[ప్రముఖ చైల్డ్ సైకాలజిస్ట్ ఐ.పి.సుహాసిని గారు సంచిక పాఠకుల కోసం ‘పిల్లల పెంపకంలో నూతన దృక్పథం’ అనే ఫీచర్ అందిస్తున్నారు.]
పిల్లలకి వినే చెవి కావాలి, వంక పెట్టే నోరు కాదు!
మనందరికీ మన పిల్లల మీద ఎంతో ప్రేమ ఉంటుంది కానీ మనం వాళ్ళతో ఏం మాట్లాడుతున్నామో అన్నది ఒకసారి ఆలోచిద్దామా?
“వినడం అనేది ప్రేమ చూపించే మొదటి మెట్టు.”
– ఈ మాట ఎంత సరైనదో తెలుసుకోవాలంటే మన పిల్లలతో చేసే ప్రతి సంభాషణను ఓసారి గుర్తు తెచ్చుకుందామా?
- “చెప్పినట్టు వినలేవు!”
- “ఎన్నిసార్లు చెబితే అర్థం అవుతుంది?”
- “నువ్వేనా చిన్న పిల్లోడివి అనుకుంటున్నావా?”
- “ఈ మాత్రం తెలీదు”
- “ఇలాగైతే ఎలా ఉంటుంది?”
ఇవే కాదు ఇలా ఇంకెన్నో మరెన్నో చెప్పుతూనే ఉంటాం అవునా? అదే, మన పిల్లలు మనతో మాట్లాడడానికి వస్తే మనం వాళ్ళతో ఎలా మాట్లాడుతాం అని ఆలోచించండి.
- “ఆ చెప్పు, ఏంటి తొందరగా చెప్పు తగలడు నాకు బోలెడు పనుంది అవతల”
- “మీటింగ్‌లో ఉన్నాను నన్ను డిస్టర్బ్ చేయకు”
- “అబ్బా ఇప్పుడు అలసిపోయాను తర్వాత మాట్లాడుతాలే”
మనము వారితో చెప్పే లేదా మాట్లాడే మాటలే ఎక్కువ అవుతున్నాయి గానీ, మనము నిజంగా వాళ్ల మనసులో ఉండే భావనలను గాని మాటలు గాని తెలుసుకోవాలి అని వాళ్లతో గడిపే సమయం తగ్గిపోతుంది.
ఈ జనరేషన్ లోని పిల్లలు విషయాలను చక్కగా వ్యక్తపరచగలుగుతారు – ఒకే పరిస్థితిని వాళ్లదైన కోణంలో చూడగలుగుతారు. కానీ వారికి అవసరమైనదేమిటంటే – వారిని అర్థం చేసుకునే ఓ శ్రద్ధగా వినే చెవి.
“When children are heard, they feel valued. When they are blamed, they feel unseen.”
అంటే – పిల్లలు మనల్ని నమ్మాలంటే, ముందుగా మనం వారి మాటలని వినాలి, భావనలని అర్దము చేసుకోవాలి.
ఈ వ్యాసంలో మనం
- పిల్లల మనసు గెలుచుకోవాలంటే మనము ఎలా వినాలి,
- ఎక్కువగా తప్పులు ఎంచటం వల్ల పిల్లలపై ఎలా ప్రభావం పడుతుంది,
- ఇంకా వినే తల్లిదండ్రులుగా మారటానికి మనం ఎలాంటి ప్రయత్నాలు చేయాలి.
పిల్లలు ఎప్పుడు మాట్లాడతారు?
మన పిల్లలు చిన్నవాళ్లైనా, వాళ్లకు అనుభవాలు ఉంటాయి. మనసులో ఎన్నో ప్రశ్నలు, భావోద్వేగాలు, సందేహాలు, కోపాలు, కలలు ఉంటాయి. పిల్లలు మాట్లాడే ముందు ఒకటి చూస్తారు – “నేను చెప్పినప్పుడు అమ్మా నాన్న వింటారా?”
వింటారన్న నమ్మకం ఉంటేనే వారు మాట్లాడతారు. లేదంటే – నిశ్శబ్దంగా మారిపోతారు. వారి మాటలును ఎవరితో పంచుకోవాలో తెలియక వాటిని మనసులోనే అని చేస్తూ ఉంటారు.
ఎప్పుడైతే మనము వాళ్ళ మాటల్ని ప్రశాంతంగా వినగలము వాళ్లతో టైం స్పెండ్ చేయగలము అన్న నమ్మకం ఉంటేనే, అప్పుడే వారి మనసులో మాటను బయట పెడతారు.
