Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పూచే పూల లోన-82

[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[చెప్పాల్సినవన్నీ చెప్పి కుల్వంత్ వెళ్ళిపోయాకా, సమీర్‌లో ఎన్నో ఆలోచనలు తలెత్తుతాయి. సారిక గురించి, రజనీశ్ గురించి ఆలోచిస్తాడు. ఓ సీన్ చేసేముందు రజనీశ్ ఏం చెబుతాడో గుర్తు చేసుకుంటాడు. రజనీశ్ ఇలాంటి పనులు చేస్తాడా అని అనుకుంటాడు. సారికని పెళ్ళి చేసుకోవాలో వద్దో తేల్చుకోలేకపోతాడు. సారిక తండ్రి ముంబయి వచ్చి సమీర్‍ని కలుస్తాడు. తన కుటుంబం గురించి, వ్యాపారాల గురించి, సారిక గురించి ఎన్నో విషయాలు చెప్తాడు. ఇక్కడి సంగతులు మీకెలా తెలుస్తాయి అని సమీర్ అడిగితే, ఇలాంటివేవీ దాగేవి కావని, ఏదో ఒక రోజు అందరికీ తెలిసిపోతాయని అంటాడు. ఆయన ఓ బ్యాగ్‍ సమీర్ చేతిలో పెట్టి, సారికని పెళ్ళి చేసుకోమని అడిగి, లేచి బయటకు నడుస్తాడు. చేతిలో బ్యాగ్ పట్టుకునే డోర్ దాకా వచ్చిన సమీర్, నా నిర్ణయం సరే, ఈ నిర్ణయం రజనీశ్‍కు ఏదైనా సందేశమీయడానికా అని అడుగుతాడు. సారిక చేతకానిది కాదనీ, ఆమెకు ఇతర బాధలు ఉన్నాయని, ఆమెకో చిన్న తమ్ముడు ఉండేవాడని చెప్పి వెళ్ళిపోతాడు. – ఇక చదవండి.]

‘తమ్ముడుండే వాడు’ అనే మాట వినగానే ఒక రోజు ఓ కుర్రాడు నన్ను ఎక్కడికో తీసుకెళుతూ నన్ను రోడ్డు దాటియ్యటం, ఆ కలలో సారిక ఎటువంటి చీరలో కనిపించిందో, అదే చీరలో మర్నాడు షూటింగ్‌కి రావడం, అన్నీ ఒక్క సారి లైట్లు వెలిగినట్లు వెలిగాయి. ఏదీ తోచలేదు. టకటకా కుల్వంత్ గారి కార్డు తీసాను. నంబరు కొట్టాను. రెండో మూడు సార్లు రింగ్ వెళ్లినా ఆయన తీయలేదు. పైకి వెళ్లి ఇక పడుకుందామనే ఆలోచన వచ్చింది. ఈ మధ్యనే నాలో ఎక్కడి నుండో కొన్ని చిత్రమైన సెంటిమెంట్లు బయలుదేరాయి. రెండు రెండు మెట్లు ఎక్కితే కానీ ఎక్కినట్లు కాదు. గది లోకి వెళూతుండగా ఫోన్ మ్రోగింది.

“యస్?”

“కుల్వంత్. కాల్ చేసారు?”

“అవును.. సినిమాలు పూర్తిగా మానేయమంటారా?”

“అదేంటి? నేను అలా అన్నానా?”

“కాదనకోండీ.. మనసు అలజడులను అధిగమించి ప్రశాంతతను కోరుకుంటోంది.”

“మీరున్న రంగంలో అది ఎవరికీ ఉండదు.”

“నిజమా? వదిలేసినా రాదా?”

“రాదు.”

“ఎందుకని?”

“కడుక్కున్నంత మాత్రాన మేకప్‍లు పోవు.”

“నన్ను ఏం చెయ్యమంటారు?”

“సారికను ప్రక్కన పెట్టండి. రజనీశ్‌నూ అవతల పెట్టండి.”

“ఒకసారి రజనీశ్‍తో మాట్లాడమంటారా?”

“వద్దు.”

“ఎందుకని?”

“ఆయన మాటలలో మీకు ఏమీ దొరకదు. రకరకాల ఇతిహాసాలు, పురాణాలు చెప్పేస్తాడు. నవ్విస్తాడు, కవ్విస్తాడు.. ఇలా ఎన్నో జరుగుతాయి. సలహాలు కూడా చెబుతాడు. అంతకు మించి మీకు ఏమీ అర్థం కాదు.”

“సారిక గురించి మీకు బాగానే తెలుసు అనుకుంటాను.”

“పరవాలేదు. మాకు మీకు కావలసిన సమాచారం ఇవ్వగలను.”

“ఆమె తండ్రి నన్ను కలవటానికి వచ్చాడు.”

“తెలుసు.”

