Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పిడకల వేట

[వడలి రాధాకృష్ణ గారు రాసిన ‘పిడకల వేట’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

సోమరాజులో ఇప్పుడు ఆనందమే ఆనందం! తన చుట్టూరా ఉన్న ప్రపంచమంతా అదే పనిగా కథక్ నృత్యం చేస్తున్నట్లుంది. జగమంతా జాజిమల్లె కొమ్మ లాగ మెరిసిపోతున్నట్లుంది. దానితో అలవికాని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోతున్నాడు. అంతేనా, ఊబకాయలాగ ఊరిపోయి ఉరకలు వేసేస్తున్నాడు.

“కోకీ..” భార్యను కోమలంగా పిలిచాడు.

భర్త మూడ్‌ను పసికట్టిసింది. అంతే కోకిలాంబ చటుక్కున తాను కూడ ఆ మూడ్ ఒడిసి పట్టేసింది.

‘‘ఊ..” మత్తుగా పలికింది.

“ఉరకలు వేసే ప్రపంచం ఇది..” ఏవేవో నోటి కొచ్చినట్లు మాట్లాడేస్తూ ఉన్నాడు.

“ఊహూ..” అంది మరీ మత్తుగా!

“ఈ ప్రపంచానికి ఏమయిందో తెలవదు. ఉరకలు వేయడమే కాదు, ఆకాశంలో ఉల్కల మెరుపుల్లాగ మెరిసిపోతోంది!” భర్త ఏవేవో మాట్లాడేస్తున్నాడు.

కోకిలాంబకు విషయం అర్థం కాకుండా ఉంది. అయినా అర్థం చేసుకుంటూనే ఉంది. తన మూడ్, సోమరాజు మూడు ఒకటి కాదని, వేర్వేరని గ్రహించేసింది. అంతే, కోకిలాంబ సర్దుకోక తప్పింది కాదు. అలా ఎదురుగా ఉన్న నిలువెత్తు అద్దం వైపు చూసుకోంది. దానికి తగిలించి ఉన్న పూలదండలు అద్దాన్ని పూర్తిగా కప్పేశాయేమో, తన అందమైన ప్రతిబింబం అద్దంలో ఆమెకు ఆనడం లేదు.

అంతే పెనిమిటి మీద అంతెత్తున లేచి పోయింది. దండల్ని విసిరి పారేసింది.

“రాత్రి మినిష్టరు గారు వేసిన దండలవి! విసిరి కొట్టినావంటే ఆయన్ని కొట్టినట్లే.”

“ఎవరూ ఆ మినిష్టరు గారినా!”

“అవును.”

“ఆయన ఇప్పుడు కాదు కదా! ఒకప్పుడు మినిష్టర్‌గా ఉండి తర్వాత ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కించుకోలేని మాజీ మినిష్టరు.”

“ఎవరో ఒకరు.. నాకు ఆయన ఎవర్ గ్రీన్ మినిష్టరు అంతే!”

“ఎవరూ లేదు, గ్రీనూ లేదు. అసలు ఆ సువర్ణరాజు గాడి కాలరు పట్టుకోవాలి.”

“కంఠం పట్టుకోవడానికి, కంఠానికున్న చొక్కా కాలరు పట్టుకోవడానికి అతగాడేమి చేశాడు చెప్పు బంగారం! నన్ను నా ప్రతిభను గుర్తించి నిన్నరాత్రి నాకు గొప్ప సన్మానం చేస్తేను!!”

“నీకు చేసినాడు సరే, ప్రతి మగాడి విజయాల వెనకా ఓ ఆడది ఉండదా? అలా నీ ప్రతి విజయం వెనుక భార్యగా నేను లేనా!!!!”

సోమరాజుకి ఈ పిడకల వేట బాగోతం ఏమీ అర్థం కాకుండా ఉంది.

“సువర్ణరాజు మా మంచోడే. వాడి ‘రోజూ వెన్నెల’ సంస్థ ద్వారా నన్ను గుర్తించి నాలోంచి నన్ను బయటకు లాగి పాశాశాడు. ఆనక సన్మానం చేసి వెన్నెల కురిపించేసినాడా లేదా!” భార్యను దగ్గరగా తీసుకున్నాడు. ఆనక లాలించాడు. అయినా కోకిలాంబకు అవన్నీ పట్టడంలేదు. తానేమిటో తెలియజేస్తోంది. భర్తకు అదే పనిగా షాకులు ఇస్తోంది. సోమరాజుకి ఏటూ తోచడం లేదు.

