[ప్రముఖ చైల్డ్ సైకాలజిస్ట్ ఐ.పి.సుహాసిని గారు సంచిక పాఠకుల కోసం ‘పిల్లల పెంపకంలో నూతన దృక్పథం’ అనే ఫీచర్ అందిస్తున్నారు.]
డార్క్ హ్యూమర్ కల్చర్ – పిల్లలను ఎలా రక్షించుకోవాలి?
హాస్యం అనేది మన జీవితంలో ఆనందాన్ని, సంతోషాన్ని తీసుకువచ్చే అద్భుతమైన సాధనం. సరదాగా నవ్వడం ఆరోగ్యానికి మంచిదని ఎన్నో పరిశోధనలు చెబుతున్నాయి. కానీ, ప్రతి హాస్యానికి ఒక హద్దు ఉంటుంది. కొన్ని రకాల హాస్యం మనస్సును ప్రభావితం చేసి, నెగటివ్‌గా మార్చే అవకాశం ఉంది.
ఇటీవల, డార్క్ హ్యూమర్ అనే కొత్త ట్రెండ్ యువతలో విపరీతంగా పెరుగుతోంది. ఇది సాధారణంగా విషాదం, హింస, మరణం, తక్కువ మన్నన పొందే వ్యక్తులు లేదా సంఘటనల గురించి క్రూరంగా సరదాగా మాట్లాడే విధంగా ఉంటుంది. మొదట్లో ఇది సరదాగా అనిపించినా, దీని నెగటివ్ ఎఫెక్ట్స్ పిల్లల భావోద్వేగాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి.
ఇంతటితో కాకుండా, సోషల్ మీడియాలో ఈ తరహా హాస్యం మీమ్స్, వీడియోలు, చాట్స్ రూపంలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ఇటీవల ప్రముఖ యూట్యూబర్ & పోడ్‌కాస్టర్ ‘Beer Biceps’ (Ranveer Allahbadia) పై జరిగిన డార్క్ హ్యూమర్ ట్రోల్స్ దీనికి తాజా ఉదాహరణ. అతను చేసిన కామెంట్లు ఏవైనా కానీ, కొందరు ట్రోలర్లు అతని వ్యక్తిగత జీవితాన్ని, అభిప్రాయాలను టార్గెట్ చేస్తూ అతి తీవ్రమైన డార్క్ మీమ్స్, శృంగార వితండవాదం కలిగినవి ట్రోల్స్ చేశారు. ఇది కేవలం సరదా కాదు – ఇది సైబర్ బుల్లీయింగ్‌కు దగ్గరగా ఉన్నదని చాలా మంది నిపుణులు చెబుతున్నారు. పిల్లలు, టీనేజర్లు ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నందున, వారికి ఇది సరదాగా అనిపించినా, దీని అసలైన ప్రభావం ఏమిటో వారికి అర్థం కావడం లేదు.
అసలు డార్క్ హ్యూమర్ అంటే ఏమిటి?
డార్క్ హ్యూమర్ అనేది హాస్యంలో ఒక విభాగం, ఇది సాధారణంగా బలహీనత, మరణం, హింస, మానసిక ఆరోగ్యం, సంఘటనల దురదృష్టకర వైపు గురించి మాట్లాడుతూ సరదాగా అనిపించేలా చేస్తుంది. కానీ దీని వెనుక ఒక నెగేటివ్ సైకలాజికల్ ఎఫెక్ట్ దాగి ఉంటుంది. ఉదాహరణకు, కొందరు డిప్రెషన్, ఆత్మహత్య, లైంగిక వేధింపులు వంటి తీవ్రమైన విషయాలను జోక్‌లుగా మార్చి సోషల్ మీడియాలో పంచుకుంటుంటారు.
చరిత్రపరంగా, డార్క్ హ్యూమర్ 17వ శతాబ్దంలో ఫ్రెంచ్ రచయితలు ఉపయోగించినట్లు గుర్తించారు. ‘Black Comedy’ (Noir Humor) అనే పదం మొదటిసారిగా André Breton (1935) అనే ఫ్రెంచ్ రచయిత ద్వారా పాపులర్ అయ్యింది. ఇది రష్యన్, జర్మన్, బ్రిటిష్ హాస్య సాహిత్యంలో కూడా కనిపించింది, ముఖ్యంగా ప్రపంచ యుద్ధాల సమయంలో ప్రజలు తమ బాధను సూటిగా చెప్పేందుకు ఈ హాస్యాన్ని ఉపయోగించారు. చాలమంది హాస్యనటులు కొన్నిసార్లు ఈ డార్క్ హాస్యాన్ని సీరియస్ విషయాలపై కేంద్రీకరించడానికి ఉపయోగించారు.
