[ప్రముఖ చైల్డ్ సైకాలజిస్ట్ ఐ.పి.సుహాసిని గారు సంచిక పాఠకుల కోసం ‘పిల్లల పెంపకంలో నూతన దృక్పథం’ అనే ఫీచర్ అందిస్తున్నారు.]
‘Am I doing enough?’ – తల్లిదండ్రుల మనసులో నిశ్శబ్ద ప్రశ్న
కొన్ని ప్రశ్నలు గట్టిగా పలకవు, కానీ మనసులో ప్రతీ రోజూ ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి..
- నేను తల్లిగా సరిగా చేస్తున్నానా?
- నా పిల్లలకి నేను చేస్తున్నది సరిపోతుందా?
- నేను నా పిల్లలకి ఏమైనా తక్కువ చేస్తున్నానా?
ప్రతీ తల్లిదండ్రి జీవితంలో కనీసం ఒక్కసారి ఈ ప్రశ్న మనసులో గిల్ట్‌గా పుడుతుంది.
సుధ ఒక వర్కింగ్ మదర్. ఉదయం కిచెన్, ఆఫీస్ కాల్, హోమ్‌వర్క్ రిమైండర్లతో గడపడం ఆమె రోజువారీ జీవితం. ఒక రోజు ఆమె 8 ఏళ్ల కూతురు సియా అడిగింది –
“అమ్మా, ఈ రోజు స్కూల్ తర్వాత నువ్వు రావా? మాకు డ్యాన్స్ ప్రాక్టీస్ ఉంది.”
సుధ ఆలోచించకుండా చెప్పేసింది – “అమ్మాయ్, నేడు మీటింగ్ ఉంది.. రేపు చూద్దాం.”
ఆ మాటకి సియా తలదించుకుంది.
సుధ ఆ రాత్రి బెడ్ మీద పడుకుని ఆ క్షణం గుర్తుచేసుకుంది.
“నేను ఎప్పుడూ ఇలా excuses చెబుతూనే ఉన్నానా? సియాకి నేను సరిగ్గా సమయాన్ని ఇస్తున్నానా లేదా” అని ఆ క్షణం ఆమె మనసులో ఒక గిల్ట్ ఫీలింగ్ మొదలైంది.
ఇలాంటి గిల్ట్ అందరి తల్లుల్లో కూడా ఉంటుంది, ఎప్పుడూ పిల్లలకోసం కష్టపడుతూ, తన కోసం ఒక్క నిమిషం కూడా తీసుకోకుండా జీవిస్తున్న సరే. అంతే కాదు అందరి తండ్రుల్లో కూడా ఈ గిల్డ్ ఫీలింగ్ అన్నది ఉంటుంది. నాన్న ఈ వీకెండ్ మాతో గడపగలరా అని అడిగి పిల్లలు అడిగిన ప్రతిసారి, తన బిజీ జీవితానికి గుర్తు చేసుకొని లోలోపల నిశ్శబ్దంగా తలదించుకునే తండ్రులు ఎంతమందో.
పేరెంటల్ గిల్ట్ అనేది వయసు, వృత్తి, లేదా కుటుంబ పరిస్థితితో సంబంధం లేదు. ఇది మన ప్రేమలో దాగి ఉన్న ఒక్క అసమర్థత భావం.
పేరెంటల్ గిల్ట్ అన్నది ఎందుకు వస్తుంది?
మనం తల్లిదండ్రులుగా మారిన క్షణమే మన మనసులో ఒక కొత్త భావన మొదలవుతుంది. అదే, మన పిల్లలకి ఏదీ తేడా రాకూడదు, మనం మన పిల్లల్ని ప్రేమతో బాధ్యతతో పెంచాలి అని ఒక నిశ్శబ్దమైన ప్రతిజ్ఞలా మారుతుంది. కానీ అదే భావన కొన్నిసార్లు మనల్ని గిల్ట్ అనే ఒక్క ఫీలింగ్ లోకి నెట్టెస్తుంది.
