Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఏక కాలంలో మంచి చిత్రం, చెడ్డ చిత్రమూనూ : Perfume

పోయిన వారం టాం టిక్వర్ తీసిన ఒక లఘు చిత్రం “ఎపిలోగ్” గురించి మాట్లాడుకున్నాం కదా. ఈ వారం అతనిదే మరో చిత్రం “పర్ఫ్యూం” అనే పూర్తి నిడివి జర్మన్ చిత్రం గురించి చూద్దాం. ఇది పేట్రిక్ సుస్కిండ్ వ్రాసిన జర్మన్ నవల “పర్వ్యూం” ఆధారంగా తీసినది. మనం సస్పెన్స్ చిత్రాలు చూస్తున్నప్పుడు ఒక వైపు భయపడుతూనే, అవసరమైతే ఒక కన్ను మూసుకుని అయినా పూర్తిగా చూస్తాము. ఇది కూడా ఒక వైపు కడుపులో దేవినట్టు ఉన్నా చివరిదాకా చూస్తాం. ఇక్కడ రెండు విషయాలున్నాయి : ఒకటి కథ, రెండోది దాన్ని సినిమాగా మలచిన తీరు. నేను నవలైతే చదవలేదు గాని, ఇది చూసాక ఊహించగలను. అది ఎంతో పాప్యులర్ అయ్యి, 49 భాషలలో అనువాదించబడింది కూడా. కథ విషయంలో పేచీలుండవచ్చు. కానీ ఒక సినిమాగా ఇది నాకు సంతృప్తినిచ్చినది. నవలలో ఒక పాత్ర మానసికావరణాన్ని యథేచ్చగా వివరించడానికి వీలుంటుంది. కానీ సినిమాలో అంతా దృశ్యాలతో చెప్పాలి. ఇందులో John Hurt తెర వెనక నుంచి మనకి కథ చెబుతాడు. కానీ ఆ సంభాషణ చాలా ఫుటేజీని తగ్గించడానికి ఉపయోగపడింది. అలాగని ఆ క్షణాల్లో దృశ్యాలు తక్కువ స్థాయిలో లేవు. ఇక కథ చాలావరకు చూస్తాము, తక్కువే వింటాము.
మనం ఒక మంచి పాటను ఆస్వాదించేటప్పుడు కనులు మూసుకుంటాము. ఒక మంచి పరిమళం ఆఘ్రాణించేటప్పుడు కూడా. ఇక ఒక పాటనో, పరిమళాన్నో గుర్తించాలి అన్నప్పుడు కనులు మూసుకోక తప్పదు. అప్పుడు పూర్తి ఏకాగ్రత ఆ విషయం మీదే వుంటుంది. ఈ చిత్రం పరిమళం మీదే. అందుకే నాయకుడు కూడా రోడ్డు మీద నిలబడి, కనులు మూసుకుని పరిమళం సాయంతో మనిషిని గురుతు పడతాడు, అదే పరిమళం ఆనవాలు పట్టుకుని ఆ మనిషిని వెతికి పట్టుకుంటాడు. ఇలాంటి కథనం తెర మీద చూడాల్సిందే.
కథా కాలం పద్దెనిమిదో శతాబ్ది ఫ్రాన్స్. ఒక రద్దీగా వున్న, మురికిగా, బురదగా వున్న చేపల మార్కెట్టు. అందరితో పాటే ఆమె కూడా చేపలమ్ముకోడానికి అక్కడ నిలబడి వుంది. గర్భవతి. నెప్పులు మొదలవుతాయి. వెనక గది లాంటి దాంట్లో వెళ్ళి బిడ్డను కని బొడ్డుతాడు కోసి పిల్లవాణ్ణి ఆ బురదలోనే వదిలి ఇటొచ్చి చేపలమ్ముతుంది. ఇదివరకు గర్భస్రావాలు, మృతశిశువును కనడం, లేదా కనగానే బిడ్డ పోవడం ఇలాంటివి జరిగాయి. ఈసారి కూడా ఆమెకు ఆశలేదు. కానీ ఆ పిల్లవాడు గట్టివాడు. బ్రతుకుతాడు. కేర్ మని ఏడుపు వినిపిస్తే జనం లోనకెళ్ళి చూసి ఆమె తన బిడ్డను అలా చనిపోవడానికే వదిలేసిందని తీర్మానించి, ఆమెను పోలీసులకు అప్పజెప్పుతారు. ఆమెకు ఉరిశిక్ష పడుతుంది. ఇక పుట్టిన ఆ బిడ్డ కనులు తెరిచి చూడడం కాదు, ముక్కుతో అక్కడ వున్న వస్తువులన్నిటి వాసనలను చూస్తాడు. ఆ ఒక్క ఇంద్రియ జ్ఞానం అతని ప్రత్యేకత. బిడ్డను హోం లో వేస్తారు. అక్కడా కిక్క్రిరిసినట్టు పిల్లలు. చోటు లేకపోతే కసితో అతన్ని చంపాలని చూస్తారు కొంతమంది పెద్ద పిల్లలు. ఈ గట్టి ప్రాణం చావదు. ఎలాంటి ప్రాణమో చూడండి తల్లి నుంచి, సమాజం నుంచి ఎలాంటి ఆదరణా లేకుండా పెద్దవుతాడు. ఈ విషయం సినిమా చివరిదాకా గుర్తుపెట్టుకోవాలి. అతను కాస్త పెద్దయ్యాక హోం లో చోటు లేదని అతన్ని ఒక చర్మకారునికి అమ్మేస్తారు.