అప్పుడే వారు:
- తల్లిదండ్రులను స్నేహితులుగా భావించడానికి మొదలు పెడతారు.
- తమ భావాలను అర్ధవంతంగా వ్యక్తపరచడం నేర్చుకుంటారు.
- ఎక్కువగా మాట్లాడటానికి మొగ్గు చూపుతారు.
ఇక్కడ చిన్న ఉదాహరణ:
ఓ 10 ఏళ్ళ కూతురు తన అమ్మకి ఇలా చెప్తోంది:
“అమ్మా, నాన్న నన్ను ఎప్పుడూ నెగిటివ్‌గా కామెంట్ చేస్తాడు. నేనేం చేసినా సరే ఏదో ఒకటి తిడతారు.. అందుకే నాన్నకి ఏదైనా చెప్పాలి అంటే నాకు వణుకు వస్తుంది.”
ఈ మాటలు మన పిల్లల మనసులో నిత్యం జరిగే సంఘర్షణకి నిదర్శనం.
వారు మనతో మాట్లాడలేదు అంటే తప్పు చేశారు అని కాదు, భయపడి మాట్లాడటం ఆపుతున్నారు అని కూడా అర్థం చేసుకోవాలి. పిల్లలకి మనతో మాట్లాడాలి అంటే ముందుగా మన మీద నమ్మకం కావాలి, భయం లేకుండా చూసుకోవాలి.
మానసిక శాస్త్రం ఏమంటోంది?
పిల్లల అభివృద్ధిలో ‘అటాచ్మెంట్ థియరీ’ ప్రకారం,
“Consistent, empathetic listening from caregivers builds secure emotional bonds in children.”
అంటే, తల్లిదండ్రులు పిల్లల మాటలు జాగ్రత్తగా వింటూ ఉంటే పిల్లలలో:
- భద్రతా భావన పెరుగుతుంది,
- భావోద్వేగాలను నియంత్రించుకునే సామర్థ్యం వస్తుంది,
- మనోధైర్యం పెరుగుతుంది.
చిన్న టిప్: పిల్లలతో బలమైన బంధం కోసం మీరు చేయాల్సిందల్లా –
వారు మాట్లాడేటప్పుడు మొబైల్ పక్కన పెట్టండి, అన్ని పనులు పక్కకు పెట్టి వాళ్ళ కళ్ళల్లోకి చూస్తూ వాళ్ళ మాటల్ని వినండి.
అది మాయ కాదు – మీ ప్రేమని, మీ పిల్లలకి చూపెట్టగలిగే ఏకైక గొప్ప సాధనం మీరు వారి మాటలు వినటం.
పిల్లల మనసుపై అతిపెద్ద బరువు – మన మాటలే:
పిల్లలు ఎదుగుతున్నపుడు చాలా తప్పులు చేస్తారు – అది సహజం. కానీ మనం తల్లిదండ్రులుగా ప్రతీసారి “పొరపాటు చేసిన ప్రతీసారీ తిట్లు, పోలికలు, ఒత్తిడి” పెడితే – మన పిల్లలు మన ప్రేమ కన్నా, మన నోటిని ఎక్కువగా గుర్తుపెట్టుకుంటారు. పిల్లలు ఏమనుకుంటారో తెలుసా?
- “ఎంత చెప్పినా ఉపయోగం లేదు..”
- “నన్ను ఎప్పుడూ తప్పుగా చూస్తారు..”
- “నేను చెప్పినా ఎవరూ వినరు..”
ఈ భావనలు నెమ్మదిగా పిల్లలలో లోపలి తలనొప్పులుగా మారుతాయి – వారికి,
- తక్కువ ఆత్మవిశ్వాసం (Low self-esteem) ఏర్పడుతుంది
- తల్లిదండ్రులకి దూరం జరిగిపోతారు (Emotional disconnect)
- బయట్లో వారిని అర్థం చేసుకునే వారి కోసం వెతకడం (Seeking validation outside)
దానితో వారు మౌనంగా ఉండిపోవడం మొదలెడతారు. అంటే అర్థం వాళ్ళు శాంతిగా ఉన్నారని మంచి పిల్లలుగా ఉన్నారని అనుకుంటే, అది పొరపాటు కూడా కావచ్చు. ఎందుకంటే మన పిల్లలు బాధని కూడా అణిచేసుకుంటున్నారు కాబట్టి.
ఇక్కడ చిన్న ఉదాహరణ:
ఒక తల్లి తన 14 ఏళ్ల కుమార్తెను ప్రతి రోజు స్కూల్ హోమ్‌వర్క్ విషయంలో బాధించేది.
