[ప్రముఖ చైల్డ్ సైకాలజిస్ట్ ఐ.పి.సుహాసిని గారు సంచిక పాఠకుల కోసం ‘పిల్లల పెంపకంలో నూతన దృక్పథం’ అనే ఫీచర్ అందిస్తున్నారు.]
నెహ్రూ గారి విజన్ – నేటి పిల్లల పెంపకంలో మనం నేర్చుకోవాల్సినది
“ఈనాటి పిల్లల చేతుల్లోనే రేపటి దేశ భవిష్యత్తు ఉంది” – ఈ ఒక మాటతో పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి పిల్లలపై ఉన్న ప్రేమ, ఆశ, మరియు విజన్ మనమందరం అర్థం చేసుకోవచ్చు.
ప్రతి సంవత్సరం నవంబర్ 14న ఆయన జయంతిని బాలల దినోత్సవంగా జరుపుకుంటాం. కానీ ఆ రోజు పూలు పెట్టడం, కేక్ కట్ చేయడం, సెలబ్రేషన్ చేయడం వరకు మాత్రమే మనం ఆగిపోతున్నామా? ఈ రోజుల్లో మనం పిల్లలను పెంచే విధానం, వారి జీవితాన్ని మలిచే విలువలు ఆయన చూపిన దారికి ఎంత దగ్గరగా ఉన్నాయి?
నెహ్రూ గారు రాజకీయ నాయకుడే కాదు, ఒక ఆలోచనాపరుడు, ఒక తండ్రి. తన కుమార్తె ఇందిరాగారికి రాసిన లేఖల్లో ఆయన పిల్లలకు చూపిన ప్రేమ, మార్గదర్శనం స్పష్టంగా కనిపిస్తుంది.
నెహ్రూ గారి దృష్టిలో బాల్యం
నెహ్రూ గారి దృష్టిలో బాల్యం అనేది కేవలం వయస్సు కాదు – అది ఒక ఆలోచనా స్వేచ్ఛ.
ఆయనకు బాల్యం అంటే సృజనాత్మకత, అన్వేషణ, ప్రశ్నించడం, తప్పులు చేయడం, నేర్చుకోవడం.
అందుకే ఆయన అన్నారు –
“పిల్లలు తల్లిదండ్రుల సొత్తు కాదు; వారు స్వతంత్ర ఆలోచనల స్రవంతి.”
పిల్లలు పుస్తకాలకే పరిమితం కాకుండా ప్రకృతి, కళలు, ఆటలు, మరియు సంభాషణల ద్వారా నేర్చుకోవాలని ఆయన కోరుకున్నారు. ఆయన విజన్‌లో పిల్లల విద్య అంటే కేవలం మార్కులు కాదు, మానవత్వాన్ని పెంపొందించడం.
కానీ మనమేమో మన పిల్లల్ని బాగా చదువుకో, మార్కులు తెచ్చుకో, క్లాసులో ఫస్ట్ రావాలి అని, చెప్పడంలోనే బిజీగా ఉన్నాము కానీ, “ఎందుకు”, “ఏమిటి”, అని ప్రశ్నలు అడగడానికి వాళ్ళని ఎంకరేజ్ చేయడం లేదు.
కానీ నెహ్రూ గారు పిల్లల్లో “ఎందుకు?”, “ఏమిటి?” అనే ప్రశ్నను జాగృతం చేశారు.
ఉదాహరణకు:
ఒకసారి ఒక చిన్న పిల్లాడు పూలను చూస్తూ, “ఇవి రంగులు ఎందుకు మారుతున్నాయి?” అని అడిగాడు.
దానికి నెహ్రూ గారు నవ్వుతూ చెప్పారు,
“ఇదే శాస్త్రం మొదలు! ఇలాంటివే నీకు తెలుసుకోవాలనే కోరికలు పెంచుతాయి. నువ్వు సైన్స్ చదివితే, నీకు ఇలాంటి ప్రశ్నలు ఎన్నిటికో సమాధానాలు దొరుకుతాయి అని చెప్పారు.”