భయంకరమైన వాసనలు కలిగిన ఆ కర్మాగారంలో ఎవరూ ఎక్కువ బతకలేదు. ఈ గట్టి పిండం జోఁ బేటిస్త గ్రేనవిల్ (బెన్ విషా) తప్ప. అక్కడ తయారైన వస్తువులను పేరిస్‌కి చేరవేయడానికి అతన్ని కూడా వాడుకుంటారు. ఆ విధంగా అతను ఇతర ప్రదేశాలు, వస్తువులు, మనుషులు అందరి వాసనలనూ చూసే వీలు కలుగుతుంది. ఒక అందమైన పడుచుపిల్ల ఏవో పళ్ళు అమ్ముతూ వెళ్తుంటే ఆకర్షితుడై, రూపానికి కాదు, ఆమె పరిమళానికి, ఆమె వెంట వెళ్తాడు. ఆ పరిమళం అతన్ని ఎంత ఉన్మాదిని చేస్తుందంటే ఆమె వొళ్ళంతా వాసన చూడటానికి వేరే మార్గం లేక ఆమెను చంపేస్తాడు. అయితే మిగతా పరిమళాల లాగే ఆమె పరిమళం కూడా ఎంతో సేపు నిలవదు. అదీ అతని బాధ. అప్పుడే పేరిస్ లో amor అనే సెంటు బాగా నచ్చింది అక్కడి జనాలకి. దాని ఫార్ములాని ఎలాగైనా కనుగొనాలని చూస్తున్నాడు బాల్డిని (డస్టిన్ హాఫ్మన్). మొన్నటి దాకా అతను నెంబర్ వన్ perfumer. ఇప్పుడు వ్యాపారం పడిపోయింది. తిరిగి పూర్వవైభవం రావాలంటే ఇంకొన్ని కొత్త సెంట్లు కనుగొనాలి. అతని దగ్గర అసిస్టెంటుగా చేరుతాడు గ్రానువిల్. ఇతని ఆఘ్రాణ శక్తి క్షణాల్లో సెంట్ల నిర్మాణం, వినిర్మాణం, పుర్నర్నిర్మాణం అదీ చూసి అచ్చెరువొందుతాడు బాల్డిని. అతని చేత కొత్త సెంట్లు చేయించుకుంటూ, తనకు తెలిసిన విద్యలు నేర్పుతూ కలిసి వుంతారు; ఒకసారి ఇల్లు కూలి బాల్డిని చనిపోయేదాక.
డిస్టిలేషన్ కాకుండా వేరే పధ్ధతుల్లో సెంట్ తీయవచ్చా? సెంట్ను ఎక్కువకాలం భద్ర పరిచేదెలా? ఇలాంటి సమస్యలు గ్రానువిల్ వి. ఇవన్నీ తెలుసుకోవడానికి ఫ్రాన్స్ లోని గ్రాస్ అనే ప్రదేశానికి వెళ్తాడు. అక్కడ ఒక విధవరాలు నడుపుతున్న సెంట్ ఫేక్టరీ లో పనికి కుదురుతాడు. కొన్నాళ్ళకి వూరంతా భయాందోళనలకు గురవుతుంది. అందమైన కన్నె పిల్లలు మాయమవుతున్నారు, ఆ తర్వాత వాళ్ళ నగ్న దేహాలు నదిలోనో, వీధిలోనో దొరుకుతున్నాయి. కర్ఫ్యూ విధించి ఆ దుర్మార్గుడి ఆగడాలను అరికట్టాలా, మరో మార్గమా అన్నది ఇప్పుడు చర్చ.
సరే ఇంతకంటే ఎక్కువ కథ చెప్పను. మీరు సినిమానే చూడండి.
