Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పూచే పూల లోన-83

[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[‘తమ్ముడుండే వాడు’ అనే మాట వినగానే ఒక రోజు ఓ కుర్రాడు తనని ఎక్కడికో తీసుకెళుతూ రోడ్డు దాటియ్యటం, ఆ కలలో సారిక ఎటువంటి చీరలో కనిపించిందో, అదే చీరలో మర్నాడు షూటింగ్‌కి రావడం, అన్నీ ఒక్కసారిగా సమీర్ మనసులో మెదులుతాయి. వెంటనే కుల్వంత్‌కి ఫోన్ చేస్తాడు. రెండో మూడు సార్లు రింగ్ వెళ్లినా ఆయన తీయడు. నిద్రపోవడానికి పైకి వెళ్తుంటే, ఆయన ఫోన్ వస్తుంది. సినిమాలు పూర్తిగా మానేయమంటారా అని ఆయన్ని అడుగుతాడు సమీర్. తాను అలా అనలేదని ఆయనంటాడు. మనసు ప్రశాంతతని కోరుతోందని సమీర్ అంటే, మీరున్న రంగంలో అది ఎవరికీ ఉండదంటాడాయన. ఏం చేయమంటారని సమీర్ అడిగితే, సారికనీ, రజనీశ్‌ని పక్కన పెట్టమని ఆయన సూచిస్తాడు. రజనీశ్‍తో మాట్లాడనా అంటే వద్దంటాడు. సారిక తండ్రి తనని కలవడానికి వచ్చాడని సమీర్ చెప్తే, తనకి తెలుసునని అంటాడాయన. తాను గోవా వెళ్ళిపోదామనుకుంటున్నానని సమీర్ చెప్తాడు. అయినా ఈ సమస్య మిమ్మల్ని వదలదని కుల్వంత్ అంటాడు. సారికకు తమ్ముడుండేవాడా అని సమీర్ అడిగితే, ఉండేవాడనీ, చనిపోయాడనీ అంటూ, తాను విన్న విషయాలు చెప్తాడు కుల్వంత్. సారికని వాళ్ళ తండ్రి బాగా గారాబం చేశాడనీ, సారికి పుట్టిన తర్వాత తొమ్మిదేళ్ళకు మగబిడ్డకు జన్మనిచ్చి సారిక తల్లి చనిపోయిందని, ఆ తర్వాత ఆయన మరో పెళ్ళి చేసుకోకుండా, పిల్లలని చూసుకున్నాడనీ, సారికని గొప్ప నరక్తికి చేయాలని తలచాడని చెప్తాడు కుల్వంత్. కానీ సారిక సినీ రంగాన్ని ఎంచుకుందని, ముంబయి వచ్చిందనీ, కొన్ని రోజులు ఇబ్బంది పడినా, సినీరంగంలో రాణించిందని చెప్తాడు కుల్వంత్. ఓ రోజు ఆమె తమ్ముడు ఆమె అడ్రసు సంపాదించి తండ్రి దగ్గరనుంచి పారిపోయి ముంబయి వచ్చేసాడనీ, అక్క ఇంటి ముందు ఆగాడనీ, వాడిని చూసి కారు దిగిన సారికని పిలుస్తూ, రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరిగి చనిపోయాడని చెప్తాడు కుల్వంత్. గుడ్ నైట్ చెప్పి, ఆయన ఫోన్ పెట్టేస్తాడు. తరువాత సారిక ఫోన్ చేస్తుంది. – ఇక చదవండి.]

మొబైల్ లోని గాలరీలో అన్నీ ఫోటోలే. ఒక్కొక్కటి, డిలీట్ చేస్తూ పోతున్నాను. ఈ ఉదయం వచ్చిన ఫొటోలు నన్ను బాగా ఇబ్బంది పెట్టాయి. పేపర్లలో, టీవీలలో, అన్ని చోట్ల నాకు సారికకు వివాహం నిర్ణయం అయినట్లు, త్వరలోనే మూడు ముళ్ళనీ మీడియాలో మారుమ్రోగిపోయింది. వాటిలో చాలా ఫొటోలు నాకు సారిక పంపినవి!

నాలుగైదు సార్లు రింగ్ చేసాక గానీ సారిక ఫోన్ తియ్యాలనిపించలేదు. నా కాళ్ళూ, చేతులూ కట్టేసి బలవంతం చేస్తున్నట్లున్నది. ఫోన్ తీసాను కానీ హలో అని కూడా అనలేదు. సారిక కూడా హలో అనలేదు.

రెండు ఫోన్లూ సైలంట్‌గా ఉన్నాయి. కనెక్ట్ అయి ఉన్నాయి.

“ఊఁ..” అన్నాను.

