[మణి గారు రాసిన ‘ఫీనిక్స్ పక్షి.. స్వాతి’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
శ్రావ్య కారు డ్రైవ్ చేసుకుంటూ వస్తోంది. మంచు పడుతూండడంతో, నెమ్మదిగా డ్రైవ్ చెస్తోంది. ఇల్లు దగ్గర కాగానే, ‘మంచిదయింది తొందరగా వెళ్ళి వచ్చేసాను!’, అనుకుంది. ఈ రోజు మంచు బాగా పడుతుందని వాతావరణ హెచ్చరిక.
వరసగా, మూడు రోజుల వరకూ స్నో పడవచ్చని, వార్తలు చెప్పడంతో, ఇంట్లో మూడు రోజుల వరకూ కావాల్సినవి అన్నీ తెచ్చుకోవడానికి వెళ్ళింది. ‘అనుకున్న విధంగా, స్నో పడే, సమయానికి ఇంటికి చేరుకుంటున్నాను’, అనుకుంది. డ్రైవ్ చేస్తున్న శ్రావ్యకి, వెళ్తున్న దారిలో, ఒక ఇంటి దగ్గర, మంచులో ఒక వ్యక్తి నిల్చుని వుండడం కనిపించింది. స్నో పడుతూంటే, ఆ విధంగా ఆ వ్యక్తి బయట నిల్చోడం ఆశ్చర్యాన్ని కలిగించింది. పడుతున్న తెల్లని మంచు వెలుగులో ఆ వ్యక్తిని, ఒక అమ్మాయిగా గుర్తించింది. జుట్టు రంగు, ఒంటి రంగుని బట్టి ఇండియన్ అనుకుంది. దగ్గరకి వెళ్ళాక కారు ఆపి కార్ విండో గ్లాస్, కిందకి దింపి, “ఏమయినా సహాయం కావాలా?..” అంటూ ఇంగ్లీష్‌లో అడిగింది.
ఆమె జీన్స్ పేంట్, టి షర్ట్ లాంటి స్వెటర్ వేసుకుని వుంది. ఆమెకి వయసు దాదాపు ఇరవై అయిదో, ఇరవై ఆరో వుంటుంది. పడుతున్న స్నో లో, ఆ బట్టలతో, ఎక్కువ సేపు ఆమె చలికి ఆగలేదు. ‘సరి అయిన, వేడి కలిగించే, దుస్తులు కూడా వేసుకోకుండా ఈమె, ఏమిటి ఇలా వుంది?’ అనుకుంది శ్రావ్య.
ఆమె, ఏమీ మాట్లాడక పోవడం చూసి, మళ్ళీ అడిగింది. “ఏమయినా సాయం కావాలా?” అని.
ఆమె, ఒకసారి అడ్డం గాను, ఒకసారి నిలువుగానూ తల ఊపింది.
“కారులో కూర్చుని, మాట్లాడుదురు గానీ, రండి!..” అంటూ కారు తలుపు తెరిచింది.
ఆమె ఒకసారి అటూఇటూ చూసి, కారు లోకి వచ్చి కూర్చుంది.
“మీరు ఇలా స్నో లో నిల్చుని వున్నారు! ఏమయింది? ఎక్కడకి వెళ్ళాలి?.. దారి తప్పారా?”
శ్రావ్య ప్రశ్నలకి, ఆమె తలవంచుకుని, మౌనంగా వుంది.
శ్రావ్య, మళ్ళీ అడిగింది. “మీకు ఏదయినా సాయం కావాలా?..”
ఆమె మళ్ళీ, ఒకసారి అడ్డంగానూ, ఒకసారి నిలువుగానూ, తల ఊపింది.
ఆమె ఏమీ మాట్లాడక పోవడం శ్రావ్యకి కాస్త అసహనాన్ని కలిగించింది
“మీరు ఏమీ మాట్లాడకపోతే నేను ఏమీ చేయలేను. మీరు, దిగిపోతే నేను వెళ్తాను..” అంది.
ఆ మాటలకి, ఆమె తల ఎత్తి, “అదే మా ఇల్లు..” ఆమె, అంతవరకూ నిల్చున్న వైపు, చూపిస్తూ అంది.
శ్రావ్య, ఒకసారి ఆమె చూపించిన ఇల్లు వైపు చూసింది. తలుపులు వేసి వున్నాయి. లోపల దీపాలు వేసే వున్నాయి. కర్టెన్స్ వేసి వుండడంతో, లోపల ఏమీ కనిపించటం లేదు.
ఆమె కూడా ఆ ఇల్లు వైపు దిగులుగా చూస్తోంది.
శ్రావ్యకి ఏమీ అర్థం కాలేదు.
“ఇల్లు ఇక్కడే పెట్టుకుని మీరు బయట వున్నారు, అదీ స్నోలో?..”
శ్రావ్య మాటలకి ఆమెకి దుఃఖం కట్టలు తెంచుకుని వచ్చి, ఏడవడం మొదలు పెట్టింది. శ్రావ్యకి ఆమె ఎందుకు ఏడుస్తోందో అర్థం కాలేదు. ఏమి చేయాలో, పాలు పోలేదు. ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూ వుంటే చూస్తూ వుండి పోయింది,
“నా భర్త, నన్ను బయట పెట్టి తలుపులు వేసేసాడు..” వెక్కుతూనే, మాటలు పెగలించుకుని అంది, ఆమె.
