[షేక్ కాశింబి గారు రచించిన ‘పిల్లలతో పెద్దలు’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
తల్లిదండ్రులు స్క్రీన్ల చేలో మేస్తుంటే
పిల్లలు గట్టు మీద కట్టేసిన దూడల్లా ఎంత వరకుంటారు?
నాన్న ఇంట్లోనే మందు పార్టీ చేస్తుంటే..
చిన్నోడు పెగ్గేయకుండా ఎన్నాళ్ళుంటాడు?
అయినవారే పోలికల సూదులతో గుచ్చి చిన్నబుచ్చుతుంటే
ఆత్మన్యూనతా సంకెళ్ళెలా తెంచుకుంటారు పసివాళ్ళు?
వివక్షా విషనాగుల్లా ఇంటివారే కాళ్ళకు చుట్టుకుంటుంటే
ఆత్మస్థైర్యపు కవచమెలా నిర్మించుకుంటారు ఆడపిల్లలు?
నాన్న, అన్న ఆడవారనే పూల మొక్కల్ని సంరక్షిస్తేనేగా
చిన్నవాళ్ళు ఆ మర్యాదని అందిపుచ్చుకుని కొనసాగించేది?
అమ్మ ఆశువుగా గొప్పలు చెబుతుంటే..
ఆమె వెంటనున్న పిల్లలకి సత్యమెలా రుచిస్తుంది?
ఇంటిల్లిపాదీ విలువల ముత్యాల్ని ఒడిసి పట్టాలంటే..
ఇంటి సంప్రదాయం ఇచ్చిపుచ్చుకునేదై ఉండాలి ఎప్పుడూ!
అరిగి పోయే సూక్తుల గంధపు చెక్కలు కాదు
ఆరిపోని ఆచరణా దీపాలు కావాలిప్పుడు!
మీ ఆలోచనా చలువ కళ్ళద్దాల్ని పిల్లల కళ్ళకు తగిలించకండి!
వాళ్ళ ఆశల గూళ్ళని స్వయంగా కట్టుకోనివ్వండి!
మీ కాళ్ళ పావుకోళ్ళ ఆనందాలని వాళ్ళు కాళ్ళకు తొడక్కండి!
వాళ్ళనుకునే ఆకాశపు టెత్తులకు పక్షుల్లా ఎగరనివ్వండి!
పిల్లల్నించి గుణాల సంస్కారాన్నాశించండి! కాదంటే..
గొఱ్ఱెపిల్లల్నో.. తేనెటీగల్నో.. పట్టు పురుగుల్నో..
పెంచేందుకు కొన్ని నెలల శిక్షణ తీసుకుని
శ్రద్ధ పెడితే.. లాభాలే.. లాభాలు!