Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పూచే పూల లోన-100

[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[సమీర్‍, సుందర్‍ల మధ్య సంభాషణ జరుగుతూంటుంది. స్టెల్లా హోటల్‌కి వెళ్లలేదు అంటూనే ఆమె హంతకురాలని ఎలా అన్నరని అడుగుతాడు సుందర్. బదులుగా సమీర్ లోపల్నించి పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ కాగితాలు తెచ్చి సుందర్‍ని చదవమంటాడు. అన్నీ అక్కర్లేదని, చివరి పేరాలో, ప్రధాన కారణం ఉంటుంది, అది చదవంటాడు. మెడని ఎవరో నొక్కిపెట్టి, ఊపిరి ఆడకుండా చేసినట్లు ఉంటుంది రిపోర్టులో. మెడ మీద అక్కడక్కడా గోళ్ళతో గాట్లు ఉన్నాయనీ, అవి ఆడవాళ్ల గోళ్ళని అనుమానం వ్యక్తం చేసిందా నివేదిక. స్టెల్లా సంగతి అర్థం కావటం లేదని చెప్పి, తాను గోవా నుంచి వచ్చేసాకా అసలేం జరిగిందో చెప్పమని అడుగుతాడు సుందర్. వివరాలు చెప్తాడు. జో జైల్లోంచి విడుదలై, జ్యోతి సహకారంలో నేరస్థులని కనిపెట్టడానికి చేసిన ప్రయత్నాలను చెప్తాడు. స్టెల్లాను కలవడానికి జ్యోతిని తీసుకువెళ్తే, ఆమె కలవాడానికి నిరాకరించటం, తమ గదికి వచ్చాకా జ్యోతి ఒక పెయింటింగ్ గీసి, దాన్ని వివరించిందనీ, దాంతో జో కి క్లూ దొరికిందనీ సమీర్ చెప్తాడు. – ఇక చదవండి.]

ద్దరం హాల్లోకి వచ్చాం.

ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. నటిస్తాడో నటించడో కూడా నాకు తెలియదు. కానీ ఈ ఉదంతం యావత్తూ అటు రజనీశ్‍, ఇటు నేను మర్చిపోలేము. సమీర్ తెర మీద పునర్జన్మ ఎత్తుతాడా లేదా అన్నది పక్కనపెడితే, అసలు ఈ హత్య ఏంటి? ఎవరు చేశారు అన్నది తెలుసుకునే బయటకు వెళ్ళాలని అనుకున్నాను.

సమీర్‍లో మామూలుగానే ఎన్నడూ ఆందోళన, ఆవేదన వంటివి చూడలేదు. దృఢ నిశ్చయం, న్యాయాన్యాయాల పట్ల స్థిరమైన ఆలోచనలు కలవారికి, ఒడుదుడుకుల వలన కించిత్ చింత వంటిది తగులుకుని ఇవతలికి వస్తుంది కానీ అందులోనే మునిగిపోయి ఎక్కడికో జారిపోయి.. కాకపోతే మరి విడుదలయ్యాడు కాబట్టి ఉత్సాహం రెండింతలుగా ఉంది.

నన్ను సోఫాలో కూర్చోమని సైగ చేసాడు. ఒక బ్యాగ్ లోంచి ఒక కాగితం తీసి ఇచ్చాడు.

“ఇది కేవలం కాపీ..” చెప్పాడు, “..సారిక బెడ్ మీద హోటల్ వాళ్ళు అక్కడ ఉంచిన నోట్ ప్యాడ్ మీద వ్రాసి పడేసింది.”

జాగ్రత్తగా చదివాను.

‘సమీర్, నువ్వు యస్ అని మృదువుగా అనక్కరలేదు. నీ గురించి ఆలోచిస్తే చాలు, ఒక మరుభూమిలో, మరమనుషులతో యాంత్రికంగా ప్రయాణం చేస్తున్నవారికి అప్పుడే ఆత్మీయతతో కూడిన ఒక చల్లని సెలయేరు ప్రత్యక్షమైనట్లుంది.

నువ్వు రావు. రానక్కరలేదు. ఈమెనెందుకు పంపావు?

నా బుర్ర బద్దలవుతోంది.

నీ చేతులతోనే నా గొంతు నొక్కినొక్కి చంపుతోంది.

ఫరవాలేదు. ఇవి నీ చేతులే. గిలగిలా గింజుకున్నా.

ఫరవాలేదు. నేను తట్టుకోలేను. లేదు. తట్టుకుంటాను.