ఆమె కళ్ళనుంచి నీళ్ళు ధారలా కారుతున్నాయి.
శ్రావ్య నిశ్చేష్టురాలయింది. కళ్ళు పెద్దవి చేసి, ఆమె వైపు నమ్మలేనట్లు చూసింది.
ఆమె, శ్రావ్య చూపులని తప్పించుకుంటూ తలవంచుకుంది. చేత్తో కళ్ళ నీళ్ళు తుడుచుకుంటోంది.
“మీరు 911 కి ఫోన్ చేస్తారా?..” అంటూ, శ్రావ్య కారులో వున్న టిస్సూ పేపర్ బాక్స్ ఆమెకి ఇచ్చింది.
“ఫోన్ లేదు.. లోపల ఉంది” ఆమె కళ్ళు తుడుచుకుంటూ అంది.
“నా ఫోన్, నుంచి చేయ్యండి!..” అంటూ, శ్రావ్య తన ఫోన్ ఆమెకి ఇవ్వబోయింది.
“ఊహూ!..” అంది ఆమె తల వంచుకుని.
“ఎంత సేపు ఇలా బయట వుంటారు? ఈ స్నో లో, ఎక్కువసేపు వుండడం మంచిది కాదు. పైగా మీ దుస్తులు కూడా ఈ చల్లదనానికి తగ్గవి కావు..” అంది శ్రావ్య.
“ఇక్కడ, మీకు తెలిసిన వాళ్ళు, ఎవరయినా వుంటే, నా ఫోన్ నుంచి, ఫోన్ చేసి మాటాడండి.” చెప్పింది శ్రావ్య.
“ఇక్కడ ఎవ్వరూ తెలియదు. నాకు తెలిసి వున్న వాళ్ళు కూడా లేరు..” ఆమె మాటలు నూతిలోంచి వస్తున్నట్లు వస్తున్నాయి.
శ్రావ్య ఆమె కేసి ఒకసారి జాలిగా చూసి, “నా ఇల్లు, ఇక్కడకి దగ్గరే. మీకు, అభ్యంతరం లేకపోతే, మా ఇంటికి రండి. వస్తారా?” అంది
ఆమె ఒకసారి అంగీకారంగా తల ఊపుతూ మొదట సారి శ్రావ్య కళ్ళ లోకి చూస్తూ, “థేంక్స్” అంది.
ఎర్రగా వున్నాయి, ఆమె కళ్ళు. ఆమె కళ్ళు తుడుచుకుంటూనే వుంది.
శ్రావ్య, కార్ స్టార్ట్ చేసింది.. “మీరు చూస్తూంటే ఇండియన్‌లా వున్నారు?..”
“అవును!”
“నేను ఇండియా నుంచే.. మీది ఏ భాష?”
“తెలుగు..”
“తెలుగు వాళ్ళు అన్నమాట.. అయితే తెలుగులోనే మాట్లాడండి. నేను తెలుగు మాట్లాడుతాను. మాది హైదరాబాద్. మీది?”
“కాకినాడ.” అంది ఆమె
“నా పేరు శ్రావ్య. మీ పేరు?”
“స్వాతి” ఆమె కళ్ళు తుడుచుకుంటూనే వుంది.
ఇంటికి చేరుకోవడంతో, శ్రావ్య రిమోట్‌తో, గారేజి తెరిచి, కారు గారేజిలోకి పోనిచ్చి, గారేజి మూసి వేసింది.
ఇంట్లోకి వెళ్ళాక, ఆమెని హాలులో కూర్చోబెట్టి, “కాఫీ తెస్తాను” అంటూ లోపలకి వెళ్ళి, రెండు కప్పులతో, పొగలు కక్కుతున్న కాఫీ తీసుకువచ్చింది. ఒక కప్పు ఆమెకి ఇచ్చి, తను ఒక కప్పు తీసుకుని, అమెకి ఎదురుగా వున్న సోఫాలో కూర్చుంది.
ఇద్దరూ, మౌనంగా కాఫీ తాగారు. శ్రావ్యకి, ఏమి మాట్లాడాలో తెలియలేదు.
కాఫీ తాగాక, శ్రావ్య లోపలకి వెళ్ళి తన బట్టలలో నుంచి ఒక పేంట్, ఒక టీ షర్ట్, ఒక స్వెట్టర్, తెచ్చి స్వాతికి ఇచ్చింది. “మీ బట్టలు, చాలా చల్లగా వుండి వుంటాయి. ఆ గది లోకి వెళ్ళి మార్చుకోండి. మీరు ఏమీ సంశయించకండి.” అంది.
స్వాతి మౌనం గానే, బట్టలు మార్చుకుని వచ్చి కూర్చుంది.
ఒడ్డు పొడుగులో ఆమె, తనలానే వుండడంతో ఆమెకి తన బట్టలు సరిపోయాయి అనుకుంది శ్రావ్య, ఆమెని చూస్తూ కాస్సేపు వుండి, నెమ్మదిగా చెప్పడం మొదలు పెట్టింది.