బాధ వేసింది. ఈ ఇండస్ట్రీలో ఎవరి గురించే సమాచారాలు దగ్గర పెట్టుకోకుండా వెర్రివాడిలా బ్రతికేస్తున్నది నేనొక్కడినే అని అర్థమయింది. అది నేను వేసిన పొరపాటే కావచ్చు. జో చాలా సార్లు చెప్పాడు – అందరి గురించీ కొంతైనా తెలుసుకుని ఉండాలి అని. కొందరి గురించి ఎంత తెలిసినా మాట్లాడకూడదన్నాడు. మన గురించి అందరికీ పూర్తిగా తెలిసిపోయే ఇండస్ట్రీ అది. మనం నిజాలు చెప్పినా ఎవరూ నమ్మని రోజులను స్వాగతిస్తూ అందులోకి పెట్టాలి..

“ఎలా?”

“నా కారు డ్రైవర్‌కే తెలిసినప్పుడు నాకు తెలియటంలో విషయం లేదు.”

“మిమ్మల్ని ఒక మిత్రుడిగా భావిస్తున్నాను.”

“మీ దగ్గరికి బలవంతంగా వచ్చి, కొన్ని విషయాలు చెప్పింది కూడా మీ మంచి కోరే మిత్రునిగా వేసిన పని. కాకపోతే నాకు అవసరం ఏముంది?”

అది నిజమేనినిపించింది. భవిష్యత్తులో ఏదైనా జరగకూడని సంఘటన జరిగినా ఆయనకే ఇబ్బంది అని తెలిసి కూడా ఆ పని చేశాడు.

“నిజమే. సారికను వివాహం చేసుకోమని అడిగాడు.”

“ఓకే.”

“ఓకే అంటే?”

ఆయన నవ్వాడు.

“మంచివారే. నాకు ఓకే అని కాదు. నేను మీతో చెప్పినవి మరొకరి ద్వారా రూఢీ అవుతున్నాయిని అర్థం. నిర్ణయం మీది.”

“పెళ్లి చేసుకుంటే ఏంటి? చేసుకోకపోతే ఏంటి?”

“ఒక నటుడికి ఏదైనా ప్రమాదమే.”

“అందుకే గోవా వెళ్లిపోవాలనుకుంటున్నాను.”

“ఈ సమస్య మిమ్మల్ని వదలదు. అదలా ఉంచండి. సారికను చేసుకోవాలనుకుంటున్నారా? ఇష్టపడ్డారా? తరువాత ఏంటి? ఇవన్నీ మీరు ఆలోచించుకోవాల్సి ఉంటుంది.”

“ఒకవేళ నేను వద్దంటే ఏంటి పరిస్థితి?”

“అర్థం కాలేదు.”

“ఆ అమ్మాయిది ఓ చిత్రమైన వ్యక్తిత్వం.”

“ఏం చేస్తుంది? చంపేస్తుందా?”

“అదే అడుగుతున్నాను.”

“ఆ అమ్మాయిని అంత దగ్గరగా ఎందుకు రానిచ్చారు?”

తల మీద పిడుగు పడ్డట్లయింది.

“మీరు నాకు పరిచయం కాలేదు కదా?”

“ఇది మరీ బాగుంది. ఇంతకీ నాకు దేనికి ఫోన్ చేసారు?”

ఈ సంవాదం ఇక్కడితో చాలు అని చెప్పేందుకు చాలా మంది ఉపయోగంచే పద్ధతి ఇది. ఒక్కోసారి కొందరు – చివరగా అంటారు.

“సారికకు తమ్ముడు ఉండేవాడా?”

“అవును. చిన్నతనంలోనే చనిపోయాడు.”

కొద్ది సేపు ఏమీ వినిపించలేదు.

“సార్.”

“ఆఁ..”

“లైన్‌లో ఉన్నారా?”

“ఉన్నాను. చెప్పండి”

“ఎలా చనిపోయాడు?”

“నేను విన్నదే చెబుతాను. వాస్తవం నాకు తెలీదు.”

“మరేం పరవాలేదు. చెప్పండి. అదే ఆశిస్తున్నాను.”

“సారిక ఇంట్లో ఒక రెబెల్.”

“ఝాన్సీ.”

“అవును. వీళ్ల అసలు ప్రాంతం కర్నాటక లోని కూర్గ్ లోని మడికేరి. వీళ్ల నాన్నకు కాఫీ ప్లాంటేషన్స్ ఉన్నాయి. ఐశ్వర్యవంతుడు. ఆ తరువాత ఇతర వ్యాపారాలకు విస్తరించాడు.”

“ఈమె రిబెల్ అన్నారు.”

“అవును. అయ్యా.. సినిమాలలో నటిస్తున్నారు. ఒక నేపథ్యాన్ని స్థిరపరచిన తరువాత కదా, ఒక విషయాన్ని ముందరికి తేవలసింది?”

“తప్పకుండా. మీరు చెబుతుంటే సినిమా చూసినట్లే ఉంది.”

“నా చేతిలో మీరు పుచ్చుకోనిది ఉంది. అది కూడా కారణం. మీ చేతిలో ఏముంది?”

“హా.. నిద్ర పట్టకపోతే వాడుకునేది..”

“నిద్ర మాత్రా?”

“కాదు. ఓ నవల.”

“ఓ. వెరీ గుడ్. చాలా పుస్తకాలు చదువుతారా?”