నేటి తల్లితండ్రుల ప్రేమలో భద్రత దాగి ఉంది కానీ స్వేచ్ఛ లోపిస్తుంది
ఈ రోజుల్లో మనం పిల్లల భవిష్యత్తు కోసం అన్నీ చేస్తాం – మంచి పాఠశాలలు, కోచింగ్‌లు, ఆన్లైన్ క్లాసులు, ఇంకా మరెన్నో.
కానీ ఒక ప్రశ్న మనకు, మనమే వేసుకోవాలి:
“మనం వాళ్లకు నేర్పిస్తున్నామా లేక కేవలం నేర్చుకోవడానికి మార్గం చూపిస్తున్నామా?”
- పిల్లలకి ఏం నేర్పించాలో మనమే డిసైడ్ చేస్తున్నాము:
చాలామంది తల్లిదండ్రులు పిల్లలు పుట్టగానే వాళ్ళు పెయింటర్ అవుతాడు, క్రికెటర్ అవుతారు, లేదు డాక్టర్ అవుతాడు, ఇంజనీర్ అవుతాడు అని ముందే ఊహించేసుకుంటారు. అందుకు తగ్గట్టుగానే, వారి పిల్లల ఫ్యూచర్‌ని కూడా తల్లిదండ్రులే ప్లాన్ చేసేస్తారు.
ఉదాహరణకి:
10 ఏళ్ల స్నేహాకు పియానో అంటే చాలా ఇష్టం. కానీ వాళ్ళ అమ్మకి తనేమో డాక్టర్ అవ్వాలని కోరిక. పియానో నేర్చుకోవాలి, అంటే దానికి సమయం ఇవ్వాలి, “అది చదువుకి ఆటంకం అవుతుంది”, అని వాళ్ళ అమ్మ ఉద్దేశం. అందుకే పియానో క్లాస్ ఆపేసింది.
కానీ నెహ్రూ గారి విజన్ ప్రకారం – “పిల్లల ఆసక్తులే వారికి బాగా చదువుకోవాలి, అని ప్రోత్సహించే ఇంధనం లాగా పని చేస్తాయి.”
స్నేహా పియానో వాయించేటప్పుడు concentration, rhythm, patience నేర్చుకుంటుంది. ఇవే క్వాలిటీస్ చదువులో కూడా సహాయపడతాయి. తనని ఫ్రంట్‌లో నిలబెడతాయి.
- పిల్లలలో ఆలోచనల్ని మనం ప్రోత్సహించటం లేదు:
పిల్లలలో ఏదైనా తెలుసుకోవాలి అన్నకుతూహలం తగ్గిపోతుంది వారు ఏదైనా అడగాలి, అని మన దగ్గరికి వస్తే మనం టైం లేదు, అని ఎన్నోసార్లు తల్లిదండ్రులు విసుక్కోవటం జరుగుతుంది.
ఉదాహరణకి:
13 ఏళ్ల హర్షిత్ ఒక రోజు తన తండ్రిని అడిగాడు, “నెహ్రూ గారు జైల్లో ఉన్నప్పుడే లేఖలు రాశారంటే ఎలా?”
తండ్రి సమాధానం చెప్పడానికి బదులు, “నెట్లో వెతుక్కో” అన్నాడు. ఆ ఒక్క మాటతో హర్షిత్ యొక్క కుతూహలం ఆగిపోయింది.
కానీ నెహ్రూ గారి విజన్ ప్రకారం – “పిల్లల ఈనాటి కుతూహలమే, రేపు వారికి ఏదన్నా సాధించాలి అని పట్టుదల నిచ్చే సాధనం”.
నేటి పిల్లల పెంపకంలో నెహ్రూ గారి ఆలోచనలు ఎలా ఉపయోగపడతాయి?