“మా పెళ్ళి అయి, పది నెలలు అయింది. పెళ్ళి అవగానే, ఇక్కడకి వచ్చాము. వచ్చిన రెండు నెలలు బాగానే జరిగాయి. తర్వాత, అతను గొడవలు పెట్టడం మొదలు పెట్టాడు. కారణం, ఏమి ఉండక్కరలేదు, ఏదో ఒక రకంగా, నన్ను అవమానించడం, ఏదయినా చెప్పబోతే, కొట్టడం, నన్ను బయటపెట్టి, తలుపులు వేసుకోవడం. ఈ రోజూ అదే జరిగింది. ఈ విధంగా, చాలాసార్లే చేస్తాడు. ఒక గంట తర్వాతో, రెండు గంటల తర్వాతో, తలుపులు తీస్తాడు..”
చెప్తూ, నెమ్మదిగా, ఒకసారి నిట్టుర్చింది స్వాతి. మళ్ళీ అంది. “ఆ తర్వాత, ఏమి జరగనట్లే, ప్రవర్తిస్తాడు.. అతని ప్రవర్తనని, గుర్తు చేసినా, ప్రశ్నించినా, సారీ చెప్తాడు. నాకు, ఎలా అర్థం చేసుకోవాలో, తెలియదు..”
‘అర్థం చేసుకోవడానికి, ఏముంది?.. వట్టి శాడిజం, కాకబోతే!.. అయినా సాటి మనిషి మీద, చేయి చేసుకుని, బయట పెట్టి తలుపులు వేసే, వ్యక్తి గురించి, ఇంకా ఏదో అర్థం చేసుకోవాలనుకోవడం?! అటువంటి వ్యక్తిని అర్థం చేసుకోవడానికి, కష్టపడుతున్న ఆమెని చూసి జాలిపడాలి!!’ అనుకుంది శ్రావ్య.
కొంత సేపు ఇద్దరూ మౌనంగా వుండి పోయారు.
“మరి, ఏమి చేద్దామనుకుంటున్నారు?”
“ఏమి ఆలోచించలేదు..” సాలోచనగా, దిగులుగా అంది స్వాతి.
“ఊ!..” అంటూ తల పంకించింది, శ్రావ్య.
కాస్సేపుండి శ్రావ్య అంది “మీకు అభ్యంతరం లేకపోతే ఈ రాత్రికి ఇక్కడే వుండండి.” అంటూ స్వాతికి, గది చూపిస్తూ, ఆమెకి పడుక్కునేటందుకు, కావాల్సిన ఏర్పాటులన్నీ చేసింది శ్రావ్య.
“మీరు ఎవరికైనా ఫోన్ చేయాలనుకుంటే నా ఫోన్, వాడచ్చు..” అంటూ తన ఫోన్, స్వాతికి ఇచ్చింది శ్రావ్య.
“మీరు మాట్లాడుకుంటూ వుండండి. నేను డిన్నర్ ఏర్పాటు చేస్తాను” అంటూ, వంట ఇంట్లోకి వెళ్ళింది శ్రావ్య.
వంట ఇంట్లో, వంట చేస్తున్న శ్రావ్యకి, స్వాతి మాటలు అస్పష్టంగా వినపడుతున్నాయి. స్వాతి గొంతులో, ఉద్విగ్నత వినిపిస్తోంది. ‘బహుశః ఆమె తల్లి తండ్రులతో మాట్లాడు తోందేమో!’ అనుకుంది శ్రావ్య.
ఏమి మాట్లాడాలో తెలియక శ్యావ్య, మాట్లాడలేని భావోద్వేగంతో స్వాతి,.. ఎక్కువ మాట్లాడకుండా, డిన్నర్ ముగించారు. స్వాతి గదిలోకి వెళ్ళి పడుక్కుంది. శ్రావ్య కొంత సేపు ఆఫీసు పని చేసుకుని పడుక్కుంది.
శ్రావ్య పడుక్కుందే, కానీ, నిద్ర పట్టలేదు. చాలా ఆలోచనలు!..
అసలు, ఏమనిషి అయినా, ఇంకొక మనిషిని కొట్టడం, హింసించడం ఎలా చేస్తారు? ‘నేను భర్తని, కాబట్టి, భార్యని, ఏమయినా చేయొచ్చు’ అని అనుకుంటాడా?.. మానవత్వం కూడా, లేకుండా ఏమిటో ఆ కొట్టడం, బయటకి నెట్టెయ్యడం?! ఏ గొడవలు వున్నా, ఇంటి దగ్గర, కావాల్సిన వాళ్ళు, అందరూ వున్నప్పుడు మాట్లాడుకోవాలి. మన దేశం కాని దేశంలో, ఒకరికి ఒకరు, అన్ని రకాలుగా, సాయం చేసుకోవడానికి బదులు, ఇదేమి అఘాయిత్యాలో?
ఏ గొడవలు అయినా, ప్రేమతో మాట్లాడుకుని పరిష్కరించుకోవచ్చు కదా! స్నో, పడుతోంది అని కూడా లేకుండా, బయట పెట్టి, తలుపులు వేసుకోవడం ఏమిటో?!..
