Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పూచే పూల లోన-80

[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[ఓ రోజు జో ఫోన్ చేస్తాడు. అడక్కూడదు, కానీ అడుగుతున్నాను అని అంటాడు. నీ అడుగులు జాగ్రత్తగా పడుతున్నాయా అని సమీర్‍ని అడుగుతాడు. రజనీశ్ గురించి, సారిక గురించి అడుగుతాడు. సారికతో ఉన్న బంధం గురించి అడుగుతాడు. తనదీ సారికదీ కేవలం స్నేహమేననీ, రజనీశ్‍కి తనకీ ఏ గొడవలూ లేవని చెప్తాడు సమీర్. తప్పుగా అనుకోవద్దనీ, అన్ని వేళలు ఒకలా ఉండవని హెచ్చరిస్తాడు జో. ఇంతకీ సారిక, రజనీశ్, నా గురించి ఈ సందర్భం ఈ రోజే ఎందుకు ముందుకు వచ్చిందని అడుగుతాడు సమీర్. సారిక తండ్రి మలేసియాలో పెద్ద వ్యాపారస్థుడనీ, ఆయన సమీర్‍ని కలవడానికి ముంబయి వస్తున్నాడని చెప్తాడు జో. ఎందుకని అడిగితే, సారిక సంగతి అంటాడు జో. మేము అలాంటిదేమీ అనుకోలేదని అంటాడు సమీర్. జో నవ్వేసి, జాగ్రత్తగా ఉండమని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. సారిక, సమీర్‍ల మధ్య – చక్కని డైలాగులు ఉన్న ఓ అద్భుతమైన సన్నివేశాన్ని చిత్రీకరించి, కట్ చెప్తాడు రజనీశ్. – ఇక చదవండి.]

దృశ్యం చలన చిత్ర చరిత్ర లోని పుటలలోకి ఎక్కేసింది. కాలేజీలో స్త్రీ స్వాతంత్ర్యం, పురుషుని రక్షణ అక్కరలేదు వంటి వాదనలతో హీరోకి విరుద్ధంగా చేష్టలు చేసిన ఓ అమ్మాయిని ఆ విధంగా వివాహం నిర్ణయమైన వారం రోజులలో ఆ అపార్ట్‌మెంట్‌లో నిలదీస్తాడు హీరో. బాక్‌డ్రాప్‌లో ఎన్నో చర్చలు అమ్మాయి గొంతులో వినిపిస్తాయి. వాటన్నింటినీ అధిగమించి ప్రస్తుతానికి ఈ సందర్భంలోంచి బయటపడితే చాలు అని నిర్ణయించుకుని క్షమించమని అడుగుతుంది అమ్మాయి. అక్కడ నటించిన ఇద్దరికీ చాలా పేరు వచ్చింది.

ఎండాకాలం రోజులవి. సారిక ప్రతి ఏటా నైనీ తాల్ వెళ్ళిపోతుంది. నన్ను రమ్మన్నా నాకు షూటింగ్ షెడ్యూల్స్ వలన ఇబ్బంది కలిగి వెళ్లలేక పోయాను. నిజమో, అబద్ధమో తెలియదు, ఎందుకో సారిక ఓ రెండు నెలలు కలవదు అని అనుకున్నప్పుడల్లా బాధ గానే ఉంది. ఒంటరిని కాను అని జో వలన ఎన్నో సార్లు అనుకున్నాను. కానీ ఒకరి వలన ఒంటరితనం మాయమవుతుందా? ఏమో! ‘ముసిరే చీకట్లు’ అనే ఒక కొంకణి కథలో రోజూ చీకటి పడే వేళకి ఒక వ్యక్తికి వింత ఆలోచనలు వస్తూ ఉంటాయి. కథలో ఎన్నో జరుగుతాయి, కానీ చివరికి కంటిచూపు పూర్తిగా సన్నగిల్లినప్పుడు ఆలోచనలు మూగగానే అతను చీకటి పడుతోంది అనుకుంటాడు. చివరి దశలో తెలుసుకుంటాడు – చీకటి వలన ఆలోచనలు ముసరసరటం లేదని! ఆలోచనలు తనలో గుమిగూడినప్పుడు సరైన ఆలోచన ఏదీ మెరవలేదు కాబట్టి చీకటి కమ్ముకుందని!