‘మనువాడిన పెనిమిటి నలుగురిలో గుర్తింపబడితే సంతోషించాలి గాని ఇలాగ షాకులివ్వడం.. లీకులిచ్చి జర్కులివ్వడం..’ తనలో తాను నొచ్చుకున్నాడు.

ఆ క్షణంలో సువర్ణరాజు తనకు ఓ గొప్ప పారదర్శకత కల్గిన వెన్నెల వెల్లువ లాగ అన్పిస్తూ ఉన్నాడు. అతగాడి ‘రోజూ వెన్నెల’ సంస్థ ఓ వెలుగుల వేకువలా తోస్తోంది.

“ఎవరినైనా అనచ్చునుగాని, ఆ రాజుగాడిని పిసరంత మాట అన్నావంటే ఊరుకొనేది లేదు.”

“అవును శ్రీవారూ! భర్తల విజయాల వెనుక భార్యామణులుంటారని, ఆ మణుల విలువను ప్రపంచానికి తెలియజేయాలనుకోని దౌర్భాగ్యరాజులను ఏమనుకోవాలి?” పళ్ళు నూరుతూ కాసింత కటువుగానే పలికింది.

“చెప్పేది సూటిగా చెప్పి ఏడువు. అంతేగాని సూది గుచ్చినట్లు కాదు.”

“అవునండీ శ్రీవారులకే గాని, శ్రీమతులకు ఏమీ ఉండవా!!?”

“అదా మైడియర్ కోకీ..” పకపకా నవ్వాడు సోమరాజు.

“మీకన్నీ నవ్వులాటల లాగే ఉంటాయి. నాకు మటుకు నరాలు తెగిపోయేటట్లు ఉన్నాయి.” ఉక్రోషంగా అంది.

కోకిలాంబను దగ్గరకు తీసుకో బోయాడు. విసిరి కొట్టేసింది.

“అది కాదే కోకీ.. సువర్ణం గాడిని కదిపి చూశాను. నాకు సన్మానం చేసేటప్పుడు హోమ్‌నే కాదు, హోమ్ డిపార్టుమెంటూ కలపాల్సిందేనని నొక్కి చెప్పాను. ముందు చూపుతో తుఫాను వెచ్చరికలు జారీచేశాను కూడాను.”

“అయినా వాడికి బుద్ధి ఉందంటారా?”

“మైడియర్ కోకీ.. అదేనే నా అందాల కేకూ, హెచ్చరించడమే కాదు. వాడిని నిలేసి పారేశాను కూడాను!” – అప్పుడేం చెప్పాడో తెలుసా!”

~

“—-”

‘అది కాదు రాజు గారూ! ‘రోజూ వెన్నెల’ కార్యక్రమంలో ప్రక్కన పెళ్ళాలను కూర్చోపెట్టి సన్మానాలు చేయడమనే పథకాన్ని లేపి పారేశాం!’

“—–”

‘వెనక మా బైలా లో జంటల గురించిన క్లాజు ఉండేది. మన ‘రోజూ వెన్నెల’లో ఒకసారి గుర్రాలయ్య గారికి పెద్ద సన్మాన కార్యక్రమం పెట్టేశాము. ముగ్గురు మినిష్టర్లని పిలిపించాం కూడాను. గ్రాండ్‌గా ఉంటుందని గుర్రాలయ్యను వెన్నంటి అతగాడి విజయాల వెనుక ఉన్న గురువమ్మను కూడ స్టేజి ఎక్కించి గ్రాండ్‌గా సన్మానం చేశాము.’

“—-”

‘అంతే! ఆయన విజయాల వెనుక నేనూ ఉన్నానంటూ గున్నమ్మ వచ్చి నానా యాగీ చేసి పారేసింది. గుర్రాలయ్యతో కలిసి నాకు చెయ్యాల్సిందేనంటూ నిలేసింది. అప్పుడు నోటి మాటరాని గుర్రాలయ్య హోమ్ డిపార్టుమెంట్‌లో అవుట్ హౌస్ నేనేనంటూ కోర్టుకెక్కేసింది. దానితో సన్మానం చేసిన పాపానికి ‘రోజూ వెన్నెల’ కూడా బోను ఎక్కాల్సి వచ్చింది..’

