[గిరిజనుల సామెత ఆధారంగా ఈ కథని అందిస్తున్నారు శ్రీ వేలమూరి నాగేశ్వరరావు.]
కామయ్యపేట గ్రామంలో కామమ్మ అనే గిరిజన స్త్రీ ఉండేది. ఆ గ్రామంలో గిరిజనులు పిప్పళ్లు పంట వేస్తారు. ఈ పంట నాలుగు నెలలకు చేతికి వస్తుంది. పిప్పళ్ల వేరులు బాగా ముదిరాక పంట తీస్తారు. వేళ్లను కోసి కడిగి ఎండబెడ్తారు. వాటిని మందుల కంపెనీ యజమానులు కొనుగోలు చేస్తారు. ఈ పిప్పళ్ల బస్తా కనీసం ఐదు వేల రూపాయలకు పైగా ఉంటుంది. ఈ పిప్పళ్లు అమ్మి గిరిజనులు ఆ సొమ్మును ఇతర పంటలు పండించేందుకు బంగారం కొనుక్కునేందుకు ఖర్చు చేస్తుంటారు.
కామమ్మకు పుప్పి పన్ను కారణంగా వాచిపోయి సులు, పోటుతో నిద్రపట్టడంలేదు. ఏదైనా వస్తువు తినలేకపోతోంది. ఈ బాధ నివారణకు పదిమందిని అడిగింది. ఒక్కొక్కరూ ఒక్కో సలహా ఇవ్వడంతో ఆమెకు మతిపోయింది. ఆమెను చూద్దామని మేనల్లుడు రాజన్న వచ్చాడు. ఆమె అతనితో తన బాధ చెప్పుకుని ఏడ్చింది. “నువ్వు పిప్పళ్ల బస్తాలాగున్నావు. నా పుప్పి పన్ను పీకలేవా?” అని అడిగింది. వాడికి ఏం జవాబు చెప్పాలో తోచలేదు. పన్ను పీకడం వాడికి చేతకాదు. ఈ విషయం కామమ్మతో ఎలా చెప్పాలో తెలియక సతమతమవుతున్నాడు.
ఈలోగా గ్రామంలో ఒక నాటు వైద్యుడు ఆమె పరిస్థితి తెలుసుకున్నాడు. ఆమెకు తాను వైద్యం చేస్తానని చెప్పి ఒక సహాయకునితో కలిసి కామమ్మ ఇంటికి వెళ్లాడు. ఆమె బుగ్గమీద చిన్న సూదితో మందు ఎక్కించాడు. తరువాత ఆమె నోరు గట్టిగా సాగదీసి ఒక సాధనంతో పుప్పి పన్ను పీకి ఆమెకు చూపించాడు. రక్తం కారుతున్న నోరును శుభ్రం చేసి దూదికి మందు పూసి పుప్పి పన్ను పీకిన చోట ఉంచాడు. ఆమెకు బాధ తగ్గి ఆ నాటు వైద్యునికి పది రూపాయలు, శేరు కందులు, రెండు శేర్ల బియ్యం ఇచ్చింది. ఆ వైద్యుడు ఆనందంగా ఇంటికెళ్తూ “పిప్పళ్ల బస్తాలా ఉన్న వారంతా పన్ను పీకలేరు కామమ్మా!” అంటూ వెళ్లిపోయాడు. కామమ్మ మేనల్లుడు అత్త బాధ తగ్గించినందుకు సంతోషించాడు. “నన్ను పిప్పళ్ల బస్తాలాగున్నావంటూ వేళాకోళమాడుతావా?” అని అడగ్గా ‘నువ్వు నా మేనల్లుడివి కదా! అందుకు నిన్ను వేళాకోళ మాడే హక్కునాకుంద’ని చెప్పి అతన్ని శాంతపరిచింది.
గ్రామంలోని గిరిజనులు పిప్పళ్ల బస్తాలా ఉన్న వారెవరూ పిప్పిపన్ను పీకలేరని తెలుసుకుని ఆమె మాటలను సామెతగా చెప్పుకోసాగారు.