ఈ కొద్ది సేపట్లోనే అర్థమైంది. ఇదంత కష్టం కాదు..’

ఆ తరువాత చాలా గ్యాప్ ఉంది.

‘ఊ.. మరల పట్టుకో సమీర్.. యస్!’

“ఇది విచిత్రంగా ఉంది..”, అన్నాను. “..ఇలా మామూలు దస్తూరితో వ్రాయగల్గినవాళ్ళు చావుబ్రతుకుల మధ్యలో గింజుకున్నారా?”

“అదే నిజంగా పోలీసులక్కూడా అర్థం కాలేదు.”

“ఇక్కడ ఇంకో విషయం ఉంది.”

“ఏంటది?”

“నువ్వు రావు అని స్పష్టంగా వ్రాసింది.”

“కరెక్ట్.”

“అంటే అక్కడ లేనట్టే కదా?”

“నిజమే. ఈమెను పంపావు అని వ్రాసింది. నా పేరు చెబుతోంది. సారిక తండ్రి గొడవ చెయ్యకపోయినా నన్ను అనుమానించాల్సిందే కదా?”

“అవును. ఈమె అనే ఆవిడ ఎప్పుడు వెళ్ళింది, ఎలా వెళ్ళింది? స్టెల్లా అని ఎలా నిర్ధారించటమైంది?”

“ఆ పేపరు వెనుక కూడా ఏదో ఉంది, చూడండి.”

కాగితం తిప్పాను. నిజానికి అది ముందు వ్రాసినట్లుంది. జిరాక్స్‌లో వెనుక వైపు తీసారు.

‘ఈ ప్రేమ అనే మేకప్ తుడిచేసుకుంటున్నాను సమీర్.. పాక్ అప్! ఎంత గొప్ప దృశ్యమైనా వెండి తెర మీద వెలుగు ఆరిపోవాల్సిందే. నువ్వు తెరచాటు హీరోవి. తెర మీదకి వచ్చేసావు. ఎంత చెప్పినా సినిమా కథ సినిమా కథే. ఆలోచనలు శబ్దాలలో, పదాలలో తాండవం చేస్తూ సాగిపోయే కథలు సాహిత్యం లోని అసలు పదార్థాలు, పరమార్థాలు. నేను కొద్ది సేపు నన్ను నేను మరిచిపోయి మసలుకున్నాను. డాన్స్ నేర్చుకున్నాను కదా? ఎగిరి గెంతేసాసు.. తప్పు లేదు. ఈ అనుభూతి ఇగరకనే ఇలా నన్ను ఎగరనీ.. ఇక్కడికి రాకు సమీర్..’

సోఫాలో కూలబడ్డాడు సమీర్.

“ఇదెలా ఉంది?”, అడిగాడు.

“వైపరీత్యాలను ఆహ్వానించి ఆస్వాదించేవారు అనుకోని సుడిగుండాలలోకి వెళ్ళిపోతారు. ఇంతకీ స్టెల్లా..”

విపరీతంగా నవ్వాడు సమీర్.

“స్టెల్లా వదలడం లేదు కదూ? ఇంత దాకా వచ్చాక ఇంకా ఎందుకు? చెబుతాను!” అన్నాడు.

***

సమీర్ ఇంటి నుండి బయలుదేరి మెయిన్ రోడ్డు ఎక్కినప్పటి నుండే మనసు మనసులో లేదు. ఈ జరిగింది విన్నాక, నమ్మాలన్నా, కష్టంగానే ఉంది.

రోడ్డుకు ఎడమవైపు ఏపుగా పెరిగిన చెట్లను చూస్తూ పోతున్నాను. ఎందుకో దృష్టి ఒక విచిత్రమైన చెట్టు మీద పడింది. దీని గురించి కృష్ణప్రసాద్ గారు ఒకసారి చెప్పారు. కారు ఆపి కొద్ది సేపు పచ్చిగాలి కోసం క్రిందకి దిగి ఆ చెట్టును చూస్తూ ఉండిపోయాను. చెట్టుకు పై భాగంలో నిక్కపొడుచుకున్న పూలున్నాయి. కానీ మధ్య భాగంలో ఎవరో ఒక పరికరం తీసుకుని కావాలని పెద్ద డొల్ల చేసినట్లుంది..

‘కానరాని కోయిల’ సినిమా విజయోత్సవం గోవాలో జరుపుకుంటున్న సమయంలో ఎవరో టి. వి. ఛానల్ వాళ్ళు స్టెల్లాని ఇంటర్వ్యూ చేశారు.

