[ప్రముఖ చైల్డ్ సైకాలజిస్ట్ ఐ.పి.సుహాసిని గారు సంచిక పాఠకుల కోసం ‘పిల్లల పెంపకంలో నూతన దృక్పథం’ అనే ఫీచర్ అందిస్తున్నారు.]
మీ పిల్లలు చదువుపై దృష్టి పెట్టడం లేదా? ఇవే అసలు కారణాలు!
జనవరి వచ్చింది అంటే ఇంట్లో తల్లిదండ్రులందరికి ఒకటే ధ్యాస, ఒకటే టెన్షన్ అదేనండి పిల్లల పరీక్షలు. అందులోనూ బోర్డు ఎగ్జామ్స్ రాసే పిల్లలు ఉండే ఇంట్లో అయితే ఇంకా మరి అడగక్కర్లేదు. ఇంటికి చుట్టాలు స్నేహితులు రాకపోకలు బంద్, ఇంట్లో టీవీ తీసేస్తారు, ఇంటర్నెట్ కనెక్షన్ కట్ చేసేస్తారు ఇంకా ఇలాంటివి ఎన్నో మరెన్నో చేస్తూనే ఉంటారు. కానీ వాళ్ల సమస్య తీరదు. ఏంటా సమస్య అని అనుకుంటున్నారా?
అదేనండి వాళ్ళ పిల్లలు చదువు మీద దృష్టి పెట్టడం లేదు ఏకాగ్రత చూపెట్టడం లేదు. చదువు అంటేనే పారిపోతున్నారు లేదా తలనొప్పి అంటున్నారు, అని తల్లితండ్రులు బాధపడుతున్నారు. పిల్లలకి చదువు యొక్క ప్రాముఖ్యత ఎలా తెలియజెప్పాలి పెద్ద అయితే వాళ్లు జీవితంలో ఎలా సెటిల్ అవుతారు అన్న టెన్షన్‌తో పెద్దలు తలలు పట్టుకుంటున్నారు.
మీరు కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నారా? మీ పిల్లలకి ఎలాగా చదువు మీద ఏకాగ్రత పెంచాలి, ఎలా చదువు యొక్క ప్రాముఖ్యతను వివరించాలి అని ఆలోచిస్తున్నారా? అయితే మనము ముందుగా పిల్లలకి చదువు మీద ఎందుకు ఏకాగ్రత తగ్గిపోతుంది తెలుసుకోవాలి కదా, దానితో పాటే వాటికి పరిష్కారాలు కూడా వెతుకుదాము. మరి ఇంకెందుకు ఆలస్యం?
1. సాంకేతిక వ్యసనం – మొబైల్ మాయలో పిల్లలు:
మీ పిల్లల చదువుకి సహాయకారిగా ఉంటుంది అని కొన్న మొబైలు లేదా లాప్‌టాప్ ఈ రోజుల్లో ఒక పెద్ద భూతం లాగా మారి మీ పిల్లల ఫ్రీ టైమ్‌ని పూర్తిగా మింగేస్తుంది, గమనించారా? అంతే కాదండి వాళ్ళ మెదడును పనిచేయకుండా చేయడంలో కూడా వీటి పాత్ర చాలా ఎక్కువ ఉంది. ఈ మొబైలు లాప్‌టాప్ మూలంగా పిల్లలు సోషల్ మీడియాకి, గేమ్స్‌కి, యూట్యూబ్ వీడియోలకి, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌కి వాళ్ళ దృష్టిని మళ్లిస్తున్నారు. ఏమాత్రం ఖాళీ దొరికిన వారు దాంట్లోనే లీనమైపోతున్నారు, దాంతో మరి వారికి చదవడానికి టైం సరిపోవటం లేదు, చదవాలని ఇంట్రెస్ట్ కూడ తగ్గిపోతుంది.
