[ప్రముఖ చైల్డ్ సైకాలజిస్ట్ ఐ.పి.సుహాసిని గారు సంచిక పాఠకుల కోసం ‘పిల్లల పెంపకంలో నూతన దృక్పథం’ అనే ఫీచర్ అందిస్తున్నారు.]
మీ పిల్లలని బోర్డ్ ఎగ్జామ్స్ కి ఎలా సమర్థవంతంగా రెడీ చేయాలి?
పరీక్షలు పిల్లల విద్యా ప్రస్థానంలో ఒక కీలక మైలురాయి. ముఖ్యంగా బోర్డ్ ఎగ్జామ్స్ సమయం వచ్చినప్పుడు, విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకూ ఇది ఒక సవాలుగా మారుతుంది. కొందరు పిల్లలు ఎంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగినా, మరికొందరు ఒత్తిడికి గురవుతూ ఆత్మస్థైర్యాన్ని కోల్పోతారు. అసలు, ఈ పరీక్షల ఒత్తిడిని తల్లిదండ్రులు తగ్గించడానికి, పిల్లలకు సరైన మార్గదర్శనం ఇవ్వడానికి ఏం చేయాలి?
సమయాన్ని సమర్థవంతంగా పథకం ప్రకారం ఉపయోగించడం, ఆరోగ్యకరమైన జీవితశైలిని అలవర్చుకోవడం, మానసిక స్థైర్యాన్ని పెంచడం – ఇవన్నీ పరీక్షల సమయంలో కీలకపాత్ర వహిస్తాయి. ఈ వ్యాసంలో, బోర్డ్ ఎగ్జామ్స్ సమీపిస్తున్న తరుణంలో తల్లిదండ్రులు పిల్లలకు ఎలా మద్దతుగా నిలవాలి, వారి సన్నద్ధతను మెరుగుపరిచే విధానాలు ఏమిటి అనే అంశాలను ప్రామాణికమైన పరిశోధనల ఆధారంగా వివరించనున్నాం. దానితో పాటుగా పిల్లలకి కావాల్సిన ఎమోషనల్ సపోర్టు ఎలా ఇవ్వాలో కూడా మనము చర్చించుకుందాం.
1. పిల్లలపై ఒత్తిడిని తగ్గించండి:
పరీక్షలు అనేవి ఒక సాధారణ ప్రక్రియ మాత్రమేనని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. ఫలితాలపై అధిక దృష్టి పెట్టకుండా, వారి ప్రయత్నాన్ని గుర్తించి ప్రోత్సహించాలి. ఇతర విద్యార్థులతో పోల్చటం వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం తగ్గుతుంది, కాబట్టి అలాంటి చర్యలను నివారించాలి. వాళ్లు ఫ్రీగా కనిపించినప్పుడల్లా చదువుకో టైం వేస్ట్ చేయొద్దు అని అనటం తగ్గించి మనము వారికి కొంచెం రిలాక్స్ అవ్వటానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ కూడా ఇంట్లోనే మనము ఏర్పాటు చేయాలి. చదవడం ఒక భారంగా కాకుండా ఒక ఫన్ ఆక్టివిటీ లాగా వాళ్లకి మనము మార్చాలి. అది ఎలాగంటే
- గ్రూప్ స్టడీ సెషన్స్: గ్రూప్ స్టడీ సెషన్స్‌ని ఎంకరేజ్ చేయండి మీ పిల్లల మెంటాలిటీకి తగిన తగినటువంటి ఫ్రెండ్స్‌ని ఇంటికి పిలిచి వాళ్ళు అందరిని కలిసి గ్రూప్ స్టడీస్ చేయమని చెప్పండి. దానివల్ల వారు మరి కొంచెం ఇంట్రెస్ట్‌తో చదవటం మొదలెడతారు
- గేమిఫికేషన్ టెక్నిక్స్: ముఖ్యమైన ప్రశ్నలను తల్లిదండ్రులు లేదా స్నేహితులు క్విజ్గా అడిగితే, ఆటలాగే ఉంటుంది, కానీ టాపిక్‌లు కవర్ అయిపోతాయి. చదివిన ప్రతి టాపిక్కు స్కోర్ ఇవ్వండి – కొన్ని టాపిక్స్ పూర్తయితే రివార్డు (ఒక చిన్న బ్రేక్ లేదా ఫేవరెట్ స్నాక్ ఇవ్వండి).
2. సమయ నిర్వహణను ప్రోత్సహించండి:
ఒక సమతుల్యమైన టైమ్‌టేబుల్ రూపొందించడం ద్వారా పిల్లలు తక్కువ ఒత్తిడితో ఎక్కువ నేర్చుకోగలుగుతారు. కఠినమైన సబ్జెక్టులకు ప్రాధాన్యత ఇవ్వడం, మద్యలో విరామాలు ఉండేలా చూడడం, మరియు ప్రతిరోజూ రివిజన్‌కు సమయం కేటాయించడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. ఎలాగంటే:
- పోమోడోరో టెక్నిక్ (25-5 రూల్): 25 నిమిషాలు చదివి, 5 నిమిషాలు బ్రేక్ తీసుకోవడం ద్వారా మైండ్ ఫ్రెష్‌గా ఉంటుంది. పిల్లలు మరింత సమర్థంగా నెర్చుకోవటానికి చేయడానికి ఈ టెక్నిక్ ఉపయోగపడుతుంది.
