Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పిల్లల పెంపకంలో నూతన దృక్పథం-7

[ప్రముఖ చైల్డ్ సైకాలజిస్ట్ ఐ.పి.సుహాసిని గారు సంచిక పాఠకుల కోసం ‘పిల్లల పెంపకంలో నూతన దృక్పథం’ అనే ఫీచర్ అందిస్తున్నారు.]

పనిచేస్తున్న తల్లిదండ్రులకు గైడ్: వేసవి సెలవుల్లో పిల్లలకు ప్రయోజనకరమైన యాక్టివిటీస్

వేసవి సెలవులు వచ్చేశాయి! పిల్లలకు ఇది మజా చేయడానికి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి, పూర్తిగా రిలాక్స్ అయ్యే సమయం. కానీ పనిచేస్తున్న తల్లిదండ్రులకేంటి? సెలవుల వేళ పిల్లలు ఇంట్లో ఎక్కువ సమయం గడిపేటప్పుడు, వాళ్లను ఉత్సాహంగా, ఉపయోగకరంగా ఉంచడం ఓ పెద్ద సవాలుగా మారుతుంది.

మీరు ఆఫీసు పనిలో బిజీగా ఉంటే, పిల్లలు ఇంట్లో సెలవులను ఎలా సద్వినియోగం చేసుకోవాలి? రోజంతా మోబైల్, టీవీ ముందు కూర్చోకుండా, వాళ్లకు వినోదంతో పాటు కొత్త నైపుణ్యాలు, చక్కటి అనుభవాలు అందించే మార్గాలు ఏవీ?

ఈ వ్యాసంలో, పనిలో బిజీగా ఉన్న తల్లిదండ్రులు పిల్లలకు సంపూర్ణంగా ప్లాన్ చేసిన వేసవి అనుభవాన్ని ఎలా అందించగలరో తెలుసుకుందాం. సమతుల్యమైన రోజువారీ షెడ్యూల్, విద్యా మరియు వినోదంతో కూడిన యాక్టివిటీస్, పిల్లలను ఇన్గేజ్ చేసే క్రియేటివ్ ఐడియాస్ – ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి! మరి ఆలస్యం ఎందుకు చదివేద్దామా?

వేసవి సెలవులు – పిల్లల పెరుగుదలకి మరియు వ్యక్తిత్వ వికాసానికి అనువైన సమయం!

వేసవి సెలవులు అనేవి పిల్లలకు మాత్రమే కాదు, తల్లిదండ్రులకు కూడా ఒక గొప్ప అవకాశం.  ఎందుకంటారా ఇప్పుడే కదా మరి మీరు మీ పిల్లలతో కొంచెం సమయం ఏ టెన్షన్ లేకుండా గడపగలిగేది.  అలాగే మీ పిల్లలు కూడా ఇప్పుడే కదా కొత్త విషయాలు నేర్చుకోవటం కానీ కొత్త వాళ్లతో స్నేహం చేయడం గానీ చదువుకు భిన్నంగా వేరే ఏదైనా కొత్త విషయం ట్రై చేయడం గానీ చేయగలిగేది.

కానీ ఈ కాలంలో తల్లిదండ్రులు ఇద్దరు పని చేయటం మూలంగా వారిద్దరికీ పిల్లలతో సమ్మర్ హాలిడేస్‌లో టైం స్పెండ్ చేయడానికి ఖాళీ లేదు. పోనీ తాత అమ్మమ్మల దగ్గరికి తాత నాయనమ్మల దగ్గరికి పంపించడానికి కూడాను వీలు కుదరటం లేదు ఎందుకంటే పిల్లలకి ఇక్కడ సమ్మర్ క్లాసులు పోతాయి కాబట్టి. అందుకే చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లల్ని డే కేర్‌కి పంపించడం లేదు ఎక్స్‌ట్రా యాక్టివిటీ క్లాసుల్లో వేసేయటం చేస్తున్నారు.

