[మణి గారు రాసిన ‘పిల్ల మేఘం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
కొన్ని సంవత్సరాలుగా, అక్కడ ఏ గ్రామం లోనూ, ఏ పట్టణం లోనూ వర్షాలు లేవు. మేఘాలు పై నుంచే వెళ్ళిపోసాగాయి. మబ్బులు పట్టినా, కాస్సేపటికే చెదిరిపోయేవి.
ఎండమావులని మరిపించేవి. ఇంక నీటి ఎద్దడి, ఎలా వుంటుందో వేరే చెప్పవలసిన పని లేదు. పంటలు లేవు. జంతువులు కూడా నీళ్ళులేక ఎండిపోసాగాయి. పక్షులు అలజడి చేయకుండా గూటికే పరిమితం అవసాగాయి. కొన్ని వలస వెళ్ళిపోయాయి. ఆ ప్రాంతమంతా కరువు, కాటకాలతో, గజగజలాడసాగింది.
***
ఆ రోజు మాత్రం, సాయంత్రం ఉన్నట్లుండి ఓ మేఘమాల క్రిందకి జారింది. కాసేపటికి, మబ్బులు ఆకాశాన్ని మూసివేసాయి. మొదట సన్న జల్లు, వెనకే కుండపోత లాంటి వర్షం. ఆగదే!.. ఆ ప్రాంతాన్నంతా, ఆ క్షణంలోనే సస్యశ్యామలం చేయాలన్న పట్టుదలతో వున్నట్లు, ఆ వర్షం అలానే కురుస్తూనే వుంది.
ఎవరూ ఊహించని విధంగా వచ్చిన, ఆ వర్షానికి కారణం తెలిసిన వాళ్ళు ఇద్దరే, ఇద్దరు. ఒకరు ఎండి బీటలు బారి, కళాకాంతులు కోల్పోయిన నేల తల్లి. మరొకరు నేలతల్లి పొత్తిళ్ళలోకి, కరిగి మాయమయిన ఓ పిల్ల మేఘం.
***
ఆ రోజు ఏం జరిగిందంటే..
***
సూర్యుడు నెమ్మదిగా పడమటకి దిగడం ప్రారంభించేడు. ఎండ తీక్షణత కాస్త తగ్గింది.
‘వర్షాలు లేకపోవడంతో కాస్త ఎండ కూడా తట్టుకోవడం కష్టంగా వుంది. అటువంటిది వేసవి ఎండ. తట్టుకోవడం కష్టంగానే వుంది’ అనుకుంటూ కట్టెలు కొట్టుతున్న రామయ్య కొట్టడం ఆపాడు.
తలకి కట్టుకున్న తువ్వాలు తీసి మొహానికి, ఒంటికి పట్టిన చెమట తుడుచుకున్నాడు. తువ్వాలు ఒకసారి దులిపి మళ్ళీ తలకి కట్టుకున్నాడు.
ఆకాశం కేసి చూసి, “ఒరేయ్! సోమిగా! ఇంక కట్టెలు కొట్టడం ఆపెయ్. కొట్టిన కట్టెలు మూటకట్టు. ఇప్పుడు బయలుదేరితే కానీ, రాత్రికి ఇంటికి చేరుకోలేము. ప్రొద్దు కుంగుతోంది” అన్నాడు.
‘అలానే’, అన్నట్కు తల ఊపి, కట్టెలు కొట్టడం ఆపాడు సోమయ్య. వాడికి తొమ్మిది ఏళ్ళు. వాడూ, వాడి తండ్రి లానే చెమటలో తడిసి ముద్దయి వున్నాడు.
తలకి కట్టుకున్న తువ్వాలు తీసి, ఓ దులుపు దులిపి, మొహం, ఒళ్ళు తుడుచుకొని, తువ్వాలు భుజం మీద వేసుకొని, కొట్టిన కట్టెలు అన్నీ చేరవేసి, ఒకటి పెద్దమూట, ఇంకొకటి చిన్న మూట వచ్చేలా అన్నీ సర్దాడు. తండ్రీ, కొడుకులు ఇద్దరూ కలిసి, రెండు మూటలని, విడివిడిగా తాళ్ళతో బిగించి కట్టారు.