ఆలోచిస్తున్న శ్రావ్యకి ‘ఒకటి రెండు గంటల తర్వాత, తలుపులు తీస్తాడు’ స్వాతి మాటలు గుర్తుకు వచ్చాయి. అతను తలుపులు తెరిచేసరికి, స్వాతి కనపడకపోతే, పోలీసు కంప్లైంట్ ఇస్తాడేమో! ఆ అలోచన రాగానే ఒక్క ఉదుటన లేచింది శ్రావ్య. ఇలాంటి శాడిస్ట్, అతని భార్యని కిడ్నాప్ చేసానని, కంపైంట్ చేస్తేనో!.. చేసినా చేస్తాడు. కాస్త భయంగా కంగారుగా అనిపించి తన, క్లాస్‌మేట్, కొలీగ్, స్నేహితురాలు, గీతకి ఫోన్ చేసింది. గీత, శ్రావ్య, చిన్నప్పటినుంచీ ఒకటే స్కూల్, ఒకటే కాలేజ్.. ఇద్దరూ అమెరికాలో ఒకటే యూనీలో ఎం.ఎస్. చేసారు. ఇప్పుడు, ఒకటే ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నారు.
“ఏమిటే?! ఇంత రాత్రి చేసావు?..” గొంతులో నిద్ర.. నిద్రలో లేచిందిలా వుంది.
జరిగినదంతా చెప్పింది శ్రావ్య. చివరగా, తనకి కలిగిన భయం గురించి కూడా చెప్పింది.
“వాడు అసలే శాడిస్టులా వున్నాడు. కిడ్నాప్ కేసు, పెడతాడంటావా?..” శ్రావ్య కాస్త ఆందోళనగా అంది.
“అపరిచితులతో జాగ్రత్త!.. దూరంగా వుండాలి! అని కదా ఇక్కడ, ఈ దేశంలో, నానుడి. మర్చిపోతే ఎలాగు? మొగుడు కొట్టినా తిట్టినా, పడి వుంటారు చూడు!.. వాళ్ళని అస్సలు నమ్మకూడదు. రేపు, అతను నువ్వు చెప్పినట్లు కంపైంట్ ఇస్తే, ఈవిడ, అదే ఈ స్వాతి, నీకు ఏ విధమయిన మద్దతు ఇవ్వకపోవడం అటుంచి, భర్త మాటలకి వత్తాసు పలికినా పలకవచ్చు.. అయినా ఎవరో ఒక అపరిచితురాలిని, ఇంట్లో వుంచుకునే ధైర్యం ఎలా చేసావు?.. అదీ, మన దేశం కాని దేశంలో..”
“నువ్వు,.. ఆపుతావా? నీ గురించి తెలిసి కూడా, ఏదో ధైర్యం చెపుతావు, అని, నీకు ఫోన్ చేసాను చూడు, అది నేను చేసిన పెద్ద తప్పు..”
“అంత, ఆత్మ నింద అవసరం లేదు లేవే!.. చూడు..! కీడెంచి మేలెంచాలి అంటారు!.. అందుకే అలా అన్నాను.. స్వాతి, మెలుకువగా వుంటే, ఫోన్ చేయించు – ‘స్నేహితురాలి దగ్గర వున్నాను, పొద్దున్న వస్తాను’ అని.. ఇంక ఇప్పుడు చేసేది ఏముంది?.. స్వాతి పడుక్కుని వుంటే, ఆమె లేవగానే ఫోన్ చేయించు.. ఎక్కువ ఆలోచించకు. నిద్ర పో!.. అంతా బాగనే అవుతుంది లే!.. ఉదయాన్నే నేను వస్తా!..” అంటూ పెట్టేసింది గీత.
లేచి బయటకి వచ్చిన శ్రావ్యకి, స్వాతి వున్న గదిలోంచి శబ్దం వినిపించి, దగ్గరకి, వేసిన తలుపుని ఒకసారి కొట్టి తెరిచింది.
స్వాతి, చప్పుడుకి లేచి కూర్చుంది.
“భయపడకండి. నేనే! మెలుకువ వస్తే, మీరు ఎలా వున్నారో, అని చూసాను” అంది శ్రావ్య కాస్త సంకోచిస్తూ.
“ఊ.!..” అంటూ, తల ఊపింది స్వాతి. చాలా సేపు ఏడ్చిందేమో, మొహం అంతా వాచి వుంది. జాలిగా చూస్తూ శ్రావ్య మళ్ళీ అంది “మీ భర్త, మీకోసం వెతుక్కుంటాడేమో! మెసేజ్, పెడతారా?” అంటూ ఫోన్ అందించింది శ్రావ్య.
ఏమనుకుందో, ఏమిటో. ఏమీ మాట్లాడకుండా, ఫోన్ తీసుకుని, మెసేజ్ టైప్ చేసి, మళ్ళీ ఫోన్ వెనక్కి ఇచ్చేసింది.
స్వాతి లొకేషను కూడా పెట్టింది, ఉదయాన్నే, అతనిని తీసుకు వెళ్ళమంటూ.
