Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పిల్లల పెంపకంలో నూతన దృక్పథం-10

[ప్రముఖ చైల్డ్ సైకాలజిస్ట్ ఐ.పి.సుహాసిని గారు సంచిక పాఠకుల కోసం ‘పిల్లల పెంపకంలో నూతన దృక్పథం’ అనే ఫీచర్ అందిస్తున్నారు.]

ఒకే భోజన పంక్తి – ఒక కుటుంబ కథనం

ఒకే పంక్తిలో కూర్చొని భోజనం చేయడం.. మామూలుగా అతి సాధారణంగా అనిపించే ఈ క్రియ వెనక ఎన్నో గాథలుంటాయి. కుటుంబమంటే కేవలం రక్తసంబంధాలు మాత్రమే కాదు, ప్రతి రోజు కలిసి జీవించే క్షణాల్లో బంధాలు బలపడతాయి. వాటిలో ముఖ్యమైనదీ – భోజన సమయాల్లో అందరూ కలిసి ఒకే పంక్తిలో భోజనం చేయడం.

అప్పట్లో అమ్మ రుచిచూపిన వంటలూ, నాన్న చెప్పిన ఆఫీసు సంగతులూ, అక్క చెయ్యని హోం వర్క్స పై అన్న చేసిన సరదా కామెంట్లు – ఇవన్నీ ఒకే భోజన పంక్తిలో ఏర్పడిన అనుబంధాల జాడలు. కానీ కాలం మారింది. ఒకే ఇంట్లో ఉండే మనుషులు కూడా వేర్వేరు టైమింగ్ లలో తినే పరిస్థితి వచ్చేసింది.

ఈ కథనం – ఒకే పంక్తిలో భోజనం చేసిన రోజుల జ్ఞాపకాలని గుర్తు చేయడానికి మాత్రమే కాదు, ఆ భోజనాల్లోని తీయదనాన్ని ఆనందాన్ని తిరిగి మన జీవితాల్లోకి తీసుకురావాలన్న ప్రయత్నం. ఎందుకంటే.. ఒకే పంక్తి వద్ద కూర్చోవడం అంటే కడుపు నిండటం కాదు, మనసులు కలవడం మరియు నిండటము కూడా!

పూర్వ కాలంలో భోజన పంక్తుల ప్రాముఖ్యత:

ఒకప్పుడు ఇంట్లో భోజన సమయం అంటే ఒక పండుగ వాతావరణం. పెద్దలు ముందు కూర్చుంటే, పిల్లలు వారికన్నా తక్కువస్థానాల్లో కూర్చుంటారు. ప్రతి వంటకంలో అమ్మ ప్రేమతో ఉడికించిన ఆత్మీయత ఉండేది. తినేటప్పుడు ఎవరి ఎవరి చేతిలోనూ మొబైల్ ఫోన్ లేదు గదిలో టీవీ అంతకన్నా లేదు. అందరూ ఒకరినొకరు చూసుకుంటూ సరదాగా కబుర్లు ఆడుకుంటూ తినేవాళ్ళు.

ఆ సమయాల్లో భోజనం అనేది కేవలం శారీరక అవసరం కాదు – అది ఒక కుటుంబాన్ని మానసికంగా దగ్గర చేసే మూల మూలిక. పెద్దల ఆశీస్సులు తినేటప్పుడే లభించేవి. నాన్న ఓ పద్యం చెప్పేవారు, తాత ఓ జాతక కథ చెప్పేవారు. అప్పుడే వంటల బడ్జెట్‌కి సంబంధించిన చిన్ని తగాదాలు, చిన్నక్క టమోటా పచ్చడి నచ్చలేదని ముఖం బిగబట్టడం, ఆ సన్నివేశాల్లో అంతెత్తు ఆనందం దాగి ఉండేది.

ఇలా ఒక్క భోజన పంక్తి వద్ద కూర్చునే ఆచారం, కుటుంబంలో ఉన్న ప్రతి సభ్యుని జీవితంలో ఒక విలువైన సంపదని ఇచ్చేది– అవే ఆత్మీయత మమకారం అనే విత్తనాలు. ఆ విత్తనాలు పెరిగి పెద్దవి అయ్యి మనకి అందరూ ఉన్నారు అందరికీ మనము ఉన్నాము అని ఒక గొప్ప సంతృప్తిని ఇచ్చేవి అదే మనకి అసలైన సంపద. అది తరిగేది కాదు పంచుకున్న కొద్ది పెరుగుతుంది.

