పావురాల రంగు శారీలో చేతికి ఒక హాండ్ బ్యాగ్ తగిలించుకుని మొబైల్లో ఎవరితోనో మాట్లాడుతూ ఓ ప్రక్కగా నిలబడి ఉంది సారిక. నన్ను చూసి ‘అవును నేనే’ అన్నట్లు చిరునవ్వు నవ్వి ముందుకు నడిచింది.
ఈ యూనిట్లో అందరికీ ఏదో ఉత్సాహం. దాదాపు అదేమిటో అందరూ పెళ్ళివారిలా మారిపోయారు. మా సినిమాలోని పాటలు పాడుతూ స్వాగతం పలికారు. ఈమె ఒక లీడర్లా అందరికీ నమస్కారాలు పెట్టేస్తోంది! నేను సంకోచిస్తూ నాలుగడుగులు వెనుక నిలబడ్డాను. వెనక్కి చూసి నన్ను ముందరికి రమ్మని ఆహ్వనించింది. తప్పక వెళ్లి ప్రక్కన నిలబడ్డాను. ఇద్దరు కుర్రాళ్ళొచ్చి మా ముందర పిచ్చి పిచ్చిగా చిందులెయ్యటం ప్రారంభించారు. నా మీద నాకే నవ్వొచ్చింది. టపాకాయలు పేలుస్తున్నారు.
ఎక్కడి నుండో రజనీశ్ వచ్చి నన్ను వెర్రి వెధవను చూసినట్లు చూసి బిగ్గరగా నవ్వాడు.
“ఏంటి? కదలరా?” అన్నాడు.
బయట బస్సు దగ్గర అందరూ స్వాగతం పలుకుతున్నారు.
“రెడీ, టేక్.. యాక్షన్” అన్నాడు రజనీశ్. అందరూ గొల్లున నవ్వారు. మందుకు నడిచాం. అడుగులో అడుగు వేస్తోంది సారిక. అందరినీ ఓరకంట కనిపెడుతోంది. నన్నూ ఓ కంట కనిపెడుతోంది.
నిజమే. సినిమా అనుబంధాలన్నీ అద్దాల మేడలే. అలా నడుచుకుంటూ వెళుతుంటే హీరో హీరోయిన్లు సంబరాలకి వెళుతున్నట్లుంది కానీ కాబోయే భార్యాభర్తలుగా మటుకు నాకు అనిపించలేదు. ఈమె ఆ దృశ్యాన్ని అద్భతంగా అనుభవించేస్తోంది!
బస్సు దగ్గరికి వచ్చాం. అక్కడ పూలదండలతో జనం డోర్‌కి అటూ ఇటు నిలుచునున్నారు. నాకు సహనం సన్నగిల్లుతోంది. తనివి తీరా పూలదండలు వేసేసారు. ఓ కుర్రాడు నా చేతిలో ఓ దండ పెట్టించి, ఆమెకు వెయ్యమన్నాడు. ఇంకొకడు సారికకూ ఓ దండ ఇచ్చాడు.
“ఇప్పుడు చెయ్యకూడదలా” అన్నాను.
“పరవాలేదు సార్..” అందరూ అరిచారు. “..పండగలో పండగ – కమాన్ సార్”
నేను దండ వెనక్కి ఇచ్చేసాను. సారిక నన్ను అదోలా చూసింది.
తనూ వెనక్కు ఇచ్చేసింది.
నేను గబగబా బస్సు లోకి ఎక్క అక్కడ మా సినిమా రైటర్ గారు కూర్చున్న సీటులో ఆయన ప్రక్కన కూర్చున్నాను.
“కంగ్రాట్స్” అన్నారాయన.
సారిక లోపలికి వచ్చి అటూ ఇటూ చూస్తోంది. ఎవరో వచ్చి ఆ రైటర్ గారిని ఓ దెబ్బ వేసాడు.
“అన్యాయం..”, అన్నాడాయన. “..ఉత్తమ రచయితను కనీసం మెత్తగా అయినా కాకుండా కొడతావా?”
“లే”
“ఎందుకు?”