ఊదయం, గీత వచ్చేసరికి, స్వాతి భర్త రావడం, ఆమె వెళ్ళిపోవడం, కూడా జరిగి పోయాయి.
“థాంక్సే! నువ్వు చెప్పినట్లు, స్వాతి చేత, ఆమె భర్తకి మెసేజ్ చేయించాను. ఉదయాన్నే, అతను వచ్చి తీసుకు వెళ్ళాడు.”
“మంచిదే! నీకు, ఏ సమస్య లేకుండా, ఆమె వెళ్ళిపోయింది.” అంది గీత.
“ఊ!.. కానీ ఆమెకి, నేను ధైర్యం కలిగే విధంగా ఏ పని చేయలేకపోయానేమో? ఆమెని. భర్తకి మెసేజ్ చేయమని చెప్పడం వల్ల, ఒక విధంగా వెళ్ళిపొమ్మని, చెప్పినట్లు అయిందేమో” అంది శ్రావ్య కాస్త గిల్టీగా.
“మెసేజ్ చేయకపోతే, నువ్వు అనుకున్నట్లే జరిగేది. అతను పోలీసు కంప్లైంట్ ఇచ్చేవాడు. నువ్వు ఇరుకున పడేదానివి.”
“అదీ నిజమే!.. నీకు, ఫోన్ చేయడం, మంచిదయింది. నాకు, అసలు తట్టలేదు. ఆవిషయం.. ఆమెని, ఆ విధంగా చూడడం నన్ను చాలా కదిలించింది.. అందుకే నా బుర్ర పని చేయకుండా పోయింది” అంది శ్రావ్య రాని నవ్వు నవ్వుతూ.
“ఇవన్నీ, చాలా సాధారణం అయిపోయాయి, ఇప్పుడు..” అంది గీత.
“అదేమిటే, అలా అంటావు?..”
“అవును శ్రావ్యా!.. నా కజిన్, బోస్టన్‌లో వుంటోంది.. అదీ, ఇలాంటి విషయమే, చెప్పింది. ఒకటి కాదు.. ఇంకొక కజిన్, శాన్ ఫ్రాన్సిస్కో లొ వుంటుంది.. అదీ ఇలాంటిదే చెప్పింది.. ఇప్పుడు, ఇక్కడ, అంటే, అమెరికాలో వుండే ఇండియన్స్ ఫేమిలీస్‌లో ఇలాంటివి జరగడం చాలా సాధారణమయిపోయింది. ఈ మగవాళ్ళకి, ఇక్కడకి వచ్చేసరికి, ఏమి తేడా వస్తుందో మరి?!..”
“ఇక్కడకి వచ్చి, మారడం కాదులే, గీతా!.. అక్కడా, ఇలానే, వుంటారేమో. బయటకి రావంతే!.. ఇక్కడయినా, మనం చూస్తున్నాము, కాబట్టి తెలిసింది. ఎవరయినా చెపితేనో, వార్తల్లో వస్తేనే, కదా తెలిసేది. బయటకి వచ్చేవి, తెలిసేవి, కొంచెమే.. రానివి, ఎక్కువే వుంటాయి..”
“అదేమిటోనే! ఇలాంటి సంఘటనలలో, బాధితులంతా,.. అదే భార్యలు, చెప్పేదానిలో, సాధారణంగా కనిపించేది అవమానించడం, తిట్టడం, కొట్టడం, బయటపెట్టి తలుపులు వేసేయ్యడం.. నేను విన్న సంఘటనలు, ఒక పది వుంటే, అన్నిటిలోనూ భర్తలు, ఈ విధంగానే, ప్రవర్తించారని చెప్పడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది.” అంది గీత.
“ఇంటరెస్టింగ్!.. ఇది కూడా వైరల్, లాంటిదంటావా?” అంటూ నవ్వింది శ్రావ్య. గీత కూడా నవ్వింది.
మళ్ళీ, వుండి, వుండి.. సాలోచనగా అంది శ్రావ్య,
“ఇదీ, ఒక విధమయిన మానసిక రుగ్మత ఏమో.. అవుతే దాన్ని, అంగీకరించడానికి, ఎవరికీ వాళ్ళు, అంగీకరించడం కష్టమే, అవుతుంది. ఇంక ఇలాంటి మగవాళ్ళకి, ముఖ్యంగా భర్తలకి ఇంకా కష్టం.. ఎందుకంటే, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళకి ఏవిధం గానూ, తప్పుగా అనిపించదు. భర్త, ఏమి చేసినా పడి వుండాలనే, ఎప్పుడో, నిర్దేశించిన నియంత్రణ, పట్టు సడలినా, వదిలినా, ఇంకా ఎక్కడో, మెమొరీలో, అంతర్గతంగా వుంటునే వుంటుంది. అందుకే, పురుషాధిపత్యం, సంసారాలలో, ఇంకా నడుస్తూనే వుంది. ఆ కారణం గానే, ఇలాంటివన్నీ, వాళ్ళ తల్లి తండ్రులకి, బయట వాళ్ళకి, ఏమీ తప్పుగా అనిపించక పోయినా, ఆశ్చర్య పోనక్కర లేఫు.”