మొన్న ఒక రోజు మా వాడు నన్ను అడిగాడు, మీరు సమ్మర్ హాలిడేస్‌లో ఏం చేసే వాళ్ళు – టీవీలు మొబైల్‌లు లేకుండా మీకు బోర్ అనిపించలేదా అని? చిన్నప్పటి నా వేసవి సెలవులు గురించి గుర్తు తెచ్చుకుంటే నాకు బాగా గుర్తు ఉన్నది ఏంటంటే పంక్తి భోజనాలు. అవునండి, పంక్తి భోజనాలే. వేసవికాలం అంటే ఆవకాయల సీజన్ కదా. ఆవకాయ కలిపిన గిన్నెలో, ఇంత అన్నం వేసి మా నానమ్మ కలుపుతూ ఉంటే పిల్లలందరం తన చుట్టూ చేరి కథలు చెప్పమని గొడవ పెడుతూ ఉంటే, తను ఎన్ని కథలు చెప్పేదో, ఎన్ని ఊసులు చెప్పేదో, లెక్కపెట్టలేము, కానీ ఈ లోపల మా కడుపులో మటుకు నిండిపోయేవి. కాకపోతే ఆ తర్వాత మా అమ్మ వాళ్లు కుక్కర్ ఇంకోసారి పెట్టినప్పుడు తెలిసేది మేము అన్నం మొత్తం ఖాళీ చేసేసామని.

ఇది మా వాడికి వివరించి చెప్పినా అర్థం అవ్వని పరిస్థితి. ఎందుకంటే, అప్పట్లో గా అన్ని కుటుంబాలు వేసే సెలవుల్లో కలవడం లేదు కదా. ఎవరికి వాళ్లు వాళ్ళ ఫ్యామిలీతో వెకేషన్‌కి వెళ్ళిపోతున్నారు. ఒకవేళ కలిసినా ఎవరికి కావాల్సిన టైమ్‌లో వాళ్లు వాళ్లకు కావాల్సింది చేసుకొని/ తెప్పించుకొని తింటున్నారు. అందుకే ఈ కాలం పిల్లలకి పంక్తి భోజనాల మహత్యం తెలియడం లేదు

ఇప్పుడు ఏమైపోయింది ఆ పంక్తి?

కాలం మారింది. జీవనశైలి వేగం పుంజుకుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి వ్యక్తిగత షెడ్యూల్, స్క్రీన్ టైమ్, ఆఫీసు టైమ్, క్లాసులు, ట్యూషన్లు.. అంతా వేరు వేరు. ఒకే ఇంట్లో ఉన్నా, ఒక్కసారిగా అందరూ కలిసి భోజనం చేయడం అరుదైపోయింది.

తల్లి వంట చేస్తూ పిల్లల కోసం టిఫిన్ బాక్సులు సర్దుతూ ఉంటే, పిల్లలు మొబైల్ స్క్రీన్ చూస్తూ టేబుల్ దగ్గర బిజీగా ఉంటారు. నాన్న పనిచేస్తున్న లాప్టాప్ ముందే భోజనం పూర్తవుతుంది. చివరకు – ఒకే ఇంట్లో నాలుగు విభిన్న భోజన సమయాలు.

ఎప్పుడైతే మనము బిజీ జీవితాన్ని ఆలింగనం చేసుకున్నాము అప్పటినుంచి, మన జీవితం అంతా ఉరుకులు పరుగులతో నిండిపోయింది. దానితో పాటే, పంక్తి భోజనం అన్న సాంప్రదాయం కాస్త కనుమరుగైపోయింది. ఎందుకంటే మరి దానికి మనం టైం ఇవ్వాలి కదా, మరి ఆ టైమ్ ఏ మన దగ్గర లేదు కదా.

అందుకే పంక్తి భోజనం కాస్త ఇప్పుడు ఒక జ్ఞాపకం అయిపోయినట్టు అనిపిస్తుంది. ఆ జ్ఞాపకం మరి మరికొంత కాలానికి కనుమరుగు కూడా అయిపోతుంది. కానీ అది తిరిగి మన ఇంట్లోకి వచ్చేందుకు ఆహ్వానం ఇవ్వడం మన చేతిలోనే ఉంది కదా?