కాలింగ్ బెల్ మ్రోగింది. నేనుండే ఇంట్లో నలుగురు పనివాళ్ళు ఉంటారు. కాలింగ్ బెల్ కొట్టేదాకా ఎవరినీ రానీయరు. గేటు ముందున్న లాన్ లోనే అపాయింట్‌మెంట్లన్నీ అయిపోతాయి. ఇంతగా ఎవరు దూసుకొని వచ్చారా అనుకున్నాను. తలుపుకున్న పరికరం నుంచి చూసాను. బెర్ముడా షార్ట్స్‌లో ఒకతనున్నాడు. నల్ల కళ్లద్దాలు ధరించాడు. ప్రక్కన పని కుర్రాడున్నాడు. ఎంతో సేపు వారించి, తప్పదనుకున్నప్పుడే అతను తలుపు దాకా రానిస్తాడు. ఆ నమ్మకం నాకున్నది.

తలుపు తెరిచాను. ముందు కుర్రాడు లోపలి చ్చాడు.

ఆయన్ని అక్కడే ఉండమని సైగ చేసాడు. నన్ను కొద్దిగా లోపలికి రమ్మన్నాడు.

“మీకు చాలా ముఖ్యమైన సమాచారం ఇవ్వాలని బలవంతం చేసాడు.”

“ఈయన పేరు?”

“కుల్వంత్.”

“ఊ. సరే. నువ్వెళ్ళు. నేను చూసుకుంటాను.”

అతను వెళ్ళిపోయాడు. ఆయన లోపలికి వచ్చి నమస్కారం చేసుకొన్నాడు.

“కూర్చోండి”, అన్నాను.

నిలబడే చుట్టూతా చూసాడు.

“అయామ్ కుల్వంత్”, అంటూ కూర్చున్నాడు.

ఎదురుగా కూర్చున్నాను.

“ఏం చేస్తూ ఉంటారు?”

మర్యాదస్థుడిలా ఉన్నాడు. జాగ్రత్తగా పర్సులోంచి ఓ కార్డు చేసి ఇచ్చాడు.

‘కుల్వంత్ సింగ్, అర్కిటెక్ట్ అండ్ ఇంటీరియర్ డిజైనర్’ అని వివరాలున్నాయి,

నవ్వాడతను. నాకు నవ్వొచ్చింది. ఈయన నాకు ఒక ముఖ్యమైన సమాచారం ఇస్తాడా?

“నాకు ఇవేమీ అవసరం లేదు”, అన్నాను.

నిజమే అన్నట్లు తల ఊపాడు.

“నా వృత్తికి నేనొచ్చిన పనికి సంబంధం లేదు” అన్నాడు.

“ఏం పని మీద వచ్చారు?”

“మీరు సినీ ఇండస్త్రీలోకి ఎలా వచ్చారో గుర్తుందా?”

“అవును. గుర్తుంది”, చెప్పాను.

“జరుగుతున్న ఒక ప్రాజెక్టు లోంచి అప్పటికే చాలా మటుకు షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఒక హీరోని తీసేసి, మిమ్మల్ని పెట్టుకున్నారు.”

“అవును.”

“ఆ హీరో నాకు తమ్ముడవుతాడు.”

“ఓ. అతనికి సినిమాలు బాగానే ఉన్నాయి కదా?”

“నో. నో. అది కాదు సమస్య. సమస్య సారికతో ఉన్నది.”

“సారిక తోనా? ఏంటది?”

“నా తమ్ముడిని ఎందుకు తీసేసారో మీకు తెలుసు కదా?”

“రకరకాల కారణాలు చెప్పారు. అయినా ఇప్పుడవన్నీ ఎందుకు?”

“ఇప్పుడే కావాలి. సారికకు దగ్గరయిన వారెవరూ రజనీశ్‍కు నచ్చరు.”

“నేను ఆయనతో ఇంకా సినిమాలు చేస్తూనే ఉన్నానే?”