తల్లీదండ్రుల గిల్ట్ అనేది మీరు పిల్లల అవసరాలను సరియైన స్థాయిలో అందించలేకపోయే భావన. ఇది మూడు ప్రధాన రకాలుగా వుంటుంది:
- వర్క్-లైఫ్ గిల్ట్: పని కారణంగా పిల్లలతో తగినంత సమయం గడపలేకపోవడం.
o ఉదాహరణ: ఆఫీస్‌కి చాలా ఆలస్యంగా వెళ్తున్న తల్లి, డే కేర్‌లో ఒంటరిగా ఉన్న తన చిన్నారిని చూసి అయ్యో తనని సరిగ్గా చూసుకోవటం లేదే అని ఒక బాధలోకి వెళ్తుంది
- కంపరేటివ్ గిల్ట్: ఇతర తల్లిదండ్రులంటే పోల్చుకోవడం.
o ఉదాహరణ: సోషల్ మీడియా ఫోటోలు చూసి “వారు నా కంటే ఎక్కువ సమయం పిల్లలకి ఇస్తున్నారు, పిల్లలతో లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు” అని అనిపించడం.
- పర్ఫెక్షనిస్ట్ గిల్ట్: అన్నీ తనే పర్ఫెక్ట్గా చేయాలి అన్న ఒక చిన్న ఆశ.
o ఉదాహరణ: పిల్లలు చేసిన చిన్న తప్పుకి కూడా, నేను విఫలమైన, తల్లి/తండ్రి అనిపించడం.
మనలో ఈ గిల్ట్ ఫీలింగు ప్రధానంగా ఎందుకు వస్తుంది అంటే
1. మన మానసిక నిర్మాణం:
మనం సహజంగా పిల్లలను కాపాడాలి, బాధ్యతతో చూసుకోవాలి అని భావిస్తాము. మన మనసు సహజంగా “కాపాడాలి, రక్షించాలి, చూసుకోవాలి” అనే మోడ్‌లో ఉంటుంది. దానికి ఏమాత్రం తేడా వచ్చినా మనలో ఈ గిల్ట్ ఫీలింగు కలుగుతుంది.
ఉదాహరణకి, రాధ అనే తల్లి ఒక రోజు తన కుమార్తె జ్వరంతో స్కూల్ మిస్ అయ్యింది. రాధ ఆఫీస్‌కి వెళ్ళిపోయింది, కానీ ఆమె మనసు మాత్రం ఇంట్లోనే ఉంది. “నేను ఇంట్లో ఉండి చూసుకోవాల్సింది..” అని ఆలోచిస్తూ సాయంత్రం వరకు గిల్టీగా గడిపింది.
అది ఆమె తప్పు కాదు – అది ఒక తల్లి హృదయ స్పందన.
పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్లకు చిన్న గాయం అయినా మనం బాధపడతాం; పెద్దవాళ్లయినప్పుడు వాళ్ల మనసు దెబ్బతిన్నా అదే బాధ పుడుతుంది.
ఇది తల్లిదండ్రుల మానసిక నిర్మాణం.
2. సామాజిక ఒత్తిడులు & సోషల్ మీడియా:
సోషల్ మీడియాలో కనిపించే, “పర్ఫెక్ట్ ప్యారెంటింగ్” చిత్రాలు మనలోని గిల్ట్ ని పెంచుతాయి.
ఉదాహరణకి, మనం ఫోన్ తెరిచిన వెంటనే ఎవరో “మా పిల్లల సర్టిఫికెట్ కలెక్షన్ డే,” ఇంకొకరు “మా ఫ్యామిలీ పిక్‌నిక్ డైరీ” అని పోస్ట్ చేస్తుంటారు.
ఇవి చూడగానే మనం మన జీవితాన్ని పోల్చడం మొదలుపెడతాం.
“వాళ్లు ఎంత బాగా మేనేజ్ చేస్తున్నారు, నేను మాత్రం రోజూ అలసిపోయి ఏదీ పూర్తి చేయలేకపోతున్నా..” అని మనసులో చిన్న మంట వెలుగుతుంది.
ఇదే సోషల్ మీడియా సృష్టించే మాయ – అది వాస్తవం కాదు, కానీ మన గిల్ట్‌ని నిజమైనట్టుగా అనిపించే అద్దం.
సమాజం కూడా మనపై “మంచి తల్లి, మంచి తండ్రి అంటే ఇలా ఉండాలి” అనే అనూహ్య ప్రమాణాలు పెడుతుంది. వాటిని చేరుకోవడమే తల్లిదండ్రుల గమ్యం అయిపోతుంది – ఆ ప్రయాణంలో ఆనందం మరిచిపోతాం.