“నిజమే!.. బయట కూడా, చాలా రకాల ఒత్తిళ్ళు.. ఎక్కడ చూసినా పోటీ ధోరణి. ‘ఎవరికి వాళ్ళు, ఒక్క రోజులోనే, సిఇఓ అయిపోవాలని అనుకోవడం, రాత్రికి రాత్రే, కోట్లకి పడగలెత్తాలని అనుకోవడం.. ఇలాంటి ఒత్తిళ్ళని, ప్రెజర్‌ని మేనేజ్ చేయలేక, ఇంట్లో భార్యల పైన చూపిస్తున్నారేమో! ఆత్మన్యూనతతో బాధ పడేవాళ్ళే, ఈ విధమయిన శాడిజంతో ప్రవర్తిస్తారు. కంపేరిజన్స్‌లో, ఆత్మన్యూనత రాకుండా ఏమవుతుంది?..” అంది గీత.
“అవును!..” అంటూ, తల ఊపింది శ్రావ్య.
“ఏమోనే!.. ఇలాంటివి చూస్తూంటే, పెళ్ళంటేనే, భయం వేస్తుంది.” అంది గీత
“రెండు నెలలలో పెళ్ళి పెట్టుకుని, నువ్వు అనాల్సిన మాటలా?..”
“అందుకే అంటున్నా, భయం వేస్తోంది అని. అతను, ఎటువంటివాడో, ఎలా వుంటాడో, అని భయం వుండదా?..”
“అతను, ఇక్కడే వుంటున్నాడు కదా!.. కలుస్తూ వుంటే, మంచి చెడులు, తెలుస్తాయి. అంతే కానీ, భయపడి ప్రయోజనం ఏముంది?.. భయం పోవాలంటే.. అతని గురించి, ఎక్కువగా తెలుసుకోవడమే!”
“నువ్వు, అన్నీ తెలిసినట్లు, అందరికీ, చెప్తావు! కానీ, పెళ్ళి మాత్రం చేసుకోనంటావు?..”
“అమ్మా! కాస్త కరెక్షన్. పెళ్ళి వద్దనుకోలేదు. నాకు నచ్చిన వాడు, దొరికితే కానీ, చేసుకోను, అంతే!” అంది శ్రావ్య.
కాస్సేపుండి మళ్ళీ అంది శ్రావ్య. “నువ్వు చూడు.. నీకు ఎన్ని సంశయాలో! అయినా పెళ్ళి చేసేసుకుంటున్నావు! అదే నాకు నచ్చదు. ఏ బాంధవ్యంలోనయినా, ప్రేమ వుండాలి. ప్రేమతో పాటు, పరస్పర నమ్మకం, గౌరవం తప్పకుండా వుండాలి. ఇంక వివాహ బంధంలో, జీవిత భాగస్వాముల మధ్య, వాటి అవసరం, ప్రాముఖ్యత గురించి వేరే చేప్పాల్సిన పని ఏముందే? అయినా, వాటిని, ఈ వివాహ వ్యవస్థ, గ్యారంటీ చేయదు. అందుకే, ఏ వ్యక్తి మీదయినా ప్రేమ, గౌరవం, నమ్మకం కలిగే వరకూ, పెళ్ళి చేసుకోకూడదు. లేకపోతే, ఆ సంసారం కాస్తా, పొలిటికల్ వ్యవస్థలా తయారవుతుంది. అపార్ధాలు, అనుమానాలు, అపనమ్మకాలు.. ఇద్దరూ, ఎప్పుడూ అశాంతితోనే వుండాలి. అదీకాక.. ఇప్పుడు, ఆడవాళ్ళు, వాళ్ళ వ్యక్తిత్వాలని, వాళ్ళే కొత్తగా, రాసుకుంటున్నారు. ఆ విషయంలో, ఇంకొకళ్ళ జోక్యం కానీ, ఇంకొకళ్ళు ప్రభావితం చేయడం కానీ, అంగీకరించటం లేదు. అది, అందరూ గుర్తించి, అంగీకరిస్తేనే, భార్యాభర్తలు సంతోషంగా వుండగలిగేది.”
“ఊ!.. నిజమే!” అంటూ మౌనంగా వుండిపోయింది గీత.
ఆ తర్వాత, కాస్సేపు, ఆఫీసు పని గురించి మాట్లాడుకున్నారు.
***
ఆ తర్వాత, స్వాతి, మళ్ళీ, మళ్ళీ, శ్రావ్య దగ్గరకి, వస్తూ వుండేది. పరిస్థితి తెలిసిన, శ్రావ్య, ఏమీ, అడిగేది కూడా కాదు. స్వాతి, వుండదలుచుకుంటే, వుంటానని చెప్పేది. కూడా ఫోన్ తెచ్చుకునేది. ‘పరిస్థితిని, మేనేజ్ చేయడం అలవాటు చేసుకుంటున్నట్లుంది’ అనుకునేది శ్రావ్య,
అది చెప్తే, గీత అంది – “నీ ఇల్లు, ఏమయినా పుట్టిల్లు, అనుకుంటుందా ఏమిటే? సాయం చేయడం మంచిదే.. అలా అని, ఎడ్వాంటేజ్ తీసుకోనీ కూడదు”
“స్వాతి వున్న పరిస్థితిలో, ‘అడ్వాంటేజ్ తీసుకోవాలి’ అని అనుకునేటంత సావకాశం వుండదు గీతా! ఎప్పుడూ, ఏదో ఒక విధమయిన, అవమానానికి, వేధింపుకి, గురి అవుతూంటే, ముందుగా దెబ్బతినేది, ఆత్మవిశ్వాసం. అది పోయాక ఎవరయినా, ఏదయినా, స్పష్టంగా ఎలా ఆలోచించగలుగుతారు? ఏ నిర్ణయం అయినా, ఎలా తీసుకుంటారు?”