ఆయన తల ఆడించాడు.

“నో. రజనీశ్ మామూలు మనిషైతే మీకు అర్థమవుతాడు. అతను వింత సైకో.”

ఆలోచించాను.

“ఇంతకీ ఏం చేస్తాడు?”

“బాగా దగ్గరకి రానిస్తాడు. మిమ్మల్ని పెళ్ళి కూడా చేసుకోమంటాడు. కావలిస్తే ముహూర్తం కూడా పెట్టించి ఏర్పాట్లన్నీ చేస్తాడు. అంతా అయ్యాకా, తరువాత..”

“తరువాత?”

అతను ఏమీ మాట్లాడలేదు.

“కానీ నా తమ్ముడితో అలా చెయ్యలేదు.”

“ఏం చేశాడు?”

“ఇద్దరిలో ఒకరు పైకెళ్ళిపోకుండా ఉండాలంటే సారికకు దూరమవమని చెప్పాడు. వాడు ఆమె వద్ద నుండీ, సినిమా నుండీ తప్పుకున్నాడు.”

“నాకు అలాంటివేమి చెప్పలేదు.”

“చేసి చూపిస్తాడు.”

“సారికను ఇష్టపడ్డాడా?”

“అలాంటివి సినీ ఇండస్ట్రీలో నడవవు.”

“అంటే?”

“ఇదంతా టైం పాస్.”

“సారిక ఇష్టపడిందా?”

“అదీ టైం పాసే.”

“మీరు అర్థమయ్యేటట్లు మాట్లాడితే బాగుంటుంది.”

“సాలెపురుగు ఏం చేస్తుంది? తన గూటిలోకి ప్రవేశించిన ఈగని కొద్ది సేపు అలా వదిలేస్తుంది. అది బయటకు వెళ్లాలని గిలగిలా తన్నుకుని మరి కాస్త ఇరుక్కుంటుంది. అప్పుడు దగ్గర కొచ్చి పని పూర్తి చేసుకుంటుంది.”

“మీరు చెప్పే మాటలు ఆసక్తికరంగా ఉన్నాయి. కానీ నేనెందుకు నమ్మాలి?”

“మీరు నమ్మాలని నేను బలవంతం చెయ్యలేను. సారిక గిలగిలా తన్నుకుంటోంది, బయట పడటానికి. మిమ్మల్ని ఆసరాగా తీసుకుంది.”

ఆలోచించాను. ఏదో తిరకాసు ఖచ్చితంగా ఉంది.

“నిజమే అనుకుందాం. నన్నేం చెయ్యమంటారు?”

“సూటిగా చెబుతున్నాను. సారికతో పని వెయ్యటం మానెయ్యండి.”

“రజనీశ్‌నూ వదిలేయవచ్చు కదా?”

“అలా చెయ్యకూడదు. మీ ఉనికిని మీరు కాపాడుకోవాలి.”

“చాలా చక్కగా చెప్పారు. ఒక్క ప్రశ్న..”

అతను లేచాడు.

“ఈ మాట ఇప్పుడే, ఇక్కడే ఇలా మీరు నాకు చెప్పేందుకు గల ప్రధాన కారణం, ఏదైనా సంఘటన ఉంటే కనుక తెలుసుకోవచ్చా?”

అతను లాన్ వైపు నడిచాదు. వెనకాలే వెళ్ళాను.

“మంచి ప్రశ్న” అంటూ అటూ ఇటూ చూశాడు.

అక్కడ ఎవరూ లేరు.

“మీరు సినిమాల్లోనే నటిస్తారు కదా?”

“అవును. నిజ జీవితంలో నటించటం నా వల్ల కాదు.”

“అదలా ఉంచండి. సంగీతం, నృత్యం, పెయింటింగ్.. ఇలా ఏ కళ తీసుకున్నా దైనందిన జీవితానికి కొద్దిగా దూరంగా నిలబడి ఆస్వాదించమంటాయి. కానీ సినిమా అలా కాదు. ఇక్కడ జరిగేది అక్కడ, అక్కడ కనిపించేది ఇక్కడ కనిపించాలని అనుకున్నత్లు కలిసిపోయి సాగుతూ ఉంటుంది.”