రామయ్య రొప్పుతూ, కాసేపు నేల మీద కూర్చుని అలసట తీర్చుకుంటూ, “సోమిగా! ఆ సీసా ఇలా అందుకోరా. కాస్త నోరు తడుపుకుంటాను” అన్నాడు.
సోమయ్య మౌనంగా పక్కన, ఓ సంచీలోచి నీళ్ళ సీసా తీసి తండ్రికి ఇచ్చాడు.
సీసా, ఓసారి పైకి ఎత్తి చూస్తూ “ఊ! నీళ్ళు అయిపోవచ్చాయి. నువ్వూ కాస్త నోరు తడుపుకో! ఇంటికి వెళ్ళేవరకూ ఇవే నీళ్ళు మనకి. అయిపోతే, దారిలో మనకి కష్టమవుతుంది” అన్నాడు.
సీసాలో నీళ్ళు చాలా జాగ్రత్తగా, చాలా అపురూపంగా రెండు గుక్కలు వేసాడు, రామయ్య. “తీసుకో” అంటూ సీసా వెనక్కి సోమయ్యకి ఇచ్చాడు. సోమయ్య కూడా రెండు గుక్కలు తాగి, సీసాని చాలా జాగ్రత్తగా సంచీలో పెట్టాడు.
“ఈసారి కూడా వర్షాలు లేవు. ఎలా బతుకుతామో” అంటూ నిట్టూరుస్తున్న తండ్రి వేపు చూస్తూ ‘అవును’ అన్నట్లు తల వూపాడు, సోమయ్య.
“ఊ! పద పద! ఇంకా మనం పట్నం వెళ్ళాలి. ఈ కట్టెలు అమ్మాలి. ఆ పైసలతో గ్రాసం కొనాలి. మన వూరికి వెళ్ళాలి. ఇంట్లో, అందరూ మనకోసం ఎదురు చూస్తూ వుంటారు. మనం సామాను, తీసుకు వెళ్ళేవరకూ కడుపులో పేగులు లెక్క పెట్టుకుంటూ వుంటారు.”
ఇద్దరూ, కట్టెల మూటలు నెత్తిన పెట్టుకొని పరుగు లాంటి నడకతో పట్టణం వైపు నడక సాగించారు.
పట్టణం, అక్కడ నుండి దగ్గర దగ్గర, ఓ అయిదు మైళ్ళు వుంటుంది. ఓ మూడు మైళ్ళు దాటితే కానీ, నడిచే దారి బాగుండదు. ఇంక ఈ మూడు మైళ్ళు దారి అంతా రాళ్ళు రప్పలు. ఎంత అలవాటు అయినా ఎండలో దప్పి కాకుండా వుండడం కష్టమే.
నేలంతా ఎండి బీటలు బారి కాళ్ళకి గుచ్చుకుంటొంది. పైన తల కింద కాళ్ళు కాలుతున్నాయి. లెక్క చేయకుండా ఇద్దరూ అలానే నడుస్తున్నారు. ఒకరి వెనుక ఒకరు. ముందు తండ్రి రామయ్య, వెనుక కొడుకు సోమయ్య.
“అమ్మా!..” సోమయ్య కేకకి, రామయ్య ఆగి వెనకకి తిరిగి, “ఏమైంది రా?” అన్నాడు.
“కాలిలో ముల్లు దిగింది అయ్యా” అంటూ తలమీద మూట పక్కన పడేసి కింద కూలబడ్డాడు, సోమయ్య.
సోమయ్య కాలు లోంచి ముల్లు తీసేసి, అరికాలు నెమ్మదిగా చేతితో రుద్దుకున్నాడు.
కొడుకు కోసం ఆగిన రామయ్య కూడా తల మీద మూట పక్కన పెట్టి నేల మీద గొంతుకు కూర్చుని ఓసారి కొడుకు కేసి చూసి, ఆకాశం కేసి చూసాడు.
‘మచ్చుకు ఓ మేఘం కూడా కనపడటం లేదు. పట్టిన మబ్బులు చెదిరిపోతున్నయే తప్ప వర్షం పడటం లేదు. ఏమి పాపమో ఏమో’ అనుకుంటూ నిట్టూర్చాడు.
సోమయ్య సంచీ లోంచి నీటి సీసా తీసి, ఓ గుక్క నీరు నోట్లో వేసుకొని చప్పరించి, తండ్రికి సీసా అందించాడు.