“ఊఁ.. అంటే?”

“ఇదంతా ఎలా జరిగింది?”

“నేనూ అదే అడుగుతున్నాను.”

“అంటే ఇద్దరికీ తెలియదా?”

“అంతే కదా?”

“ఇద్దరం ప్రెస్ ముందుకు వచ్చి ఈ వార్త తప్పు అని చెబుదామా?”

“…….”

చాలా సేపు ఏ సమాధానం లేదు.

“యస్?”

“అది అవసరనూ?”

“మన మధ్యలో అలాంటి నిర్ణయం లేనప్పుడు ఆ పని చెయ్యటం అవసరం కదా?”

“నిజమే.. కనీసం..”

“కనీసం?”

“…….”

దేనికో సంకోచిస్తున్నట్లు అర్థమవుతోంది.

“యస్? కనీసం?”

గొంతు మారింది.

“కనీసం.. కనీసం అటువంటి నిర్ణయం వచ్చే వరకైనా ఆ పని చెయ్యాలి.”

నేను మాట్లాడే లోపల ఫోన్ కట్ అయిపోయింది. అనుమానాలు ఎక్కువవుతున్నాయి. ఈమె అనుకుని ఉండవచ్చు కానీ నాలోంచి అవునన్న మాట ఇవతలికి లాగేందుకు ఇంత పని చేస్తుందని అనుకోలేదు. కాకపోవచ్చు.

***

“నేను కళాకారుడిని..”, చేతిలో గ్లాసు పట్టుకుని అన్నాను. “..అనుక్షణం ఓడిపోయినట్లే కనిపిస్తాను. అసలు నా గెలుపు అంటే ఏమిటో తెలుసా?”

అమ్మాయి గ్లాసులో మందు పోసింది. ఏమీ మాట్లాడలేదు. రెండు గుటకలు మింగి కిటికీ దాకా వెళ్ళాను. కిటికీ బయట ట్రాఫిక్ లైట్లు, గొడవ గొడవగా ఉంది.

“ఇంత పెద్ద ప్రపంచం.. ఇంత మంది.. నన్నొక్కడినే ఓడించాలని ఎంచి నన్ను ఓడించటం..”

గబగబా గ్లాసు పైకెత్తాను. ఖాళీ అయిన దానిని చూసాను.

“పిల్లా..” కాసువల్‍గా అన్నాను, “..కళాకారుడిని! నా హృదయాన్ని వెలితిగా ఎన్నడూ ఉంచకు. ఈ గ్లాసునూ ఇలా చూడలేను. నింపెయ్.. ప్లీజ్..!”

అమ్మాయి గ్లాసు నింపింది.

కిటికీ తెర మీద కదులుతున్న నా నీడను చూసాను. అటు నడిచాను. అది ప్రక్కనున్న కిటికీ తెర మీదకి జరిగింది.

“వాడెందుకు ప్రతి సారీ కదలిపోతాడు?”

అమ్మాయి అలాగే నిలబడి ఉంది.

“చెప్పు పిల్లా.. వాడికి ఏదైనా పిచ్చా?”

“మీరు కూర్చోండి సార్.”

“ఎందుకు?”

“నాకు భయంగా ఉంది.”

“భయమా? ఎందుకు?”

“మీరు మామూలుగా లేరు ఈ రోజు.”

విరగబడి నవ్వాను.

“పిల్లా! మందు పోసింది నువ్వు! పోసాకా, తాగమన్నట్లే కదా?”

“సార్..”

“పిల్లా..”, గ్లాసు పైకెత్తాను. “..ఇదేంటో తెలుసా?”

“గ్లెన్ ఫిడిచ్.”

“ఛా! బ్రాండ్ ఎవరడిగారు? ఇందరి బాండ్ వాగన్ లోకి వెళ్ళిపోయాకా ఎవరికీ బ్రాండులుండవు. మసిపూసి కడిగేసే మారేడుకాయ.”

అమ్మాయి చిరునవ్వు నవ్వింది.

“పిచ్చిగా ఉంది కదూ?”

“లేదు సార్.”

“సామెత తప్పుగా చెప్పాను కదూ?”

“లేదు సార్.”

“నేను మామూలుగా లేను కదూ?”

“సార్”

“అవును. అవతల ఈ జనం ఉన్నారు చూడూ..”

“సార్”

“దొంగలు”

“……”

“అవును. అందరూ దొంగలే! దొంగ నా..”

“ఎందుకు సార్?”

“అవును. మామూలుగా లేను కదూ? ఎందుకో తెలుసా?”

“ప్లీజ్.. కూర్చోండి సార్.”

“ఎందుకు పడిపోతానా?”

“నో సార్.”