మనిషికి ఆలోచనా శక్తి బాగానే ఉన్నట్లుంది.

“అవును. అందులో సందేహం లేదు.”

“అలా పూర్తిగా కలిపేసి వ్యూహాలు పన్నేసే వారూ, మరో కథో లేక ఇంకేదో సినిమాలో తీసేసేవారూంటారు.”

“ఉంటారు. రజనీశ్ అలాంటివాడు కాదు.”

ఆపాడు.

“కాడు. ఖచ్చితంగా కాడు. కానీ ఎంత పిచ్చివాడంటే ఒక అద్భుతమైన వ్యూహం సినిమాలో పని చేసి అందరినీ మెప్పించినట్లు నిజ జీవితంలో కూడా అలా జరిగిపోవాలని ఆశించి పిచ్చి పిచ్చి తెలివితేటలను ఉపయోగిస్తాడు. చెల్లాచెదురు చేస్తాడు. అలా కనిపించడు.”

“మీకు ఇవన్నీ మీ తమ్ముడు చెప్పాడా?”

“కొన్ని చెప్పాడు. కొన్ని వాడి కోసం నేను కష్టపడి తెలుసుకున్నాను. అందుకే ముందు జాగ్రత్తగా ఆ సినిమాని నుండి నేనే వాడిని తప్పించాను. అందరూ మరో విధంగా అనుకున్నారు.”

గేటు దాకా వచ్చాం.

“నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు”, అన్నాను.

“అవును. చెప్పకుండా వెళ్లను. రజనీశ్‌కి తన మేధస్సు మీద విపరీతమైన నమ్మకం.”

“అది తెలుస్తునే ఉంటుంది.”

“మొన్ననే మైసూరు గుర్రపు పందేలలో నా మిత్రుడూ, అతనూ కలుసుకున్నారు. ఇద్దరికీ ఆ పిచ్చి ఉంది.”

“ఓ.”

“వివరీతంగా ఆడి సంపాదించి ‘సదర్న్ స్టార్’, మైసూరులో జల్సా చేసుకున్నారు. ఇండస్ట్రీ.. అంటే సినీ ఇండస్ట్రీ నీ చేతిలో ఉంది కదా రజనీశ్, ఏంటి నీ తదుపరి ప్లాన్? – అన్నాడు నా మిత్రుడు.”

“ఇంటరెస్టింగ్. ఆ ఒక్కటి చెప్పండి. నిజంగా రజనీశ్ ఈ సినీ ఇండస్ట్రీని శాసిస్తున్నాడా?”

“సందేహం లేదు. అతని తల అందుకే ఇక్కడుండదు. గొప్ప జాతకుడు.”

“ఇంతకీ ఏమైంది?”

“టేబిల్ మీద బాటిల్స్ పెట్టిన వాడిని రూపాయి కాయిన్ అడిగాడట. అతను నవ్వుతూ ఇచ్చాడు. నా మిత్రుడిని చూసి ‘హెడ్స్ సమీర్, టెయిల్స్ సారిక’ అన్నాడట. పైకి ఎగరేసి అంత ఎత్తులోనూ ఎడమ చేతిలోకి పట్టుకుని కుడివేలితో కప్పి ‘ఏంటి?’ అన్నట్లు కళ్ళెగరేసాడు. మా వాడు భయంగా చూసాడు, కానీ ఏమీ మాట్లాడలేదు. చెయ్యి తీసేసి కాయిన్ అతనికి ఇచ్చేసాడు. ఎగిరెగిరి పడటం జీవితం కాదు.. టాస్, పైకి ఎగరెయ్యి.. నీ ఎత్తుగడని ఎగరెయ్యి.. తిరిగి నీ ఒడిలోనే పడనీ! జీవితం గెలిచే గుర్రం కాదు! గెలువ లేని గుర్రాలని గుర్తించి వాటి మధ్యలో నిలబెట్టిన డార్క్ హార్స్‌ని గమనించటం!”

(ఇంకా ఉంది)

Exit mobile version