[శ్రీ పెద్దాడ సత్యప్రసాద్ రచించిన ‘పిచ్చి వనం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
కమ్మగా పాడే కొయిల
వచ్చిందని వనమంతా
మురిసింది
ఒళ్ళంతా కళ్ళు చేసుకుని
వినోదించింది
తనువంతా చెవులు చేసుకుని
విని తరించింది
కోయిల గానంతో
తన్మయమైపొయింది
తన బతుకుకి ఇది
చాలనుకుంది
ఇంతలో ఎంత మాయ
అన్నట్లుగా
ఆ మధురగానం
మౌనమైంది
ఆ రూపం
కనుమరుగైంది
ఇంతింతగా ఎదిగి
ఎగిసిన వన సంబరం
మూన్నాళ్ల ముచ్చటైంది
కోయిల తన కోసమే
వచ్చిందనుకున్న ఆ వనం
ఆమె కానరాక
ఇక చాలనుకుంది జీవనం
పాపం పిచ్చి వనానికి
తెలియదు కాబోలు
వసంతం కోసమే
కోయిల వచ్చిందని
అది వెళ్ళిపోగానే
తానూ ఎగిరిపోయిందని
పెద్దాడ సత్యప్రసాద్ విశాఖపట్నం జిల్లా వాస్తవ్యులు, కవిగా, రచయితగా దశాబ్దాల ప్రయాణం. వీరి కధలు, కవితలు వివిధ పత్రికలలో ప్రచురితమవడమే కాక, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ద్వారా కూడా ప్రసారం అయ్యాయి. ఇక, వృత్తిగతంగా పాత్రికేయులు. రెండున్నర దశాబ్దాలకు పైగా పాత్రికేయ వృత్తిలో అంకితభావంతో పనిచేస్తున్నారు. రాజకీయ విశ్లేషణలు వీరి ప్రత్యేకత. ప్రస్తుతం ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగంలో న్యూస్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.