“పక్కింటి వర్షిత పాప ఎంత చక్కగా చదువుతోంది! నువ్వు ఉన్నావు నీకు ఏంటి చేతకాదు!”
ఆ పాప మెల్లగా చదువు మీద విముఖత పెరిగింది. దానితో చదువుకి అమ్మకి ఇద్దరికీ దూరమైంది.
చిన్న టిప్: చెప్పడం తప్పు కాదు, ఎలా చెప్పావు అన్నది ముఖ్యం
“ఎందుకు ఇలా చేసావు?” అనే మాటకన్నా
“నీకు అప్పుడు ఏమనిపించింది?” అనే ప్రశ్న
పిల్లల హృదయానికి దగ్గర అవుతుంది.
వినే చెవి పిల్లలకి ఏమి ఇస్తుంది?
మనమందరం జీవితంలో ఎప్పుడైనా ఓసారి ఈ మాటలు ఎవరో ఒకరితో చెప్పే ఉంటాం.
“ఓ మారు నన్ను విని చూడండి!”
ఇదే మాటలు మన పిల్లలు మన మనసులో చెప్పకుండా ఉండిపోతుంటారు. మనం వారి మాటలని ఆలోచనల్ని విన్నపుడు వాళ్లకి కలిగే అనుభూతి అమూల్యం. మన పిల్లలు చెప్పిన మాటలకి స్పందించడం కాకుండా, ఎప్పుడైతే, మనసుతో వింటామో, అదే మనం వాళ్ళకి ఇచ్చే గొప్ప బహుమతి.
వినే చెవి పిల్లలకు ఇచ్చే గొప్ప బహుమతులు:
1. భద్రతాభావం (Sense of Safety):
“నన్ను అమ్మా నాన్న వినగలరన్న నమ్మకం”
పిల్లలు ఈ నమ్మకంతో ఏ విషయమైనా మనతో పంచుకుంటారు – చిన్నదైనా, పెద్దదైనా. ఇది భవిష్యత్తులో నైతిక నిర్ణయాలు తీసుకోవడంలో చాలా కీలకం.
2. ఆత్మవిశ్వాసం (Confidence):
వారి మాటలు మనం వినడం వల్ల “నా అభిప్రాయాలు విలువైనవే” అనే బలమైన భావన కలుగుతుంది. అది బోల్డ్ మరియు ఇన్డిపెండెంట్‌గా ఎదగడంలో సహాయపడుతుంది.
3. ఆత్మీయ సంబంధం (Emotional Bonding):
పిల్లలతో మనం వింటూ ఉన్న ప్రతీసారి, వారు మన హృదయానికి దగ్గరపడతారు. ఈ బంధం వారి టీన్ ఏజ్‌లో ముఖ్యమైన రక్షణ కవచంలా ఉంటుంది.
4. ఆలోచనా స్వేచ్ఛ (Freedom to Express):
పిల్లలు మనం తీర్పు లేకుండా వింటామని గమనిస్తే, వారు స్వేచ్ఛగా భావాలను పంచుకుంటారు. అది సృజనాత్మకత, మానసిక ఆరోగ్యం రెండింటికీ సహకరిస్తుంది.
వినే తల్లిదండ్రులు ఎలా మారాలి?
“వారు నన్ను వింటున్నారని నాకు అనిపించదు..”
ఇది చాలా మంది పిల్లల మనసులో ఉన్న, కానీ నోటితో చెప్పలేని బాధ.
వారు దూరమవుతున్నారు అనిపిస్తున్నప్పుడే..
మనకి వారిని దగ్గర చేసుకోవడానికే ఓ అద్భుత అవకాశముంటుంది – వినే తల్లిదండ్రులుగా మారడం.
🔹 రోజు 10 నిమిషాలు ‘నిశబ్ద సమయం’ ఇవ్వండి
పాఠశాల నుండి వచ్చిన తరువాత లేదా రాత్రిపూట నిద్రకి ముందు –
👉🏼 “ఇప్పుడు నిన్ను వింటున్నా. నువ్వు చెప్పు.” అని స్పష్టంగా చెప్పండి.
ఇది పిల్లలో మనసు తెరవడానికి మొదటి మెట్టు అవుతుంది.
