[ప్రముఖ చైల్డ్ సైకాలజిస్ట్ ఐ.పి.సుహాసిని గారు సంచిక పాఠకుల కోసం ‘పిల్లల పెంపకంలో నూతన దృక్పథం’ అనే ఫీచర్ అందిస్తున్నారు.]
నువ్వే పెద్దవాడివి అన్న మాట – సోదర బంధాన్ని బలహీనం చేస్తుందా?
పెద్దవాడవు కదా.. తమ్ముడిని బాగా చూసుకో!
అక్కవు కదా.. చెల్లెలికి నువ్వు రోల్ మోడల్ గా ఉండాలి!
ఈ మాటలు మనందరికీ చాలా సార్లు వినిపించినవే. కానీ ఈ మాటల వెనక దాగి ఉన్న అసలు భావన ఏంటి?
అసలీ “పెద్దదానివి/పెద్దవాడివి, బాధ్యత నీదే” అనే ఆలోచన పిల్లల హృదయాల్లో సోదర బంధంపై ఎంత ప్రభావం చూపిస్తుంది?
మన జీవితాల్లో అన్నయ్య-తమ్ముడు, అక్క-చెల్లెలు అనేది ఒక ప్రత్యేకమైన అనుబంధం. పంచుకునే ఆటలు, చిన్నపాటి గొడవలు, అనుకోని కబుర్లు – ఇవన్నీ కలసి ఎదిగే బంధం. కానీ అదే బంధం కొన్నిసార్లు తల్లిదండ్రుల మాటల వల్ల ఒత్తిడిగా మారే ప్రమాదం ఉంది. ఇంకా దానికి తోడు, చుట్టుపక్కల వాళ్ళ మాటలు ఇంట్లో పెద్ద వాళ్ళ మాటలు తోడు అయ్యాయంటే ఎంత ఒత్తిడి పిల్లలు గురవుతారు మీకు తెలుసా?
ఒక చిన్న ఉదాహరణ:
తన ఆర్ట్ క్లాస్ నుంచి వచ్చిన 8 ఏళ్ల చిన్నారి, ఎంతో ఆసక్తిగా తన వేసిన చిత్రం చూపిస్తున్నాడు. కానీ అక్క చేతిలో స్కూల్ హోమ్ వర్క్ ఉంది. దాంట్లో టీచర్ రాసిన వెరీ గుడ్ అన్న మెచ్చుకోలు ఉంది, దాంతోపాటు స్లిప్ టెస్ట్ పేపర్ కూడా ఉంది దాంట్లో ఫుల్ మార్క్స్ సాధించింది అని టీచర్ ఇచ్చిన స్టార్ కూడా ఉంది. కానీ అది చెప్పే అవకాశం రాకుండానే తమ్ముడు వచ్చేసాడు. వచ్చి రావడంతోనే అమ్మ అటెన్షన్ మొత్తం తమ్ముడు మీదికే వెళ్లిపోయింది. చూడు తమ్ముడు ఎంత బాగా చేశాడో వాని మెచ్చుకొని ఏదైనా పెట్టు అని అమ్మ అనడంతోని, అక్క నిరాశగా తన పుస్తకం పక్కన పెట్టి ఇంట్లోకి వెళ్లిపోయింది. ఇలాంటి చిన్న ఉదంతాలు రోజురోజుకీ పెద్ద తేడాలుగా మారే ప్రమాదం ఉంటుంది.
ఇలాంటి అనుభవాలు ప్రతి ఇంట్లో ఎదురవుతుంటాయి. ప్రేమ చూపించాలని అనుకుంటూ, తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్లు చెప్పే చిన్న చిన్న మాటలు చాలు, సోదర బంధాల్లో విరోధాలను పెంచటానికి. ఈ వ్యాసంలో మనం తల్లిదండ్రులుగా మన పిల్లల మధ్యన ఉండే బంధాన్ని ఎలాగా పటిష్టం చేయాలి, సోదరుల మధ్య ఉండే సిబ్లింగ్ రైవల్రీని ఎలా తగ్గించాలి అని తెలుసుకుందాము.