పిల్లలను డేకేర్‌కు పంపడంలో తప్పు లేదు, కానీ తల్లిదండ్రులుగా మనం వారితో గడిపే సమయం, వాళ్లకు నేర్పే విలువలు, స్వతంత్రంగా నేర్చుకునే అవకాశం కూడా ఇవ్వాలి. ఈ వేసవి సెలవులను సమతుల్యంగా ప్లాన్ చేస్తే, పిల్లలకు వినోదం మాత్రమే కాదు, జీవిత నైపుణ్యాల అభివృద్ధికి కూడా సహాయపడతాయి.  అది ఎలాగో చూసేద్దామా మరి!

పిల్లల అవసరాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం!

పిల్లలను వేసవి సెలవుల్లో ఎంగేజ్ చేయాలంటే, ముందుగా వాళ్ల అవసరాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యము. ప్రతి పిల్లవాడి అవసరాలు వయస్సును బట్టి, వ్యక్తిగత ఆసక్తులను బట్టి మారుతూ ఉంటాయి. కొందరు ఆటలలో ఎక్కువగా ఆసక్తి చూపుతారు, మరికొందరు చదవడంలో, ఇంకొందరు కొత్త విషయాలను నేర్చుకోవడంలో మక్కువ చూపుతారు. అందుకే పిల్లలను బలవంతంగా ఏదో ఒక యాక్టివిటీలో నెట్టివేయడం కంటే, వాళ్ల అభిరుచులకు అనుగుణంగా వేసవి ప్లాన్ చేయడం ఉత్తమం.

వయస్సు ప్రకారం పిల్లల అవసరాలు, వారి ఆసక్తులు

4-6 ఏళ్ల పిల్లలు:

చిన్న పిల్లలు ప్రధానంగా ఆటల ద్వారా నేర్చుకుంటారు. వాళ్లకు అధిక శారీరక కదలిక అవసరం.

7-10 ఏళ్ల పిల్లలు:

ఈ వయస్సులో పిల్లలు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడంలో ఆసక్తి చూపుతారు.

11+ ఏళ్ల పిల్లలు (ప్రీ-టీనేజ్ & టీనేజర్లు):

ఈ వయస్సులో ఉన్న పిల్లలు స్వతంత్రంగా ఆలోచించాలని, వారి నిర్ణయాలు వారే తీసుకోవాలని అనుకుంటారు.

ఇవి కొన్ని ఉదాహరణలు మటుకే. మీ పిల్లల అభిరుచికి, అభివృద్ధికి మేరకు మీరు వాళ్ళకి వివిధ రకాలైన ఆక్టివిటీస్ వారి ఏజ్ తగ్గట్టుగా ఇవ్వచ్చు. పిల్లలకు సరైన యాక్టివిటీస్ ఇవ్వకపోతే, వాళ్లు విసుగుగా ఫీలై ఎక్కువగా స్క్రీన్ టైమ్‌కి అలవాటు పడే అవకాశం ఉంటుంది. వారి అభిరుచికి తగ్గట్టుగా యాక్టివిటీస్ ప్లాన్ చేయడం వల్ల వారు ఎక్కువ ఆనందంగా ఉంటారు, ఒత్తిడి లేకుండా కొత్త విషయాలను ఆహ్లాదంగా నేర్చుకుంటారు. కొత్త నైపుణ్యాలను నేర్చుకునే అవకాశాలు ఇవ్వడం వల్ల వాళ్లలో సృజనాత్మకత, సమస్యల పరిష్కార నైపుణ్యాలు పెరుగుతాయి.

వేసవి షెడ్యూల్ రూపొందించడం చాలా అవసరం!