పరిష్కారం:
మీ పిల్లలు చదువుకునే సమయంలో మొబైల్ ఫోన్లన్నీ దూరంగా పెట్టండి. వాళ్లు చదువుకుంటున్నప్పుడు మీరు కూడా మొబైల్ ఫోన్, టీవీ చూడకుండా మీరు ఏ పుస్తకం చదువుకోవటమో లేదా ఇంట్లో పని చేసుకోవడమో బెటర్. ఇలాగే మీ కుటుంబం మొత్తం మీ పిల్లలు చదువుకునే టైమ్‌లో మొబైల్ ఫోన్లు దూరంగా పెట్టి ‘టెక్-ఫ్రీ అవర్స్’ అనే ఈ పద్ధతిని పాటించండి. వారి చదువుకి సహకరించండి.
2. నిద్రలేమి – మెదడు నిద్రిస్తే ఏకాగ్రత ఎక్కడిది?
ఇటీవల ఒక పరిశోధన ప్రకారం, ప్రపంచములో 80% పిల్లలు నిద్రలేమికి గురవుతున్నారు ఎందుకంటే వాళ్లు రాత్రి 10 గంటల తర్వాత పడుకుంటున్నారు. రాత్రి చాలాసేపు పొద్దుపోయేంతవరకు స్నేహితులతో చాటింగ్, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూడటంతోనే టైమ్ స్పెండ్ చేస్తున్నారు. దీనితో వాళ్లకి నిద్ర తక్కువవుతుంది, మెదడుకి అలసట ఎక్కువవుతుంది. బాడీ రీఛార్జ్ అవ్వడం లేదు. అందుకనే వారికి ఏకాగ్రత లోపిస్తుంది
పరిష్కారం:
ఖచ్చితమైన నిద్ర పట్టికను ఏర్పాటు చేసి, మీ పిల్లలు 8 గంటలు పూర్తిగా నిద్రించేలా చూడాలి. నిద్రపోయేందుకు ఒక అరగంట, లేదు అంతకుముందే మొబైల్స్ గ్యాడ్జెట్స్ దూరం పెట్టి మంచి కథలు చదవడం, పుస్తకాలు చదవటం, లేదంటే మ్యూజిక్ వినడం అలవాటు చేయాలి. మీ పిల్లలు నిద్రపోయేందుకు ముందు మీరు కూడా వాళ్లతో కలిసి పుస్తకం చదవటమో పాటలు వినడము చేస్తే వాళ్ళకి అలవాటు అవుతుంది. అలా చేయటం వల్ల మీ పిల్లల కూడా మీతో చాలా క్లోజ్‌గా ఫీల్ అవ్వటం స్టార్ట్ చేస్తారు. దానితో వారి మెదడు సేద తీరి వెంటనే గాఢ నిద్రలోకి వెళ్లి పోతారు.
3. ఒత్తిడి, ఆందోళన – భయంతో ఏం నేర్చుకుంటారు?
స్కూల్లో టీచర్లు చదవమని పెట్టే ప్రెషర్, తల్లితండ్రుల ఆశలు, ఆశయాలు, పరీక్షల్లో ర్యాంకులు సాధించాలని తపన ఇవన్నీ కలిసి పిల్లలను మానసికంగా అలసటకు గురి చేస్తున్నాయి.
ఇవే కాకుండా, స్నేహితుల ముందు గొప్పగా నిలబడాలనే ప్రెషర్ సోషల్ మీడియా ప్రభావము ఇవన్నీ కూడా పిల్లల్లో ఒత్తిడిని ఆందోళనని పెంచుతున్నాయి రీసెంట్ రీసర్చ్ ప్రకారం మన పిల్లలలో 72% పైన పిల్లలు ఎంతో ఒత్తిడికి, ఆందోళనకు గురవుతున్నారని చెప్తున్నారు
పరిష్కారం:
పిల్లలని ఇతరులతో పోల్చకుండా వారి సామర్థ్యాలను అర్థం చేసుకొని దానికి తగినట్టుగా వాళ్ళని ప్రోత్సహించాలి. వాళ్ళకి తరచూ – మేమున్నాము – అని ఒక భరోసాని అందజేయాలి. సోషల్ మీడియాలో కనిపించేవన్నీ నిజం కాదు అని పదే పదే చెబుతూ ఉండాలి. మార్కులే జీవితం కాదు అని కూడా చెప్పాలి. వారిని తరచూ ప్రశంసిస్తూ, మేమున్నాము నీకు అని ఒక ధైర్యాన్ని వాళ్ళకి ఇవ్వాలి. ఆప్యాయంగా దగ్గరికి తీసుకోవాలి.
