Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పిల్లల పెంపకంలో నూతన దృక్పథం-31

[ప్రముఖ చైల్డ్ సైకాలజిస్ట్ ఐ.పి.సుహాసిని గారు సంచిక పాఠకుల కోసం ‘పిల్లల పెంపకంలో నూతన దృక్పథం’ అనే ఫీచర్ అందిస్తున్నారు.]

‘మూడ్ స్వింగ్స్’ కాదు.. ఇది డిప్రెషన్ అయి ఉండొచ్చు!

కొన్ని కన్నీళ్లు కనిపించవు, కొన్ని కేకలు వినిపించవు – కానీ తల్లిదండ్రుల హృదయమే వాటిని గుర్తించగలదు.

రేణుక తన 14 ఏళ్ల కూతురు అనన్యను చూసి ఆశ్చర్యపోయింది. ఎప్పుడూ నవ్వుతూ, పాటలు పాడుతూ, స్నేహితులతో కలసి ఉండే అనన్య ఇప్పుడు గది తలుపు వేసుకుని నిశ్శబ్దంగా కూర్చుంటోంది. రేణుక అనుకుంది – “ఇది పెద్దదవుతుండటంలో భాగం.. సాధారణ మూడ్ స్వింగ్స్.”

కొన్ని రోజులు సరదాగా ఆటపట్టించింది, మరికొన్ని రోజులు కోప్పడింది కూడా. కానీ ఒక రోజు, అనన్య కన్నీళ్లు పెట్టుకుని చెప్పింది – “అమ్మా, నాకు ఏమీ చేయాలని అనిపించడం లేదు.. లోపల అంతా ఖాళీగా అనిపిస్తోంది.”

ఆ క్షణం రేణుక హృదయానికి షాక్ తగిలింది. అనన్య గురించి తనకు అన్నీ తెలుసు అని ఎంత భ్రమలో ఉందో తెలుసుకుంది. కానీ వెంటనే ఆ బాధ నుంచి తీరుకొని, తన ఫ్రెండ్ అయినా కౌన్సిలర్‌ని కన్సల్ట్ చేయటానికి బయలుదేరింది.

తల్లిదండ్రులు ఎందుకు ఈ సంకేతాలు మిస్ అవుతున్నారు?

రాము తన 15 ఏళ్ల కొడుకు అజయ్‌లో మార్పులు గమనించాడు. ముందెప్పుడూ స్నేహితులతో నవ్వుతూ ఉండే అజయ్, ఇప్పుడు ఎప్పుడూ ఫోన్‌లో మునిగిపోయి గదిలో కూర్చుంటున్నాడు. వాళ్ళ అమ్మ ఎంత కంగారు పడుతున్న ఇదంతా టీనేజ్‌లో సహజం అని చెప్పి వాళ్ళ అమ్మని సముదాయించాడు.

ఎప్పుడు స్ట్రాంగ్‌గా, నవ్వుతూ, నవ్విస్తూ, ఉండే దివ్య ఇప్పుడు ప్రతి చిన్న విషయానికి దిగులు పడుతూ, టెన్షన్ పడుతూ, కూర్చుంటూ ఉంటే వాళ్ళమ్మ ఎందుకు అన్నిటికీ డ్రామాలు చేస్తావు అని తిట్టడం మొదలు పెట్టారు.

ఇలా చాలా తల్లిదండ్రులు పిల్లలలో కనిపించే మానసిక సంకేతాలను ‘స్వభావం’ అని పొరబడుతున్నారు. ఎందుకంటే మనం “పిల్లలకు బాధలు ఏవుంటాయి?” అనే భావనతో పెరిగాం. వారికి తినడం, చదవడం, ఆటలే జీవితమని భావించాం.

కానీ ఈ తరం పిల్లలు అపరిమిత ఒత్తిళ్లు, సోషల్ కంపారిజన్స్, మార్కుల భారం, ఆన్లైన్ ప్రభావం వంటి ఎన్నో మానసిక ఒత్తిళ్ళకి గురవుతున్నారు. తల్లిదండ్రుల ప్రేమ నిస్వార్థమైనది, కానీ కొన్నిసార్లు ఆ ప్రేమే పిల్లల బాధను గుర్తించడంలో అడ్డంకిగా మారుతుంది – ఎందుకంటే మనం “వాళ్లు బాగానే ఉన్నారు” అని నమ్మడానికే ఎక్కువ ఇష్టపడతాం.

పిల్లల నిశ్శబ్దాన్ని అర్థం చేసుకోవడం, వారి మనసులోని భావనలను వాళ్ళు చెప్పకుండానే వినటం, అన్నదే నిజమైనపేరెంటింగ్.

గమనించాల్సిన ప్రారంభ సంకేతాలు

ఇవి ఒక్కోసారి ‘సాధారణ టీనేజ్ ప్రవర్తన‘ లాగానే కనిపిస్తాయి. కానీ ఇవి కొన్ని వారాలపాటు కొనసాగితే జాగ్రత్తపడాల్సిన సమయం.

తల్లిదండ్రులు ఏం చేయాలి?