“అలా అని వూరుకుంటే, ఆమె ఎప్పటికీ, నిన్ను ఒక కంఫర్ట్ జోన్ లాగా వాడుకుంటూ వుంటుంది. దాని వలన నువ్వు ఆమెకి, మంచి కన్నా చెడు, ఎక్కువ చేస్తున్నట్లు అనిపించటంలేదూ? నువ్వు ఆమెకి, ఆశ్రయం ఇవ్వకపోతే, ఆమె ఈపాటికి, ఇండియా వెళ్ళిపోయి వుండేది. లేకపోతే డైవర్స్ ఇచ్చి వేరే వుండేది.. కుంటుపడిన, వాళ్ళ బంధాన్ని క్రచస్ ఇచ్చి నడిపిస్తున్నావు? ఆలోచించు..” అంది గీత.
“ఆమె, నా ఇల్లు పుట్టిల్లుగా అనుకున్నా, కంఫర్ట్ జోన్ అనుకున్నా నాకు ఏమి అభ్యంతరం లేదు. ఆమెకి, ఇక్కడ ఎవ్వరూ లేరు. ఎవరూ తెలియదు. అటువంటప్పుడు, నువ్వు అనుకున్నట్లు, ఇండియా వెళ్ళడం గానీ, డైవర్స్ ఇవ్వడం కానీ, అంత ఈజీగా అవుతుందా. అయినా, దేనికయినా, టైమ్ రావాలంటారు.. అదీ కాక, ఆమె ఏమి అనుకుంటోందో, మనకి తెలియదు. ఆమె నా దగ్గరకి వచ్చిందని, నా అభిప్రాయాలు, ఆమె మీద రుద్ది, ఒత్తిడి తీసుకురావడం, నాకు ఇష్టం లేదు. ఆమె, ‘ఒక బాధితురాలిగానే, వుండిపోదలుచుకుంటోందా? ఆ ఆలోచనా పరిధి, దాటి, బయటకి, రావాలనుకుంటొందా?’ అనేది చివరకి, ఆమె నిర్ణయించుకోవాల్సిందే.. నేను చేయగలిగినది,.. చేయగలిగిన సహాయం, చేయడం..” అంది శ్రావ్య.
***
ఒకరోజు, స్వాతి సూట్‍కేస్‍౬తో వచ్చింది. మొహం మీద గాయాలు. ఎప్పటిలాగే, శ్రావ్య ఏమీ అడగలేదు. కాస్త, ఆశ్చర్యపోతూ. చూసింది. స్వాతి, లోపలకి వచ్చి కూర్చుంది.
కొంత సేపు, మౌనం గా వుండి, స్వాతి అంది “అతనితో ఇంక వుండలేను. చాలా ఓర్చుకున్నాను. అంతవరకూ క్రూరంగా, ప్రవర్తించినవాడు, ఒక్కసారి కాళ్ళ మీద పడిపోతాడు. అతని ప్రవర్తనకి, నాకు, చాలా అయోమయంగా, వుండేది. అర్థం అయ్యేది కాదు,.. అతను కాళ్ళ మీద పడి, క్షమించమంటూంటే, జాలి వేసేది. అందుకే ఇన్నాళ్ళు భరించాను. ఇంక, నా వల్ల కాదు.. అతనితో, చెప్పే వచ్చేసాను.”
“ఊ!..” శ్రావ్య ఊ కొడుతూ తల ఊపి. ‘అతనికి, చెప్పి వచ్చే, ధైర్యం చేసిందంటే, చాలా గొడవే జరిగి వుంటుంది. ఆమె మొహం మీద, గాయాలు చూస్తూంటేనే, తెలుస్తోంది.’ అనుకుంది.
“అమ్మ, నాన్న, అతని తల్లి తండ్రులకి చెపితే, ‘మీ అమ్మాయి ఏమి చేసిందో!’ అన్నారుట.. ఎంత కాలం ఈ విధంగా, బాధపడినా, అతని తప్పు, అతనికి తెలిసి వచ్చి, మారే పరిస్థితి కనిపించటం లేదు.. ఇదంతా, నా తప్పే అంటూ వుంటే, క్రమేణా, అదే నిజమనుకునే పరిస్థితికి, నేను వెళ్ళిపోతానేమో అని, భయం వేసింది. ఆత్మన్యూనతతో, నేను బతికినా, అది చావు లానే.. బతుకుకీ, చావుకీ, తేడా వుండదు అప్పుడు. ఇప్పటికే, నాకు ‘నేను బతికి వున్నానా?’ అనే అనుమానం, వస్తూంటుంది. అతను, ఎప్పుడు ఏ విధంగా, ప్రవర్తిస్తాడో అనే భయం, నన్ను ప్రతిక్షణం, భయపెడుతూనే వుంటుంది..”. స్వాతి చెప్తూంటే, ఆమె కళ్ళ నుంచి, నీళ్ళు ధారలా కారుతున్నాయి.. చేతితో తుడుచుకుంటూనే వుంది.