🔹 ప్రతి రోజు 10 నిమిషాలు – మొబైల్ లేని సమయం:
పిల్లలు మాట్లాడే సమయంలో మొబైల్ పక్కన పెట్టండి. మీ దృష్టి పూర్తిగా పిల్లల మీద పెట్టండి వేరే పనిలేవి పెట్టుకోకండి
వారి కళ్ళలోకి చూస్తూ, తల ఊపుతూ స్పందించండి.
ఇది వారికి “నన్ను గౌరవిస్తున్నారు” అన్న భావనను కలిగిస్తుంది..
🔹 జడ్జ్ చేయకుండా వినండి:
వారు చెప్పే విషయానికి “నీ వయసులో నేనెంత కష్టపడ్డానో తెలుసా!” అని మధ్యలో జడ్జ్ చేయకండి.
వారి అనుభవాన్ని వారి కోణంలో అర్థం చేసుకోవాలనే ప్రయత్నం చేయండి. “ఇది నీకు ఎలా అనిపించింది?” లేదా “అప్పుడు నీవు ఏం చేశావు?” లాంటి ప్రశ్నలు అడగండి.
ఉపదేశం ఇవ్వకండి – వారు మాట్లాడేలా చేయడమే గెలుపు.
🔹 శరీర భాషతో సహా వినండి:
వారి కళ్లు చెబుతున్న భావాలను చదవండి. వారు మాటల్లో చెప్పలేకపోయిన అనుమానాలు, భయాలను వినండి.
నిశ్శబ్దంలో వినగలగడం కూడా వినే కళలో భాగమే.
🔹 వారు చెప్పింది గుర్తుపెట్టుకోండి మళ్లీ ప్రస్తావించండి అవసరమైనప్పుడు:
నిన్న వారు చెప్పిన చిన్న విషయాన్ని ఈరోజు ప్రస్తావిస్తే,
నా మాటని మా అమ్మ నాన్న శ్రద్ధగా వింటున్నారు అన్న ప్రేమ అనుభూతితో ప్రేమతో నిండిపోతారు.
చిన్న టిప్: మీ పిల్లలు చెబుతున్నది మధ్యలో ఆపవద్దండి
ముగింపు: ప్రేమించే ముందు వినాలి!
పిల్లలకి మంచి విలువలు నేర్పాలి, బాగా చదవాలి, బాధ్యతగా ఎదగాలి అని మనకెంతో ఆశ.
కానీ ఆ మార్గం విమర్శల దారిలో కాక, వినే చెవుల దారిలో ఉండాలి.
మనకు పిల్లలు మాట వినాలనిపిస్తుంది..
కానీ వాళ్లు మన మాట వినాలంటే ముందు మనం వారి మాట వినాలి.
వినే తల్లిదండ్రులే – మార్పును తీసుకురాగల శక్తివంతమైన మార్గదర్శులు.
చిన్న సంఘటన – పెద్ద బోధ:
ఒకసారి ఓ చిన్న బాబు తండ్రిని అడిగాడు –
“నాన్నా, మీరు నా మాటలు వింటున్నారా? లేక వినిపించుకుంటున్నారా?”
తండ్రి ఆశ్చర్యపోయాడు. బాబుని ప్రశ్నల్లోని లోతు తండ్రికి కొత్త విషయం నేర్పించింది
వినడం ఒక విషయం.. వినిపించడం ఇంకో విషయం!
పిల్లలు ఎప్పుడూ మనం నిజంగా వింటున్నామా? లేక పెదవుల మీదుగా మాత్రమే స్పందిస్తున్నామా? అన్నది స్పష్టంగా గుర్తిస్తారు.
ఈరోజు ఒకసారి పిల్లల్ని పిలిచి
“నిన్ను వింటున్నా – చెప్పు కన్నా!” అనే మాట చెప్పండి.
వారు ఒకవేళ ఆశ్చర్యపోయినా సరే –
ఆ మాట వాళ్ళలో ఒక కొత్త ఆశ నింపుతుంది.
(వచ్చే వారం మరో టాపిక్‌తో కలుద్దాం)
ఐ.పి. సుహాసిని గారు కిడ్స్ అండ్ పేరెంట్స్ లైఫ్ కోచ్‌గా పని చేస్తున్నారు. చైల్డ్ సైకాలజిస్ట్. పేరెంటింగ్ బ్లాగర్, యూట్యూబర్. పేరెంట్స్ కోసం వాట్సప్‌లో ఒక ఫ్రీ కమ్యూనిటీ నడుపుతున్నారు. ఆ కమ్యూనిటీ లింక్ Simplified Parenting with Suhasini. వారిని mommyshravmusings@gmail.com అనే మెయిల్ ఐడిలో సంప్రదించవచ్చు.