వేసవి సెలవులు పిల్లలకు స్వేచ్ఛను, వినోదాన్ని, కొత్త విషయాలు నేర్చుకునే అవకాశాన్ని అందించే సమయం. అయితే, తల్లిదండ్రులు ఒక విషయం గుర్తుంచుకోవాలి – షెడ్యూల్ లేకుండా పిల్లలను వదిలేస్తే, వాళ్లు ఎక్కువగా టీవీ, మొబైల్, వీడియో గేమ్స్ వంటి స్క్రీన్ యాక్టివిటీస్‌కి అలవాటు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం మన పిల్లలతో కలిసి ఒక షెడ్యూల్ రూపొందించుకోవాలి. అదే సమయంలో, చాలా కఠినమైన షెడ్యూల్ చేయడం వల్ల పిల్లలు ఒత్తిడికి గురవుతారు. అందుకే, సమతుల్యమైన, ఆటపాటలకు కూడా స్థానం ఇచ్చే షెడ్యూల్ రూపొందించడం ఎంతో ముఖ్యం. మీకోసం ఒక చిన్న శాంపుల్ షెడ్యూల్.

చిన్న శాంపుల్ షెడ్యూల్:

  1. ఉదయాన్నే చక్కటి ప్రారంభం: ఒక మంచి పద్ధతిలో రోజు ప్రారంభమైతే, పిల్లలు ఉత్సాహంగా ఉంటారు. యోగా, వెలుపల వాకింగ్, స్ట్రెచింగ్ వంటి అలవాట్లను ప్రవేశపెట్టండి.
  2. ఆరోగ్యకరమైన అల్పాహారం: తాజా పండ్లు, న్యూట్రిషస్ ఫుడ్ తీసుకునేలా చూడండి. పిల్లలను కూడా బాగా ఆహారం తినేలా ప్రోత్సహించండి. మీ పిల్లల్ని కూడా బ్రేక్ ఫాస్ట్ ప్రిపరేషన్‌లో ఇన్వాల్వ్ చేయడం స్టార్ట్ చేయండి.
  3. నేర్చుకునే సమయం: ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ఉపయోగించండి. Ex: కొత్త పుస్తకాలు చదవడం, ఆన్లైన్ కోర్సులు ఎటెండ్ అవ్వడం, కొత్త హాబీ నేర్చుకోవటం మొదలగునవి.
  4. ఆటపాటల సమయం: ఇంట్లో గేమ్స్ ఆడటం, బోర్డు గేమ్స్, లేదా స్నేహితులతో కలిసే సమయంలో కాస్తా ఫిజికల్ యాక్టివిటీస్ (సైక్లింగ్, గార్డెనింగ్) చేయించడం మంచిది.
  5. మధ్యాహ్న భోజనం, విశ్రాంతి: భోజనంతో పాటు, ఒక చిన్న విశ్రాంతి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. చిన్నపిల్లలన్నీ భోజనం తర్వాత కొంచెం సేపు నిద్రపోవడానికి ప్రయత్నించమని చెప్పండి. కొంచెం పెద్ద పిల్లలు మరి ముఖ్యంగా టీనేజ్‌లో ఉండే వాళ్ళకి ఈ భోజనం తర్వాత టైమును క్రియేటివ్ లెర్నింగ్‌కి వాడుకోవచ్చు అంటే డైరీ రాయటం లేదు డ్రాయింగ్ చేయటం మండల ఆర్ట్ గీయటం లేదు మట్టితో బొమ్మలు చేయటం ఇలాంటివి.
  6. అవుట్ డోర్ యాక్టివిటీస్/ క్రీడలు: పిల్లలను ఇంట్లో కూర్చోనివ్వకుండా బైట గడిపేలా చూడండి. పార్క్, సైక్లింగ్, స్విమ్మింగ్, ఆటల కోసం ప్రత్యేక సమయం కేటాయించండి.
  7. డిన్నర్ & రిలాక్సేషన్: డిన్నర్‌కి ముందు తర్వాతనో మీరు మీ పిల్లలతో కలిసి కొంచెం సేపు గడపండి. మీ పిల్లల్ని డిన్నర్ ప్రిపరేషన్‌లో కూడా ఆ ఇన్వాల్వ్ చేయడం మొదలు పెట్టండి. మీ పిల్లలతో కలిసి లైట్ మ్యూజిక్ వినడం, చిన్న పుస్తకాలు చదవడం, వాక్‌కి వెళ్లడం, లేదంటే మీరందరూ కలిసి బోర్ గేమ్స్ ఆడుకోవడం లాంటివి చేయండి కొంచెం సేపు.
  8. ప్రశాంతంగా నిద్రపోండి: కంప్యూటర్, మొబైల్ స్క్రీన్స్‌ను పక్కన పెట్టి, తక్కువ వెలుతురులో పిల్లలను నిద్రపుచ్చండి.