4. మల్టీటాస్కింగ్ – చదువుతో పాటు చాటింగ్ ఎలా?
ఇన్‌స్టాగ్రామ్ లోని రీల్స్ యూట్యూబ్ షార్ట్స్ స్క్రోల్ చేయటంతో మీ పిల్లల అటెన్షన్ స్పాన్ తగ్గిపోతుంది. దాంతో పాటుగాను మల్టీ టాస్కింగ్ అన్న కొత్త జాడ్యం ఒకటి అందరికీ మొదలైంది. ఒకేసారి రెండు మూడు పనులు మేము చేయగలము అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తోని వాళ్ళు చదువుకుంటూ వాళ్ళ ఫ్రెండ్స్‌తో చాటింగ్ చేయటము, ఇన్‌స్టాగ్రామ్ స్క్రోల్ చేయటము, వగైరాలు చేస్తున్నారు. దీని మూలంగా ఏమవుతుందంటే ఏ పని మీద పూర్తిగా దృష్టి పెట్టలేకుండా ఉన్నారు. ఏ పనిని కంప్లీట్ చేయలేకపోతున్నారు.
పరిష్కారం:
ఒకేసారి ఒక పనిని పూర్తిగా చేయడాన్ని ప్రోత్సహించండి. చదువుతూండగా మొబైల్ పక్కన పెట్టటాన్ని అలవాటు చేయాలి. మీరు కూడా అస్తమానం మొబైల్‌ని వాడడం తగ్గిస్తే మిమ్మల్ని చూసి మీ పిల్లలు కూడా నేర్చుకుంటారు.
5. సరైన ప్రణాళిక లేకపోవడం – గందరగోళానికి గుడ్‌బై చెప్పండి!
ఈ కాలం పిల్లలకి ఎప్పుడు ఒక ప్రణాళిక వేసుకొని దాని ప్రకారం నడుచుకోవడం చేతకావడం లేదు. ఎప్పుడు ఖాళీ దొరికిన ఒక గాడ్జెట్ పట్టుకొని ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ చూడటానికి అలవాటు పడిపోయారు. టైమ్ మేనేజ్మెంట్ అన్నది వాళ్ళకి చేతకావడం లేదు. ప్రతిదీ లాస్ట్ మినిట్‌లో చేయడం కోసం పరుగులు పెట్టటము, టైమ్ సరిపోక దానిని అసంపూర్తిగా వదిలేయడం అలవాటైపోయింది.
పరిష్కారం:
పిల్లలతో కలిసి చదువు కోసం ఒక షెడ్యూల్ తయారు చేయండి. చిన్న చిన్న లక్ష్యాల్ని పెట్టి వాటిని సాధించినప్పుడు పిల్లలకి ఒక చిన్న సర్ప్రైజ్ ఇవ్వడం అలవాటు చేయండి. దానితో వాళ్ళకి ఒక ప్రణాళిక వేసుకొని దానికి అనుగుణంగా ఎలా నడుచుకోవాలో అలవాటు అవుతుంది. మీరు మీ ఇంట్లో లేదా ఆఫీసులో వేసుకునే ప్రణాళికను కూడా వాళ్ళకి చూపెట్టండి వాళ్లతో దాని గురించి డిస్కస్ చేయండి. సమయ పరిపాలన యొక్క ప్రాముఖ్యతను వివరించండి. మిమ్మల్ని చూసి మీ పిల్లలు కూడా నేర్చుకుంటారు
6. శారీరక వ్యాయామం లోపం – మెదడును మేలుకొలుపుదాం!
