[‘పొయెట్స్ టుగెదర్’ భిన్న కవుల విభిన్న కవిత్వం – అనే సీరిస్‌లో దేశదేశాల కవుల కవితల అనువాదాన్ని అందిస్తున్నారు హిమజ. అమెరికన్ కవి లాంగ్స్టన్ హ్యూస్ రాసిన Freedom, Poem, I Too అనే మూడు కవితలనికి స్వేచ్ఛానువాదం.]
~
1. స్వేచ్ఛ
~
స్వేచ్ఛ ఎప్పటికీ దొరకదు
ఇవాళో, ఈ యేడాదో
రాజీమార్గం ద్వారానో,
భయం వల్లనో
స్వేచ్ఛ ఎన్నటికీ రాదు
అవతలి వ్యక్తికి ఉన్నంత స్వేచ్ఛ నాకూ ఉంది
నా రెండు పాదాలు ఈ భూమిపై మోపి
ఈ నేల నా స్వంతం అనుకొనే హక్కు
నాకు ఎప్పుడూ ఉంది
విషయాలు వాటంతట అవే జరగనివ్వండి
ఇంకో రేపటి రోజు ఉన్నది కదా అని
జనాలు చెప్పే మాటలు విని వినీ
విసుగెత్తాను.. అలసిపోయాను
నేను మరణించాక దొరకబోయే స్వతంత్రం నాకక్కరలేదు
రేపటి రొట్టెను కలగంటూ ఇవాళ నేను బతకలేను
స్వేచ్ఛాకాంక్ష అన్నది
గొప్ప అవసరంతో నాటుకున్న బలమైన విత్తనం
నేనిక్కడ బతుకుతున్నప్పుడు
నీకున్నంత స్వేచ్ఛ తప్పకుండా నాకూ కావాలి!
***
2. కవిత
~
నా స్నేహితుడిని ఎంతగానో ప్రేమించాను
అతడు నా నుంచి దూరంగా వెళ్ళిపోయాడు
ఇంకా చెప్పేందుకు అంతగా ఏమీ లేదు
మొదలైనంత మృదువుగా
నా కవిత ముగిసిపోయింది
నా స్నేహితుడిని నేనెంతో ప్రేమించాను!!
***
3. నేను కూడా
~
నేను కూడా అమెరికా గురించి
గీతాలు ఆలపిస్తాను
నేనొక నల్ల సోదరున్ని
కంపెనీవారు, పెద్ద పెద్దవాళ్ళు వచ్చినపుడు
నన్ను వంటింట్లో కూర్చుని తినమని
వాళ్ళు నన్ను లోపలికి పంపిస్తారు
నాకు నవ్వొచ్చి భలే నవ్వుతాను
అయినా బాగా తింటాను
నేను బలంగా పెరుగుతాను కూడా
రేపటిరోజున
కంపెనీ ప్రముఖులు వచ్చినపుడు
నేను భోజనపు బల్ల దగ్గరే కూర్చుంటాను
ఎవరేమంటారో చూస్తాను
‘పోయి వంటింట్లో కూర్చుని తిను పో’
అని చెప్పేందుకు ఎవరూ సాహసించలేరు
అంతేకాకుండా..
నేనెంత అందమైనవాడినో కూడా వాళ్ళు చూస్తారు
సిగ్గుపడతారు కూడా
అవును మరి
నేను కూడా..
నేనూ.. ఒక అమెరికన్‌ని!!
~
మూలం: లాంగ్స్టన్ హ్యూస్
తెలుగు సేత: హిమజ
James Mercer Langston Hughes అమెరికన్ కవి. నవలాకారుడు, నాటక రచయిత, సామాజిక రాజకీయ అసమానతలను ప్రశ్నించే సామాజిక ఉద్యమకారుడు.
సాహిత్య కళారూపంగా పిలువబడే Jazz poetry లో సరికొత్త పద్ధతులను, ఆలోచనలను నింపి పరిపుష్టం చేసిన ఆవిష్కర్తల్లో ముందు వరసలో ఉండేవాడు.
ఆఫ్రో అమెరికన్ సాహిత్య సాంస్కృతిక చరిత్రను అత్యంత ప్రభావితం చేసిన ఉద్యమం Harlem Renaissance.
సాహిత్యం, సంగీతం, నాట్యం, కళ, రంగస్థలం, రాజకీయాలు, fashion ల నడుమ ఉన్న మేధోపరమైన సాంస్కృతిక పరమైన తేడాలను తొలగించడం కోసం కృషి చేసినవాడు. Harlem పునరుజ్జీవనం కొరకు పౌరహక్కులు, సంస్కరణ సంస్థల మధ్య సత్సంబంధాల కోసమే తపించి సాహిత్య కళాత్మక ఉద్యమాల వెన్నంటి నడిచి నడిపించినవాడు.
Hughes ప్రోస్టేట్ క్యాన్సర్‌కి జరిగిన శస్త్రచికిత్స వల్ల తలెత్తిన అనారోగ్య సమస్యల వల్ల తన 65వ యేట న్యూయార్క్‌లో మరణించారు. Harlem లోని సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ బ్లాక్ కల్చర్ భవనంలో Hughes అస్థికలను ఖననం చేసారు.
Harlem లోని Hughes ఇంటిని 1981 లో NewYork landmark గా గుర్తించారు. జాతీయ సందర్శనా స్థలాల జాబితాలో అతని ఇంటిని చేర్చారు.
సుతిమెత్తగా కవిత్వం రాసే ‘హిమజ’ కవితా సంకలనం ‘ఆకాశమల్లె’కి కవయిత్రి మొదటి పుస్తకానికి ఇచ్చే సుశీలా నారాయణరెడ్డి పురస్కారం (2006), రెండవ పుస్తకం ‘సంచీలో దీపం’కు ‘రొట్టమాకు రేవు’ అవార్డు (2015) వచ్చాయి.
‘మనభూమి’ మాసపత్రికలో స్త్రీలకు సంబంధించిన సమకాలీన అంశాలతో ‘హిమశకలం’ పేరున సంవత్సర కాలం ఒక శీర్షిక నిర్వహించారు.
ప్రపంచ ప్రఖ్యాత ఆఫ్రో అమెరికన్ కవయిత్రి ‘మాయా ఏంజిలో’ కవిత్వాన్ని అనువదించి 50 వారాలు ‘సంచిక’ పాఠకులకు అందించారు.
ఇప్పుడు ‘పొయెట్స్ టుగెదర్’ శీర్షికన భిన్న కవుల విభిన్న కవిత్వపు అనువాదాలు అందిస్తున్నారు.