“రచయితలకు బుద్ధి, జ్ఞానం ఉండవని చాలామంది చాలాసార్లు చెప్పారు నాకు”
“నేనూ నీకు చెప్పాను”
“అవును. అందుకే లే. మేడమ్ కూర్చుంటారు”
ఆయన నాలుక కరుచుకుని లేచాడు. పాపం ఆయనది తప్పుకాదు.
“నిజమే. నేనెందుకిక్కడ, పానకంలో పుడక, తల్లీ.. దా.. చక్కగా చిలకా గోరింకల్లా ప్రక్క ప్రక్కన కూర్చోండి” అంటూ అవతలికి వెళ్లి మా వెనుక సీట్లో సెటిల్ అయిపోయాడు.
సారిక జాగ్రత్తగా కూర్చుంది.
“కిటికీ ప్రక్కకు వస్తావా?” అడిగాను. చుట్టూతా చూసింది.
“నో” అంది. చిరునవ్వు మటుకు అలాగే ఉంది. అందరూ మమ్మల్నే చూస్తున్నారు.
“మీ ఊరు తీసుకెళుతున్నావా?” గుసగుసలాడుతున్నట్లు అడిగింది.
“నేను తీసుకెళ్లటం ఏంటి? అందరం వెళుతున్నాం”
“నువ్వు రాజకీయాలలో ఉండవలసిన వాడివి”
“ఎందుకు?”
“ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చినట్లు మాట్లాడతావు.”
“నువ్వు షోరూమ్‌లో బొమ్మలా ఉండవలసినదానివి”
“ఎందుకలాగా?”
“చీర నలగకుండా, పెదవి కదలకుండా, చిరునవ్వు నవ్వుతుందో, నవ్వలేదో తెలియకుండా కళ్ళు పెద్దవే, అందరూ చూడండి అన్నట్లు రెప్ప వాల్చకుండా కేవలం ఒక్క జర్క్‌తో జడను ముందరకు తెచ్చుకుని ఎవరికీ వినిపించకుండా మాట్లాడుతావు”
“నేను దిష్టి బొమ్మను అని ఎంత అందంగా చెప్పావు?”
బస్సు ముందర ఎవరో కొబ్బరికాయ కొట్టి దిష్టి తీసారు. బస్సు కదిలింది. గోల గోలగా ఉంది..
మా సీటు వెనుక రైటర్ రెచ్చిపోతున్నాడు.
“చూసావా?”
“ఏంటి సార్?”, అసిస్టెంట్ అడుగుతున్నాడు.
“ఇదే సృష్టిలోని వింతైన అందం”
“ఏంటి సార్ అది?”
“రోజూ ఒకరినొకరు ఎంత తగులుకున్న ఇలాంటప్పుడు అమ్మాయి చెయ్యి తన చేతికి తగలగానే, లేదా భుజాలు రాసుకోగానే మరో వింత ప్రపంచంలోకి మనసు ఈ అనుభూతులను గుండెకు హత్తుకుంటూ మరీ ప్రవేశిస్తుంది”
“సూపర్”
“కుదుపుకు భుజం తగిలినట్లు ఈయిన, ఫరవాలేదు అన్నట్లు ఆమె. మరల తగలాలి, ఈసారి మరోలా ఉండాలి అనుకుంటారు”
“అదిరింది”
“గంధం చెక్కలు తగులుకొని రాసుకుంటేనే సుగంధం”
“పేలింది”
“అద్దీ. వాళ్ళు విన్నారంటావా?”
“వింటున్నారంటాను!”
“విని ఏం చేస్తున్నారంటావు?”
సారిక కళ్ళు మూసుకుని నిండుగా నవ్వింది. ఎవరో షాంపెయిన్ బాటిల్ తెరిచారు. కెవ్వున కేకలు పెట్టారు. గోవా రమ్మంటుంది.
(ఇంకా ఉంది)
వేదాంతం శ్రీపతిశర్మ కథా రచయిత. నవలా రచయిత. వ్యంగ్య హాస్య రచనలకు పెట్టింది పేరు. “ఆరోగ్య భాగ్యచక్రం” అనే పుస్తకాన్ని వెలువరించారు.