కథ ఏ విధంగా రూపు తీసుకుని, ఏ విధంగా ముగుస్తుంది అన్నది చెప్పడం లేదు కాబట్టి ఎక్కువ పరిశీలినలు వ్రాయలేను.
టాం టిక్వర్ దీని స్క్రీన్ ప్లే మరో ఇద్దరితో కలిసి వ్రాశాడు తనే దర్శకుడు. తనే సంగీత దర్శకులలో ఒకడు. ఇదివరకు అనుకున్నట్టు అంతా అతని కపోలంలో రూపు దిద్దుకున్నట్టే తెర మీద కూడా రూపు దిద్దుకుంటుంది. మొదటి అయిదు నిముషాల్లోనే అతను చేసిన షాట్ టేకింగ్; అలాగే పేరిస్ చేపల మార్కెట్లోని ఆ సీన్లు చూస్తేనే అర్థమైపోతుంది : అతను “సినిమా” గా కథ చాలా ప్రభావవంతంగా చెప్పగలడని. ఇక గొప్ప చాయాగ్రహణం ఇచ్చింది కూడా అతని ఫేవరిట్ అయిన ఫ్రాంక్ గ్రీబ. వీళ్ళకు తోడు డస్టిన్ హాఫ్మన్, బెన్ విషా, అలన్ రిక్మన్ ల మంచి నటన. కథలోని మంచి చెడులు, నీతి అనీతి లాంటివి పక్కన పెట్టి ఈ సినిమా చూస్తే ఒక మంచి అనుభూతి మిగులుతుంది. పెద్దలకు మాత్రమే అయిన ఈ చిత్రాన్ని కూడా కాస్త వివేకం-విచక్షణ లతో చూడాల్సిన చిత్రం.


SPOILER ALERT
ముందుగా ఈ చిత్రం చూసి తర్వాత ఇది చదవండి. సినిమాలో సస్పెన్స్ అంటూ ఏమీ లేదు. అంతా మన కళ్ళ ముందే జరుగుతుంది. కానీ మొత్తం కథ తెలిస్తే సినిమా చూస్తున్నప్పుడు కలగాల్సిన ఆశ్చర్యం, రోత, భయం, ఉత్సుకత, వెగటు, విస్మయం లాంటి ఎన్నో అనుభూతులను సరిగ్గా అనుభవించలేము.
డిస్టిల్ల్ చేసి సెంటును తయారు చేసే బాల్డిని చెబుతాడు. పరిమళాలకూ ఒక ఆత్మ వుంటుంది. ప్రత్యేకంగా. దాన్ని దాని పరిసరాల ఇతర వాసనల నుంచి వేరు చేసి చూడాలి, గుర్తు పట్టాలి. స్థూలంగా ఒక పరిమళానికి మూడుగా వేరు చేసి చూడొచ్చు, హెడ్, హార్ట్, బేస్ లుగా. ప్రతిదీ మళ్ళీ నాలుగు chords గా విభజించవచ్చు. ఇలా ప్రతి పరిమళానికీ పన్నెండు ప్రత్యేకమైన అంశాలు ఉంటాయంటాడు. ఇక డిస్టిల్లేషన్ పధ్ధతి కాకుండా వేరే పధ్ధతులు కూడా వున్నాయనీ, అవి గ్రాస్ లాంటి చెఒట బాగా తెలుసుకునే వీలుందనీ చెబుతాడు. గ్రాస్ లో గ్రానువిల్ నేర్చుకున్నది ఏమిటంటే వాసన లేని కొవ్వు పదార్థాన్ని శరీరానికి పూసి, గాలాడకుండా కప్పి వుంచి, తర్వాత దాన్ని తీసి వేడి చేయడం ద్వారా వచ్చే ఆవిరి నుంచి సెంటును తీయవచ్చని. కుక్క పిల్లను ఎత్తుకుని మార్కెట్ లో కనిపించిన ఒక పడుచును కిడ్నాప్ చేసి చంపి ఆ విధంగా సెంట్ తీస్తాడు. ఆ సెంట్ ఆ కుక్క పిల్ల దర్దాపుల్లో తీస్తాడు. కుక్క పిల్ల అతన్నే అనుసరిస్తుంది, తన యజమానురాలి వాసనను గుర్తుపట్టి. ఇక నమ్మకం కలిగి మరింత మందిని చంపి సెంట్లు తీస్తాడు. తనకు కావలసిన పన్నెండు రకాలు అయ్యే దాకా. కానీ చివరికి పోలీసులకు చిక్కుతాడు. అతనికి ఉరిశిక్ష ఖరారవుతుంది. అందరూ చూస్తుండగా అతన్ని