Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పిల్లల పెంపకంలో నూతన దృక్పథం-3

[ప్రముఖ చైల్డ్ సైకాలజిస్ట్ ఐ.పి.సుహాసిని గారు సంచిక పాఠకుల కోసం ‘పిల్లల పెంపకంలో నూతన దృక్పథం’ అనే ఫీచర్ అందిస్తున్నారు.]

మీ పిల్లలు ఇన్‌స్టాగ్రామ్‌కి రీల్స్ బానిసలుగా మారిపోతున్నారా? పరిష్కారం ఇదే!

📱** “అమ్మా, ఒక్క రీల్ చూసి చదువుకోస్తా..”**

📱** “నాన్నా, నా ఫ్రెండ్స్ అందరూ రీల్స్ చూస్తున్నారు.. నేను చూడకపోతే ఎలా?”**

📱** “స్కూల్ లో చదువుల ఒత్తిడి ఎక్కువగా ఉంది.. కొద్దిసేపు ఇన్‌స్టాగ్రామ్ చూస్తే రిలాక్స్ అవుతా..”**

ఈ మాటలు ఏ రోజైనా మీ ఇంట్లో వినిపిస్తున్నాయా? మీ పిల్లలు చదువు చెప్పి బాగా కూర్చోబెట్టాను అనుకునే లోపలే, వారి చూపు తిరిగి స్క్రీన్ వైపేనా? అంటే మరి మీరు మీ పిల్లల్ని కొంచెం ఇన్‌స్టాగ్రామ్‌కి దూరంగా పెట్టి చదువు మీద కాన్సెంట్రేట్ చేయమని చెప్పడానికి సమయం వచ్చింది.

కానీ మీరు అనుకోవచ్చు, ఇంత చిన్న వీడియోలు – 30 నుంచి 60 సెకన్ల వ్యవధిలో వచ్చే రీల్స్ – పిల్లలపై అంతటి ప్రభావం చూపించగలవా? అవును, ఇది కేవలం సరదా కంటెంట్ మాత్రమే కాదు, మెదడులో డోపమైన్ (Dopamine) అనే రసాయనాన్ని విడుదల చేసి, మరింత ఎక్కువగా చూడాలని తపన పెంచే వ్యసనం. కొంతమంది పిల్లలకు ఇది ‘ఒకటే చూస్తా’ అనే నిర్దోషమైన అలవాటు నుండి, ‘పూర్తిగా ఇన్‌స్టాగ్రామ్ లోనే మునిగిపోయే’ ప్రమాదకర స్థాయికి వెళ్లిపోతోంది. ఒంటరిగా పడుకునే పిల్లల్లో రాత్రి అంతా మేల్కొని ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కూడా చూసే పిల్లలు చాలా మంది ఉన్నారు.

ఈ రీల్స్ ఎడిక్షన్ కారణంగా పిల్లల చదువు పాడవుతుంది నిద్ర పాడవుతుంది. దాంతో పాటు ఆరోగ్యం పాడవుతుంది. అంతే కాదండి వాళ్ళ జీవితమే పాడైపోతుంది. ఎందుకంటే, వాళ్లు వాళ్ళ జీవితంలోని గోల్స్ ఏమిటో మర్చి పోతున్నారు. ఏదైనా సాధించాలి అన్న పట్టుదల కూడా వాళ్లలో తగ్గిపోతుంది.

మరి ఈ రీల్స్ ఎడిక్షన్ పిల్లల్లో ఎలా తగ్గించాలి చూద్దామా? పిల్లలకి చదువుపై ఎలా మళ్లీ ఇంట్రెస్ట్ కల్పించాలి వాళ్లకి గాడ్జెట్స్ లేకుండా జీవితంలో ఎలా తిరిగి మళ్ళీ ఎంజాయ్ చేయాలి అన్నది పరిచయం చేద్దామా?