- ప్రాక్టీస్ టెస్ట్స్ & టైమ్డ్ రివిజన్: రోజుకు కనీసం ఒక మాక్ టెస్ట్ రాయడం, టైమర్ పెట్టుకొని రివిజన్ చేయడం లాంటివి పాటించటం వల్లన, లాస్ట్ నిమిషం ప్రెజర్ తగ్గుతుంది.
3. స్మార్ట్ స్టడీ టెక్నిక్స్ ఉపయోగించండి:
సాదా పుస్తకాలు చదవడం కంటే, దృశ్య మరియు శ్రావ్య పద్ధతుల ద్వారా విద్యార్థులు వేగంగా నేర్చుకోవచ్చు. మైండ్ మ్యాప్స్, ఫ్లాష్ కార్డ్స్, మరియు నోట్-మెకింగ్ వంటి పద్ధతులు సమర్థవంతంగా ఉపయోగించాలి. అలాగే, ప్రాక్టీస్ టెస్ట్స్ రాయడం వల్ల సమయ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది.
- మైండ్ మ్యాప్స్: మైండ్ మ్యాప్స్ అంటే ఏమిటో కాదు ప్రతి సబ్జెక్టులోని ప్రతి ఒక్క లెసన్కి ఒక చిన్న డయాగ్రామ్ లాగా రాయడమే. ఇంటర్నెట్లో ఈ కాలంలో బోర్డ్ ఎగ్జామ్స్‌లో ఉండే ప్రతి సబ్జెక్టుకి మైండ్ మ్యాప్ దొరుకుతున్నాయి లేదు అంటే మీ పిల్లల్ని కూడా మైండ్ మ్యాప్స్ తయారు చేసుకోమని చెప్పండి.
- ఆడియో & వీడియో స్టడీ టెక్నిక్స్: విషయాలను రికార్డ్ చేసుకుని వినడం, యూట్యూబ్ లెక్చర్స్ లేదా ఎడ్యుకేషనల్ యాప్‌లలో వీడియోలు చూడటం వలన ఇంపార్టెంట్ టాపిక్స్, ప్రిన్సిపల్స్ తొందరగా మైండ్ లోకి ఎక్కుతాయి.
4. ఆరోగ్యం, నిద్ర, మరియు ఆహారం పై శ్రద్ధ వహించండి:
శారీరక ఆరోగ్యం మరియు మానసిక స్థిరత పరీక్షల సమయంలో అత్యంత కీలకం. సరైన పోషకాహారం, రోజుకు కనీసం 7-8 గంటల నిద్ర, మరియు ఒత్తిడిని తగ్గించే సాధనాలు (యోగా, ప్రాణాయామం, వాకింగ్) పిల్లలకు మెరుగైన ఫోకస్ అందిస్తాయి.
- మెడిటేషన్ & రిలాక్సేషన్ టెక్నిక్స్: రోజుకు 5 నిమిషాలు డీప్ బ్రీతింగ్ లేదా మెడిటేషన్ చేయించడం మరిచిపోకండి. రిలాక్సింగ్ కోసం కొంచెం సేపు మంచి పాటలు వినడం లేదు ప్రకృతిలో వాకింగ్ కి వెళ్లడం లాంటివి కూడా చేయటం వల్ల మైండ్ రిలాక్స్ అవుతుంది. ఈ మైండ్ ఫుల్ బ్రేక్స్ తీసుకోవటం మూలంగా మెదడు మీద ఒత్తిడి తగ్గి రిలాక్స్ అవుతుంది దాని మూలంగా మళ్ళీ ఫోకస్డ్గా చదవడం మొదలు పెట్టవచ్చు.
5. ఎమోషనల్ సపోర్టు ఇవ్వండి:
తల్లిదండ్రుల ప్రోత్సాహం పిల్లలకు ఎంతో మానసిక శక్తినిస్తుంది. పరీక్షల సమయంలో చిన్న విజయాలను సెలబ్రేట్ చేయడం, పిల్లలతో పాజిటివ్‌గా మాట్లాడటం, విఫలమైనా వెనకడుగు వేయకుండా మళ్ళీ ప్రయత్నించమని నచ్చజెప్పడం అవసరం.
- పిల్లల భయాలు, సందేహాలను అర్థం చేసుకోండి: పిల్లలు పరీక్షల గురించి ఏవైనా భయాలు లేదా ఆందోళన కలిగి ఉంటే, వారితో ఓపికగా మాట్లాడండి. “పరీక్షల్లో ఎక్కువ మార్కులు రాకపోతే ఏమవుతుంది?” అనే భయం వారిలో కలగకుండా చూడండి. “నీ ఉత్తమ ప్రయత్నమే ముఖ్యం” అనే నమ్మకాన్ని వారిలో పెంచండి.