దప్పితీరేంత నీరు తాగి చాలా రోజులయి పోయింది. అందుకే అందించిన సీసాను, వద్దనకుండా తీసుకొని తనూ నోరు తడుపుకున్నాడు రామయ్య.
“ఈసారి కూడా వర్షాలు రాకపోతే మళ్ళీ ఏటికి, మనం ఈ మన్నులో, కలిసిపోవాల్సిందేరా సోమిగా!”.. ఇలాంటి మాటలు తండ్రి నోటి వెంటే కాదు! అందరి నోటి వెంటా కూడా కూడా వినడం అలవాటు అయిపోయింది సోమయ్యకి.
చావుకీ బతుకుకీ తేడా, తెలీని వయసు వాడిది. వాస్తవాలకి మించిన ఆలోచనలు రాని వయసు, పరిస్థితి కూడా. అందుకే మాటల గురించిన ఆలోచనలు ఎప్పుడూ రావు వాడికి.
వాడికి ఎప్పుడూ ఒకటే ఆలోచన. కడుపు నిండా తిండి లేకపోయినా పర్వాలేదు కాని, తాగడానికి నీళ్ళు వుండాలి.
కట్టెలు అమ్ముకోవడానికి పట్టణం వెళ్ళినప్పుడు, అక్కడ చెరువు నీళ్ళల్లో, ఆటలు ఆడి కడుపు నింపుకోవడం అలవాటు వాడికి. కానీ ఆ చెరువూ ఎండిపోయింది. నోరు తడుపు కోడానికి కూడా నీళ్ళు లేవు.
అందరూ ‘ఈసారి కూడా వర్షాలు రాకపోతే’ అంటూ వుంటే, రావనే వాళ్ళు సూచిస్తున్నటు అనిపిస్తుంది వాడికి.
అయినా ఆ విషయం ఎక్కువ ఆలోచించడు. రోజూ కడుపు నింపుకోడానికి. వాళ్ళు చేసే పోరాటంలో ఆలోచనలు దగ్గరకి రావు. అందుకే, వాడిని ఆకలీ దప్పీ బాధ పెట్టినట్లు, ఏ విషయం పెద్దగా బాధపెట్టదు.
***
అదే సమయంలో, ఆకాశంలో ఓ మేఘమాల ప్రయాణానికి ఆయత్తం అవుతోంది. మేఘాలు అన్నీ ఒకరి చేయి ఒకరు పట్టుకొని వడివడిగా పరిగెట్టడానికి సంసిద్ధం అవుతూన్న వాళ్ళలా వున్నాయి.
ఓ పిల్ల మేఘం, తల్లిని వదలి ఆకతాయిగా అటూ ఇటూ పరిగెడుతుంటే, తల్లి దానిని గదమాయిస్తోంది.
“కిందకు వెళ్ళకు!”
“చెట్టు కానీ గుట్ట కానీ వుంటే, వాటికి తగలకుండా పైనుంచే నడవండి!” ఇంకో తల్లి మేఘం అదిలిస్తోంది.
వాటి అన్నిటిలోనూ ఒకటే తలంపు. ‘ఎటువంటి పరిస్తితిలోనూ తాము వర్షించ కూడదు’ అని. దానికి కారణం లేకపోలేదు.
అది ఏమిటంటే..
***
అన్ని మేఘాలు పుట్టుకతోనే నేర్చుకునేది, అర్థం చేసుకొని జీర్ణించుకునేది, తాము కారణజన్ములమనే! సముద్రం నుంచి నీటిని తీసుకొని ఆకాశంలోకి ఎగసి, గాలికి కరిగి, మళ్ళీ భూదేవి ఒడిలోకి వర్షమై ఒదిగి పోవడం. అందుకోసమే తాము పుట్టాయని అనుకుంటాయి.
ఇంక, అది సృష్టికార్యంగా భావిస్తాయి అవి. అందుకే వర్షమై నేలను తాకినప్పుడు, పులకరిస్తాయి! పరవశిస్తాయి!
‘అలౌకికమైన అనుభూతి అది!’ అని వాటిల్లో అవి మాట్లాడుకుంటాయి. వాటి జీవిత పరమార్థం, ఆ అనుభూతిలో కరిగిపోవడమే అని నమ్ముతాయి.