మరి ముందుగా, ఈ సమస్య ఎందుకు వస్తోంది? పిల్లలు రీల్స్‌ను అంతగా ఎందుకు ఇష్టపడుతున్నారో తెలుసుకుందామా?

రీల్స్ చిన్న వీడియోలు అయినప్పటికీ, అవి మెదడులో డోపమైన్ అనే రసాయనాన్ని విడుదల చేస్తాయి, ఇది తక్షణ సంతృప్తిని కలిగిస్తూ మరింత ఎక్కువగా చూడాలనే కోరికను పెంచుతుంది. స్కూల్ నుండి వచ్చే చదువుల ఒత్తిడి ఇంట్లో పెద్దవాళ్ళు పెట్టే ప్రెషరు ఫ్రెండ్స్‌తో వచ్చే కంపారిజన్ల మూలంగా టెన్షన్లు వీటన్నిటి మూలంగా పిల్లలు తక్షణ రిలీఫ్ కోసం రీల్స్‌కి ఎడిక్ట్ అవుతున్నారు.

అందులో వచ్చే కంటెంట్‌లో ఎక్కువగా, ఫన్నీ వీడియోలు, డ్యాన్స్, మ్యూజిక్, ప్రాంక్స్. ఇవన్నీ పిల్లలను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. వాళ్ళు నిజ జీవితంలో చేయలేనివి ఊహించుకునేవి ఈ రీల్స్‌లో కనిపించేటప్పటికీ వాళ్లు ఈ రీల్స్‌కి ఎక్కువగా ఎట్రాక్ట్ అవుతారు. అంతేకాదండోయ్, ఎక్కువగా ఈ  రీల్స్ చూడటంతో ఆ ప్రాంక్స్‌ని ఇంట్లోనూ లేదా బయట ఎవరికి తెలియకుండానో చేయడానికి ట్రై చేస్తారు, దాంతో జీవితంలోని ప్రమాదాలను కొని తెచ్చుకుంటారు. సిక్స్ మంత్స్ బ్యాక్ వచ్చిన ఒక వైరల్ వీడియో డ్రైవ్ చేస్తూ డాన్స్ చేయడం మూలంగా చాలామంది అది ట్రై చేసి ఆక్సిడెంట్‌కి గురయ్యారు కాళ్లు చేతులు విరగొట్టుకున్నారు.

ఒకేసారి ఒక 30 నిమిషాల ఎడ్యుకేటివ్ వీడియో చూడమంటే పిల్లలు బోరు అని చూడటం లేదు. కానీ అదే 30 నిమిషాల్లో రీల్స్ చూడమంటే వాళ్ళు 30 నిమిషాలు కాదు గంటలు గంటలు కూడా చూసేస్తున్నారు. దాని మూలంగా ఏమవుతుందంటే, వారి మనసుకి ఏకాగ్రత కోల్పోతుంది.  దాని మూలంగా చదువుకునేటప్పుడు కూడా వారి 10 నిమిషాలకు మించి ఫోకస్ పెట్టలేకుండా ఉన్నారు. పైగా ఆ పుస్తకాల్లో మూమెంట్ ఏమీ ఉండదు కదా, మాములుగా ఉండే ప్రింట్ ఉంటుంది. కాని ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో మనుషులు తిరుగుతూ ఉంటారు పైకి కిందకి అంటూ ఉంటే స్క్రీన్ రిఫ్రెష్ అవ్వుతూ ఉంటుంది. కాబట్టి వాళ్లకి అది ఇంకా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. మరి పుస్తకాల్లో ఎంటర్టైన్మెంట్ ఉండదు కదా, అందుకే చదువుకోండి అంటే వాళ్ళకి కాన్సన్‌ట్రేషన్ ఉండటం లేదు.