ఇప్పుడు ఈ సొషల్ మీడియాలో ఇన్‌స్టాగ్రామ్, రెడిట్, డిస్కార్డ్, ట్విట్టర్, మొదలగునవి డార్క్ హాస్యాన్ని విపరీతంగా ప్రోత్సహిస్తున్నాయి. Dank Memes అనే కొత్త క్యాటగిరీ ద్వారా తీవ్రమైన సెటైర్, నిగ్రహం లేని జోక్‌లు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. దానితోపాటుగా ఇప్పుడు ట్రోలింగ్ ఒక కొత్త హాస్య ఫార్మ్‌లాగా మారిపోయింది. కొందరు ప్రముఖులను, లేదా బలహీనమైన వ్యక్తులను డార్క్ మీమ్స్ రూపంలో టార్గెట్ చేస్తూ నెగటివ్ ట్రెండ్స్ క్రియేట్ చేస్తున్నారు.
పిల్లలపై డార్క్ హ్యూమర్ ప్రభావం
1. సహానుభూతి తగ్గిపోతుంది:
డార్క్ హ్యూమర్ ఎక్కువగా చూడడం వల్ల పిల్లలు ఇతరుల భావోద్వేగాలను అర్థం చేసుకోలేకపోతారు. వారి సహానుభూతి నెమ్మదిగా తగ్గిపోతూ, ఇతరుల బాధను హాస్యంగా చూడడం అలవాటు పడతారు. వారిలో ఒక సుపీరియారిటీ కాంప్లెక్స్ పెరిగిపోతుంది ఇతరులని చిన్నచూపు చూడ్డం అన్నది అలవాటైపోతుంది.
దీనివల్ల, బాధపడే వాళ్ళని సముదాయించటం మానేసి వాళ్ళని ఇంకా ఎక్కువ ఏడిపించటం సతాయించడం అన్నది ఒక హాబిట్‌గా మారుతుంది.
2. మనసులో అల్లకల్లోలాన్ని పెంచడం:
ఈ డార్క్ హ్యూమర్ ప్రోగ్రాములు చూస్తూ పెరిగిన పిల్లల్లో ఒకరక విధమైన మానసికల్లో కల్లోలం అశాంతి పెరిగిపోతుంది. ఎందుకంటే, ఈ డార్క్ హ్యూమర్‌లో ఉండే అవమానకరమైన హానికరమైన అంశాలను వాళ్లు గుర్తిస్తారు కానీ దానికి వాళ్ళు ఎలా రియాక్ట్ అవాలో వాళ్ళకి తెలియకుండా పోతుంది.
ఇది జీవితంలో అత్యంత సీరియస్ అంశాలు గురించి అవగాహన లేకుండా చేస్తుంది దేనికి నవ్వాలో దేనికి నవ్వకూడదు తెలియని పరిస్థితుల్లో పిల్లల్లో ఏదో తెలియని ఒక మానసిక ఆందోళన పెరుగుతుంది.
3. ఆత్మ విశ్వాసం తగ్గిపోతుంది:
కొన్ని సందర్భాల్లో, పిల్లలు స్వయంగా డార్క్ హ్యూమర్‌కు టార్గెట్ అవుతారు. వాళ్ల బాడీ షేప్, ముఖకవళికలు, కుటుంబ నేపథ్యం వంటి వాటిని టార్గెట్ చేస్తూ మీమ్స్ వస్తే, వాళ్లు లోలోపల ఆలోచిస్తూ నెగటివ్‌గా మారిపోతారు. దీనిని వారు వేరే వాళ్ళతో కూడా ఎవరితోనూ షేర్ చేసుకోరు వాళ్ళలో వాళ్లే దిగులు పడిపోయి వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు.
4. బలహీనవర్గాల పట్ల నిర్లక్ష్యం:
ఈ హాస్యంలో ఎక్కువగా శారీరిక దివ్యాంగులు, మానసిక సమస్యలు ఉన్న వ్యక్తులు, సామాజికంగా వెనుకబడిన వర్గాలు టార్గెట్ అవుతుంటాయి. దీన్ని ఎప్పటికీ సరైన హాస్యంగా పరిగణించరాదు. ఈ డార్క్ హ్యూమర్‌కి అలవాటు పడిన పిల్లలు బలహీనవర్గాల మీద టార్గెట్ చేస్తూ సామాజిక బాధ్యతను విస్మరించి అందరిని అపహాస్యం చేయడంలో ఆనందం పొందుతారు.
5. సైబర్ బుల్లీయింగ్‌కు దారి తీసుకుంటుంది:
డార్క్ హ్యూమర్ ఎక్కువగా ఉపయోగించే పిల్లలు సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లలో ఇతరులను బులీ చేయడం, వారికి తక్కువగా అర్థమయ్యే జోక్‌లు వేయడం అలవాటు చేసుకుంటారు. ఇది హానికరమైన ధోరణిగా మారుతుంది. దీనికి గురైన పిల్లలు గాని పెద్దలు గాని యాంగ్జైటీ డిప్రెషన్ వంటి మానసిక రుగ్మతల బారిన పడే అవకాశం ఉంటుంది.
తల్లిదండ్రులుగా మనం ఏమి చేయాలి?
మనము మన పిల్లలతో ఓపెన్‌గా మాట్లాడాలి వాళ్లతో కలిసి టైం స్పెండ్ చేయాలి.