“చాలా కాదు. కానీ బాగానే చదువుతాను.”

“కొన్ని ప్రక్కన పెట్టి, వ్రాయబడని పుస్తకాలని, కొద్దిగా జీవితాన్ని కూడా చదివితే జీవితం సాగిపోయే బాట సుగమం కాగలదు.”

చేతిలోని నవలని చూసాను. పుస్తకాలలో నిజాలుంటాయా? జరిగిన కథలలో జీవిత సత్యాలు దాగి ఉండవా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు?

“నిజమే..” అన్నాను. “..అనుభవాలను పొందుపరచిన పుస్తకాలను చదవటంలో తప్పు లేదని నేను భావిస్తాను.”

“సారీ. మిమ్మల్ని తప్పు పట్టటం లేదు. మీ అలవాట్లు మీవి. ఇంతకీ విషయానికి వద్దాం.”

“ప్లీజ్.”

నవ్వాడు.

“తప్పకుండా. అమ్మయిని ముద్దుగా పెంచాడు. గారాబం చేసాడు. తొమ్మిది ఏండ్ల తరువాత మగ శిశువుకు జన్మనిచ్చి భార్య చనిపోయింది.”

“ఓ.”

“అవును. ఆవిడే ఉండి ఉంటే ఎలా ఉండేదో?”

“ఈయన మరో పెళ్ళి, మరో అమ్మాయి..”

“అవేవీ లేవు. ఎన్నో దానధర్మాలు చేసాడు, చేయించాడు. సారిక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నర్తకీమణి కావాలని ఆశపడ్డాడు. వాస్తవానికి సారిక చాలా గొప్ప నర్తకీమణి.”

“అవును. చూసాను.”

“అంతే కాదు, మన నేల మీద మెరిసే ప్రతి కళలోనూ ప్రవేశం ఉంది.”

“ఓ.”

“సంస్కృతి అనే పేరుతో పదహారు దేశాలలో మన దేశపు కల్చరల్ సెంటర్లు స్థాపించి వాటికి సారికని డైరెక్టర్‌ని చేసాడు. ఈమె ఆ పని చెయ్యనన్నది.”

“కారణం?”

“తెర మీద కనిపిస్తేనే ఈ తరానికి ఎవరైనా తరించినట్లు కదా అని వాదించింది. అది తరించటం కాదు, కీర్తి కాంక్ష అని ఆయన వాదించాడు.”

“పోనీ వదిలెయ్యవచ్చు కదా?”

“సినీరంగం కాకుండా ఏదైనా కోరుకోమన్నాడు. ఆయనకు ఎందుకో ఆ అభిప్రాయం.”

ఆలోచన సరైనదా కాదా అని యోచించను. ఈ దేశంలోని దురవస్థ ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. వేదాల గురించి మాట్లాడాలన్నా, తెర మీద అశ్లీలంగా కనిపించినా ఇవతలకి వచ్చి వాటి గురించి మాట్లాడితే అందరూ చప్పట్లు కొట్టే హీనమైన ‘సనాతన’ సమాజం ఇది!

“ఆయన గొప్పవాడు.”

“నిజమే. కానీ కూతురిని దూరం చేసుకున్నాడు. ఇంట్లోంచి వెళ్లిపోయింది. ముంబయిలో కొన్ని రోజులు ఇబ్బందిపడి చివరకి చలనచిత్రాలలో విశేషంగా రాణించింది. తరువాత కథ యావత్తూ చరిత్రగా మారిపోయింది. ఏమైందో తెలిదు, ముంబయి వచ్చిన కొత్తల్లో ఆమె తమ్ముడు అడ్రస్సు సంపాదించి ఇల్లు వదలి పారిపోయి ఇక్కడకి వచ్చేసాడు.”

“ఓ. ఆమె ఇంటికి చేరాడా?”

“చేరాడు. ఆమె కారులో బయటకి వచ్చి వాడిని చూసి కారు ఆపింది. కారు దిగేసరికి.. దీదీ అంటూ అరిచి, చూసుకోకుండా రోడ్డు మీదకి వచ్చి ఓ బండి క్రింద పడిపోయాడు.”

“మై గాడ్.”

“చూసారా? వింటుంటూనే అలా ఉంది. కళ్ళ ముందు జరిగిన ఆ దృశ్యం ఇప్పటికీ ఆమె కనుల నుండి ఎక్కడికీ జరగలేదు. ఇది ఆ విషాద గాథ.”

‘నాకు కనిపించినది ఇంత నిజమా?’ అనుకున్నాను. కుల్వంత్ గారు గుడ్ నైట్ చెప్పేసారు. కుడి చేతిలోని ఆ నవలని బెడ్ మీద పడేసాను. దాని టైటిల్ కూడా ఆలోచింప చేసింది. ‘జరగనిది’ (కదలనిది) ఆ టైటిల్!

నాకూ ఎందుకో కొద్దిసేపు కదలాలని అనిపించ లేదు! ఫోన్ మ్రోగుతోంది. సారిక కాల్ అది..

(ఇంకా ఉంది)

Exit mobile version