“హహహ.. వీళ్ళల్లో ఒక్కడు, ఒక్కడైనా మామాలు మనిషిని కనీసం.. కనీసం మామాలుగానైనా గౌరవిస్తారా?”

అదోలా చూసింది అమ్మయి.

ఆమెకు దగ్గరగా రెండడుగులు వేసాను.

ఆమె వెనక్కి జరిగింది. చేతులు కట్టుకుంది.

“చెప్పు పిల్లా.. ఈ గొప్పవాడు ఓ గొప్ప మాట అడిగేసాడు. అంచాత చెప్పేసెయ్.. కమాన్.”

“సార్”

“చెప్పు పిల్లా”

“గౌరవించడు సార్.”

“ఎందుకు?”

“తెలీదు సార్.”

“నువ్వే అన్నావు కదా?”

“ఏంటి సార్?”

“నేను ఈ రోజు మామూలుగా లేను. అవునా?”

“బాగా డిస్టర్బ్ అయ్యారు సార్.”

“ఛీ.. గాలి తీసేసావు పిల్లా! ఇందాకన్న మాటే బాగుంది. మామూలుగా లేనన్నావు. ఇప్పుడు పనికిమాలినోడిలా ఉన్నావంటున్నావు..”

“నో సార్, నేనలా అనలేదు. ప్లీజ్ సార్.”

చెయ్యి అడ్డుపెట్టాను.

“నో ప్రాబ్లమ్. ఈసారి గట్టి ప్రశ్న అడుగుతా, చెప్పు.”

అమ్మాయి చేతులు జోడించింది. సోఫాలో కూలబడ్డాను.

“పిల్లా..”

“సార్”

“అంత అందమైన చేతులు.. అంత నాజూకు వ్రేళ్లు..!”

అమ్మాయి ఏదో దారి వెతుక్కుంటున్నట్లు అటూ ఇటూ చూస్తోంది.

“ఈ సౌందర్యం నింపుకున్న వాటిని నమస్కారానికి వాడకూడదు! నువ్వు నన్ను గౌరవిస్తూ నమస్కారం పెట్టలేదు.”

అమ్మాయి చేతులు మామూలుగా పెట్టింది.

“నన్ను వదిలెయ్యమని ఆ పని చేసావు.”

“మీరు కూర్చోండి సార్.”

“చెప్పు.”

“ఏం చెప్పాలి?”

“మామూలోడితో మామూలోడికి పని లేదు. కరెక్ట్?”

“కరెక్ట్.”

“పనికిమాలినోడితో?”

“తెలీదు సార్.”

“నీకు తెలుసు. ఆడెందుకలా కదిలిపోతాడు ఆ.. ఆ పనికిమాలిన తెర మీద?”

“అది నీడ సార్.”

“నీడా?”

“అవును సార్.”

“ఎవరిది?”

“మీదే సార్.”

“అయితే మటుకు? అలా ఎలా కదిలిపోతాడు పిచ్చి పిచ్చిగా?”

“మీరు కదులుతున్నారు సార్.”

“ఓ. అవునా? చెప్పు.”

“ఏంటి సార్?”

“పనికిమాలిన వాడిని జనం ఎలా గౌరవిస్తారు?”

“గౌరవించరు సార్.”

“ఛా!”

గబగబా వెళ్ళి తెరలు కిటికీ మీద నుండి తోసేసాను.

గబుక్కున ఇటు తిరిగి నుదుటి మీద చెయ్యి పెట్టుకున్నాను.

“ఏమైంది సార్?”

“ఈ గ్లాసులో మరో మనిషి – మూడ్‍లోకి వస్తున్న మూడోవాడు కనిపిస్తున్నాడు.”

“కట్. ఓకే”, అరిచాడు రజనీశ్.

గబగబా వచ్చి కుర్చీలో కూర్చున్నాను. మేకప్ వాడు వాడి పని వాడు చేసుకుంటున్నాడు.

రజనీశ్ టోపీ తీసి నన్ను జాగ్రత్తగా చూసాడు.

“నాదో అనుమానం..”, అన్నాడు.

“ఏంటి సార్?”

“మందు కొట్టనివాళ్ళు కొట్టేవాళ్ళ కంటే బాగా కొట్టినట్టు నటిస్తారా అని.”

నవ్వి ఊరుకున్నాను.

“నిజమా?”, అడిగాడు.

“ఏమో?”

“అది కాదు.”

“ఏంటి సార్?”

“సారికను చేసుకుంటున్నావా?”

మందు కొట్టలేదు కానీ కొట్టినవాడికి అంతా దిగిపోయినట్లు ఏదో తల నుండి పాదం వరకూ జారిపోయినట్లనిపించింది!

(ఇంకా ఉంది)

Exit mobile version