- ఫలితాల కంటే ప్రయత్నాన్ని ప్రోత్సహించండి: ఫలితాలపై దృష్టి కంటే, “ఈ సారి ఎంత బాగా ప్రయత్నించావో చూద్దాం” అనే దృక్పథాన్ని కలిగించండి. చిన్న చిన్న విజయాలను సెలబ్రేట్ చేయండి – ఉదాహరణకు, ఒక క్లిష్టమైన టాపిక్‌ను పూర్తి చేసినప్పుడు చిన్న బ్రేక్ లేదా ఫేవరెట్ స్నాక్ ఇవ్వండి.
6. చివరి రెండు వారాల్లో కొత్త విషయాలు చదవకుండా, రివిజన్‌పై దృష్టి పెట్టండి:
పరీక్షల సమీపంలో ఉండగా కొత్త విషయాలు నేర్చుకోవడం కంటే, ఇప్పటికే తెలుసుకున్న అంశాలను సమగ్రంగా రివైజ్ చేయడం మంచిది. ముఖ్యమైన ఫార్ములాలు, డయాగ్రామ్స్, మరియు షార్ట్ నోట్లను పునర్విమర్శించాలి. ఈ సమయంలో పిల్లలు ప్రశాంతంగా ఉండేలా తల్లిదండ్రులు సహాయపడాలి.
బోర్డ్ పరీక్షలు విద్యార్థుల అకడమిక్ జీవితంలో ఒక కీలక దశ. అయితే, ఈ పరీక్షలు పిల్లల భవిష్యత్తును నిర్ణయించేవి కావు – అవి కేవలం ఒక స్థాయి పరీక్ష మాత్రమే. తల్లితండ్రులుగా మనము పిల్లలపై అంచనాలు పెంచకుండా వారిని ప్రేరేపించడమే మన ముఖ్యమైన కర్తవ్యం అని అనుకుని వారి ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాము అప్పుడే మన పిల్లలు స్వేచ్ఛగా ఆత్మవిశ్వాసంతో బోర్డ్ ఎగ్జామ్స్‌ని ఎదుర్కొనగలరు.
తల్లిదండ్రులకు ఒక ముఖ్యమైన సందేశం:
పరీక్షలు పిల్లల జీవితంలో ఒక భాగమే కానీ, అవి వారి మేధస్సుకు లేదా భవిష్యత్తుకు ఏకైక ప్రమాణం కావు. విజయం అనేది కేవలం మార్కుల ద్వారా మాత్రమే నిర్ణయించబడదు, జీవితానికి అవసరమైన ఆత్మవిశ్వాసం, మనోధైర్యం, మరియు నేర్చుకునే ఆసక్తి ఎంతో ముఖ్యమైనవి.
తల్లిదండ్రులుగా, పరీక్షల సమయంలో పిల్లలను ఒత్తిడిలోకి నెట్టి మరింత భయాందోళన కలిగించకుండా, వారి ప్రయాణానికి మద్దతుగా ఉండండి, ఓపికగా వినండి, ప్రేరేపించండి. విజయానికి ప్రతి ఒక్కరికీ ఒక ప్రత్యేకమైన మార్గం ఉంటుంది. మీ పిల్లలు ఎంతో కష్టపడి చదివినందుకు గర్వపడండి, వారి ప్రయత్నాన్ని గుర్తించి ప్రోత్సహించండి. పరీక్షలు ముగిసిన తర్వాత, పిల్లలతో కలిసి ఈ ప్రయాణాన్ని విశ్లేషించండి, భవిష్యత్తు కోసం మరింత మెరుగైన ప్రణాళికలు రూపొందించండి.
“పరీక్షల ఒత్తిడిని పోగొట్టి, పిల్లలకు ప్రేమ, విశ్వాసం, మానసిక బలాన్ని అందించండి. నిజమైన విజయం మార్కుల్లో కాదు, జీవన పాఠాలలో ఉంటుంది!”
(వచ్చే వారం మరో టాపిక్‌తో కలుద్దాం)
ఐ.పి. సుహాసిని గారు కిడ్స్ అండ్ పేరెంట్స్ లైఫ్ కోచ్‌గా పని చేస్తున్నారు. చైల్డ్ సైకాలజిస్ట్. పేరెంటింగ్ బ్లాగర్, యూట్యూబర్. పేరెంట్స్ కోసం వాట్సప్‌లో ఒక ఫ్రీ కమ్యూనిటీ నడుపుతున్నారు. ఆ కమ్యూనిటీ లింక్ Simplified Parenting with Suhasini. వారిని mommyshravmusings@gmail.com అనే మెయిల్ ఐడిలో సంప్రదించవచ్చు.