ఒకే పంక్తిలో, ఒకటైన హృదయాలు:

ఒకే పంక్తి వద్ద కూర్చొని భోజనం చేయడం అంటే కడుపు నింపుకోవడమే కాదు – అది మనసుల్ని కలిపే సామూహిక యజ్ఞంలా కూడా. ఆ సమయాల్లో ఎవరి మొబైల్ లేదు, ఎవరి చెవుల్లో ఇయర్ ఫోన్లు లేవు. ఉన్నది ఒకటే ఒకరి మీద ఒకరికి ప్రేమ, ఆప్యాయత. ఒకరి మనసులో మాట చెప్పకుండానే ఇంకొకరు తెలుసుకునే మమకారం.

పంక్తి భోజనం చేసే ఆ క్షణాలలో:

1. అనుబంధం బలపడుతుంది:

రోజుకి కనీసం ఒకసారి అయినా కలిసి కూర్చొని మాట్లాడటం వలన కుటుంబ సభ్యుల మధ్య పరస్పర విశ్వాసం, సాన్నిహిత్యం పెరుగుతుంది. మొబైల్ స్క్రీన్లు తప్పించి ముఖాముఖీ మాట్లాడే అవకాశం ఇదే.

2. పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది:

వారి మాటలకు విలువ ఇచ్చే వాతావరణం ఉంటే పిల్లలు తల్లిదండ్రులతో తమ భావోద్వేగాలను స్వేచ్ఛగా పంచుకుంటారు. ఇలా మాట్లాడే సమయంలో వారు గౌరవం, శ్రద్ధ, వినయం నేర్చుకుంటారు.

3. ఆరోగ్యవంతమైన భోజనపు అలవాట్లు ఏర్పడతాయి:

కుటుంబంతో కలిసి కూర్చుంటే జంక్ ఫుడ్‌కు బదులుగా మంచి ఇంటి వంటలపై ఆసక్తి పెరుగుతుంది. మితంగా తినడం, చద్దీగా తినడం వంటి ఆరోగ్య అలవాట్లు పిల్లల్లో సహజంగా కలుగుతాయి.

4. మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది:

రోజువారీ ఒత్తిడి, ఒంటరితనం నుంచి బయటపడటానికి కుటుంబ భోజన సమయం ఒక మంచి తాలూకు విరామం. నవ్వులు, సరదా సంభాషణలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి.

5. సంస్కారం , కుటుంబ విలువలు బోధించవచ్చు:

పూర్వీకుల సంస్కారాలు, నైతిక విలువలు, మనం మన కుటుంబ వ్యవస్థపై కలిగించాలనుకునే ప్రభావం – ఇవన్నీ చిన్న మాటల ద్వారా పంథిలో నేర్పవచ్చు. తాతయ్య చెప్పే కథలు, అమ్మ పంచే సన్నివేశాలు పిల్లల్ని ఊహించలేని విధంగా ప్రభావితం చేస్తాయి.

6. వాయిదా వేసే గొడవలు తగ్గుతాయి:

కుటుంబ సభ్యులు ప్రతి రోజు మాట్లాడుకుంటే అపార్థాలు తగ్గుతాయి. చిన్న చిన్న మనస్పర్థలు ఆ సమయంలో పరిష్కరించబడి, సంబంధాలు మరింత బలపడతాయి.

7. సమష్టి ఆనందం అనుభవించగలుగుతారు:

పాటలు పాడుతూ, జోక్స్ చెప్పుకుంటూ, ఒకరి ప్లేటులో మరొకరు పెట్టిన ముద్దల్లో ఓ కుటుంబం చిరునవ్వుతో ఉండే క్షణాలు – ఇవే జీవితంలోని నిజమైన ధనంగా మిగులుతాయి.

మనుషుల మధ్య ఉన్న దూరాన్ని తగ్గించడమే కాదు, మన హృదయాల్ని ఒకే తాళంలో అనుసంధానించడమే ఆ సంప్రదాయం సారాంశం. ఒకే పంక్తి అనేది కేవలం భోజన స్థలం కాదు – అది కుటుంబ బంధాలను దృఢతరం చేసి, మనుషుల మనసులని దగ్గర చేసే ఆలయం.

ఇప్పటికైనా తిరిగి ఆ పంక్తి వైపు..

జీవితంలో అన్నిటికీ సమయం కేటాయిస్తున్నాం.. కాని కుటుంబంతో కలిసి కూర్చొని భోజనం చేయడానికి రోజు పది నిమిషాల సమయం వెచ్చించలేకపోతే, ఆ బంధం ఎప్పుడు బలపడుతుంది?