డార్క్ హ్యూమర్ అంటే ఏమిటి, దాని వెనుక ఉన్న ప్రాబ్లెమ్ ఏమిటి అనే విషయాలను పిల్లలకు అర్థమయ్యేలా వివరిస్తే, వారు దాని ప్రభావాన్ని గుర్తించగలుగుతారు. పిల్లల సోషల్ మీడియా యూజ్‌ను గమనిస్తూ ఉండాలి. వారు ఏ ఏ ప్లాట్‌ఫార్మ్‌లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు? ఎలాంటి మీమ్స్, ట్రెండ్స్ ఫాలో అవుతున్నారు? అనే అంశాలను నిశితంగా గమనించాలి.
మంచి హాస్యం అంటే తీవ్రమైన నెగటివ్ అంశాలు కలిగి ఉండకుండా, ఎవరికి హాని కలిగించకుండా ఉండేలా ఉండాలి, అని పిల్లలకు మనం నచ్చ చెప్పాలి. పాతకాలం నాటి మంచి హాస్యం ఉండే సినిమాలని పుస్తకాలని వాళ్లకు పరిచయం చేయాలి. సానుకూలమైన ఆరోగ్యకరమైన హాస్యం గురించి వాళ్లతో ఎప్పుడూ మనం చర్చిస్తూ ఉండాలి.
పిల్లలకి మనం ఒకటే నచ్చ చెప్పాలి. మనము ఎప్పుడైనా ఒక మీమ్ గాని, ఒక జోక్ గాని, షేర్ చేసేటప్పుడు లేదు, ఒక కామెంట్ పెట్టేటప్పుడు దీని మూలంగా ఎవరైనా బాధపడే వాళ్ళు ఉన్నారా వాళ్లని మనం మానసికంగా బాధిస్తున్నామా అని ఆలోచించాలి అని చెప్పాలి.
పిల్లలలో ముఖ్యంగా మనము ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పెంచాలి. వాళ్ల భావాలు వాళ్ల ఫీలింగ్స్‌ని వాళ్ళ అర్థం చేసుకోవటమే కాకుండా ఇతరులలో భావోద్వేగాలని కూడా అర్థం శక్తి వాళ్ళలో పెంపొందించాలి. ఎవరైనా వాళ్లని ట్రోల్ చేస్తే దానిని వాళ్ళు ఎలా ఎదుర్కోవాలో నేర్పించడం పాటు మనం ఇంకోళ్ళని ఎలా ట్రోల్ చేయకూడదు అని కూడా నేర్పించాలి. స్కూల్లో పక్క పిల్లల్ని ఏడిపిస్తూ ఉంటే దాన్ని ఎలా ఎదుర్కోవాలో అన్న విషయం కూడా మనం వాళ్లకు నేర్పించాలి.
ముగింపు:
డార్క్ హ్యూమర్ చిన్న వయస్సులో ఉన్న పిల్లలపై పెద్ద ప్రభావం చూపే ఒక అనవసరమైన సామాజిక వ్యామోహంగా మారింది. మొదటిసారిగా అది సరదాగా అనిపించినా, దీని ద్వారానే మన పిల్లలు భావోద్వేగ మానసిక సంక్షోభాలు, ఆత్మవిశ్వాసం లోపం, అసమర్థత, సామాజిక బాధ్యతల యొక్క అవగాహన లోపం వంటి అనేక ఆందోళనలకు గురవుతున్నారు.
డార్క్ హ్యూమర్ అన్ని వయస్సుల పిల్లలకు తప్పనిసరిగా విరుచుకుపడవలసిన ఒక అంశం కాదు. సానుకూల హాస్యాన్ని, సమాజానికి మేలు చేసే సృజనాత్మకతను, మానవత్వాన్ని పిల్లలకు నేర్పించడం అత్యంత ముఖ్యమైనది.
ఇకపై తల్లిదండ్రులుగా మన బాధ్యత ఈ విషయంలో పిల్లల్ని మార్గదర్శనం చేయడం. డార్క్ హ్యూమర్ వల్ల వచ్చే నెగటివ్ ప్రభావాలు గురించి అవగాహన కలిగి, మనం పిల్లలకు స్వచ్ఛమైన, హానికరమైన కోణాల నుండి దూరంగా ఉన్న హాస్యాన్ని మాత్రమే అనుమతించాలి. పిల్లలకు మానవత్వాన్ని, ప్రేమను, సమాజంపై నమ్మకాన్ని గట్టి చేయడానికి మనం ఎప్పుడూ తగిన మార్గదర్శకత్వాన్ని అందించాలి.
(వచ్చే వారం మరో టాపిక్‌తో కలుద్దాం)
ఐ.పి. సుహాసిని గారు కిడ్స్ అండ్ పేరెంట్స్ లైఫ్ కోచ్‌గా పని చేస్తున్నారు. చైల్డ్ సైకాలజిస్ట్. పేరెంటింగ్ బ్లాగర్, యూట్యూబర్. పేరెంట్స్ కోసం వాట్సప్‌లో ఒక ఫ్రీ కమ్యూనిటీ నడుపుతున్నారు. ఆ కమ్యూనిటీ లింక్ Simplified Parenting with Suhasini. వారిని mommyshravmusings@gmail.com అనే మెయిల్ ఐడిలో సంప్రదించవచ్చు.