కానీ ఈ మధ్య కాలంలో చాలా మార్పులు వచ్చాయి. మేఘాలు పుడుతూనే, మంటలతో బాధపడసాగాయి. ఇంక వర్షంలా నేలను తాకేడప్పుడు, వాతావరణం లోకి రాగానే, వాటి మంటలు ఎక్కువయి అల్లల్లాడసాగాయి. అలౌకికమయిన అనుభూతి అనుకున్నదల్లా భరించలేని నరకంలా మారింది.
సృష్టికార్యాన్ని ఎంతో భక్తితోనూ, గౌరవంతోనూ చేస్తున్న తాము ఎందుకు ఇటువంటి నరకం అనుభవించాల్సి వస్తోందో, వాటికి మొదటిలో అర్థం కాలేదు. తరువాత, తరువాత, వాటికి అర్థమయింది. గాలి, నీరు కలుషితం అవడమే దానికి కారణం అని.
సృష్టిలో అన్ని జీవాలు ప్రకృతిని, గౌరవిస్తూ ప్రేమిస్తూ బతుకుతూ వుంటే మనిషి మాత్రం ప్రకృతి సంపద అంతా తన సొత్తే అనుకుంటూ వచ్చాడు. స్వార్థం తప్ప ఏమీ ఆలోచించలేని స్థితికి దిగజారాడు. ఆ మార్గంలో ప్రకృతిని కలుషితం చేస్తున్నాడు. మిగిలిన జీవరాశులకి హాని కలుగుతుందని తెలిసినా, కాస్త కూడా సందేహించకుండా తన స్వార్థమే తను చూసుకుంటున్నాడు..
చెట్లు కొట్టివేస్తున్నారు. కొండలు తవ్వేస్తున్నారు. జంతువులని చంపేస్తున్నారు. కొన్నిటిని ఆహారం కోసం, కొన్నిటిని ప్రయోగాల కోసం, కొన్నిటిని అలంకారాలకు, ఆభరణాలకు, ఇలా ప్రకృతిలో ప్రతీ ఒక్కటీ తమ స్వంతం అవాలని, తమ కోసం మాత్రమే వాటి ఉనికి, అనే అహంకారం!. ఆ అహంకారమే, వారు కూడా ప్రకృతిలో భాగమే అని, మిగిలిన చరాచర జీవరాశులతో కలిసి బ్రతకడంలోనే, వారి ఉనికి కూడా నిక్షిప్తమయిందన్న నిజాన్ని, వారు గుర్తించనీకుండా చేస్తుంది.
వారు, ప్రకృతి మీద చేసే ఈ అత్యాచారాల వల్ల, వారికి కూడా బాధ కలుగుతున్నా, వారు పట్టించుకోవడం మానేసారు. మనుషుల వల్ల మిగిలిన అందరికీ, కలుగుతున్న ఈ బాధలకి అందరికీ కోపం కలుగసాగింది. అందరితో పాటు మేఘాలు! ‘తమకు ఇంత బాధ కలుగచేస్తున్న ఈ మనుషులని శిక్షించాలంటే తాము వర్షించకూడదు’ అని నిశ్చయించుకున్నాయి.
అదొక్కటే కాదు. మేఘాలు వర్షమై వాతావరణంలోకి వస్తూంటే అవి పడే బాధ వర్ణనాతీతం! ఆ బాధకు ఏ మేఘమూ, సిద్ధపడటం కూడా లేదు.
అందుకే అవి చాలా జాగత్తగా పై నుంచే, ఏ అడవినో, ఏ సముద్రాన్నో వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నాయి.
దాని ప్రభావమే వర్షాలు లేకపోవడం.
నేల అంతా ఎండిపోయి బీటలు బారింది.
‘నాలో జీవించి, నాలోనే లీనమయే, ఏ జీవి బాధపడినా నాకేగా బాధ! మనిషి స్వార్థానికి ఇంతమంది ఇలా బాధపడాల్సిందేనా’ ఉస్సూరుమంది నేలతల్లి, గాలి తాకిడికి.