పిల్లల ఆసక్తుల ప్రకారం షెడ్యూల్ మార్చుకోండి. వారాంతాల్లో (Weekends) కుటుంబ పిక్నిక్‌లు, ప్రత్యేకమైన ఫన్ యాక్టివిటీస్ జోడించండి. పిల్లలకు స్వేచ్ఛ ఇవ్వడం కూడా ముఖ్యమే, కొన్ని గంటలు వాళ్లకు ఇష్టమైన పని చేసేందుకు వదిలివేయండి. ఇలా షెడ్యూల్ను బ్యాలెన్స్‌డ్‌గా ఉంచడం వల్ల పిల్లలు బోర్ ఫీలవకుండా, సెలవులను పూర్తిగా ఆస్వాదిస్తారు!

పనిచేస్తున్న తల్లిదండ్రులు ఈ షెడ్యూల్‌ను ఎలా నిర్వహించగలరు?

పనిచేస్తున్న తల్లిదండ్రుల కోసం వేసవి షెడ్యూల్‌ను సమర్థవంతంగా అమలు చేయడానికి కుటుంబ సభ్యుల సహకారం అత్యంత అవసరం. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు, తాతయ్య, అమ్మమ్మ, బామ్మ, చెల్లెళ్ళు లేదా ఇతర బంధువుల సహాయాన్ని తీసుకోవడం మంచిది. కుటుంబ సభ్యులు పిల్లలను శారీరక మరియు మానసికంగా సక్రమంగా తీర్చిదిద్దేలా చేయగలిగితే, మీరు పని మీద దృష్టి పెట్టడమే కాకుండా, పిల్లలు కూడా అనవసర స్క్రీన్ టైమ్‌కు అలవాటు పడకుండా ఉంటారు. మీకు కుటుంబ సహాయం అందుబాటులో లేకపోతే, వైజ్‌గా ప్లాన్ చేసి పిల్లలను సెల్ఫ్-డిపెండెంట్‌గా మారుస్తూ చూడాలి.  అవసరమైతే ఒక కేర్ టేకర్‌ని పెట్టుకోండి లేదు మీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు వర్క్ ఫ్రం హోమ్ ఆప్షన్‌ని వాడుకోండి.

ఇటీవల టెక్నాలజీ సహాయంతో పిల్లలను దూరం నుంచే మానిటర్ చేయడం చాలా సులభం. కొన్ని సమర్థవంతమైన మార్గాలు:

తల్లిదండ్రులు పిల్లలతో రోజూ సాయంత్రం క్వాలిటీ టైమ్ గడిపితే, వాళ్ల బంధం మరింత బలపడుతుంది. వారాంతాల్లో చిన్న కుటుంబ ట్రిప్స్, స్పెషల్ ఫన్ యాక్టివిటీస్ ప్లాన్ చేసి పిల్లలకు ఆఫీసు బిజీకి బదులుగా ప్రేమను, అనురాగాన్ని పంచండి. ఇలా ప్లాన్ చేసుకుంటే, వేసవి సెలవులు పిల్లలకు ఆనందకరంగా, తల్లిదండ్రులకు టెన్షన్‌ఫ్రీగా ఉంటాయి!

(వచ్చే వారం మరో టాపిక్‌తో కలుద్దాం)

Exit mobile version