ఎక్కువసేపు రీల్స్ చూటంతో గడపడం మూలంగా పిల్లల్లో ఒంటరితనం ఎక్కువవుతుంది, సోషలైజేషన్ స్కిల్స్ తగ్గుతున్నాయి. అంటే మిగతా మనుషులతో ఎలా మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలి కూడా మర్చిపోతున్నారు. అంతే కాకుండా ఆ రీల్స్ చూసి వాళ్ళు తమ జీవితం చాలా డల్‌గా ఉంది బోరింగ్‌గా ఉంది అన్న ఫీలింగ్‌తో ఒక రకమైన స్ట్రెస్‌కి లోన్ అవుతున్నారు. దానితో వారిలో కోపం ఎగ్రెసివ్‌నెస్ కూడా ఎక్కువవుతుంది. ఇంకా కొంతమందికి డిప్రెషన్ కూడా వస్తోంది.

పిల్లలను రీల్స్ నుంచి బయటపడేసి చదువుపై దృష్టి కేంద్రీకరించే మార్గాలు:

మార్పు మనతోనే మొదలవుతుంది:

ముందుగా మనము మొబైల్ వాడడం తగ్గించాలి. దానితోపాటు ఇంట్లో నో మొబైల్ జోన్ లేదా నో ఫోన్ జోన్ అని చెప్పి ఏర్పాటు చేయాలి. అంటే ఉదాహరణకి భోజనాల గది లేదు మనం పడుకునే బెడ్ రూమ్‌లో పిల్లలు చదువుకునే స్టడీ రూమ్ లోని ఫోన్లు అసలు తీసుకురాకూడదు. ఎవరు కూడా వాడకూడదు పిల్లలే కాదు అలాంటి రూల్ ఒకటి మనం కొంచెం కఠినమైనా ఇంట్లో అమలు చెయ్యండి.

మొదట్లో సహజంగానే పిల్లలు చాలా అసహనంగా కోపంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఫోన్ గురించి వెతుకుతూ ఉంటారు, కానీ మనము పెట్టుకున్న ఈ రూల్‌ని మనం ఎట్టి పరిస్థితుల్లోని బ్రేక్ చేయకుండా ఈ చదివే గదిలో, భోజనాలు గదిలో, పడుకునే బెడ్రూంలో పడుకోవటానికి ఒక గంట ముందు మొబైల్ చూడకూడదు అని ప్రతి ఒక్కళ్ళు నియమం పెట్టుకుంటే, స్లోగా పిల్లలకి నిద్ర మెరుగవుతుంది. నిద్రమెరుగవటంతో పాటు వాళ్ళలోని కాన్సన్‌ట్రేషన్ పెరిగి చదువు మీద వెచ్చించే సమయం పెరుగుతుంది. దాంతో పాటుగా మనం చదువు అంటే క్లాస్ పుస్తకాలు ఒక్కటే కాకుండా స్టోరీ బుక్స్,  కామిక్ బుక్స్, మరే రకమైన పుస్తకాలైనా కావచ్చు అవి చదవడం కూడా అలవాటు చేయాలి.  దానితో పిల్లలకి చదువు మీద విసుగు లేదు బోర్డమ్ అన్నది తగ్గుతుంది.

మీరు ఫ్యామిలీతో గడిపే సమయాన్ని పెంచండి:

మహారాష్ట్రలోని ఒక గ్రామంలో ఆ గ్రామ సర్పంచి, పిల్లలకి చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది, అని చెప్పి అందరితో మాట్లాడి వారి గ్రామంలో ప్రతిరోజు సాయంకాలం రెండు గంటలు సేపు ఇంటర్నెట్ టీవీలు అన్ని ఆపేయటం మొదలుపెట్టారు. ఆ టైంలో పెద్దవాళ్లు కూడా టీవీ గాని మొబైల్ గాని చూడరు. బయటికి వచ్చి పక్కవాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. ఇలాగ చేయడం మూలంగా ఆ గ్రామంలో పిల్లలు చదువు మీద శ్రద్ధ పెట్టడమే కాక ర్యాంకులు సంపాదించుకుంటున్నారు, మరియు, ఆ గ్రామంలో అందరూ హ్యాపీగా ఆరోగ్యంతో ఉంటున్నారు. వాళ్ళలో జబ్బు పడే వాళ్ళ శాతం కూడా తగ్గుతుంది.

