[‘పొయెట్స్ టుగెదర్’ భిన్న కవుల విభిన్న కవిత్వం – అనే సీరిస్లో దేశదేశాల కవుల కవితల అనువాదాన్ని అందిస్తున్నారు హిమజ. అలైస్ వాకర్ రాసిన The Mother Of Trees, Before I Leave The Stage అనే రెండు కవితలకి స్వేచ్ఛానువాదం.]


~
1. చెట్ల తల్లి
~
ఒకవేళ నేను
వీచే గాలికి తల్లిని కాగలిగితే
నీకు కలిగే భయాలన్నింటిని
నీ నుంచి క్షణంలో దూరంగా ఊదిపారేస్తాను
ఒకవేళ నేను
ప్రవహించే నీటికి తల్లిని కాగలిగితే
నిన్ను బెదిరించే దారులన్నింటినీ
నిమిషాల్లో ప్రక్షాళన చేసేస్తాను
ఒకవేళ నేను
ఆ మహావృక్షాలకే తల్లిని కాగలిగితే
అన్ని ప్రమాదాలను దాటి
నువు పై పై ఎత్తులకు ఎదిగేలా
నా పొడవాటి పిల్లలను
నీ పాదాల చుట్టూతా నాటుతాను
కానీ.. అయ్యో..
అతి సాధారణ మానవుల తల్లినైపోతిని
మా చిన్నారులపై జరిగే
అన్యాయాలను అక్రమాలను
అనుమతించినప్పటి నుంచి
మా పసికందులపై జరిగే
భయంకర అపవిత్ర దాడులను
ఎదుర్కోలేని నిస్సహాయులమైన నాటినుంచి
నేను
మాయాశక్తులు అదృశ్యమైన
ఒక అతి మామూలు తల్లిని మాత్రమే
అతి మామూలు మనుషులకు
తల్లిని మాత్రమే..!!
***
2. వేదికను వీడే ముందు..
~
నేనిక ఈ వేదికను వీడిపోయే ముందు
ఒకే ఒక పాటను పాడతాను
నేను నిజంగా పాడాలనుకున్న ఒకే ఒక పాట
ఇది నేను అనే నా పాట
అవును.. ఇది నా పాటే
ఇంకా.. మీరు , మేము
మనం.. మనందరం
నా రుధిరపు ప్రతి చుక్కతోను
నేను మనందరిని ప్రేమిస్తున్నాను
ఇక్కడ అక్కడ అని కాదు
కదిలే మన కణాలలోని
ప్రతి అణువు – నిస్సందేహంగా
మన ఉనికిలో ఎగిరే
నిరాడంబరమైన మన జెండాలే!!
~
మూలం: అలైస్ వాకర్
తెలుగు సేత: హిమజ
Alice walker (1944) అమెరికన్ నవలా రచయిత్రి, కథా రచయిత్రి, కవయిత్రి, సామాజిక ఉద్యమకారిణి. తన సాహితీ ప్రస్థానంలో 17 నవలలు, 12 non-fiction works, చిన్న కథల సంకలనాలు, వ్యాసాలు కవిత్వ సంకలనాలు వెలువరించారు.




‘The Color Purple’ అన్న అలైస్ నవలకు ప్రతిష్ఠాత్మక పులిట్జర్ ప్రైజ్ లభించింది. ఈ బహుమతి అందుకున్న మొట్టమొదటి ఆఫ్రికన్ అమెరికన్ రచయిత్రి అలైస్.

సుతిమెత్తగా కవిత్వం రాసే ‘హిమజ’ కవితా సంకలనం ‘ఆకాశమల్లె’కి కవయిత్రి మొదటి పుస్తకానికి ఇచ్చే సుశీలా నారాయణరెడ్డి పురస్కారం (2006), రెండవ పుస్తకం ‘సంచీలో దీపం’కు ‘రొట్టమాకు రేవు’ అవార్డు (2015) వచ్చాయి.
‘మనభూమి’ మాసపత్రికలో స్త్రీలకు సంబంధించిన సమకాలీన అంశాలతో ‘హిమశకలం’ పేరున సంవత్సర కాలం ఒక శీర్షిక నిర్వహించారు.
ప్రపంచ ప్రఖ్యాత ఆఫ్రో అమెరికన్ కవయిత్రి ‘మాయా ఏంజిలో’ కవిత్వాన్ని అనువదించి 50 వారాలు ‘సంచిక’ పాఠకులకు అందించారు.
ఇప్పుడు ‘పొయెట్స్ టుగెదర్’ శీర్షికన భిన్న కవుల విభిన్న కవిత్వపు అనువాదాలు అందిస్తున్నారు.