చాచా నెహ్రూ గారి ఆలోచనలు కేవలం రాజకీయ నాయకుని మాటలు కాదు; అవి మనసును తాకే మానవ విలువల పాఠాలు. ఆయన పిల్లల్ని ఒక చిన్న విత్తనం లాగా చూశారు – సరైన ప్రేమ, వెలుతురు, ఆహారం దొరికితే అది గొప్ప చెట్టుగా ఎదుగుతుంది అని నమ్మారు.
ఇప్పటి డిజిటల్ కాలంలో పిల్లలతో అనుబంధం తగ్గిపోతున్న ఈ రోజుల్లో, నెహ్రూ గారి తత్వం మనకు మళ్ళీ దిశ చూపుతుంది.
1. ప్రేమతో కలిసిపోవడం – కమాండ్ చేయడం కాదు, కనెక్ట్ కావడం:
నెహ్రూ గారు పిల్లలతో మాట్లాడినప్పుడు, వాళ్ల స్థాయిలోకి దిగి మాట్లాడేవారు.
ఆయనకు తెలుసు – పిల్లలు మాటలు కంటే భావాలను ఎక్కువగా గుర్తుంచుకుంటారు.
కాబట్టి మనం కూడా మన పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి ఒక క్లాస్ పీకుతున్నట్టు కాకుండా ప్రేమతో సంభాషిస్తే వాళ్లు మన మాట వింటారు మన మనసులో భావాలు అర్థం చేసుకుంటారు
📌 చిన్న టిప్: “పిల్లలు మనకు గౌరవం చూపాలంటే, ముందు మనం వారికి గౌరవం చూపాలి.”
2. ఆసక్తి మరియు ఊహాశక్తిని ప్రోత్సహించండి:
నెహ్రూ గారు ఎల్లప్పుడూ చెప్పిన మాట – “పిల్లల ఊహాశక్తి నేర్పించకపోయినా, అడ్డుకోవద్దు.”
ప్రశ్నలు అడిగే పిల్లలు మన భవిష్యత్తును నిర్మిస్తారు.
అందుకే పిల్లలు “ఎందుకు?” అని అడిగితే, మనము వారిని, కోప్పడకుండా, కలిసి వెతకడం నేర్పాలి. ఇలా చేయడం వల్ల వాళ్లలో సైంటిఫిక్ మైండ్, క్రియేటివిటీ, లాజికల్ థింకింగ్ పెరుగుతాయి.
📌 చిన్న టిప్: ప్రతి ప్రశ్న వెనుక ఒక కొత్త ఆలోచన దాగి ఉంటుంది; దానిని వెలికి తీయడం మన బాధ్యత.
3. భిన్నతను అంగీకరించడం:
నెహ్రూ గారి దృష్టిలో ప్రతి పిల్ల వేరే రకం పుష్పం. కొంతమంది తెలివిగా ఉంటారు, ఇంకొందరు భావోద్వేగంగా, కొందరు కళాత్మకంగా. ఈ భిన్నత్వమే మన సమాజానికి అందం.
ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు “ఇతని మార్కులు, ఆమె స్కోర్” అని పోల్చుతూ పిల్లల వ్యక్తిత్వాన్ని తగ్గిస్తున్నారు. కానీ నెహ్రూ గారు అంటున్నారు:
📌 చిన్న టిప్: “పిల్లల మధ్య తేడాలు ఉండడం తప్పు కాదు; వాటిని గుర్తించి దారిచూపడం మన పని.”
4. విలువలతో కూడిన స్వేచ్ఛ:
నెహ్రూ గారు స్వేచ్ఛను ప్రేమించారు. ఆ స్వేచ్ఛలో బాధ్యత కూడా ఉండాలి అని నమ్మారు.
ఇది పిల్లల పెంపకంలో కూడా అదే రీతిగా వర్తిస్తుంది.
పిల్లలకు చిన్న నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇవ్వండి. ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏ హాబీ ఎంచుకోవాలి, ఏ సబ్జెక్ట్ ఇష్టమని. ఇలా స్వేచ్ఛ ఇచ్చినప్పుడు వారు బాధ్యత కూడా నేర్చుకుంటారు.
