[బాలబాలికల కోసం ‘పెన్సిలిన్ ఆవిష్కర్త అలెగ్జాండర్ ఫ్లెమింగ్’ అనే రచన అందిస్తున్నారు డా. కందేపి రాణీప్రసాద్.]
బాలలూ! మీకు ‘అలెగ్జాండర్ ఫ్లెమింగ్’ అంటే ఎవరో తెలుసా? ఆయన చాలా గొప్ప శాస్త్రవేత్త. ఆయన ఏం కనుక్కున్నాడో తెలుసా? బాక్టీరియాను నాశనం చేసే ఔషధం ‘పెన్సిలిన్’ను కనుగొన్నాడు.
ఈ ‘పెన్సిలిన్’ బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్స్‌ను నయం చేస్తుంది. మరి ఫ్లెమింగ్ గురించీ, పెన్సిలిన్ గురించీ తెలుసుకుందామా!
1881వ సంవత్సరం ఆగష్టు 6వ తేదీన స్కాట్లాండ్ లోని ‘లాచ్ ఫీల్డ్ ఫార్మ్’లో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ జన్మించాడు. ఈయన తండ్రి పేరు హ్యూ ఫ్లెమింగ్. 1906వ సంవత్సరంలో ప్లెమింగ్ మెడిసిన్ పట్టా పొందాడు. మెడిసిన్ ప్రవేశ పరీక్షలో ఫ్లెమింగ్, యునైటెడ్ కింగ్‌డమ్ మొత్తం మీద మొదటివాడుగా వచ్చాడు. బాక్టీరియాలజీ డిపార్ట్‌మెంట్ ప్రొఫెసర్ ఆల్మర్త్ రైట్ పర్యవేక్షణలో పరిశోధనలు సాగించాడు. మానవ శరీరంలో సహజసిద్ధమైన యాంటిబయాటిక్ ఉంటుందని 1921లో కనుగొన్నాడు. దానికే ‘లైసోజైమ్’ అని పేరు పెట్టాడు.
1928 సంవత్సరం సెప్టెంబరులో పెన్సిలిన్‌ను ప్లెమింగ్ ఆవిష్కరించాడు. ‘స్టెఫలో కోకస్’ అనే సూక్ష్మజీవులపై పరిశోధనలు చేస్తుండగా అనుకోకుండా పెన్సిలిన్ ఆవిష్కరింపబడింది. ఒక గిన్నెలోని నీలిరంగు బూజు బాక్టీరియాను నాశనం చేస్తుందని పరిశోధనల్లో గ్రహించాడు. ఆ బూజును మైక్రోస్కోప్‌లో చూసినపుడు బ్రష్ ఆకారంలో కనిపించింది. లాటిన్ భాషలో బ్రష్‌ను ‘పెనిసిల్లం’ అంటారు. అందుకే దానికి ‘పెన్సిలిన్’ అనే పేరు వచ్చింది.
పెన్సిలిన్‌ను 1928 లోనే కనుగొన్నప్పటికీ ప్రజలకు ఉపయోగపడే రీతిలో తయారు కావడానికి 1955 దాకా పట్టింది. మొదట్లో పెన్సిలిన్‌ను తయారుచేసిన వెంటనే రోగికి ఇవ్వాల్సి వచ్చేది. నిలవ ఉంచటానికి పనికివచ్చేది కాదు. ఇన్ని సంవత్సరాల అవిశ్రాంత శ్రమ, దీక్ష, పట్టుదల వల్ల మానవాళికి మహోపకారం జరిగింది. పెన్సిలిన్‌ను కనుగొన్నందుకు ఫ్లెమింగ్‌కు నోబెల్ పురస్కారం లభించింది. ప్రజలను ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షించిన మహా మనీషి ఫ్లెమింగ్. ఈయన 1955 మార్చి 11వ తేదీన తుది శ్వాస వదిలాడు.
డా. కందేపి రాణీప్రసాద్ MA, MSc, PHD, బాల సాహితీ వేత్త, కవయిత్రి, అనువాదకులు, చిత్ర కళాకారిణి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట మహిళా పురస్కారం అందుకున్నారు. తెలుగు విశ్వ విద్యాలయం వారి ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకున్నారు. రాణీ ప్రసాద్ ఆర్ట్ పేరుతో హాస్పిటల్ వేస్ట్‌తో 4000 బొమ్మలను సృష్టించారు. బాల సాహిత్యంలో 48 పుస్తకాలు రచించారు. ‘తెలుగు బాల సాహిత్యంలో సైన్స్ రచనలు’ అనే అంశంపై నాగార్జున విశ్వవిద్యాలయంలో పరిశోధన చేశారు. తెలుగు విశ్వ విద్యాలయంలో బాల సాహిత్య కీర్తి పురస్కారాన్ని నెలకొల్పారు. మిల్కీ మ్యూజియం, స్వీటీ చిల్డ్రన్ లైబ్రరీ లను తమ ఆసుపత్రిలో పిల్లల కోసం నిర్వహిస్తున్నారు. తమ సొంత ఆసుపత్రిలో ప్రిస్క్రిప్షన్ పాడ్ మీద పిల్లల కోసం తెలుగు పాట, బొమ్మ పెట్టి ప్రింట్ చేస్తున్నారు. సైన్సు, యాత్రా సాహిత్యం విరివిగా రాస్తున్నారు. కళాభారతి, కవిత వాణి, చిత్ర కళారాణి అనే ఎన్నో బిరుదులను, 6 వరల్డ్ రికార్డ్స్నూ సొంతం చేసుకున్నారు.