3. వ్యక్తిగత ఆశలు:
“నేను ఎల్లప్పుడూ పిల్లల జీవితంలో ఉండాలి, అందుబాటులో ఉండాలి” అని అనుకోవడం. కానీ మనం కూడా మనుషులమే – అలసిపోతాం, తప్పు చేస్తాం, ఆందోళన చెందుతాం.
ఉదాహరణకి, వెంకట్ అనే నాన్న తన డెడ్‌లైన్ కారణంగా కుమారుడి ఫుట్‌బాల్ మ్యాచ్ మిస్ చేశాడు. రాత్రి కుమారుడు నిశ్శబ్దంగా కూర్చుని ఉండగానే, వెంకట్ మనసులో గిల్ట్ జ్వాల చెలరేగింది. “నేను ఉండాల్సినప్పుడు లేకపోయాను” అనే వాక్యం అతని మనసులో పదే పదే మార్మోగింది.
కానీ వాస్తవం ఏంటంటే – తల్లిదండ్రి ఉనికి ఒక్క రోజుతో కాదు, ప్రతి చిన్న క్షణంలో చూపే ప్రేమతో కొలవబడుతుంది.
మనలో “నేను ఎల్లప్పుడూ సరైనవాడిగా ఉండాలి” అనే ఆశ, దురాశగా మారి మనల్ని మనమే మర్చిపోయేటట్టు చేస్తుంది.
గిల్ట్ అంటే మనం చెడ్డ తల్లిదండ్రులమని కాదు; అది మనం ఎంతగా పిల్లలను ప్రేమిస్తున్నామో గుర్తు చేసే మనసు ప్రతిబింబం.
కానీ ఆ గిల్ట్ మనల్ని తినేయకుండా, మనల్ని మెరుగుపరచే దిశగా మలచుకోవడమే నిజమైన పేరెంటింగ్.
పేరెంటల్ గిల్ట్ నుంచి బయటపడే మార్గాలు:
తల్లిదండ్రుల మనసులో గిల్ట్ రావడం సహజం – కానీ ఆ భావన మనసును తినేయకుండా, దానిని మనకి ఒక సహాయకుడిగా ఎలా మార్చుకోవాలో చూద్దాం.
a. “పర్ఫెక్ట్ కాదు, ప్రెజెంట్ కావాలి” అనేది గుర్తుంచుకోండి.
పిల్లలకు మన సమయం కావాలి, మన శ్రద్ధ కావాలి. ఫోన్లు పక్కన పెట్టి 10 నిమిషాలు పిల్లలతో నవ్వండి – అదే వారికి పెద్ద బహుమతి.
ఉదాహరణకి, ఒక రోజు రాధ తన కూతురికి మాట ఇచ్చింది, “ఈ వీకెండ్ సినిమా కి వెళ్దాం” అని. కానీ ఆఫీస్‌లో ఒక అత్యవసర మీటింగ్ రావడంతో వెళ్లలేకపోయింది.
ఆ రాత్రి రాధ తనని తాను తప్పుపట్టుకోవడం మొదలుపెట్టింది. నేను ఎప్పుడూ తప్పే చేస్తా, నేను మంచి అమ్మని కాలేక పోతున్నాను అని.
అయితే, తర్వాత రోజు ఆమె కూతురిని కౌగిలించుకొని చెప్పింది, నిన్ను నిరాశపరచడం నాకూ బాధే, కానీ నీతో గడపడానికి నేను ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాను, I am Sorry అని. కానీ వాళ్ల కూతురు సినిమా లేకపోతే ఏమైందమ్మా, నువ్వు రాత్రి నాతో కలిసి పడుకున్నావు కదా, అది చాలు అని చెప్పింది.
పిల్లలకి మనం కొంచెం సమయాన్ని ఇస్తే చాలు మనం పర్ఫెక్ట్ గా ఉండవలసిన అవసరం లేదు
b. సమయాన్ని క్వాలిటీగా మార్చుకోండి:
సమయం కొద్దిగా ఉన్నా, దానిని ప్రేమతో నింపండి.
ఉదాహరణకి, వెంకట్ తన కుమారుడితో ప్రతిరోజు 10 నిమిషాల “టీ టైమ్ టాక్” ప్రారంభించాడు. వాళ్లు కలిసి బిస్కట్ తింటూ, ఆ రోజు జరిగిన ఫన్నీ విషయాలు చెబుతారు.
అది పెద్ద టైమ్ కాదు, కానీ అనుబంధం పెరిగే క్షణం.