“నమస్తే స్టెల్లా జీ.”

“నమస్తే.”

“సినిమా హిట్ అయింది. మీకెలా అనిపిస్తోంది?”

“సమీర్ విజయం మనందరి విజయం. నాకూ హ్యాపీనే.”

“హ.. హ.. సమీర్ గోవాకి రావటం మీకెలా అనిపిస్తోంది?”

“ఆఁ.. ఇక్కడే ఉండిపోతే బావుండనిపిస్తోంది.”

“మరి అతని భవిష్యత్తు?”

“దానికేమయింది? ఎక్కడైనా ఒకటే.”

“అంటే బొంబాయి వదిలి గోవాలో..”

“గోవాకి హీరో వద్దా?”

“ఓ. ఇది ఆలోచించాలి.”

“మనం మన టాలెంట్‌ని ఎందుకు వదిలేసుకుంటాం? మనకు ఒక అస్తిత్వంతో, ఒక ఉన్నతమైన ప్రతిభతో పనిలేదా?”

“కరెక్ట్. మీకూ, సమీర్‍కి ఎలా పరిచయం?”

“మా ఇద్దరికీ చాలా చిన్నప్పుడే.. అంటే సమీర్ కాలేజీలో ఉన్నప్పుడే వాళ్ళ నాన్న – అంటే నాకు అంకుల్ అవుతారు, మా ఎస్టేట్‌లోనే వివాహం నిర్ణయించారు. మా ఇద్దరివీ కేవలం వ్యాపారరంగానికి చెందిన కుటుంబాలు కావు…”

“మరి?”

“మైనింగ్, మాఫియా ఇవన్నీ మామూలే. అలా కాకుండా మాది గొప్ప కళాకరుల సంప్రదాయం..”

“ఓ. మీరు పేరు మోసిన పెయింటర్.”

“అదలా ఉంచండి. ప్రభుత్వం వారు మా పూర్వీకుల చారిత్రాత్మకమైన పెయింటింగ్స్ అన్నీ కస్టడీలో పెట్టుకున్నారు. ఆ భవంతులన్నీ దాదాపుగా మావే. మా ఉనికిని చేతులారా నాశనం చేస్తున్నారు. మా ఫ్యామిలీలో చాలామంది విదేశాలకు వెళ్ళిపోయారు.”

“కరెక్ట్.”

“ఈ నేపథ్యంలో ఈ వివాహ ద్వారా ఆ సంపద తిరిగి ఊపిరి పోసుకుని నిలబడగలదని అందరం ఆశిస్తున్నాం!”

“ఓ. అయితే మీకూ, సమీర్‍కి త్వరలోనే పెళ్ళన్న మాటా.”

“చూద్దాం.”

“మర్ సమీర్‍కీ, నటి సారికకీ వివాహం అని అంతటా మారుమ్రోగుతోంది. సూటిగా అడుగుతున్నానని ఏమీ అనుకోకండి.”

“మీడియాలో ఉన్న మాటే కదా? అనుకోవటానికి ఏముంది? సమీర్ అలాంటి పని చెయ్యడు. నాతో ఎన్నడూ ప్రస్తావించలేదు. ఆ వ్యవహారం తెర మీదకే పరిమితం.”

“సారికను దర్శకుడు రజనీశ్ చేసుకోవాలనుకోవటం గురించి మీరు విన్నారా?”

“విన్నాను.”

“మరి?”

“నేనేం చెయ్యాలి?”

ఇద్దరూ నవ్వారు (ఈ ఇంటర్వ్యూ రికార్డింగ్ – జో ఎంతో కష్టపడి సంపాదించి పోలీసులకిచ్చాడు).

“మీకు సినిమాలలో నటించాలని లేదా?”

“లేదు.”

“ఆ రంగం అంటే ఇష్టం లేదా?”

“సినిమాలు చూస్తాను.”

“సమీర్‌వి?”

“సమీర్‌వి కూడా చూస్తాను.”

“ఎలా అనిపిస్తాయి?”

“సమీర్ చాలా తెలివిగా సినిమాలు ఎంచుకుంటాడు.”

“సారికను కూడా సరదాగా ఎంచుకున్నాడా?”

“సముద్రం చివర క్షితిజం అలా కనిపిస్తుంది, ఎందుకో ఊరిస్తూ మెరుస్తుంది కూడా.. కానీ అది నిజానికి లేనే లేదు. అలలు అలా వస్తాయి, పోతాయి, బ్రతికుంటాయా? చెప్పండి. పోవాలి కూడా.. అలాగే లేచి ఆగిపోతే? ప్రయాణం సాగదు.”