“—-”

‘భార్యని పిలవడం, పిలిపించడం అనే క్లాజును అప్పటి నుండి ‘రోజూ వెన్నెల’ సంస్థ బైలా లో లేపి పారేసింది’.

~

“అంటే మీక్కూడా అవుట్ హౌస్ భయం ఏదయినా!?” మొగుడి కళ్ళలోకి అనుమానంగా చూస్తూ పలికింది కోకిలాంబ

“మైడియర్ కోకీ.. నీక్కావాల్సింది సన్మానమేగా! ఈ సోమరాజుకి వదిలెయ్! నువ్వు వచ్చే ఆలిండియా ఆడంగుల దినోత్సవం నాడు వృద్ధుల హోమ్‌లో వంద బిస్కెట్ ప్యాకెట్లు పంచుతావు. ఆ సందర్భంగా ఘన సన్మానం నీకు. అయినా సువర్ణరాజు మన జేబు మనిషి.”

‘ఉందిలే మంచికాలం ముందు ముందునా..’ టీవీలో సూపర్ సాంగ్ వస్తోంది. కోకిలాంబకు భర్త మాట గురి లేకపోయినా టీవీ పాట మీద గురి ఉంది.

***

సోమరాజుకు దిమ్మ తిరిగిపోతోంది. అమాయకంగా మొదట్లో ‘రోజూ వెన్నెల’ సన్మానానికి ‘సై’ అన్నాడు. కానీ సువర్ణరాజు పంపిల బిల్లు చూస్తే గుండె గుభేలుమంది.

పైసా కూడా తగ్గేది లేదంటూ బిగేసుకు కూర్చుంటున్నాడు. రోజూ ఇంటి కొచ్చేసి మెడ మీద కత్తి పెట్టినట్లు మాట్లాడుతున్నాడు.

కోకిలాంబకు విషయం తెలిస్తే.. ముందున్న ఉపద్రవం సోమరాజుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. అంత పెద్ద మొత్తం. అంత డబ్బు ఎన్ని నెలలు కష్టపడి పని చేసినా సంపాదించలేని మధ్య తరగతి బ్రతుకులు తమవి.

చేసిన సన్మానం గుర్తుకు వచ్చేసరికి కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి. మెడనిండా వేసిన పూల దండలు వెక్కిరిస్తూ ఉన్నాయి. పెట్టిన ఫ్లెక్సీలు, తీసిన వీడియోలు, ఫోటోలు వెగటుగా అన్పిస్తున్నాయి. ‘రోజూ వెన్నెల’ తనకు చీకటి అంధకారాన్ని మిగులుస్తూ ఉంది.

అయితే కోకిలాంబకి విషయం తెలియనే తెల్సింది.

“భర్త ప్రతి విజయం వెనుక భార్య ఉంటుంది. అలాగే భర్త ప్రతి కష్టం వెనుక భార్య అండగా నిలబడి అంటుంది. అది మన బైలా లో రాసి ఉంది. భయపడకు డియర్. ఇదిగో మా పుట్టింటోళ్ళు ఆ అప్పుడెప్పుడో పెట్టిన బంగారు గొలుసు. దీన్ని కుదువబెట్టి ఆ డబ్బు ఆ సువర్ణరాజు ముఖాన కొట్టేసిరా!” కోకిలాంబ కోకిల పాటలాంటి పలుకులు షోకుగా మాత్రమే గాక చాలా హుందాగా ఉన్నాయి.

‘అవును. సన్మానాల పేరిట వ్యాపారం చేస్తున్న సువర్ణరాజు గాడు మారడు. అతగాడు అంతే’ అనుకుంటూ వెళ్ళి డబ్బు కట్టేసి వచ్చాడు.

సన్మానాల ఉబలాటం తీరిన భార్యాభర్తలు ప్రేమగా హత్తుకుపోయారు.

Exit mobile version