కాస్సేపుండి మళ్ళీ అంది “మీరు, నన్ను, తోబుట్టువు కన్న, ఎక్కువగా చూసుకున్నారు. ఎప్పుడు పరిస్థితి బాగోలేకపోయినా, ఎటువంటి సంకోచం లేకుండా, మీ దగ్గరకి వచ్చేదాన్ని.. మీరున్నారన్న ధైర్యం, నాకు ఆసరా ఇచ్చింది. నన్ను ఆలోచించుకునేలా, చేసింది. మీ సహాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను..”
శ్రావ్య మౌనంగా ఆమె మాటలు వింటోంది.
స్వాతి, ఆగి ఆగి, చెప్తోంది. “చివరగా, మీరు, ఇంకొక్క సాయం చేయాలి.” అంటూ, మెడలో వున్న మంగళ సూత్రం గొలుసు, చెవుల కమ్మలు, చేతికి ఉన్న రెండు గాజులు బల్ల మీద పెట్టి, “నాకు, ఇండియా టికెట్ కొనడానికి, డబ్బులు కావాలి.” అంది.
వింటూన్న శ్రావ్య స్వాతి కేసి ఒకసారి చూసి ఆమె దగ్గరకు వచ్చి కూర్చుంది. స్వాతి చేతిని, తన చేతిలోకి తీసుకుని అంది “మంచి నిర్ణయం తీసుకున్నావు స్వాతీ! నువ్వు వెళ్ళడానికి, అవసరమయిన ఏర్పాటు నేను చేస్తాను. నువ్వు అక్కడకి వెళ్ళాక, నెమ్మదిగా, నాకు డబ్బులు పంపుదుగాని!..” అంటూ బల్ల మీద స్వాతి పెట్టిన నగలు, స్వాతి చేతిలో పెట్టింది.
స్వాతి, దగ్గరగా కూర్చున్న శ్రావ్యని కౌగిలించుకుని, కాస్సేపు ఏడ్చింది. “నేను ఏడుస్తున్నది బాధతో కాదు, మీ ఆత్మీయతకి..” అంటూ కళ్ళు తుడుచుకుని, వచ్చీ రాని నవ్వు నవ్వింది.
తెలియకుండానే శ్రావ్యకి కూడా కళ్ళనుంచి నీళ్ళు రాలాయి. ఇద్దరూ చాలా సేపు, ఒక విధమయిన, భావోద్వేగంలో వుండిపోయారు.
***
స్వాతిని, ఇండియా ఫ్లైట్ ఎక్కించి, తిరిగి వస్తూంటే, గీత నవ్వుతూ అంది. “దేశం కాని దేశంలో, ఇలాంటి కష్టం వస్తే.. కష్టమే.. ఏమయితేనేం,.. స్వాతి,.. క్షేమంగా ఇండియాకి వెళుతోంది. మొత్తానికి కథ సుఖాంతమయింది..”
“ఎక్కడే పాపం?!.. ఆమె అనుభవించిన నరకం తాలూకు ట్రామా నుంచి, బయటపడడానికి, ఎన్ని రోజులు పడుతుందో.. ఏళ్ళు పడుతుందో.” అంది, శ్రావ్య డ్రైవ్ చేస్తూ.
“తొందరగానే, బయట పడుతుందని ఆశిద్దాం..” అంది, గీత, కార్ విండో లోంచి, ఆకాశం కేసి చూస్తూ.
“ఊ!.. ఫీనిక్స్ పక్షి, కాలి, బూడిద లోంచి, మళ్ళీ పుట్టినట్లు, స్వాతి, అన్నీ మరిచిపోయి, కొత్త జీవితానికి నాంది పలుకుతుందని ఆశిద్దాం..” అంది శ్రావ్య డ్రైవ్ చేస్తూ, ముందుకి పరిగెడుతున్న రోడ్ చూస్తూ.
“ఊ! ఫీనిక్స్ పక్షి.. స్వాతి.. బాగుంది.. నీ ఉపమానం” అంది, గీత నవ్వుతూ..
ఫ్లైట్‌లో ప్రయాణం చేస్తున్న స్వాతి శ్రావ్యని తలుచుకుంటూ, దేవుడిని ప్రార్ధించుకుంది. ‘నాలాంటి వాళ్ళు, ఎంత మంది వుంటారో, నాకు తెలియదు, కానీ శ్రావ్య లాంటి వాళ్ళు, కొద్ది మందే వుంటారని, నాకు తెలుసు. అందుకే, ఇటువంటి కష్టం వచ్చిన, నా లాంటి వాళ్ళందరికీ, శ్రావ్య లాంటి వాళ్ళు, తారసపడేలా చూడు, దేవుడా!’ అని.