[ప్రముఖ చైల్డ్ సైకాలజిస్ట్ ఐ.పి.సుహాసిని గారు సంచిక పాఠకుల కోసం ‘పిల్లల పెంపకంలో నూతన దృక్పథం’ అనే ఫీచర్ అందిస్తున్నారు.]
మీ పిల్లలు ఫాలో అవుతున్న ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ల గురించి మీరు ఎందుకు తెలుసుకోవాలి?
“అమ్మా, మనం కూడా ఈ కేఫ్‌కి వెళ్లి ఫోటో తీసుకుందాం! అందరూ ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తున్నారు.”
ఇది పదవ క్లాస్ చదువుతున్న శ్రావ్య తన తల్లిని అడిగిన డైలాగ్.
ఆ కేఫ్ వాళ్లు ‘ట్రెండీ డెజర్ట్స్’ కోసం ప్రసిద్ధి చెందారు. రుచి అంత గొప్పగా లేకపోయినా, ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చే ఫోటోలు మాత్రం చాలా స్టైలిష్‌గా కనిపిస్తాయి.
ఇలా, ఒక ‘పోస్ట్’ కోసం పిల్లలు కొత్త ప్రదేశాలు, కొత్త వస్తువులు, కొత్త అలవాట్లను వెంటనే ప్రయత్నించాలనుకోవడం సహజం అయిపోయింది.
ఇన్ఫ్లుయెన్సర్ల శక్తి – పిల్లల మనసులపై ప్రభావం:
పిల్లలు ఎక్కువగా చూసినదే నిజమని నమ్మే వయసులో ఉంటారు. అందుకే ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించే ఫ్యాషన్, గేమ్స్, ఫిట్నెస్, మేకప్, ఫుడ్ – ఏ విషయమైనా వారిని వెంటనే ఆకర్షిస్తుంది. ఉదాహరణకి, పదకొండేళ్ల స్వాతి ప్రతిరోజూ ఒక స్కిన్‌కేర్ ఇన్ఫ్లుయెన్సర్ వీడియోలు చూసి, తనకూ ఆ మాస్కులు, ఫేస్ ప్యాక్స్ కావాలంటూ అమ్మను పట్టుబడుతుంది. అదే సమయంలో, పద్నాలుగేళ్ల కిషోర్ మాత్రం క్రికెట్ ట్రైనింగ్ వీడియోలు ఫాలో అవుతూ, తన బ్యాటింగ్ టెక్నిక్‌ని మెరుగుపరుచుకోవడానికి ప్రాక్టీస్ చేస్తాడు. అంటే, ఇన్ఫ్లుయెన్సర్ల ప్రభావం ఒకపక్క కొత్త నైపుణ్యాలు నేర్పగలిగితే, మరొకపక్క లగ్జరీ లైఫ్, డబ్బు, రూపం వంటి అంశాలనే ముఖ్యమని చూపిస్తూ పిల్లల్లో అవాస్తవ అంచనాలు కూడా కలిగించగలదు. ఒకసారి పదమూడేళ్ల అనన్య తన ఫ్రెండ్స్ రూమ్‌తో పోల్చుకుని, “నా రూమ్ ఎందుకు ఇలా సింపుల్‌గా ఉంది? వాళ్లలా స్టైలిష్ డెకరేషన్ ఎందుకు లేదు?” అని తన తల్లిని అడిగింది. ఇలాంటివి చూస్తే, ఇన్ఫ్లుయెన్సర్లు పిల్లల ఆలోచనల్లో, అభిరుచుల్లో, కలల్లో ఎంత బలంగా ముద్ర వేస్తారో మనకు అర్థమవుతుంది.
అపాయాలు – ఎందుకు జాగ్రత్త అవసరం?
ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లను ఫాలో అవడంలో ఒక పెద్ద సమస్య ఏమిటంటే, పిల్లలు తక్షణ ప్రభావానికి లోనై నిజజీవితంతో పోల్చడం మొదలుపెడతారు.
ఉదాహరణకి:
- పద్నాలుగేళ్ల సాయి ఒక లైఫ్‌స్టైల్ ఇన్ఫ్లుయెన్సర్ వీడియో చూసి, “వాళ్ల రూమ్ అంత అందంగా ఉంది, నా రూమ్ ఎందుకు ఇలా ఉంది?” అని తల్లిని అడిగాడు. ఇలాంటివి వారిలో అసంతృప్తి పెంచుతాయి.
- అలాగే, పదమూడు ఏళ్ల వంశీ ఒక గేమింగ్ ఇన్ఫ్లుయెన్సర్ కొత్త గాడ్జెట్ చూపించగానే, “ఇప్పుడే కొనిపెట్టండి” అంటూ పట్టుబట్టాడు. ఇది డబ్బు విలువను అర్థం చేసుకోకుండా impulsive buying కి దారి తీస్తుంది.
- మరోవైపు, పదకొండేళ్ల పావని ఒక ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్ రెగ్యులర్‌గా చూపించే జంక్ ఫుడ్‌కి బాగా ఆకర్షితమై, ప్రతిరోజూ బయట తినాలనే అలవాటు తెచ్చుకుంది. ఇది ఆరోగ్యపరంగా ప్రమాదకరం.