అలాగే మీరు మీ పిల్లలతో రోజుల్లో కొంచెం సేపు మొబైల్ పక్కన పెట్టి గడపడం మొదలు పెట్టండి. మీకు వీలైతే కొంచెం సేపు ప్రకృతిలో గడపండి, వాకింగ్‌కి వెళ్ళండి లేదు ఏదైనా బోర్ గేమ్స్ ఆడండి. ఇలాగే రోజూ ఒక పావు గంట నుంచి అరగంట వరకు మీరు మీ పిల్లలతో మొబైల్ పక్కన పెట్టి గడిపితే వాళ్లకి మొబైల్ లేకుండా సరదాగా ఎలా గడపాలో అన్నది అలవాటవుతుంది.

వాళ్ళని ఏదైనా కొత్త హాబీ క్లాసులో చేర్పించండి లేదు ఇంకొక కొత్త విషయం నేర్పించుకోవడానికి వేరే ఆక్టివిటీ క్లాసులో చేర్పించండి. దాని మూలంగా వాళ్ళు ఇంట్లో ఖాళీగా ఉండి మొబైల్‌తో గడిపే టైం తగ్గుతుంది. వీలైతే మీరు కూడా వాళ్లతో కలిసి ఏదైనా కొత్త హాబీ నేర్చుకోవడం స్టార్ట్ చేయండి దాని మూలంగా పిల్లలకి మీతో అనుబంధం ఇంకా కొంచెం దృఢమవుతుంది.

డోపమైన్ ప్రొడక్షన్ కి కొత్త మార్గాలు:

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూడటం మూలంగా పిల్లలు ఏ విధంగా అయితే తక్షణ ఆనందాన్ని పొందుతారో అంటే డోపమైన్‌ని పొందుతారో దానికి బదులుగా మనము కొత్త మార్గాలని వాళ్ళకి పరిచయం చేయాలి. పిల్లలకి సంగీతం డాన్స్ లేదా ఆటలు ఇలాంటివి నేర్పించడమే కాకుండా దాంట్లో ఏదైనా ఒక ఛాలెంజ్ లాగా ఇచ్చారంటే వాళ్లు మొబైల్ వదిలేసి ఆ ఛాలెంజ్‌లో నిమగ్నమవుతారు.

ఉదాహరణకి ప్రతిరోజు ఒక పెయింటింగ్ చేయటం లేదు ఒక కొత్త పాట నేర్చుకోవటం లేదు ఆ పాట రికార్డ్ మనము ఆ ఛాలెంజ్‌లో పాలు పంచుకుంటే పిల్లలు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు.  దానితో నిదానంగా వాళ్ళు సెల్‌ఫోన్‌లో రీల్స్ చూసేది తగ్గిస్తారు, వారికి కావాల్సిన డోపమైన్ ఈ ఛాలెంజ్ మూలంగా లభ్యమవుతుంది. దాంతో పాటుగా వాళ్ళు, ఈ ఛాలెంజ్ కోసం కష్టపడటం సాధించటం అన్న మనసత్వాన్ని కూడా అలవర్చుకుంటారు.

