[తెలుగు సాహిత్యం పట్ల కొన్ని తరాలలో ఆసక్తి రగిలించి, ఆధునిక తరానికి వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్తూ, యువతకు ఉత్తమ సాహిత్యం ద్వారాఉత్తమ వ్యక్తిత్వాన్నివ్వాలని నిరంతరం తపించే యువభారతి సంస్థ స్థాపించి వచ్చే దసరాకు 60 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు సాహిత్యానికి, సమాజానికి యువభారతి చేసిన సేవను తెలుగు పాఠకులకు పరిచయం చేసే ఉద్దేశంతో ప్రతి ఆదివారం సంచికలో యువభారతి ప్రచురించిన పుస్తకాల పరిచయం వుంటుంది. ఈ శీర్షిక వచ్చే విజయదశమి వరకూ సాగుతుంది.]
పింగళి సూరన కవితా వైభవం
సూరన్న కలభాషిణి, సుగాత్రీ శాలీనుల వృత్తాంతం – సరస్వతీ చతుర్ముఖుల శృంగార చేష్టల వల్ల ఉత్పన్నమైన వినూత్న వస్తుసంపద – ఎరుగని తెలుగు పాఠకుడు ప్రబంధ సాహితీయామినులలోని నిత్య జ్యోత్స్నలకు నోచుకోని వాడవుతాడు.
శబ్దానికీ అర్థానికీ ఉన్న అనంత శక్తిని అవగతం చేసుకోవడానికి ద్వ్యర్ధి కావ్యపఠనం అమితంగా తోడ్పడుతుంది. శ్లేషలతో చేసే కసరత్తే అయినా శబ్దసంపదకున్న అనంత రూపాలతో పరిచయం ఏర్పడుతుంది. తనకు తానై కట్టుబాట్లు కల్పించుకొని ఒక్క పద్యంలో రెండు కథలకు అన్వయం కుదిరేట్లు వ్రాయడం శబ్ద సామ్రాజ్యం మీద, అర్థ విస్తృతి మీద సూరనకున్న సమున్నతాధికారం వ్యక్తమౌతుంది.
పాలెం శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో ఆంధ్రోపన్యాసకులుగా ఉన్న శ్రీ శ్రీరంగాచార్యులు గారు సూరన కావ్యాలలోని కొన్ని పద్యాలను ఏరి, వాటిలోని సొగసులను మనకు పరిచయం చేశారు. ఆయన ప్రాచీనాంధ్ర కావ్యాలను ఎన్నింటినో పరిష్కరించిన వారు. సంస్కృతంలోనూ తెలుగులోనూ గొప్ప కృషు చేసిన పండిత వంశానికి సంబంధించినవారు.
క్రింద ఇవ్వబడిన link ను క్లిక్ చేసి ఈ పుస్తకాన్ని ఉచితంగానే చదువుకోండి.
లేదా క్రింద ఇవ్వబడిన QR code ను scan చేసినా ఆ పుస్తకాన్ని ఉచితంగా చదువుకోవచ్చు.
శ్రీ పత్రి అశ్వనీ కుమార్ గారి నివాసం నవీ ముంబై, మహారాష్ట్ర.
విద్యాభ్యాసం అంతా విజయవాడ లోనే జరిగింది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి MBA పట్టా పుచ్చుకుని, ఉద్యోగార్ధం హైదరాబాద్ వచ్చిన తర్వాత యువభారతి సంస్థతో (1982) నలభై ఏళ్ళ అనుబంధం.
వృత్తిరీత్యా రిలయన్స్ ఇండస్ట్రీస్ లో Finance & Accounts లో Senior Management Team లో పనిచేసి 2016 లో పదవీ విరమణ చేసినా, ప్రవృత్తి మాత్రం – సంగీత సాహిత్యాలే. ప్రస్తుతం ఒక Youtube Channel కి Voice Over artiste గా, స్వరమాధురి సంగీత సంస్థకు అధ్యక్షునిగా వారి విశ్రాంత జీవితాన్ని బిజీ గా, ఆనందంగా గడుపుతున్నారు.