తల్లిదండ్రులు తెలియకుండానే చేసే కొన్ని సాధారణ పొరపాట్లు:
తల్లిదండ్రుల మనసులో ఎప్పుడూ పిల్లలపై ప్రేమే ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో, ఆ ప్రేమనే తెలియజేయడంలో వారు చేసే కొన్ని చర్యలు పిల్లల మధ్య విభేదాలకు బీజం పడతాయి. అవి వారి భావోద్వేగ బంధాన్ని బలహీనంగా చేస్తాయి. అవి ఏమిటో ముందుగా చూద్దామా?
1. పోలికలు పెట్టడం – “ఇతనిలా ఎందుకు కాలేవు?”
తల్లిదండ్రులు ఎంత మాత్రం పోలికలు పెట్టకుండా ఉండాలంటే కష్టం. కానీ తరచూ పోలికలు పెట్టడం వల్ల, పిల్లల మధ్య అసూయ, ద్వేష భావనలు పెరుగుతాయి.
ఉదా: “చెల్లెలు ఎంత సమర్థంగా చదువుతుంది! నీవెందుకు అంత జాగ్రత్తగా ఉండవు?”
ఇలాంటి మాటలు చిన్నదానికి గర్వం, పెద్దవాడికి అసహనం తెచ్చేస్తాయి.
బదులుగా: “ప్రతి ఒక్కరూ తేడాగా ఉండేవాళ్లే. నీకు నువ్వే స్పెషల్ అని మీ పిల్లల్లో కాన్ఫిడెన్స్ నింపండి.
2. ఒకరికి ఎక్కువ శ్రద్ధ చూపడం:
చిన్నవాడికి ఎక్కువ శ్రద్ధ అవసరం అనుకోవచ్చు. కానీ పెద్దవాడు కూడా మనసున్న వాడే. అతనికి “నేనెవరూ కాదు” అన్న భావన రాకుండా చూడాలి.
ఉదా: ఎంతసేపు ఒకరినే మెచ్చుకోవటం లేదు ఒకరితోనే టైం స్పెండ్ చేయడం.
బదులుగా: ప్రతి ఒక్కరితో ప్రత్యేకంగా గడిపే సమయం కేటాయించాలి – ఒక్కోరితో ఒక్కో రకంగా అనుసంధానం అవసరం.
3. ప్రతి గొడవలోని పెద్దవాడికే ఎడ్జస్ట్ అవమని చెప్పటం:
తప్పు ఎవరిదైనా, “నువ్వే పెద్దవాడివి కదా.. ఒప్పుకో” అన్న నైతిక ఒత్తిడితో సమస్యను విరామం చేయడం చాలా పెద్ద న్యాయబద్ధత లోపం.
బదులుగా: సరిగా చేయవలసింది: యథార్థంగా, ఎవరిది తప్పో వారినే సున్నితంగా గమనింపజేయడం.
4. సంకేతాలను తక్కువ అర్థం చేసుకోవడం:
ఒక బిడ్డ మరొకరిపై అసూయతో వ్యవహరిస్తుంటే – “ఆడుకుంటున్నారు” అని తీసిపారేయడం. కానీ వాస్తవంలో ఆ ఆటల వెనక నొప్పి, దుఃఖం, అనుభవాల్ని దాచిన బంధం ఉండవచ్చు.
బదులుగా: పిల్లల భావోద్వేగాలపై జాగ్రత్తగా గమనించటం, వారి మాటల వెనకని భావాలు తెలుసుకోవటం.
5. ప్రతీసారి తల్లిదండ్రులే మధ్యలో రావడం:
ఒక్కరు తప్పు చేస్తే వెంటనే మిగతవారిపై అరవడం లేదా మద్యలో జోక్యం చేసుకోవడం వల్ల, పిల్లలు తమ సమస్యలను స్వయంగా పరిష్కరించలేరు.
సూచన: పిల్లలకు సమస్య పరిష్కారం నేర్పే అవకాశం ఇవ్వాలి – కొంత మేరకు వారు నేర్చుకునేలా సహాయం చేయాలి.
ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు చేయటం ఆపేస్తే పిల్లల మధ్య అనుబంధం దృఢతరమవుతుంది.