పిల్లలు బయట ఆడకుండా ఎక్కువగా ఇంట్లోనే గడపడం వల్ల శారీరక దృఢత తగ్గిపోతుంది. శరీరం చురుకుగా లేకపోవడం వల్ల మెదడు గందరగోళంగా మారి ఏకాగ్రత తగ్గిపోతుంది.
ఉదాహరణకి ఒకరోజు ఎన్నడు లేని మీరు కొంచెం సేపు వాకింగ్ చేస్తే మీలో మీకే తెలియని ఒక ఉత్సాహం ఉప్పొంగుతుంది. ఎందుకంటే మీ బాడీలో హ్యాపీనెస్ హార్మోన్లు ఉత్పత్తి అవ్వటం స్టార్ట్ అయింది కాబట్టి. ఆ హ్యాపీనెస్ హార్మోన్లు రోజు మన శరీరంలో ఉత్పత్తి అవ్వాలి అంటే మనము రోజులో కొంచెం సేపైనా బయట ప్రకృతిలో టైమ్ స్పెండ్ చేయాలి. వీలు అయితే కొంచెం సేపు శారీరక వ్యాయామం, లేదూ, ఒక మెడిటేషన్ చేయడం ఆరంభించాలి.
పరిష్కారం:
మీ పిల్లలను రోజుకి కనీసం ఒక గంట సేపైనా శారీరక వ్యాయామం చేయడానికి ఆరంభించమని చెప్పండి. వారితో కలిసి మీరు కూడా చేశారు అంటే మీకు వారికి మధ్య ఒక చక్కని అనుబంధం ఏర్పడుతుంది. ఇంతవరకు మీతో పంచుకొని విషయాలు కూడా మీతో పంచుకోవడం మొదలు పెడతారు.
7. ఆహారం – మెదడుకు సరైన ఇంధనం అవసరమే!
ఈ కాలం పిల్లలు ఎక్కువగా జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడానికి అలవాటు పడిపోయారు. టైమ్ దొరికినప్పుడల్లా హోటల్‌లో తిందామని ఆలోచిస్తున్నారు. దీని ప్రభావం పిల్లల శరీరం మీదే కాదు వారి మెదడు మీద కూడా పడుతుంది. దీర్ఘకాలంలో వారి మైండ్ నీరసంగా ఏది గుర్తుంచుకునే శక్తి లేకుండా తయారవుతుంది. దానికి కారణం వారు తీసుకునే జంక్ ఫుడ్‌లో ఉండే కార్బోహైడ్రేట్స్, అత్యధిక షుగర్సు. ఇవి మన మెదడు పనితీరుపై ప్రభావాన్ని చూపెడతాయి.
పరిష్కారం:
మీ పిల్లలకి పోషకాహారాన్ని అందించండి పాలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్, సలాడ్స్ మొదలగునవి అందించండి. జంక్ ఫుడ్ నిషేధించి, మినిమం ప్రాసెస్డ్ ఫుడ్ ఇవ్వండి.
8. అసంతృప్తికరమైన పాఠ్యాంశాలు – ఆసక్తి కలిగించండి
చదవాల్సిన పాఠ్యాంశాలు ఆసక్తికరంగా లేకపోవడం వల్ల పిల్లలు మొక్కుబడిగా చదువుతున్నారు. పిల్లలకి పాఠ్యాంశాలను వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఆసక్తికరంగా అర్థం చెప్పే టీచర్లు కరువు అవడంతోని పిల్లలు చదువుని ఒక భారంగా భావించడం మొదలుపెట్టారు. ఏకకాలంలో అన్ని విషయాలపై సమర్థవంతంగా ఫోకస్ పెట్టలేకపోవడం వారి ఆసక్తి తగ్గింపునకు ప్రధాన కారణం.
పరిష్కారం:
పిల్లలు చదువులో ఆసక్తి పెంచే విద్యా యాప్‌లు, వీడియోలు ఉపయోగించండి. ఆన్‌లైన్ నోట్ టేకింగ్ యాప్‌లు, మైండ్ మ్యాపింగ్ టూల్స్ ఉపయోగించమని ప్రోత్సహించండి. ఇవే కాకుండా, ప్రాక్టికల్ లెర్నింగ్, వీడియో లెసన్స్, ఆసక్తికరమైన యాప్‌లు ఉపయోగించి పిల్లల ఆసక్తిని పెంచండి.