- ఇంకా కొందరు పిల్లలు beauty ఇన్ఫ్లుయెన్సర్ లని చూసి, “నేను వాళ్లలా slim గా లేను” అని అద్దం ముందు ఎక్కువసేపు నిలబడి ఆందోళన చెందుతుంటారు. దాంతో వాళ్ళల్లో సెల్ఫ్ డౌట్ పెరుగుతుంది. వాళ్ళు కూడా ఆ ఇన్ఫ్లుయెన్సర్ లాగా అవ్వటం కోసం ఎలాంటి మార్గానన్న అనుసరించడానికి ట్రై చేస్తారు.
- ఇలా చూసినప్పుడు, తప్పు కంటెంట్, unrealistic పోలికలు, డబ్బుపై అతి కోరిక, తక్కువ ఆత్మవిశ్వాసం వంటి సమస్యలు – all at once – పిల్లలపై భారంగా పడతాయి. అందుకే తల్లిదండ్రులు జాగ్రత్తగా గమనించడం, మార్గనిర్దేశం చేయడం చాలా అవసరం.
తల్లిదండ్రులు చేయాల్సినవి – పిల్లలతో నడవాల్సిన దారి
1. టాప్ అకౌంట్స్ చెక్ చేయండి
పిల్లలు ఎవరిని ఫాలో అవుతున్నారో తెలుసుకోవడం అంటే కేవలం లిస్ట్ చెక్ చేయడం మాత్రమే కాదు, వారితో ఓపెన్‌గా మాట్లాడటానికి ఒక అవకాశం. ఉదాహరణకి, ఒక తల్లి తన కుమార్తె అకౌంట్ చూసి ఎక్కువగా మేకప్ పేజీలు ఉన్నాయనే గమనించి, “నీకు వీటిలో ఏమి నచ్చింది?” అని అడిగింది. ఆ సంభాషణలో కూతురు తనకు కలర్స్, స్టైలింగ్ అంటే ఆసక్తి ఉందని చెప్పింది. దాంతో తల్లి ఆమెను సైన్స్ ఎక్స్పెరిమెంట్స్, క్రియేటివ్ ఆర్ట్స్ పేజీలు కూడా చూపించి, ఆ దిశగా explore చేయమని ప్రోత్సహించింది.
2. ఓపెన్‌గా మాట్లాడండి
మరో తండ్రి తన కుమారుడితో మాట్లాడుతుంటే, “ఈ ఇన్ఫ్లుయెన్సర్ ఎందుకు నచ్చాడు?” అని అడిగాడు. అలా సంభాషణలోకి వెళ్లి ఇద్దరికీ ఇష్టమైన మ్యూజిక్ గురించి మాట్లాడుతూ సరికొత్త ఇన్‌ఫ్లుయెన్సర్‌ని కనుగొన్నారు. దానితో ఆ తండ్రి తన బాబుతో కలిసి కొత్తగా ఒక్క common interest (మ్యూజిక్) పంచుకున్నాడు. ఇప్పుడు ఆ పిల్లవాడు తన తండ్రితో ఓపెన్‌గా అన్ని విషయాలు పంచుకోవడం మొదలుపెట్టాడు.
3. స్క్రీన్ టైమ్ లిమిట్ చేయండి:
అలాగే కొందరు తల్లిదండ్రులు ఒక సింపుల్ ఫ్యామిలీ రూల్ పెట్టారు – రాత్రి తొమ్మిదింటి తర్వాత Insta వాడకూడదు అని. మొదట్లో పిల్లలు చాలా ఇబ్బందిగా ఫీలయినా, తిట్టుకున్నా, అది ఎప్పుడైతే అలవాటయిందో, వారికి బెడ్ టైం మరింత సులభమైంది, తొందరగా పడుకోవడం వాళ్లకు అలవాటయింది.
4. క్రిటికల్ థింకింగ్ నేర్పండి:
ఇంకో తల్లి తన కూతురిని ఒకసారి అడిగింది – “ఈ వీడియో వాళ్ల నిజమైన లైఫ్ అని అనుకుంటున్నావా? లేక కేవలం కెమెరా కోసం షూట్ చేశారా?” ఆ ప్రశ్నతో ఆ అమ్మాయి మొదటిసారి ఆలోచించింది. ప్రతి వీడియోని నిశితంగా పరిశీలించడం మొదలెట్టింది. దానితో తన దృష్టిని క్రిటికల్ థింకింగ్ వైపు మరిల్చింది, ఎన్నో నేర్చుకుంది.