“పచ్చని ఆకుల శబ్దాలు ఏవి? చెట్లు ఎండిపోయాయి. ఎక్కడ పక్షుల రెక్కల చప్పుళ్ళు. అవి గూళ్ళు దాటి వస్తేనేగా. అవీ నీళ్ళులేక తిండి లేక నీరసంగా గూటిల్లోనే పడి వుంటున్నాయి.”
‘పచ్చని చెట్లు, పక్షుల కోలాహలం, రంగు రంగుల సీతాకోక చిలకలు, నేలబారు మేఘాలు, పరుగులు పెట్టే పిల్లగాలి, ఆకుల రెపరెపలు.. అంతా ఎంత కళకళ లాడుతూ వుండేది’ నేలతల్లి నిట్టూరుస్తూ అనుకుంది. ‘బహుశా నేనూ ఏదో ఒక రోజు ఈ అగ్ని లో దగ్ధ మవుతానేమో’, నిరాశగా పెదవి విరుస్తూ అనుకుంది నేలతల్లి.
‘ఎంత మంచి రోజులు అవి!’ ఓసారి గతం లోకి వెళ్ళింది.
***
అంతా సస్యశ్యామలంగా వుండేది అప్పుడు. అందరూ కర్మయోగులే! అందరి జీవిత లక్ష్యమూ ఒకటే! పది మందికి ఉపయోగపడడం. ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించడంలోనే ఆనందం వెతుక్కునేవారు, ఆనందం పొందేవారు. గట్టిగా నిట్టూర్చింది నేలతల్లి.
***
ఆకాశం లోకి పై పైకి పరిగెడుతున్న మేఘమాల. ఆ మేఘమాలలో, ఓ పిల్ల మేఘం ఆకతాయిగా పరిగెడుతోందని, తల్లి మేఘం చెయ్యి పట్టుకుని లాక్కుని వెళ్ళిపోసాగింది.
పిల్ల మేఘం దృష్టి మాత్రం, కింద ఆ తండ్రి కొడుకుల మీదే వుంది.
ఎండిపోయిన చెట్లు, బీటల బారిన భూమి, దప్పి పూర్తిగా, తిర్చుకోలేని ఆ తండ్రి, కొడుకులు.. చూస్తున్న దాని మస్తిష్కంలో, చిన్నపుడు అమ్మ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి.
“మనం పుట్టింది నేలతల్లికి నీళ్ళు అందించడానికే. వర్షంలా కురిస్తే, మన జీవిత ఆశయం నెరవేరినట్లే!”
చిన్నది కదా పిల్ల మేఘం. పెద్దవాళ్ళ వ్యవహారం దానికి నచ్చలేదు.
‘మనుషులు ఏదో చేసారని తాము కూడా, నేలతల్లిని బాధ పెట్టడం, ఏం బాగుందని?’ తల్లి ముందుకు లాగుతున్నా, అది వెనక్కి చూస్తూ వెళుతోంది.
***
కింద కూర్చున్న సోమయ్య తండ్రి పిలుపుతో లేవడానికి, ఆయత్తమయ్యాడు. మళ్ళీ కాస్త గొంతు తడుపుకోవాలి, అనిపించింది వాడికి.
దాహం తీరక గొంతు రాసుకుపోయినట్లు వుంది. “అయ్యా! కాస్త గొంతు తడుపుకుంటానయ్యా” అన్నాడు, సోమయ్య.
రామయ్య, కోపంగా విసుగుగా “జాగ్రత్తగా! ఓ చుక్కే! ఇంటికి వెళ్ళేలోపు నీళ్ళు అయిపోయాయంటే, గొంతు తడుపుకోవడానికి కూడా ఓ చుక్క వుండదు. మనము ఇంటికి కూడా చేరం.”
రామయ్య చాలా విసుగు గానూ కోపం గానూ అన్నా, అతని బాధ అర్థమయింది సోమయ్యకి.
చాలా జాగ్రత్తగా ఓ చుక్క నీరు గొంతులో వేసుకొని, సీసాకు మూత బిగిస్తున్న సోమయ్య చూపు, బీటలు బారిన నేల మీద పడింది.
చేతులు చాచి “నీళ్ళు ఇవ్వవా!” అంటూ నేల తల్లి అడుగుతున్నట్లు అనిపించి సోమయ్య చిన్న మనసు ఆర్ద్రమైంది. చేతిలో సీసా జారడం నీళ్ళు నేల మీద పడటంతో పాటు, వాడి కళ్ళు కూడా వర్షించసాగాయి.