మన పిల్లలు మనతో కలిసి గడిపే ఆ చిన్న నిమిషాలకే పెద్ద అర్థం ఇస్తారు. ఎందుకంటే వారికి కావల్సిందల్లా మన దృష్టి, మన స్నేహం, మన స్మైల్.
c. పోలికలను వదిలేయండి:
సోషల్ మీడియా చూపించే “పర్ఫెక్ట్ పేరెంటింగ్” నిజమైన జీవితం కాదు.
మీరు ఒకరోజు మీ పిల్లలతో నడుస్తూ ఫోన్ పక్కన పెట్టి గడిపే 15 నిమిషాలు – ఆ “రీల్”లో చూపించే ఏదైనా కంటే విలువైనవి. మీ కుటుంబం మీకిష్టమైన రీతిలోనే అందంగా ఉంటుంది.
“వాళ్లు ఏమి చేస్తున్నారు” అన్నదాని కంటే, “మేము ఎలా సంతోషంగా ఉన్నాం” అనే ప్రశ్నను మనసులో పెట్టుకోండి.
d. తప్పులను భయపడవద్దు:
గిల్ట్ ఎక్కువగా “నేను తప్పు చేశాను” అనే భావననుంచి వస్తుంది.
ఉదాహరణకి, సీత తన కొడుకుపై ఒకరోజు అనవసరంగా కోపంగా అరిచింది. తర్వాత చల్లగా కూర్చుని చెప్పింది, “నేను కోపం చూపించకూడదు, క్షమించు. అని”
అది చిన్న తప్పు అనిపించవచ్చు, కానీ ఆ క్షమాపణ పిల్లల మనసులో పెద్ద పాఠం రాసింది,
తప్పు చేసినా అంగీకరించడం సిగ్గు కాదు, ధైర్యం, growth అని.
e. స్వీయ సంరక్షణ (Self-care) చేయండి:
తల్లిదండ్రులు తరచుగా మరిచిపోతారు, తమని తాము చూసుకోవడం కూడా ప్రేమలో భాగమే అని.
పిల్లలు బాగుండాలంటే మన మనసు ప్రశాంతంగా ఉండాలి. ప్రతిరోజూ 10 నిమిషాల ధ్యానం, పుస్తకం చదవడం, నడక, లేదా మనసు నిండే మ్యూజిక్ వినడం, ఇవన్నీ మనలోని ఆత్మస్థైర్యాన్ని పెంచుతాయి. అప్పుడు గిల్ట్ స్థానంలో కృతజ్ఞత, ఆనందం ప్రవహిస్తుంది.
f. సహాయం తీసుకోవడంలో సంకోచించకండి:
కొన్నిసార్లు మన గిల్ట్ పెద్దదై మనలో ఆందోళన లేదా దుఃఖంగా మారవచ్చు. అప్పుడు కౌన్సిలర్ లేదా ఫ్రెండ్తో మాట్లాడటం సిగ్గు కాదు, అది ఒక ఆరోగ్యకరమైన మార్గం. పిల్లల మనసు వినడం ఎంత అవసరమో, మన మనసు వినిపించడం కూడా అంతే అవసరం.
ముగింపు:
గిల్ట్ పేరెంటింగ్ యొక్క నీడ లాంటిది – అది ఉండడం తప్పు కాదు, కానీ దానిని మనసు మీద భారంగా మోసుకోవడం తప్పు. మనము పైన చెప్పిన చిన్న చిన్న మార్పుల ద్వారా ఎప్పుడైతే మన పేరెంటింగ్ స్టైల్ ని మార్చుకుంటాము అప్పుడే మనము ఈ పేరెంటల్ గిల్ట్ ని వదిలి పెట్టగలము.
(వచ్చే వారం మరో టాపిక్‌తో కలుద్దాం)
ఐ.పి. సుహాసిని గారు కిడ్స్ అండ్ పేరెంట్స్ లైఫ్ కోచ్‌గా పని చేస్తున్నారు. చైల్డ్ సైకాలజిస్ట్. పేరెంటింగ్ బ్లాగర్, యూట్యూబర్. పేరెంట్స్ కోసం వాట్సప్‌లో ఒక ఫ్రీ కమ్యూనిటీ నడుపుతున్నారు. ఆ కమ్యూనిటీ లింక్ Simplified Parenting with Suhasini. వారిని mommyshravmusings@gmail.com అనే మెయిల్ ఐడిలో సంప్రదించవచ్చు.