5. ప్రత్యామ్నాయ రోల్ మోడల్స్ చూపించండి:
అంతేకాదు, ఇన్ఫ్లుయెన్సర్లతో పాటు నిజ జీవిత రోల్ మోడల్స్‌ని కూడా చూపించాలి. ఉదాహరణకి, స్కూల్ టీచర్లు, స్పోర్ట్స్ కోచ్‌లు, కుటుంబంలోని పెద్దలు మొదలగువారు. వారి గురించి కూడా పిల్లలతో మాట్లాడటం ద్వారా రియల్ లైఫ్‌లో చూపించడం చాలా అవసరం. ఇలా ఓపెన్ డైలాగ్, సరైన రూల్స్, ప్రత్యామ్నాయ రోల్ మోడల్స్, అన్ని కలిపి, పిల్లల డిజిటల్ ప్రయాణాన్ని సేఫ్‌గా, హెల్తీగా మార్చగలవు.
ముగింపు – పిల్లల డిజిటల్ ప్రపంచంలో మన బాధ్యత:
పిల్లలు ఇప్పుడు చాలా భాగం తమ డిజిటల్ ప్రపంచంలో గడుపుతున్నారు, ఇక్కడ వారు చూసే ప్రతి ఫోటో, ప్రతి వీడియో వారి ఆలోచనలు, అభిరుచులు, కలల మీద ప్రభావం చూపుతోంది. ఇలాంటి సమయాల్లో, తల్లిదండ్రులుగా మన బాధ్యత కేవలం నియంత్రించడం కాదు; మనం వారిని అర్థం చేసుకొని, మార్గనిర్దేశం చేయడం. ఒక చిన్న సంభాషణ, ఒక మంచి సూచన, ఒక సరైన రోల్ మోడల్ చూపించడం, ఇవన్నీ వారిలో critical thinking, balance, మరియు values పెంపొందించగలవు.
మన పిల్లల, చిన్న మనసులు, ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా అందరికి కనిపించే glamour, డబ్బు, lifestyle చూసి అసలు విలువలు మర్చిపోకుండా, మన మార్గనిర్దేశంతోనే సరిగ్గా మార్గం ఎంచుకుంటారు. మనం వారిని ప్రేమతో, ఓపెన్‌గా, అర్థం చేసుకుని, వారితో మాట్లాడితే, వారు డిజిటల్ ప్రపంచంలో సురక్షితంగా, హెల్తీగా, మరియు ఆనందంగా పెద్దవారి దిశలో అడుగులు వేస్తారు.
ప్రతి చిన్న అడుగు, ప్రతి చిన్న discussion – ఇవన్నీ వారి భవిష్యత్తు digital footprint ని shape చేస్తాయి. ఇలాంటి ప్రయత్నాలు మనకు తీపిగా ఫలిస్తాయి, ఎందుకంటే మనం కేవలం పాఠాలు చెప్పడం మాత్రమే కాదు, జీవితానికి విలువైన దారిని చూపుతున్నాము.
తల్లిదండ్రుల కోసం చిన్న ప్రశ్నలు – Self Reflection
ఈ క్రింది ప్రశ్నలకు మనం నిజాయితీగా సమాధానం చెప్పుకున్నప్పుడు, మనకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. పిల్లలతో healthy conversations జరగడానికి ఇది దారులు తెరుస్తుంది.
- నా పిల్లలు ఎవరి ఇన్‌స్టా అకౌంట్స్ ఫాలో అవుతున్నారు? నేను ఎప్పుడైనా లిస్ట్ చూసానా?
- నేను నా పిల్లలతో వాళ్ల ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి ఓపెన్‌గా మాట్లాడుతున్నానా?
- నా పిల్లలు ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల కొత్తగా ఏదైనా నేర్చుకున్నారా? లేక కేవలం అనుకరిస్తున్నారా?
- వారిని ఎప్పుడైనా “ఇది నిజ జీవితమా? లేక కేవలం షూట్ కోసం show అవుతున్నదా?” అని అడిగానా?
- నా పిల్లలకు నేను ఏ ప్రత్యామ్నాయ రోల్ మోడల్స్ చూపిస్తున్నాను – టీచర్లు, స్పోర్ట్స్ కోచ్‌లు, మా కుటుంబంలోని పెద్దలు?
- ఇంట్లో స్క్రీన్ టైమ్‌కి సరియైన పరిమితులు (Limits) పెట్టామా?
- నేను నా పిల్లలకు సోషల్ మీడియాలో సమతుల్యత నేర్పిస్తున్నానా, లేక కేవలం “యూజ్ చేయొద్దు” అని మాత్రమే చెబుతున్నానా?
(వచ్చే వారం మరో టాపిక్‌తో కలుద్దాం)
ఐ.పి. సుహాసిని గారు కిడ్స్ అండ్ పేరెంట్స్ లైఫ్ కోచ్‌గా పని చేస్తున్నారు. చైల్డ్ సైకాలజిస్ట్. పేరెంటింగ్ బ్లాగర్, యూట్యూబర్. పేరెంట్స్ కోసం వాట్సప్‌లో ఒక ఫ్రీ కమ్యూనిటీ నడుపుతున్నారు. ఆ కమ్యూనిటీ లింక్ Simplified Parenting with Suhasini. వారిని mommyshravmusings@gmail.com అనే మెయిల్ ఐడిలో సంప్రదించవచ్చు.