మీ పిల్లల చదువుపై దృష్టి పెట్టకపోవడంపై నిస్పృహ చెందాల్సిన అవసరం లేదు. సమస్యను అర్థం చేసుకోవడం, కారణాలను గుర్తించడం, వాటికి సరైన పరిష్కారాలు అన్వేషించడం అన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి. ప్రతి బిడ్డ ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వంతో జన్మిస్తాడు. తల్లిదండ్రులుగా, వారి పద్ధతులను, వారి బలహీనతలను అర్థం చేసుకుని సరైన దిశలో నడిపించడమే మన ముఖ్యమైన బాధ్యత.
పిల్లలు చదువుపై దృష్టి పెట్టడం అంటే పుస్తకాలు తెరచి చదవడమే కాదు. అది ఒక మానసిక, శారీరక, భావోద్వేగ సమతుల్యత పొందే ప్రక్రియ. చిన్న చిన్న అలవాట్ల మార్పులతో, సరైన ప్రోత్సాహంతో, పిల్లల ఆసక్తిని మళ్ళీ చిగురింపచేయొచ్చు.
మీ ప్రేమ, సహనం, ప్రోత్సాహమే వారికి ఉత్తేజం!
- మీ పిల్లలతో మాట్లాడటానికి రోజూ కొంత సమయం కేటాయించండి.
- వారి సమస్యలను విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.
- వారికి ఏ ప్రాబ్లం వచ్చినా మీ దగ్గరికి రావడం కోసం ఏమాత్రం సంకోచించకుండా ఉండేటట్టు వారికి కాన్ఫిడెన్స్ ఇవ్వండి.
- వాళ్లు తమ మనసులో భావాలని మీతో ఏ భయం లేకుండా ఫ్రీగా పంచుకునేటట్టు మీ ప్రవర్తనని మార్చుకోండి.
- వారిపై మీ ఆశలని కలలను మోపి అవి సాధించాలి అని పట్టు పట్టకండి.
చిన్న చిన్న విజయాలను గుర్తించండి. ఒక్కసారి పిల్లలు చదువుపై ఆసక్తి పెంచుకున్న తర్వాత, విజయాలు మీ ఇంటి తలుపును తట్టడం ప్రారంభిస్తాయి. వారిలోని ఆత్మవిశ్వాసాన్ని మేలుకొలిపి, చదవడాన్ని ఆసక్తిగా, సంతోషంగా మార్చడం మీరు వారికి ఇచ్చే గొప్ప కానుక. తల్లిదండ్రులుగా మీ ఈ చిన్న చిన్న ప్రయత్నాలు మీ పిల్లల జీవితంలో పెద్ద మార్పులను తీసుకురాగలవు.
పిల్లల చదువుపై దృష్టి పెట్టకపోవడానికి అనేక కారణాలున్నా, సరైన మార్గదర్శకత్వం, మీ ప్రేమ, మరియు ఆసక్తికరమైన పద్ధతులు, పిల్లల భవిష్యత్తును గొప్పగా తీర్చిదిద్దగలవు.
(వచ్చే వారం మరో టాపిక్‌తో కలుద్దాం)
ఐ.పి. సుహాసిని గారు కిడ్స్ అండ్ పేరెంట్స్ లైఫ్ కోచ్‌గా పని చేస్తున్నారు. చైల్డ్ సైకాలజిస్ట్. పేరెంటింగ్ బ్లాగర్, యూట్యూబర్. పేరెంట్స్ కోసం వాట్సప్‌లో ఒక ఫ్రీ కమ్యూనిటీ నడుపుతున్నారు. ఆ కమ్యూనిటీ లింక్ Simplified Parenting with Suhasini. వారిని mommyshravmusings@gmail.com అనే మెయిల్ ఐడిలో సంప్రదించవచ్చు.