“ఒళ్ళు తెలియకుండా వుంది నీకు! నీళ్ళు పారపోసావు!” రామయ్య కోపం కట్టలు తెంచుకుంది. నెత్తి మీద పెట్టుకున్న కట్టెల మూటని ఒక్క ఉదుటన గిరవాటు వేసి సోమయ్యని కొట్టడానికి సిద్ధమయ్యాడు.
“మన చావు ఇక్కడే రాసి పెట్టి వుంది, ఈ రోజు!” అంటూ.
ఒక విధమయిన అలౌకికమయిన స్థితిలో వున్న సోమయ్య ఇదేమీ గమనించే పరిస్థితిలో లేడు.
***
పై నుంచి చూస్తున్న పిల్ల మేఘం మనసు కూడా ఆర్ద్రమయింది. తన దప్పి కూడా తీర్చుకోకుండా, నేలని తడిపిన ఆ పిల్ల వాడి త్యాగం, దానిని ఆకట్టుకొంది. దానికి తెలియకుండానే, అది తల్లి చేయి వదిలించుకోడానికి ప్రయత్నిస్తూ కిందకి దిగసాగింది.
వాతావరణంలో కాలుష్యం తాలూకు తీవ్రత పెడుతున్న బాధని కాస్తంత కూడా లెక్క చేయలేదు, ఆ పిల్ల మేఘం.
నేల, చేతులు చాపి రమ్మని పిలుస్తున్నట్లు..
ఆ పిలుపు తప్ప, దానికి ఏమీ వినిపించటం లేదు. ఏమీ కనిపించటం లేదు.
“వుండు వుండు వెళ్ళకు” అంటూ పిల్ల మేఘంతో పాటు, తల్లి మేఘం తనకి తెయకుండానే కిందకి దిగసాగింది. పిల్ల మేఘం, బాధపడుతుందేమో అన్న ఆలోచన తప్ప, దానికి ఇంక, ఇంకో ఆలోచన రావటం లేదు.
ఆ తల్లి మేఘంతో పాటు, ఒకరి చేయి, ఒకరు పట్టుకొని వెళ్తున్న మేఘాల మాల మొత్తం కిందకి జారింది. వారికి ఏం జరుగుతోందో అర్థమయ్యేసరికి, అన్నీ వర్షించడం మొదలు పెట్టాయి.. పెద్ద వర్షం!
***
సోమయ్యని కొట్టడానికి చేయి ఎత్తిన రామయ్య, వర్షం చినుకులకి, ఆశ్చర్యంగా తల పైకెత్తి, ఆకాశం కేసి చూసాడు. చూస్తుండగానే, తడిసి ముద్ద అయ్యాడు.
కృతజ్ఞతతో, సోమయ్య ఆకాశంకేసి ఆనందంగా చూసాడు.
ఆ వర్షం నీటిని, చేతిలో పట్టుకొని, నేల మీద వేస్తూ, కాస్సేపు మైమరచి పోయాడు.
నేల తల్లి కళ్ళు చెమర్చాయి. “నాకు తెలుసు నా పిల్లలకి నేనంటే ప్రేమని. ఏ తప్పు చేసినా తెలియకపోవడం వల్ల కానీ, ప్రేమ లేక పోవడం వల్ల కాదు.”
ఆమె క్షమ, కాసేపటికి ఏరులైపారింది.
***
ఆ విధంగా కరువుతో కుంగి పోవాల్సిన ప్రదేశం మళ్ళీ సస్యశ్యామలం అయింది. ‘ఆ పిల్లవాడు, ఆ పిల్ల మేఘం చేసిన త్యాగ ఫలమే అది!’ అని ఎవరూ గుర్తించలేదు. గుర్తించే అవకాశమూ లేదు!.
కానీ నిశ్శబ్దం భాషగా చేసుకున్న చెట్టూ పుట్టా, రాయి రప్పాతో సహా.. ప్రకృతిలో, మనుషులు తప్ప, మిగిలిన జీవరాశులన్నీ ఆ విషయాన్ని, కథలు కథలుగా చాలా రోజులు చెప్పుకున్నాయి.