సోదర బంధాన్ని ప్రేమగా తీర్చిదిద్దడానికి కావాల్సిన చిట్కాలు:
ఒకే ఇంట్లో పెరిగే పిల్లలు – ఒకరినొకరు భిన్నంగా భావించాలి, గౌరవించాలి, ప్రేమించాలి.
ఈ బంధం సహజంగా ఉండాలంటే తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఇవే ఇప్పుడు మనం చూడబోయే ప్రాక్టికల్ చిట్కాలు:
1. ప్రతి బిడ్డ తోని ప్రత్యేకంగా టైం స్పెండ్ చేయండి:
ఒకే ఇంట్లో పుట్టినా కూడా ఏ ఇద్దరు పిల్లలకి ఒకే వ్యక్తిత్వం రాదు. ఎవరి వ్యక్తిత్వం వాళ్లకి ఉంటుంది వాళ్ళ అవసరాలు అభిరుచులు కూడా వేరేగా ఉంటాయి. అందుకే వాళ్ళు మన నుంచి ఆశించే తోడ్పాటు కూడా డిఫరెంట్ గా ఉంటుంది.
అందుకే ప్రతి ఒక్కరితోని వారి అభిరుచి తగ్గట్టుగా ఒంటరిగా సమయం గడపండి దానితో పిల్లలకి అమ్మానాన్న నా మీద ప్రేమ ఎక్కువ అన్న భావన కలుగుతుంది.
ఉదా: పెద్దవాడితో రాత్రి నడక, చిన్నవాడికి పుస్తకం చదివి వినిపించడం మొదలగునవి.
2. తమ సమస్యలు తమే పరిష్కరించుకునేలా మార్గనిర్దేశనం చేయండి:
ప్రతి చిన్న గొడవలో తల్లిదండ్రుల జోక్యం అవసరం లేదు. పిల్లల అన్నాక కొట్టుకుంటారు మళ్ళీ కలిసి పోతారు. వాళ్లు మీ దగ్గరికి వచ్చి కంప్లైంట్ చెప్తున్నప్పుడు ఇద్దరి కంప్లైంట్ లు వినండి ఒక అద్దం లాగా మీరు, వారి మనసులో భావనలు వారికే చూపెట్టేటట్టు ప్రవర్తించండి. మీరు ఎట్టి పరిస్థితుల్లోని ఇంకొకరి సైడ్ తీసుకోకండి.
ఉదా: నువ్వు అక్క పుస్తకం తీసుకున్నందుకు బాధపడుతున్నావా?, నువ్వు తమ్ముడిని ఎందుకని కొట్టవలసి వచ్చింది? ఇలాంటి ప్రశ్నలతో పిల్లలు మాటల ద్వారా సమస్యను పరిష్కరించడం నేర్చుకుంటారు.
3. ఒకరికొకరు మెచ్చే వాతావరణం కల్పించండి:
పిల్లలు చేసిన మంచి పనులను అందరి ముందు పోలికలు పెట్టకుండా ప్రశంసించండి. అలాగని తమ్ముడి ముందు అన్నయ్యని అన్నయ్య ముందు తమ్ముని కూడా మెచ్చుకోండి. అన్నయ్య తమ్ముని ఎంతగా ప్రేమిస్తున్నాడో లేదా తమ్ముడు అన్నయ్యని ఎంతగా గౌరవిస్తున్నాడో చెబుతూ ఉంటే ఒకళ్ళు అంటే ఒకళ్ళకి గౌరవభావం పెరుగుతుంది.
ఉదా: చూడరా, నీ అన్నయ్య నిన్న నువ్వు వేసిన చిత్రాన్ని ఎంత బాగుందన్నాడో! అని తమ్ముడికి చెప్పినా, తమ్ముడికి నువ్వు చేసే ప్రాజెక్టు వర్క్ అంటే చాలా ఇష్టము అని అన్నయ్యకి చెప్పినా వారిద్దరిలో పోటీ పడే మనస్తత్వం తగ్గుతుంది.
4. పెద్దవాడనేదీ ఒత్తిడిగా కాకుండా – గౌరవంగా చూపించండి:
నువ్వే పెద్దవాడివి నువ్వే సర్దుకుపోవాలి అని పదే పదే అంటూ పిల్లల్లో ఒత్తిడి పెంపొందించకుండా, ఇద్దరినీ సరి సమానంగా సర్దుకుపోమని చెప్పాలి.