📌 గమనిక: “బాధ్యత నేర్పే స్వేచ్ఛే నిజమైన విద్య.”
5. ప్రకృతి, ఆటలు, అనుభవాల ద్వారా నేర్చుకోవడం:
నెహ్రూ గారు పుస్తకాలకే పరిమితం కాకుండా, ప్రకృతిని పిల్లల గురువుగా భావించారు.
ఆయన “చిన్న మొక్కల మధ్య నడవండి, ఆకాశాన్ని చూడండి, జంతువుల్ని గమనించండి” అని చెప్పేవారు.
ఇప్పటి పిల్లలు స్క్రీన్లలో బిజీగా ఉన్న ఈ కాలంలో, వారిని బయటికి తీసుకెళ్లి – గార్డెన్లో ఆడించండి, సాయంత్రం నడకకు తీసుకెళ్లండి.
📌 గమనిక: అవి చిన్నగా కనిపించినా, వాళ్లలో ఉన్న సున్నితమైన భావాలు, empathy, patience పెంచుతాయి.
6. విద్య అంటే జ్ఞానం మాత్రమే కాదు, విలువల పునాది
నెహ్రూ గారి దృష్టిలో విద్య అనేది “మార్కులు సాధించడం” కాదు – “మనిషిగా ఎదగడం.”
అందుకే పిల్లలకు academic excellenceతో పాటు మానవ విలువలు నేర్పండి.
దయ, కృతజ్ఞత, సహకారం, న్యాయం – ఇవే నిజమైన విజయానికి మూలాలు.
📌 గమనిక: “మార్కులు కాదు, మానవత్వం నేర్పే విద్యే దేశాన్ని ముందుకు తీసుకెళ్తుంది.”
ముగింపు
నెహ్రూ గారి ఆలోచనలు కేవలం పాత కాలానికి మాత్రమే పరిమితమైపోలేదు; అవి ప్రతి యుగానికీ మార్గదర్శకాలు. పిల్లలు కేవలం మన వారసులు కాదు, మన విలువల ప్రతిబింబం కూడా. మనం వారికి చూపే ప్రేమ, వినిపించే సమయం, మరియు నమ్మకమే వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుంది.
అందుకే నేటి తల్లిదండ్రులుగా మన బాధ్యత – పిల్లలలో ఉన్న ఆ సహజ ఆసక్తిని నిలబెట్టడం, భయాన్ని కాకుండా విశ్వాసాన్ని నాటడం, మరియు ప్రతి చిన్న విజయానికీ అభినందన తెలపడం.
నెహ్రూ గారి పిల్లలపై ఉన్న అమితమైన ప్రేమ మనకు గుర్తు చేస్తుంది:
“బాల్యం అనేది మట్టి వంటిది, మనం దానికి ఇచ్చే ముద్రే శాశ్వతం.”
అందువల్ల, మనం పిల్లలతో గడిపే ప్రతి క్షణం ప్రేమతో, గౌరవంతో నిండినదిగా ఉంచితే –
అది మన పిల్లల భవిష్యత్తుకే కాదు, దేశ భవిష్యత్తుకూ వెలుగునిచ్చే దీపంగా మారుతుంది.
(వచ్చే వారం మరో టాపిక్‌తో కలుద్దాం)
ఐ.పి. సుహాసిని గారు కిడ్స్ అండ్ పేరెంట్స్ లైఫ్ కోచ్‌గా పని చేస్తున్నారు. చైల్డ్ సైకాలజిస్ట్. పేరెంటింగ్ బ్లాగర్, యూట్యూబర్. పేరెంట్స్ కోసం వాట్సప్‌లో ఒక ఫ్రీ కమ్యూనిటీ నడుపుతున్నారు. ఆ కమ్యూనిటీ లింక్ Simplified Parenting with Suhasini. వారిని mommyshravmusings@gmail.com అనే మెయిల్ ఐడిలో సంప్రదించవచ్చు.