చావగొట్టి, ఉరితీస్తారు. జనం మూగి వున్నారు. గోల గోలగా వుంది. అందరిలో కోపావేశాలు. వధ్యశిల చేరుకుని గ్రానువిల్ ఒక సెంటు సీసా తీస్తాడు. ఇది తను కనుగొన్న కొత్త సెంటు : ప్రేమ కు సంబంధించి. Love and love-making వాస్తవానికి. ఆ పరిమళం వెదజల్లడం జనాలందరిలోనూ అనూహ్యమైన మార్పు రావడం అందరూ అతన్ని ఒక దేవతగా చూడటం, నిర్దోషి అని నమ్మడం, అతను చంపిన ఒక అమ్మాయి తండ్రితో సహా. ఇలా జరిగిన కొద్ది నిముషాలకే అందరూ ప్రేమ మైకంలో పడిపోయి అక్కడికక్కడే సెక్స్ చేయడం మొదలుపెడతారు. ఒక పెద్ద సమూహం. అతను నిర్దోషిగా బయట పడతాడు. ఇప్పుడతను తన గమ్యాన్ని చేరుకున్నాడు. అయినా ఏదో వెలితి. తను పుట్టినవూరుకు వెళ్తాడు. అక్కడ చలిమంట వేసుకుని కొందరు కబుర్లు చెప్పుకుంటూ వున్నారు. గ్రానువిల్ తన సెంటు సీసా మొత్తాన్ని తన తలపై గుమ్మరించుకుంటాడు. ఆ పరిమళం వ్యాపించినంత మేరా మనుషులు ఏదో మైకం కమ్మి వచ్చి అతని మీద పడి పోయి, ముద్దులు పెడుతూ, ఆఖరికి కొరుక్కు తింటారు, ఏదీ మిగలకుండా. ఎంత బీభత్సం!
ఎలాంటి ప్రేమా ఆదరణా లేకుండా పెరిగాడు. ఐతే ఒక విశేష జ్ఞానంతో పుట్టాడు. అది విశేషమైన ఆఘ్రాణ శక్తి. తనకు నచ్చిన మొట్ట మొదటి అమ్మాయి దగ్గర ఒక ప్రత్యేకమైన పరిమళం గ్రహించి వెంటపడతాడు. అది ప్రేమా? వ్యామోహమా? వెర్రా? పిచ్చా? లైంగిక ఆకర్షణ అయితే ఆమెను బలవంతంగానైనా పొందాలి. కాని అతను ఆమె పరిమళాన్ని ఆఘ్రాణించడానికి, ఆమె మామూలుగా ఒప్పుకోదు కాబట్టి, చంపి వివస్త్రను చేసి వొళ్ళంతా ఆఘ్రాణిస్తాడు వాసన ఉన్నంతసేపూ. ఆ తర్వాత కూడా అతను చంపిన ఏ అమ్మాయినీ అతను శారీరికంగా కలవడు. తనకు తెలిసింది ఒక్కటే, ఆ సెంటు కోసమే అన్నీ చేస్తాడు. చివరికి మనుషులను ప్రేమ-కామాల మత్తులో ముంచే సెంటును కనుగొన్నా తృప్తి వుండదు. ఏదో వెలితి. చివరకు తను కనుగొన్నదాని వల్లే తను ఆయువు లేకుండా పోతాడు.
స్పర్శా సుఖం బాగా యావగా ఇష్టపడే వారు, ముఖ్యంగా లైంగికంగా, ఒక రకమైన ఉన్మాదులుగా మారుతారు. జిహ్వ కు బానిసైన వారు మరొకరకంగా. అలా ఒక్కో సెన్స్ కు ఒక్కోలా మనిషి పిచ్చివాడవుతాడు. ఈ ఆఘ్రాణ శక్తి చేత మనిషి ఇంత incorrigible insane murderer గా మారడం ఇందులోనే చూస్తాము. అమాయకుడు గానూ, దరిద్రుడు గానూ కనిపించే బెన్ విషా బాగా నటించాడు.
అతను చేసిన పనిలో సాధ్యాసాధ్యాలు, అనైతికత వగైరా పక్కన పెడితే తెర మీద అతని కథను చాలా ప్రభావవంతంగా చెప్పాడు టాం టిక్వర్. అతని చిత్రాల్లో, నచ్చక పోవచ్చేమో గానీ, విసుగు అనేది వుండదు ప్రేక్షకులకి.
Youtube లో వుంది ఈ చిత్రం. చూడండి. నచ్చకపోతే నన్ను తిట్టుకోకండి. 🙂

Exit mobile version