పిల్లల మనసులు బలంగా ఎదగాలంటే, ప్రేమతో నిండి ఉండే చిన్న చిన్న సంభాషణలు అవసరం. అలాంటి సంభాషణలకు సరైన వేదిక – మన పంక్తి.

ఒకే పంక్తిలో కూర్చొని భోజనం చేయడమంటే కేవలం అన్నం తినడమే కాదు

అది మనం నీకు నేను ఉన్నానుఅని చెప్పే ఆత్మీయ హస్తం.

ఈ చిన్న సాంప్రదాయాన్ని తిరిగి మన జీవితం లోకి తీసుకొస్తే, పిల్లలతో మాటలు కలవడం సులభం అవుతుంది. మనసులోని విషయాలను పంచుకునే వేదిక అవుతుంది. మన పిల్లలు ఎదిగిపోయాకా, వారు గుర్తుపెట్టుకునే అందమైన జ్ఞాపకం – ఇదే అవుతుంది. “నాన్న, అమ్మతో పంక్తిలో కూర్చొని అన్నం తినిన రోజులు ఎంత బాగుండేవో” అనే భావన వాళ్ల గుండెల్లో నిలిచిపోతుంది.

ఈ సంస్కృతిని అమలు చేయడానికి కొన్ని సాధ్యమైన చిట్కాలు:

1. వారానికి కనీసం మూడు రోజులు ఫిక్స్ చేయండి

పూర్తిగా ప్రతిరోజూ సాధ్యం కాకపోయినా, Monday, Wednesday, Friday లేదా Weekend రోజు అయినా ఒక ఫ్యామిలీ డిన్నర్ ఫిక్స్ చేసుకోండి. అది ఒక చిన్న బంధానికి పెద్ద బలం.

2. మొబైల్స్‌కు విరామం ఇవ్వండి

పంక్తి సమయాన్ని స్క్రీన్-ఫ్రీ గావించండి. అందరూ ఫోన్లు పక్కన పెట్టినప్పుడు నిజమైన సంభాషణలు ప్రారంభమవుతాయి.

3. ప్రతిసారీ ఒక సభ్యుడిని “పంక్తి నాయకుడు” చేయండి

ఆ రోజు వారు చర్చ చేయాల్సిన అంశాన్ని తెస్తారు – అది సరదా ప్రశ్న కావచ్చు (“మీకు నచ్చిన సినిమా ఏది?”) లేక చిన్న జ్ఞాపకాన్ని పంచుకోవచ్చు.

4. భాగస్వామ్య భోజనం సిద్ధం చేయండి

వంటలో ప్రతి ఒక్కరూ చిన్న భాగం తీసుకుంటే, ఆ తిన్నెలో అనుబంధం కూడా కలిసిపోతుంది.

5. వారం పథకం సిద్ధం చేయండి

రెండు మూడు రోజుల మెను ముందే ప్లాన్ చేసుకుంటే భోజన సమయాన్ని ఆఖరి నిమిషంలో రద్దు చేయాల్సిన అవసరం ఉండదు.

6. ఈ క్షణాన్ని ‘ఫ్యామిలీ రిచువల్’గా తీసుకోండి

పంక్తి కూర్చోవడం అనేది ఒక ఇంటి సంప్రదాయంగా భావించండి. పిల్లలకు ఇది గౌరవించదగిన వేళగా గుర్తు చేస్తే, వాళ్లకు కూడా ప్రాధాన్యం తెలుస్తుంది.

మరి, ఆలస్యం ఎందుకు, ఈ రోజు రాత్రే మొదలుపెట్టండి!

ఒకే పంక్తిలో ఒక చిన్న బుట్ట అన్నం పెట్టి, పిల్లల్ని పిలిచి, చిన్నగా నవ్వుతూ, వారితో ముచ్చటించండి.

వారు మొన్నటి స్నేహితుడి గురించి చెప్పొచ్చు, మీరు ఒక పాత జ్ఞాపకం పంచవచ్చు.

ఆ ముద్దలో మానవత ఉంది. ఆ మాటల్లో మనసున్న బంధం ఉంది.

ఒకే పంక్తి.. ఒకే మనసు.. ఒకే కుటుంబ గుండె ధ్వని.

మీ ఇంట్లో పంక్తి సంస్కృతి ఎలా ఉంది? మీరు ఏ రోజుల్లో కుటుంబంగా కలిసి భోజనం చేస్తారు? మీ పిల్లలకున్న అనుభవాలు మాతో పంచుకోండి!

(వచ్చే వారం మరో టాపిక్‌తో కలుద్దాం)

Exit mobile version