“ఓకే. చాలా ఆర్టిస్టిక్‌గా మాట్లాడుతున్నారు. మీరు చిన్నప్పుడే.. అంటే కాలేజీ అప్పుడే సమీర్‍ని ప్రేమించారా?”

“హహహ.. ఐ యామ్ స్టెల్లా! సమీర్ లాంటి ఉన్నతమైన వ్యక్తిత్వం కోసం మనసు పడ్డ ఓ సన్నని పూలమాలను కాను!..”

హోటల్ రూమ్‍లో టీవీలో ఇంటర్వ్యూ వస్తోంది. సారిక తన చేతులను తన మెడ మీద పెట్టుకుంది..

“కన్నీటిలో కలిసిపోతున్న భూమిని నిలువెత్తున నిలబడి క్రింద కాళ్ళతోనూ, పైన చేతుల తోనూ గట్టిగా పట్టుకుని నిలబడి ఆపుకున్న ఆనకట్టను – ఆశల పుట్టను!”

సారిక బెడ్ మీద గింజుకుంటోంది..

“నీ కోసం నిలుపుకున్న ఈ చిరాస్తిని నీలో కలుపుకోమని చిత్రమైన వెడ్డింగ్ కార్డును పిచ్చిగా అచ్చువేసి మనసులోనే దాచుకుంటూ అంతరంగంలోనే అంతరించిపోతున్న అంత పెద్ద చరిత్రను నేను..

ఒకరిది సినిమా, ఒకరిది చరిత్ర..”

గబగబా కాగితం మీద ఏదో కెలికింది సారిక. మరల చేతులు గొంతు మీదకి వెళ్ళాయి.

“ఒకటి మాయమవ్వాలి, ఒకటి మిగిలిపోవాలి.. అదే న్యాయం.”

జ్యోతి నిద్రలో చెప్పిన మాటలు.. అన్నీ అవే!

దృశ్యాన్ని ఊహించుకుంటూ అలాగే ఉండిపోయాను. ఎవరో పనివాడు అటుగా వచ్చి నన్ను చూసి ఆగిపోయాడు.

“ఏంటి సార్, చెట్టును చూస్తున్నారా?”

“అవును. వింతగా ఉంది అని..”

“దానిని సూయిసైడ్ ట్రీ అంటారు సార్. కొలంబియాలో ఎక్కువగా పెరుగుతుంది. పీ ఫ్యామిలీ. చర్మవ్యాధులకు మందుగా పనికొస్తుందని మా సార్ పెంచుతున్నారు. జీవితంలో ఒక్కసారే పూలు పూస్తాయి. ఆ పైనున్నవి అవే సార్. అవి రాగానే ఇదిగో – ఇలా తొర్రల్లా ఏర్పడి త్వరలోనే చనిపోతుంది. దీని గింజలు దీనిలోనే పుడతాయండి. వాటికి వెలుతురు కోసం ఇలా చెట్టు మొత్తం తొర్రలు పడిపోతాయి. వాటిని ఎదిగే వరకూ, పెరిగే వరకూ చూసి, చెట్టు పడిపోతుంది సారూ!”

నిట్టూర్చాను.

“ఇది చనిపోకపోతే అవి ఎదగవా?”

“ఎదగవండి మరి.”

మెల్లగా వెనక్కి తిరిగాను. అతను మరల తగులుకున్నాడు.

“మరొకటుందండి”, అన్నాడు.

“ఏంటది?”

“ఈ గింజలు ఇళ్ళల్లో పెట్టుకోకూడదండి.”

“ఎందుకు?”

“ఇవి దగ్గరుంటే ఎవరికైనా ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది. అందుకే, చూడండి.. అంత దూరం దానికి ఫెన్సింగ్ కట్టారు.”

కారులో కూర్చుని మరోసారి ఆ చెట్టును చూసాను. అందమైన పూల వెనుక, మరింత అందమైన మకరందం వెనుక ఎంత కనిపించని చీకటో అనిపించింది, పనికొచ్చే మందులో పనికిరాని విషమెంతో..

ఈ పూచే పూల లోన, విరివిగా విరబూసే విరులలో, కనిపించకుండా, వినిపించకుండా, కని, పెంచేసుకునే విషయాలెన్నో!

(సమాప్తం)

Exit mobile version