ఉదా: “నీ లాంటి అన్నయ్య ఉండడం వల్ల నీ తమ్ముడు ధైర్యంగా ఉంటాడు” అనే మాటలు అన్నయ్యతోని, నీలాంటి తమ్ముడు ఉండటం వల్ల అన్నయ్య బయటకి స్నేహితుల కోసం వెళ్లాల్సిన అవసరం లేదని అంటున్నాడు అని తమ్ముడి తోని చెప్పండి. ఇవి పిల్లలలో గౌరవభావాన్ని పెంచుతాయి.
5. కథల ద్వారా విలువలు నేర్పండి:
పిల్లలకు విలువలు బోధించాలంటే నేరుగా చెప్పడం కన్నా, కథల ద్వారా చెప్పడం ఎంతో ప్రభావవంతంగా ఉంటుంది. ముఖ్యంగా సోదర బంధంపై ఆధారపడిన పురాణ గాథలు, జాతీయ కథలు వారికి మానసికంగా బలాన్ని, మార్గదర్శకతను ఇస్తాయి.
ఉదా: శ్రీరాముడు తన తమ్ముడు లక్ష్మణుడిని ఎంత గౌరవంగా చూసేవాడో – ఆయనతో మాట్లాడేటప్పుడు “లక్ష్మణా” అని అభిమానం కలిగించే తీరుతో ఉండేవాడు. ఇది పిల్లలకి అన్నయ్య/తమ్ముడు మధ్య గౌరవం ఎలా ఉండాలో నేర్పుతుంది.
ఈ చిట్కాలు అమలు చేయడంలో కాస్త త్యాగం, కాస్త ఓర్పు, కాస్త సమయం అవసరం. కానీ ఫలితం మాత్రం – జీవితాంతం నిలిచే అనుబంధం.
ముగింపు:
పిల్లల మధ్య సోదరబంధం అనేది ఒక జీవితాంతం నడిచే ప్రయాణం. చిన్ననాటి గొడవలు, భిన్నమైన అభిప్రాయాలు, వాటిల్లో దాగిన మాధుర్యం – ఇవన్నీ కలసి ఆ బంధాన్ని మరింత బలంగా చేస్తాయి. కానీ ఆ బంధం ఎలా తీరిగమించాలో, అది కోరికగా మారాలో – అన్నీ తల్లిదండ్రుల ఆచరణపై ఆధారపడి ఉంటాయి.
“నువ్వే పెద్దవాడివి..” అనే మాట, ప్రేమతో అన్నా, బాధ్యత పేరుతో ఒత్తిడిగా మారే ప్రమాదం ఉంది.
అందుకే, పిల్లల మనసులు అర్థం చేసుకుంటూ, ఒక్కొక్కరిని వారి ప్రత్యేకతలని, వారి భావాలని, అంగీకరిస్తూ వారిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి.
ప్రేమ, సహనం, పరస్పర గౌరవం – ఇవే పిల్లల మధ్య అనుబంధానికి మూలస్తంభాలు.
మీరు వారిద్దరికీ తల్లి-తండ్రులే కాబట్టి, మీ ప్రేమ ప్రతి ఒక్కరికి పంచండి ఆ ప్రేమే వాళ్ళ ఇద్దరినీ కలిపేందుకు వారధి అయ్యేటట్టు మీరు ప్రవర్తించండి.
(వచ్చే వారం మరో టాపిక్‌తో కలుద్దాం)
ఐ.పి. సుహాసిని గారు కిడ్స్ అండ్ పేరెంట్స్ లైఫ్ కోచ్‌గా పని చేస్తున్నారు. చైల్డ్ సైకాలజిస్ట్. పేరెంటింగ్ బ్లాగర్, యూట్యూబర్. పేరెంట్స్ కోసం వాట్సప్‌లో ఒక ఫ్రీ కమ్యూనిటీ నడుపుతున్నారు. ఆ కమ్యూనిటీ లింక్ Simplified Parenting with Suhasini. వారిని mommyshravmusings@gmail.com అనే మెయిల్ ఐడిలో సంప్రదించవచ్చు.