రేణుక, రాములలాగే మరెందరో తల్లిదండ్రులు ఒక సమయంలో తడబాటుకు గురవుతారు. పిల్లల్లో మార్పులు గమనించినా, వాటిని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక గందరగోళానికి లోనవుతారు.

ఉదాహరణకు, సాయంకాలం ఇంటికి వచ్చాక ఎలా గడిచింది రోజు అని అడుగుతున్న అమ్మతో మాట్లాడకుండా తల ఒకటి ఊపి గదిలోకి వెళ్ళిపోతాడు అజయ్. మరి ఎక్కువగా అడిగితే ఏమీ లేదు అంతా బానే ఉంటుంది అంటాడు. కానీ ఆ ఏమీ లేదు వెనుక ఎన్నో భావాలు దాగి ఉంటాయి, కొన్నిసార్లు ఆ మౌనం సహాయం కోరుతున్న సంకేతం కూడా కావచ్చు.

ఇలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులు చేయాల్సినది తీర్పు ఇవ్వడం కాదు, అర్థం చేసుకోవడం. పిల్లలతో నెమ్మదిగా, ఒత్తిడి లేకుండా మాట్లాడండి.

ఉదాహరణకు, “నువ్వు కొద్దిరోజులుగా నిశ్శబ్దంగా ఉన్నావు, ఏదైనా మనసులో ఉందా?” అన్నది ఒక్క చిన్న వాక్యం అయినా అది పిల్లల హృదయంలో పెద్ద తలుపు తట్టుతుంది. వారిని మీకు దగ్గర చేస్తుంది. కొన్నిసార్లు కేవలం మీరు వెళ్లి వారి పక్కన కూర్చుని నీతో ఉన్నాను అని చెప్పటం కూడా వారికి ఒక మందు లాగా పనిచేస్తుంది.

తల్లిదండ్రుల సహనం, ఆసక్తి, మీరు వారికి చేసే చిన్న చిన్న సహాయాలు లేదు మీరు వారికి ఇచ్చే చిన్న చిన్న ప్రోత్సాహాలు, మీ చిన్నచిన్న చర్యలు, వాళ్లలో పెను మార్పుని తీసుకొస్తాయి.

ఉదాహరణకు, పిల్లలతో కలసి నడవడం, వారిని తమ ఇష్టమైన విషయంపై మాట్లాడమని ప్రోత్సహించడం, స్క్రీన్ టైమ్ కంటే చర్చా టైమ్ పెంచడం,  ఇవన్నీ పిల్లల మనసుకు మీరు ఇచ్చే ఆక్సిజన్లాంటివి.

గమనించాల్సిన విషయం: అలాగే పిల్లల మాటల్లో నేను లేకపోతే బాగుంటుందేమో, నాకు ఎవరూ లేరు, నేను ఎవరికీ అవసరం లేదు వంటి భావాలు వినిపిస్తే, వెంటనే ప్రొఫెషనల్ సహాయం తీసుకోవాలి. ఒక చిన్న ఉదాహరణ – ఒక అబ్బాయి తన కజిన్‌కి చెప్పాడు: “నేను ఎక్కువ రోజులు ఉండను అనిపిస్తోంది..” అదృష్టవశాత్తు ఆ కజిన్ తల్లిదండ్రులతో పంచుకున్నాడు. ఆ సీరియస్ సిగ్నల్‌ని వారు పట్టుకుని వెంటనే హెల్ప్ తీసుకున్నారు.

కాబట్టి గుర్తుంచుకోండి – కౌన్సెలర్ లేదా సైకాలజిస్ట్ సహాయం తీసుకోవడం బలహీనత కాదు; అది ప్రేమ యొక్క మరొక రూపం. ఎలా శరీరానికి జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తామో, అలాగే మనసు అలసిపోతే కౌన్సిలింగ్‌కి వెళ్లడం కూడా సహజమే.

ముగింపు:

రేణుక తన కూతురు అనన్యను కౌన్సెలింగ్‌కి తీసుకెళ్లిన రోజే, వారు కొత్త జీవితానికి మొదటి అడుగు వేశారు. కొన్ని నెలల్లో అనన్య మళ్లీ నవ్వడం మొదలుపెట్టింది. కౌన్సిలింగ్ అంటే మరి ఏంటో కాదు, చిన్న చిన్న మార్పులు, సంభాషణ, సమయం, అర్థం చేసుకోవడం, పిల్లలకి ఎలాగా తమ సమయాన్ని నిజంగా ఇవ్వాలో తెలుసుకున్న రేణుక అనన్య జీవితం దారి తప్పకుండా కాపాడింది, కౌన్సిలర్ సహాయము వల్ల.

డిప్రెషన్ నిశ్శబ్దంగా దాక్కుంటుంది. కానీ మన జాగ్రత్త చూపు, సహనం, ఆప్యాయత – పిల్లల మనసులో మళ్లీ ఆశాకిరణం వెలిగించే శక్తి కలిగివుంటాయి.

పిల్లల మౌనం వెనక దాగి ఉన్న బాధను వినగలిగినప్పుడు, తల్లిదండ్రుల ప్రేమే వారికి మళ్లీ వెలుగునిస్తుంది.

(వచ్చే వారం మరో టాపిక్‌తో కలుద్దాం)

Exit mobile version