సోషల్ మీడియాని ప్రొడక్టివ్‌గా వాడడం:

పిల్లలకి సోషల్ మీడియా వాడొద్దు అని చెప్తే వాళ్ళు రహస్యంగా వాడటం మొదలుపెడతారు. దాని బదులుగా మనము సోషల్ మీడియాకి అంటూ రోజుల్లో కొంచెం టైం కేటాయించి, ఆ టైంలో సోషల్ మీడియాలో ఉండే ఎడ్యుకేటివ్ కంటెంట్ అంటే సైన్స్ ఎక్స్పరిమెంట్లు, పాటలు పాడటం, స్టోరీ టెల్లింగ్, ట్రావెల్ విలాగ్స్ ఇలాంటి పేజీల్ని ఫాలో అవటం నేర్పించారంటే, వాటి మూలంగా వాళ్ళు ఎప్పుడైతే నేర్చుకోవడం మొదలెడతారో వాళ్ళు మిగతా టైం పాస్ వీడియోలు దగ్గరికి వెళ్ళరు.

మీ పిల్లలకి ఆడియో బుక్స్‌ని పరిచయం చేయండి. దాని నుంచి వాళ్ళు చాలా ప్రపంచాన్ని చూడగలుగుతారు, వినగల్గుతారు, నేర్చుకోగలుగుతారు. అంతేకాకుండా పాడ్‌కాస్ట్‌ల మూలంగా కూడా ఎన్నో విషయాలు వాళ్ళ స్కూల్‌కి సంబంధించిన పాఠాలు కూడా నేర్చుకోగలుగుతారు. కాబట్టి మీరు కొంచెం రీసర్చ్ చేసి ఆ ఆడియో బుక్స్‌ని, పాడ్‌కాస్ట్‌లని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయండి.

ఇన్‌స్టాగ్రామ్‌ని పూర్తిగా బ్యాన్ చేయడం కంటే, ఉపయోగకరంగా మార్చడం ఉత్తమ మార్గం!

“సాంకేతికతను మనం నియంత్రిస్తే అది మన శక్తి, అదే మనల్ని నియంత్రిస్తే అది బంధనం!”

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వలన పిల్లలకు తక్షణ ఆనందం (instant gratification) లభిస్తుంది, కానీ దీర్ఘకాలికంగా ఆ లోకంలో మునిగిపోతే వారి చదువు, మానసిక ఆరోగ్యం, నిద్ర, సాంఘిక జీవితం అన్నీ ప్రభావితమవుతాయి. ఈ అలవాటు పిల్లల భవిష్యత్తును నాశనం చేసే ప్రమాదం ఉన్నప్పటికీ, సరికొత్త మార్గాలను అన్వేషిస్తూ, వాళ్లను స్మార్ట్‌ఫోన్ బానిసలుగా కాకుండా, స్మార్ట్ లెర్నర్స్‌గా మారుస్తేనే మనము వారిలో గొప్ప మార్పును తీసుకురాగలం.

ఈ సమస్యకు పరిష్కారం ఏదీ ఒకరోజులో సాధ్యపడదు. అధికారాన్ని వాడి మొబైల్ తీసుకోవడం కాదు, మార్గదర్శకత్వం ద్వారా వారిని ఆలోచింపజేయడం ముఖ్యం.

తల్లిదండ్రులు కూడా సోషల్ మీడియా వినియోగాన్ని తగ్గిస్తూ, పిల్లలతో కలిసి నాణ్యమైన సమయం గడిపితే, పిల్లలు సహజంగానే ఆసక్తికరమైన హాబీల్లో, చదువులో, జీవన నైపుణ్యాల్లో నిమగ్నమవుతారు.

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూడడం ఒక ఆప్షన్ మాత్రమే – అది జీవన విధానంగా మారిపోకూడదు!

ఈ మార్గదర్శకాలను పాటిస్తే, మీ పిల్లలు కూడా రీల్స్ అలవాటు నుండి బయటపడి, తమ భవిష్యత్తును స్వయంగా తీర్చిదిద్దుకోగలిగే సమర్థులుగా ఎదుగుతారు.

మీ పిల్లల భవిష్యత్తు రీల్స్ మీద ఆధారపడనీయకండి – వారు తమ కలల్ని సాకారం చేసుకునే దిశగా నడిపించండి!

(వచ్చే వారం మరో టాపిక్‌తో కలుద్దాం)

Exit mobile version